వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ స్టాండర్డ్ టైమ్: రెండో టైమ్ జోన్ కావాలని ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టైమ్ జోన్

సూర్యోదయం ఎన్ని గంటలకు మొదలవుతుంది? అని ఎవరైనా అడిగితే, విశాఖపట్నంలో ఉంటే ఉదయం 5.30 గంటలకు కాస్త అటూఇటూగా ఉంటుందని చెబుతారు. అదే హైదరాబాద్‌లో ఉంటే ఇది 6 గంటలకు కాస్త అటూఇటూగా ఉంటుంది.

విశాఖపట్నం, హైదరాబాద్‌ల మధ్య సూర్యోదయానికి పావు గంట తేడా ఉంటుంది. మరి మన దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య టైమ్‌లో తేడా గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌ లోహిత్ జిల్లాలోని డాంగ్‌లో మొదట సూర్యోదయం అవుతుంది. ఇక్కడ వేసవిలో ఉదయం 4 గంటలకే సూర్యుడు కనిపిస్తాడు. అంటే ఉదయం 9 గంటలకు ఇక్కడ స్కూళ్లు, ఆఫీసులు మొదలయ్యే సరికే ఇక్కడ మధ్నాహ్యం సమయంలో హైదరాబాద్‌లో కాసేంత ఎండ ఉంటుంది.

అరుణాచల్‌లో సాయంత్రం 4.30కే సూర్యాస్తమయం అవుతుంది. దీంతో స్కూళ్లు, ఆఫీసుల్లో ఐదు గంటలకే లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. శీతాకాలంలో అయితే, పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. నాలుగు గంటలకే ఇక్కడ సూర్యుడు అస్తమిస్తాడు.

దీంతో ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలు తమకు ప్రత్యేక టైమ్ జోన్ కావాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి.

హిమంత బిశ్వ శర్మ

అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో

తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఇటీవల మేఘాలయతో సరిహద్దు ఒప్పందానికి సంబంధించిన నివేదికను సమర్పిస్తూ అసెంబ్లీలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు.

''ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేక టైమ్ జోన్ ఉండాల్సిన అవసరముంది. ఈ టైమ్ జోన్ భారత్ ప్రధాన భూభాగం కంటే రెండు గంటలు ముందుకు ఉంటే.. చాలా విద్యుత్ ఆదా అవుతుంది. పనిచేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. మన ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. అప్పుడు మన జీవ గడియారంతో మనం అనుసరించే టైమ్‌ కూడా కలుస్తుంది’’అని ఆయన అన్నారు.

సూర్య రశ్మి అందుబాటులో ఉండే సమయాన్ని కోల్పోవడం, విద్యుత్ వినియోగం పెరగడం లాంటి కారణాలను చూపుతూ ఆయన ప్రత్యేక టైమ్ జోన్‌ను డిమాండ్ చేస్తున్నారు.

''స్వాతంత్ర్యానికి ముందు భారత్‌లో బాంబే టైమ్, కలకత్తా టైమ్ పేరుతో రెండు టైమ్ జోన్లు ఉండేవి. వీటితో తూర్పు, పశ్చిమ ప్రాంతాలు మెరుగ్గా సూర్యరశ్మిని ఉపయోగించుకునేవి. ఫలితంగా విద్యుత్ కూడా ఆదా అయ్యేది. కానీ, గందరగోళాన్ని తొలగించే చర్యల పేరుతో ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం రెండు టైమ్ జోన్ల స్థానంలో ఇండియన్ స్టాండార్డ్ టైమ్ జోన్‌ను తీసుకొచ్చింది’’అని ఆయన అన్నారు.

అస్సాం మాత్రమే కాదు.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్ లాంటి ఈశాన్య రాష్ట్రాలు తమకు ప్రత్యేక టైమ్ జోన్ కావాలని ఎప్పటికప్పుడే కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

టైమ్ జోన్

ఏమిటీ టైమ్ జోన్?

భూమిని 360 రేఖాంశాలుగా విభజించారు. రేఖాంశాలంటే భూమిపై ధ్రువాలను తాకుతూ నిలువుగా ఉండే ఊహా రేఖలు. రెండు రేఖాంశాల మధ్య నాలుగు నిమిషాల దూరం ఉంటుంది. అలా భూమిని 24 టైమ్ జోన్లుగా విభజించారు.

మరో విధంగా చెప్పాలంటే భూమి తనచుట్టూ తాను తిరగడానికి పట్టే 24 గంటల సమయాన్ని 360 డిగ్రీలకు విభజించారు.

దీని ప్రకారం, 15 డిగ్రీల దూరాన్ని భూమి తిరగడానికి ఒక గంట సమయం పడుతుంది. అంటే ఒక డిగ్రీకి నాలుగు నిమిషాలు.

అన్ని టైమ్ జోన్లూ ప్రధాన టైమ్ జోన్‌కు అనుగుణంగా ఉంటాయి. ప్రధాన టైమ్ జోన్‌నే ''ప్రైమ్ మెరీడియన్’’ అంటారు. ఇది లండన్‌లోని గ్రీన్‌విచ్ గుండా వెళ్తుంది. అందుకే దీన్ని గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జీఎంటీ)అని కూడా పిలుస్తుంటారు.

టైమ్ జోన్

జీఎంటీ ఆధారంగా మిగతా టైమ్ జోన్లు..

మిగతా టైమ్ జోన్లన్నీ గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జీఎంటీ)తో ఉండే దూరానికి అనుగుణంగా ఉంటాయి. దీనికి తూర్పున ఉండే ప్రాంతాల టైమ్ ముందుకు ఉంటే.. ఎడమవైపు ఉండే ప్రాంతాల టైమ్ వెనక్కి ఉంటుంది.

గ్రీన్ విచ్ టైమ్‌కు భారత్ టైమ్ 5.30 గంటల ముందుకు ఉంటుంది. దీన్ని ఇండియన్ స్టాండార్డ్ టైమ్ అని అంటారు.

ఉత్తర్ ప్రదేశ్‌ అలహాబాద్‌కు సమీపంలోని మీర్జాపూర్ గుండా వెళ్లే 82.5 డిగ్రీల రేఖాంశానికి అనుగుణంగా ఈ టైమ్ ఉంటుంది.

భారత్‌లో ఈ టైమ్ జోన్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు చెందిన నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ (సీఎస్ఐఆర్-ఎన్‌పీఎల్) పర్యవేక్షిస్తుంది.

2018లో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా టైమ్ జోన్ కేటాయిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని సీఎస్ఐఆర్-ఎన్‌పీఎల్ సూచించింది. భారత కాలమానం కంటే ఒక గంట ఇది ముందుకు ఉంటే, అక్కడి సూర్యరశ్మిని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.

అస్సాం

పిల్లల చదువులపై ప్రభావం..

ఈ అంశంపై కార్నెల్ యూనివర్సిటీ ఆర్థికవేత్త మౌలిక్ జగ్నాని కూడా ఒక అధ్యయనం చేపట్టారు.

''సూర్యోదయం, అస్తమయాలు జీవక్రియలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. చీకటి పడినప్పుడు శరీరంలో నిద్రకు తోడ్పడే మెలటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది. భారత్‌లోని మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు, ఈశాన్య ప్రాంతాల్లో త్వరగా చీకటి పడుతుంది. ఫలితంగా అక్కడి పిల్లల్లో మెలటోనిన్ కాస్త త్వరగా విడుదల అవుతుంది. కానీ, వారు నిద్ర పోయేటప్పటికి మిగతా ప్రాంతాల్లానే సాధారణ సమయమే అవుతోంది. మరోవైపు ఇక్కడ సూర్యుడు త్వరగా ఉదయిస్తాడు. ఫలితంగా ఉదయాన్నే కార్యకలాపాలు మొదలవుతాయి. దీంతో అక్కడ పిల్లలకు సరైన నిద్ర కరవవుతోంది. పేద కుటుంబాల్లోని పిల్లలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు చదువుల్లో కూడా వెనకబడుతున్నారు’’అని తన అధ్యయనంలో జగ్నాని పేర్కొన్నారు.

''సూర్యాస్తమయం ఆలస్యంగా జరిగే ప్రాంతాల్లో పిల్లలు ఆలస్యంగా పడుకుంటారు. కానీ వీరు ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాల్సి వస్తుంది. సూర్యాస్తమయంలో వచ్చే ఒక గంట తేడా పిల్లల్లో కనీసం 30 నిమిషాల నిద్రను తగ్గిస్తుంది’’అని ఆయన వివరించారు.

సూర్యాస్తమయం ఆలస్యంగా జరిగే ప్రాంతాల్లో నివసించే పిల్లల్లో చాలామంది ప్రాథమిక, మాధ్యమిక విద్యాస్థాయిని కూడా దాటలేకపోతున్నారని జగ్నాని వెల్లడించారు.

ప్రతిపాదిత రెండు టైమ్ జోన్ల విధానం (పశ్చిమ భారతానికి UTC+5 టైమ్ జోన్, తూర్పు భారతానికి UTC+6 టైమ్ జోన్‌) అమల్లోకి తెస్తే జీడీపీలో కనీసం 0.2శాతం పెరుగుదల సాధ్యపడుతుందని జగ్నాని సూచించారు.

కోర్టులో వ్యాజ్యం కూడా..

2009లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని హైలెవల్ కమిటీ కూడా ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలకు ఒక గంట ముందుకు ఉంటే మేలని సూచించింది.

2014లో అప్పటి అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయి కూడా రాష్ట్రం చాయ్ బగాన్ టైమ్‌ను అసరిస్తే మేలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని తేయాకు తోటల్లో ఈ టైమ్‌ను అనుసరిస్తుంటారు. ఇది ఇండియన్ స్టాండార్ట్ టైమ్ కంటే ఒక గంట ముందుకు ఉంటుంది.

2017లో అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా.. ''మేం ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తాం. కానీ మా ఆఫీసులు పది గంటలకు తెరచుకుంటాయి. ఈ మధ్య చాలా సమయం వృథాగా పోతోంది’’అని వ్యాఖ్యానించారు.

టైమ్ జోన్

ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లోని కొన్ని దేశాలు డేలైట్ సేవింగ్ టైమ్ (డీఎస్‌టీ) విధానాలను ఉపయోగిస్తున్నాయి. అంటే తమ స్టాండార్డ్ టైమ్‌ను వేసవిలో గంట ముందుకు, శీతాకాలంలో గంట వెనక్కి నడుపుతుంటాయి. ఫలితంగా మెరుగ్గా సూర్యరశ్మిని ఉపయోగించుకునేందుకు వీలవుతుంది.

కొన్ని దేశాల్లో రెండు కంటే ఎక్కువే టైమ్ జోన్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఫ్రాన్స్‌లో అత్యధికంగా 12 టైమ్ జోన్లు ఉన్నాయి. అమెరికా, రష్యాల్లో 11 టైమ్ జోన్లు ఉన్నాయి.

భారత్‌లోనూ ఇలానే రెండు టైమ్ జోన్లు ఏర్పాటుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కొందరు గువాహటి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది.

ఎందుకు తిరస్కరిస్తున్నారు?

రెండు టైమ్ జోన్లను వ్యతిరేకించే వారు వేర్పాటువాదాన్ని ప్రధాన కారణంగా చూపుతున్నారు. రెండో టైమ్ జోన్‌ వల్ల భారత ప్రధాన భూభాగంతో ఈశాన్య ప్రాంతం విడిపోయే ముప్పందని వారు చెబుతున్నారు.

ఈ అంశంపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ దిలీప్ అహుజా మాట్లాడారు.

''రెండో టైమ్ జోన్ అంశాన్ని కొందరు దేశాన్ని విభజించేందుకు రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునే ముప్పుంది’’అని అహుజా అన్నారు. రెండు టైమ్ జోన్లతో రైల్వేలో గందరగోళం ఏర్పడుతుందని, దీని వల్ల రైల్వే ప్రమాదాలు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు.

''ఇండియన్ స్టాండార్డ్ టైమ్‌నే ఒక అరంగట ముందు జరిపితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఫలితంగా ఈశాన్య రాష్ట్రాలు మెరుగ్గా సూర్యరశ్మిని ఉపయోగించుకోగలుగుతాయి’’అని అహుజా సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Indian Standard Time: Why are the northeastern states demanding a second time zone
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X