• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐటీ ఆక్ట్-2000: మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లుగా చట్టాలు మారుతున్నాయా? :డిజిహబ్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సైబర్ నేరాలు

అక్టోబర్ 17, 2000న మొట్టమొదటి సారి భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్-2000 ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఆ రోజును "డిజిటల్ సొసైటీ డే"గా జరుపుకొంటున్నాం.

గడచిన ఇరవై ఒక్కేళ్ళల్లో టెక్నాలజీ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. మరి అప్పట్లో ప్రవేశపెట్టిన ఐటీ చట్టం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎంత మేరకు సరిపోయింది, ఎలాంటి సవరణలకు గురైంది, దాంట్లో వివాదాలకు విమర్శలకు తావిచ్చే అంశాలేంటి అనే విషయాలను ఈ వ్యాసంలో చూద్దాం.

ప్రతీకాత్మక చిత్రం

టెక్నాలజీ vs చట్టం

ఒక సమాజంలో వినోదం, విజ్ఞానం కోసం మాత్రమే కాక ప్రభుత్వ కార్యకలాపాలు, వాణిజ్య, వ్యాపార లావాదేవీలు లాంటి వాటికి డిజిటిల్ టెక్నాలజీని విరివిరిగా వాడితే, అది "డిజిటల్ సొసైటీ" అనిపించుకుంటుంది.

ఇంటర్నెట్ టెక్నాలజీ వల్ల కాగితాలు అవసరం లేకుండా లేవాదేవీలు జరపచ్చు (paperless transactions), డిజిటల్ సంతకాలు చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ బాంకింగ్‍లో ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని e-FIR ఫైల్ చేయచ్చు.

టెక్నాలజీ వెసులుబాటు కలిపించినంత మాత్రాన సరిపోదు, ఇవ్వన్నీ సమాజంలో చెల్లుబాటు కావాలంటే అవి చట్ట పరిధిలోకి కూడా రావాలి.

వివాదాలు మొదలైనా, అక్రమాలు జరిగినా చెప్పుకోడానికి, న్యాయం పొందడానికి చట్టాలు అవసరం. చట్టాలు రావడంతో పాటు వాటిని అమలుపరిచే విషయంలో పౌరులకీ, అధికారులకీ మధ్య సమన్వయం, అవగాహనా ఇంకా అవసరం.

టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నంత విస్తృతంగా, దానికి సంబంధించిన చట్టాలు అమలు కావడం లేదనే విమర్శ ఒకటి బలంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా! అసలు టెక్నాలజీ ఇలా అడ్డూ అదుపూ లేకుండా అన్ని దిశలా వ్యాపించడానికి ఇదే కారణమని, ఒకవేళ డిజిటిల్ చట్టాలు పటిష్టంగా ఉండి ఉంటే ఇంతటి వైవిధ్యమైన ఇన్నోవేషన్లు (వ్యక్తులపై, సమాజంపై దుష్ప్రభావాలని బేఖాతరు చేస్తూ) ఇంత తక్కువ సమయంలో చేయడం కుదిరేదే కాదని ఒక వాదన.

ఉదాహరణలు చెప్పుకోవాలంటే, సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయి, యూజర్ల వ్యక్తిగత డేటాను అనుమతి లేకుండా ఆడ్స్ మోడలింగ్‍కి ఉపయోగించుకుని, ఆయా కంపెనీలు కోట్లకి పడగలు ఎత్తితే కానీ వ్యక్తిగత డేటాని పరిరక్షించే చట్టాలు (యూరోపియన్ యూనియన్ ప్రవేశపెట్టిన జి.డి.పి.ఆర్ (GDPR) చట్టం, ఇండియాలో "పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, 2019" లాంటివి) అమలులోకి రాలేదు.

అలాగే, ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డీప్‍ఫేక్ వీడియోలని తయారుచేసి, వాటిని వ్యక్తుల, దేశాల ప్రతిష్టను దెబ్బతీయడానికి వాడదల్చుకున్నవారిపై ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు అన్నదానిపై ఇంకా ఏ చట్టాలూ రానేలేదు, ఎక్కడా.

చిప్

ఇండియాలో తొలి ఐటీయాక్ట్ 2000లో

ఆక్టోబర్ 2000లో ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, మన దేశాన్ని డిజిటల్ సొసైటీగా మార్చడంలో ఒక కీలక అడుగు అని చెప్పుకోవచ్చు. ఈ ఆక్ట్ ద్వారానే కాగితాలపై లావాదేవీలకి సరిసమానంగా ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లకు గుర్తింపు లభించింది. చేతితో పెట్టే సంతకానికి సమానంగా డిజిటల్ సిగ్నేచర్ పరిగణించబడింది. ఈ రెండింటి వల్లా డిజిటల్ కాంట్రాక్ట్స్ కి పేపర్ కాంట్రాక్టులతో సమానంగా గుర్తింపు లభించింది.

సైబర్ క్రైమ్స్ నిర్వచించి, వాటికి సరైన శిక్షలు కూడా ఈ యాక్ట్ లో భాగం. అంతేకాక, అప్పటికే ఉన్న ఐండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), ఇండియన్ ఎవిడెన్స్ ఆక్ట్, రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా ఆక్ట్ లలో, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ వల్ల వచ్చే మార్పులనీ పరిగణిస్తూ, సవరణలు చేశారు.

ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లని టాంపర్ చేయడం, కంప్యూటర్‍ని హాక్ చేయడం, ఇతరుల పాస్‍వర్డ్ వాడడం, ఇతరుల వ్యక్తిగత ఫోటోలని వారి అనుమతి లేకుండా పబ్లిష్ చేయడం లాంటివన్నీ నేరాలుగా గుర్తించారు.

2008లో మరి కొన్ని సవరణలు

మొదటి యాక్ట్ ప్రవేశపెట్టిన ఎనిమిదేళ్ళకి, అంటే 2008లో మళ్ళీ కొన్ని కీలకమైన సవరణలు చేశారు. ITA-2008గా పిలవబడే ఈ మార్పులు ఆక్టోబర్ 27, 2009న అమలులోకి వచ్చాయి. ఈ మార్పులకి "సైబర్ సెక్యూరిటీ" ఫోకస్‍గా నిలిచింది.

ITA-2008లో ప్రవేశపెట్టిన సెక్షన్ 67A కింద అశ్లీల చిత్రాలు, బొమ్మలు పబ్లిష్ చేయడం గానీ ( వెబ్‍సైట్ లాంటివి నిర్వహించడం గానీ), లేదా వాటిని ఇతరులకి పంపడం గానీ (ఈమెయిల్, చాట్స్ ద్వారా) నేరంగా పరిగణించబడుతుంది. పది లక్షల వరకూ జరిమానా, ఐదు లక్షల వరకూ జైలు శిక్షా పడచ్చు. పిల్లల భద్రతని దృష్టిలో ఉంచుకుని, "చైల్డ్ పోర్నోగ్రఫీ"కి వ్యతిరేకంగా, పిల్లలని అసభ్యంగా, అశ్లీలంగా చూపెట్టే కంటెంట్‍ని అరికట్టడానికి, ప్రత్యేకంగా సెక్షన్ 67B ని ప్రవేశపెట్టారు. పబ్లిష్ చేయడం, ఇతరులకి పంపడం మాత్రమే కాదు, అలాంటి కంటెంట్ అడిగినవారికి, డౌన్లోడ్ చేసుకున్నవారికి, చూసినవారికి కూడా ఈ సెక్షన్ కింద కఠిన శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టెలిఫోన్ టాపింగ్ చేసే అధికారం ఎలా ఉంటుందో, అలానే కంప్యూటర్ల మీదున్న సమాచారాన్ని మానిటర్, డీక్రిప్ట్ చేసే వీలుగా సెక్షన్ 69 ప్రవేశపెట్టబడింది. ఇవి కాకుండా, సైబర్ టెర్రరిజం కోసం కూడా ఒక కొత్త సెక్షన్ కూడా ఉంది.

సైబర్

వివాదాలు, విమర్శలు

సైబర్ నేరాలూ, వాటికోసం ఏర్పడ్డ చట్టాల గురించి ప్రజలలో ఉండాల్సినంత అవగాహన లేదు. ఏది సైబర్ క్రైమ్ అవుతుందో న్యాయవాదులకీ, పోలీసులకీ కూడా పూర్తి స్థాయి అవగాహన లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా, సైబర్ క్రైములు నమోదు అయ్యే సంఖ్య ఎక్కువగానే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం 2020లో 50,035 సైబర్ కేసులు నమోదు అయ్యాయి.

అధిక శాతం మోసం (ఫ్రాడ్) గురించి కేసులు అయితే, లైంగిక బెదిరింపులు, బ్లాక్‍మెయిల్, వ్యక్తిగత పగ వంటివి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలనుంచే దాదాపు 60% కేసులు నమోదు అయ్యాయి. ముందుచూపుతో చట్టాలని తయారుచేసుకోవడం వల్లే ఇది సాధ్యమైంది.

అయితే, కొన్ని సెక్షన్ల వల్ల ఇబ్బందులు పడ్డవారూ ఉన్నారు. ముఖ్యంగా సెక్షన్ 66A, ఇంటర్నెట్ మీద తప్పుడు/అభ్యంతరక/బెదిరించే సమాచారాన్ని పబ్లిష్ చేయడం నేరంగా పరిగణిస్తుంది.

వ్యక్తిగత దూషణలకే కాకుండా ఎవర్ని విమర్శించినా ఈ సెక్షన్ కింద కేసులు నమోదు అయిన దాఖలాలు ఉన్నాయి. వార్తాపత్రికల్లో వచ్చే కొన్ని వ్యంగ్యాత్మక కార్టూన్లకి, రాజకీయనాయకుల తీరుతెన్నులని ప్రశ్నిస్తూ రాసిన ట్వీట్లు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. 2012లో బాల్ థాకరే చనిపోయినప్పుడు, "మొత్తం ముంబాయి నగరంలో ఎందుకు బంద్ పాటించాలి?" అని ఒక అమ్మాయి ఫేస్బుక్ లో పోస్టు చేసినందుకు, ఆమె స్నేహితురాలు ఆ పోస్టుకి లైక్ కొట్టినందుకూ, ఇద్దరి మీదా కేసులు నమోదు అవ్వడంతో సెక్షన్ 66A పై పెద్ద దుమారమే లేచింది.

ఆ తర్వాత, లోకల్ కోర్టు ఈ ఇద్దరి అమ్మాయిలపై కేసు కొట్టేసినా, "భావ ప్రకటనా స్వేచ్చ"కి ఈ సెక్షన్ అడ్డనీ, అప్రజాస్వామ్యకమన్న అభిప్రాయం బలంగా నెలకొంది. మార్చి, 2015లో సుప్రీమ్ కోర్టు ఈ సెక్షన్‍ని కొట్టివేసింది. ఆ సెక్షన్‍ని కొట్టివేసినా కూడా దేశంలో స్థితిగతులని విమర్శిస్తున్నవారిపై ఏదో రకంగా చర్యలు తీసుకుంటూనే ఉంటున్నారు.

2020లో దేశ భద్రతకు ఆటంకం కలగజేస్తున్నాయని భారత ప్రభుత్వం, సెక్షన్ 69A, టిక్‍టాక్ తో సహా పలు చైనీస్ ఆప్స్ ని నిషేధించింది. ఈ చర్య కూడా చాలా విమర్శలకి గురైంది.

పార్లమెంట్

న్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021

ఫేక్ న్యూస్ ఒక మహమ్మారిగా మారి జీవితాలతో, శాంతిభద్రతలతో చెలగాటమాడుతుందని ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం 2021లో, సోషల్ మీడియా వేదికలకి, కొత్త నియమాలని ప్రవేశపెట్టింది.

వాట్సాప్ లాంటి ఆప్స్, వైరల్ అయిన మెసేజ్ మొదటిగా ఎవరి దగ్గర నుంచి, ఎప్పుడు మొదలైందన్న వివరాలన్నీ అందించాలి. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్ లాంటి వేదికలు అనారోగ్యకరమని గుర్తించిన పోస్టులని, వీడియోలని కేవలం కొన్ని నిముషాల్లో మొత్తంగా తీసివేయాలి.

ఇలా చేయడం ద్వారా ఫేక్ న్యూసులని అరికట్టవచ్చు, మహిళలు పిల్లల పై అభ్యంతరకర అసభ్య పోస్టులని ఆపవచ్చు అని వారి వాదన.

ఈ నియమాలకి సోషల్ మీడియా కంపెనీలు ఇంకా ఒప్పుకోనే లేదు. వారే కాక, ఇంకొందరు టెక్ విశ్లేషకులు కూడా ఈ చట్టం ఇంటర్నెట్ పై భావ స్వేచ్ఛకి, వ్యక్తిగత గోప్యతకి ఆటంకం కలిగించే అవకాశం పుష్కలంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ మధ్యన, రైతుల పోరాటానికి సంబంధించిన కొన్ని ట్వీట్లని తొలగించమని ట్విటర్ పై భారత ప్రభుత్వం ఒత్తిడి చేసింది. ఇహ, ఇలాంటి చట్టాలొస్తే సోషల్ మీడియా మొత్తంగా ప్రభుత్వం గుప్పిట్లోకి వెళ్ళిపోతుందనే భయాలూ వినిపిస్తున్నాయి.

సైబర్ చట్టాలపై అవగాహన ముఖ్యం

ఆన్‍లైన్, ఆఫ్‍లైన్ జీవితాలకి రాను రానూ ఆంతర్యం తక్కువైపోతోంది. మనం నిజజీవితంలో చట్టాల విషయంలోనే అవసరం పడే వరకూ ఎక్కువ ఆలోచించం, ఉన్నాయని కూడా తెలుసుకోము.

ఆ అలక్ష్యం సైబర్ చట్టాల విషయంలో మరీ ఎక్కువ. అందుకనే లైంగిక వేధింపులకి, ఆన్‍లైన్ బ్లాక్‍మెయిల్‍కి గురైనవారిలో చాలా మందికి పోలీసులని సంప్రదించవచ్చు, వారి సహాయసహకారాలతో న్యాయం పొందవచ్చు అని గుర్తించక మోసగాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు అయిపోతున్నారు.

అవగాహనలోపం వల్లే వీటిల్లో చిక్కుకుపోతున్న మహిళలు, యువతులు ఒకవైపు, ఎవరికీ దొరక్కుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చననే ఆశతో ఇలాంటి దురాగతాలలో కూరుకుపోతున్న యువత మరో వైపు.

నిజానికి, ఆక్టోబర్ 17ను "డిజిటిల్ సొసైటీ డే"గా జరుపుకోవడంలో ముఖ్యోద్దేశ్యం ఈ చట్టాలపై అవగాహన పెంపొందించడానికి, చర్చలకి ఆస్కారం పెంచడానికే! అయితే, ఎందుకనో, దానికి రావాల్సినంత పేరు రాలేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు తప్పించి ఎవరూ దీన్ని పట్టించుకోనే పట్టించుకోవడం లేదు.

ఉన్న సైబర్ చట్టాలు, రాబోతున్న చట్టాల గురించి తెలుసుకోవడం మనకి, మన సమాజానికీ చాలా ముఖ్యం. నిరంతరంగా టెక్నాలజీలో వచ్చే మార్పులని చట్టంతో అనుసంధానం చేయటమూ ముఖ్యం. మన ఇళ్ళల్లో ఖరీదైన స్మార్ట్ డివైజులు, మన వీధుల్లో స్మార్ట్ సిటీస్‍కి సంబంధించిన హంగులూ ఉన్నంత మాత్రాన మనం "స్మార్ట్" అయిపోము.

ఈ స్మార్ట్ పరికరాలు అందించే సౌలభ్యాలతో పాటు, తెచ్చిపెట్టే తిరకాసులనీ గమనించి, వాటికి సరిపడా చట్టాలు తెచ్చుకోవడంలోనూ, ఉన్న చట్టాలు ఎలా సాయపడతాయో తెలుసుకోవడంలోనూ, మన ఆన్‍లైన్ జీవనశైలిని నిరంతరం చెక్ చేసుకుంటూ క్షేమంగా, భద్రంగా ఉండడంలోనే, మన స్మార్ట్ నెస్ ఉంటుంది. డిజిటల్ సొసైటీ పౌరులుగా అది మన బాధ్యత.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
IT Act-2000: Are laws changing to suit changing technology? : Digihub
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X