అవమానాలూ భరించారు: తలవంచలేదని వెంకయ్యపై మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు రెండేళ్లుగా ఎంతగానో కృషి చేశారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం జరిగిన భారతీయ జనతా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జీఎస్టీ బిల్లుపై ఆయన ప్రసంగించారు.
ఈ బిల్లుకోసం పార్టీలో అంతా తమవంతు పాటుపడ్డారని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు జీఎస్టీ బిల్లుకోసం ఎంతగానో శ్రమించారని ఆయన గుర్తు చేశారు.

వెంకయ్య కృషికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలని అనుకుంటున్నానని, ఆయన తన రాజకీయ జీవితంలో ఎవరి ముందు తలవంచలేదని అన్నారు. జీఎస్టీకోసం వివిధ రాజకీయ పార్టీలతో వెంకయ్య జరిపిన సంప్రదింపులు, నిరంతర చర్చలు అభినందనీయమని అన్నారు.
ఆయా రాజకీయపార్టీల నేతలతో చర్చల సందర్భంగా ఒక్కోసారి ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతాయని, వాటన్నింటినీ వెంకయ్య చాలా ఓర్పుతో భరించారని అన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ చరిత్రాత్మకమైందని, సత్వరం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని ప్రధాని అన్నారు.
అంతేగాక, బిజెపి ఎంపీలు తాము సాధించిన పురోగతిపై నివేదిక అందించాలని మోడీ ఈ సందర్భంగా కోరారు. తిరంగ యాత్ర (ఆగస్టు 15 నుంచి22 వరకు) కార్యక్రమాన్ని అన్ని వర్గాలను కలుపుకుని విజయవంతంగా నిర్వహించాలని మోడీ సూచించినట్లు కేంద్రమంత్రి అనంతకుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications