• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతదేశం బొగ్గు వినియోగాన్ని ఆపేస్తే ఏం జరుగుతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బొగ్గు

భారతదేశంలో బొగ్గు ఒక ప్రధాన ఇంధన వనరు. కానీ, ఇప్పుడు పరిస్థితితులు మారుతున్నాయి. దేశంలో క్రమేపీ బొగ్గు వాడకం తగ్గించనుండటం వల్ల దీని ప్రభావం బొగ్గురంగ కార్మికులపై ఎంతమేర పడనుంది.

జార్ఖండ్‌లోని కోల్‌ టౌన్‌ అయిన ఝరియాలో భూమి నుంచి 100 సంవత్సరాలకు పైగా మంటలు వస్తూనే ఉన్నాయి. 20వ శతాబ్దపు ప్రారంభంలో అనుకోకుండా ఈ మంటలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ పట్టణంలోని భూగర్భ బొగ్గు నిల్వలు క్రమంగా కాలిపోతుండటంతో మంటలతోపాటూ, విషపూరిత పొగలు విడుదలవుతున్నాయి. దీంతో ఆ పరిసరప్రాంతాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. ఇప్పటి వరకు ఈ మంటలను ఆర్పేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.

భారతదేశంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు కలిగి ఉన్న జార్ఖండ్‌లో ఝరియా ప్రాంతం అత్యంత ఘోరమైన ప్రమాద పరిస్థితులను ఎదుర్కొంటోంది.

బొగ్గు వనరులు సమృద్ధిగా ఉన్నా కూడా జార్ఖండ్ భారతదేశంలోని అత్యంత పేద రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. దాని జనాభాలో సగం మంది పేదరికంలో మగ్గుతున్నారు.

ప్రధానంగా బొగ్గుపై ఆధారపడి ఉండే ఈ రాష్ట్రాన్ని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా మరో దారిలోకి మళ్లించడం అంటే, భారతదేశం ఎదుర్కోబోయే అనేక సవాళ్లలో ఇది కూడా ఒకటి అవుతుంది.

2030 నాటికి విద్యుత్తు ఉత్పత్తిలో 50% పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటామని భారతదేశం నిర్ణయించింది.

భారతదేశం 2070 నాటికి ఉద్గార రహిత దేశంగా చేరుకునే లక్ష్యానికి ప్రయత్నిస్తున్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ కారణాలతో జార్ఖండ్‌లో దశాబ్దాలుగా ఎందరికో జీవనోపాధినిస్తున్న కోల్‌ సెక్టార్‌ క్షిణించే అవకాశం ఉంది. ఇదే అంశం భారతదేశంలోని మిగతా బొగ్గు ఆధారిత ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది.

బొగ్గు ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడంతోపాటూ, ప్రస్తుతం కోల్‌ సెక్టర్‌లో ఉపాధి పొందుతున్న వేలాది మందికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని కనుగొనడం తదుపరి సవాలు.

క్లీన్-ఎనర్జీలోకి మార్పు చెందడంలో భాగంగా జార్ఖండ్‌లానే బొగ్గుపై ఎక్కువగా ఆధారపడే మిగతా ప్రాంతాలు భవిష్యత్తులో ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు. వారిలో ఒకరు, వాషింగ్టన్ డీసీలోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో సీనియర్ పరిశోధకులు సందీప్ పాయ్.

భారతదేశం, దక్షిణాఫ్రికాలలో బొగ్గుపై ఆధారపడిన కమ్యూనిటీలలో నూతన మార్పులను ఎలా అమలు చేయాలనే దానిపై పాయ్ సహ రచయితగా ఇటీవల ఓ అధ్యయనం చేశారు. దీని ప్రకారం జార్ఖండ్‌లో కోల్‌ సెక్టార్‌ 3 లక్షల కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తోంది. పరోక్షంగా బొగ్గు సరఫరా చైన్‌, సేవా రంగాలను కలుపుకుని దాదాపు మరో పది లక్షల పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తుంది.

వీరితోపాటూ లక్షలాది మంది అక్రమంగా బొగ్గు గనులపై ఆధారపడి జీవిస్తున్నారు. వదిలివేసిన బొగ్గు గనుల నుండి ఎక్కువగా స్థానిక గ్రామస్తులు బొగ్గును సేకరిస్తుంటారు. వీటన్నింటినీ కలుపుకుంటే, మొత్తంగా ఈ రాష్ట్రంలో దాదాపు 10% జనాభా ఉపాధిని పొందుతున్నారు.

జార్ఖండ్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలోనూ బొగ్గు గనుల నుంచి వచ్చే పన్నులు, రాయల్టీలు దాదాపు 8% వరకు ఉన్నాయి.

విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌లు ఉన్న ఇతర రాష్ట్రాలకు ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గును రవాణా చేస్తారు.

ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోతే, కోల్‌ సెక్టార్‌ ఒక్కసారిగా క్షీణించడం వల్ల స్థానికులు ఉద్యోగాలు కోల్పోవడం, స్థానిక, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడం, పరిశ్రమల నుంచి అందే కార్పొరేట్ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులు తగ్గే అవకాశం ఉన్నట్టు పాయ్ తన పరిశోధనలో గుర్తించారు.

"సరైన ప్రణాళికలు లేకుండా బొగ్గు గనులను మూసివేస్తే, బొగ్గుపై ఆధారపడిన ప్రాంతాలు నిర్మానుష్య నగరాలుగా మారుతాయనే భయం నెలకొని ఉంది. దీంతో ప్రజలు, సమాజంపై తీవ్ర దుష్పరిణామాలు పడే అవకాశం ఉంది" అని పాయ్ అధ్యయనం హెచ్చరించింది.

భారతదేశ విద్యుత్ ఉత్పత్తి బొగ్గుపై గణనీయంగా ఆధారపడి ఉంది. చైనా మాత్రమే భారత్‌ కంటే ఎక్కువ బొగ్గును వినియోగిస్తుంది. 1970ల తర్వాత మొదటిసారిగా వాణిజ్య మైనింగ్‌ చేయడానికి వేలం ద్వారా లైసెన్సులు ఇచ్చారు.

దేశ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటివలి కాలంలో థర్మల్ పవర్ ప్లాంట్‌లకు బొగ్గు సరఫరా అనుకున్నంతగా లేకపోవడం వల్ల అనేక రాష్ట్రాలు విద్యుత్ కోతలను ఎదుర్కొన్నాయి. ఇది బొగ్గుపై దేశం ఆధారపడటాన్ని వెల్లడిస్తోంది.

భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో 70% పైగా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుండే వస్తుంది. బొగ్గు ద్వారా ప్రభుత్వాలకు గణనీయమైన పన్నులు, రాయల్టీలు వస్తున్నాయి. అంతేకాకుండా బొగ్గు రంగం ద్వారా ఉద్యోగకల్పనతో, చాలామందికి జీవనోపాధి లభిస్తుంది.

ఉదాహరణకు 2019లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌ ఇండియా, దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం బొగ్గులో 80 శాతానికి పైగా ఉత్పత్తి చేసింది. 2019లో కోల్‌ ఇండియా దాదాపు 500 బిలియన్‌ రూపాయలకు పైగా పన్నులు, రాయల్టీలరూపంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు చెల్లించింది.

ఇది కేంద్ర ప్రభుత్వ మొత్తం వార్షిక రాబడిలో దాదాపు 3 శాతం. కోల్‌ ఇండియా కంపెనీ 270,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇతర పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్‌లకు చెందిన పరిశ్రమలు, ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో బొగ్గుపై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఉక్కుతో పాటూ మరిన్ని పరిశ్రమలు బొగ్గుపైనే ఆధారపడినవి కావడంతో భారతదేశం బొగ్గు ఉత్పత్తులపై ప్రత్యేకదృష్టి పెట్టింది.

దీని వల్ల ఎదురయ్యే సమస్య ఏంటంటే, బొగ్గును కాల్చినప్పుడు భారీ స్థాయిలో కార్బన్ డయాక్సైడ్‌ విడుదల అవుతుంది.

ప్రపంచ గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాల్లో భారతదేశ వంతు గణనీయంగా ఉండటమేకాకుండా, మొత్తం ఉద్గారాలలో మూడవ స్థానంలో ఉంది.

అయితే తలసరి ఉద్గారాల విషయానికి వచ్చేసరికి ప్రపంచంలో భారత్‌ చివరి వరుసలో కొనసాగుతోంది. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కూడా భారతదేశంలో భారీ మొత్తంలో వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. దీని వలన దేశంలో సంవత్సరానికి లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు.

బొగ్గు ఉత్పత్తిని ఆపాలని అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నప్పటికీ, 2021 అక్టోబర్‌లో భారత ప్రభుత్వం దేశ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2024 నాటికి ఒక బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సమీప భవిష్యత్తుకు అవసరమయ్యే బొగ్గు నిక్షేపాలు భారత్‌లో ఉన్నాయి.

అదే సమయంలో, 2030 నాటికి పునరుత్పాదక వనరుల నుంచి 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తామని COP26లో భారతదేశం ప్రతిజ్ఞ చేసింది.

భారతదేశం 2021 ఆగస్టు నాటికి 100 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని చేరుకుంది. యూకే పునరుత్పాదక సామర్థ్యానికి ఇది రెండింతలు.

భారతదేశం సమూలంగా ఇంధన వనరుల ఉపయోగంలో మార్పులకు ప్రయత్నిస్తోంది. కానీ సమీప భవిష్యత్తులో ఇతర దేశాల కంటే ఇంధన అవసరాలు ఎక్కువగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో బొగ్గు ఉత్పత్తికి దూరంగా ఉంటూ, ప్రణాళికాబద్ధంగా పునరుత్పాదక వనరులవైపునకు మారడం ఒక క్లిష్టమైన సవాలు.

మార్పులను ఆశిస్తూ ప్రభుత్వం బొగ్గు గనుల మూసివేత కార్యచరణను సిద్ధం చేసింది. అయితే పబ్లిక్ డొమైన్‌లో దీనికి సంబంధించిన వివరాలు పరిమితంగానే ఉన్నాయి. ఇప్పటివరకు, సమగ్ర అధికారిక చర్యలు ప్రారంభం కాలేదు.

"ప్రపంచ వ్యాప్తంగా ఈ మార్పులకు సంబంధించి విధానాలు అమలు చేయడానికి దశాబ్దాల సమయం పడుతుంది" అని పాయ్ చెప్పారు. "పరిమిత వనరులున్న భారత్‌ వంటి దేశానికి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మార్పుకు సంబంధించిన ప్రణాళిక అవసరం. ప్రభుత్వాలు ఇప్పుడే ఇలాంటి ప్రణాళికల కోసం కృషి చేయడం ప్రారంభించాలి’’.

2030కి సంబంధించి భారతదేశం కొత్త లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

"ఇది కేవలం బొగ్గుకు మాత్రమే సంబంధించిన అంశం కాదు" అని ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ ఐఫారెస్ట్‌లో జస్ట్ ట్రాన్సిషన్స్ డైరెక్టర్ శ్రేష్ట బెనర్జీ చెప్పారు.

"మన ముందు ఉద్గార రహిత ప్రణాళికా లక్ష్యాలు ఉన్నాయి. అంటే పారిశ్రామికంగా కూడా మార్పులు అవసరం. కాబట్టి ఈ భారీ మార్పులు ఖచ్చితంగా ప్రణాళికలను ప్రారంభించేలా చేస్తాయి'' అని ఆమె చెప్పారు.

భారతదేశంలో సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి పునరుత్వాదక వనరుల వైపు అడుగులు పడుతుండటంపై స్థానికంగా కొద్దిపాటి ఉద్యమాలు జరుగుతున్నాయి. బొగ్గు గనులు అధికంగా ఉన్న జార్ఖండ్‌లో కూడా దీనిపై ఉద్యమాలు జరుగుతున్నాయి.

జార్ఖండ్‌లో బొగ్గు ఉత్పత్తిని తగ్గించడానికి మొదట కొన్ని చిన్న-స్థాయి ప్రయత్నాలు చేసి, తర్వాత మిగతా చోట్ల అనుకరించటానికి ఈ అనుభవం ఉపయోగపడుతుందని పాయ్ చెప్పారు.

ఇదే ప్రాంతంలో మూసివేసిన గనులను విజయవంతంగా పర్యావరణ సమతుల్యతను పాటిస్తూ ఎలా పునరుద్ధరించాలో ఆయన తన పరిశోధనల ద్వారా తెలిపారు.

రాష్ట్ర ఆధీనంలోని బొగ్గు మైనింగ్ కార్పొరేషన్‌కు చెందిన రామ్‌ఘర్‌లోని ఒక మూసివేసిన ఓపెన్-కాస్ట్ బొగ్గు గనిని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ చొరవతో మత్స్యకారులకు ఉపయోగపడేలా చేశారు.

"ఈ గనిని శుభ్ర పరిచి వివిధ రకాల చేప పిల్లలను అందులో పెంచారు. ఇది స్థానిక గ్రామస్తులకు జీవనోపాధిని సృష్టించింది" అని పాయ్ పేర్కొన్నారు.

జార్ఖండ్‌లోని ఖాస్‌ కుసుంద ప్రాంతంలో పేరుకుపోయిన వ్యర్థాలపై పర్యావరణ సమతుల్యత పునరుద్ధరణకై పనులు చేశారు. ఇక్కడ బొగ్గు గనుల నుండి వచ్చే వ్యర్థాలను గతంలో అలాగే వదిలివేసేవారు. ఖాస్ కుసుందలో పర్యావరణ పునరుద్ధరణ ప్రాజెక్టు కారణంగా 2018లో ఈ బంజరు భూమిలో తొమ్మిది వృక్ష జాతులను గుర్తించారు. ఈ ప్రాజెక్ట్ రెండు హెక్టార్లలో మాత్రమే విస్తరించింది, అనేక చిన్న-స్థాయి ప్రాజెక్టులలో ఇది ఒకటి.

"2011లో డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పర్యావరణ పునరుద్ధరణ పనులను ఎలా చేయాలో మాకు చేసి చూపించింది. ఆ తర్వాత మేము కూడా దీన్ని చేయడం ప్రారంభించాము. ప్రతి సంవత్సరం మేము సుమారు 10 కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నాము" అని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్‌లో పర్యావరణ విభాగంలో పని చేసిన మాజీ ఉద్యోగి ఈవీఆర్‌ రాజు చెప్పారు.

2019లో పదవీ విరమణ చేసిన ఈవీఆర్‌ రాజు, కంపెనీకి గతంలోని బొగ్గు గనులున్న ప్రదేశాలను పర్యావరణ పునరుద్ధరణకు ఎంచుకున్నామని తెలిపారు. గతంలో బొగ్గుగనుల్లో పని చేసిన తమ కార్మికులనే ఈ కార్యక్రమానికి ఉపయోగించామని చెప్పారు. సంస్థ పర్యావరణ పునరుద్ధరణ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేసింది. గడ్డి పెంచడంతోపాటూ స్థానిక నేల, వాతావరణానికి అనువుగా ఉండే మొక్కలను నాటడం ప్రారంభించింది.

గతంలో గనులపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజలు కూడా లబ్ధి పొందారని ఈవీఆర్ రాజు చెప్పారు. పర్యావరణపరంగా పునరుద్ధరించిన భూమిలో ఆహార పంటలను పండించడానికి కంపెనీ వారిని అనుమతించింది.

ఈ విధంగా సుమారు 1,000 మంది కార్మికులు, కొంతమంది స్థానిక ప్రజలు 60 సైట్‌లలో విస్తరించి ఉన్న సుమారు 300 హెక్టార్ల భూమిని పునరుద్ధరించారని ఆయన చెప్పారు.

చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం, చెట్లను నాటడం, పాడుబడిన గనులలో అడవులను సృష్టించడం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం అన్నీ మార్పుకు ఉపయోగపడే కార్యక్రమాలు అని పాయ్ చెప్పారు. అయితే ఇప్పటివరకు ఇలాంటి ప్రయత్నాలు చాలా తక్కువగా జరిగాయి.

"ఇలాంటి ప్రాజెక్ట్‌లు స్థానిక ప్రజలకు మరింత మార్పు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పటికే మూసివేసిన, వదిలివేసిన అన్ని గనులను ఈ ప్రాజెక్ట్‌ పరిధిలోకి తీసుకురావాలి" అని ఆయన చెప్పారు.

ఈ ప్రాజెక్టులను కొత్తగా ప్రారంభించడానికి అడ్డంకులు కూడా ఉన్నాయి. బొగ్గు గనుల పునరుద్ధరణను అమలు చేయడానికి నియంత్రణ సంస్థలకు నిధులు, అధికారాలు అవసరమని పాయ్ తెలిపారు. అయితే ప్రక్రియను నియంత్రించడానికి తగిన చట్టాలు అవసరం. గనుల మూసివేత ప్రణాళికల్లో పారదర్శకత అవసరం.

స్థానిక ప్రజలను సంప్రదించి ఆరు రంగాల వృద్ధిని సులభతరం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి దారిలో పెట్టొచ్చని పాయ్ సూచించారు. అవి వ్యవసాయం, పర్యాటకం, బొగ్గుయేతర మైనింగ్, తయారీ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, కలపేతర అటవీ ఉత్పత్తులు.

సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి పునరుత్పాదక మార్పుకు ప్రయత్నించిన ఇతర దేశాలు కూడా భారతదేశానికి ఒక నమూనాను అందించగలవని వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఇండియా చాప్టర్‌లో వాతావరణ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉల్కా కేల్కర్ చెప్పారు.

"ఉదాహరణకు, ఇథియోపియాలో, పబ్లిక్ ఎలక్ట్రిసిటీ యుటిలిటీ సంస్థ 2030 నాటికి పునరుత్పాదక వనరుల నుండి 50% విద్యుత్‌ను అందించనుంది" అని కేల్కర్ చెప్పారు.

"వారు పునరుత్పాదక వనరులను అదనంగా ఉత్పత్తి చేసినప్పుడు, కొత్త శ్రామికుల్లో 30% మంది మహిళలు కావాలని కూడా చెప్పారు".

కానీ పబ్లిక్ ఎలక్ట్రిసిటీ యుటిలిటీ సంస్థ ఎక్కువ మంది మహిళలను నియమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, తగినంత మంది మహిళా ఎలక్ట్రికల్ ఇంజనీర్లు అందుబాటులో లేరని దీంతో వారికి శిక్షణ ఇచ్చారని ఆమె చెప్పారు. "ఈ సంస్థ సైన్స్, ఇంజనీరింగ్ రంగాలలోకి యువతులు ప్రవేశించడానికి, వారికి స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు అందించడానికి ఉన్నత విద్యాధికారులతో ఒప్పందం కుదుర్చుకుంది".

మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఎందుకు కల్పించలేదో తెలుసుకుని, దాని గురించి ఏమి చేయవచ్చో అర్థం చేసుకోవడానికి ఈ సంస్థ సుముఖతతో ఉందని కేల్కర్ చెప్పారు.

దక్షిణాఫ్రికాలో 2017 నుండి, ఆ దేశ ప్రభుత్వం తన జాతీయ విధానంలో ఇంధన వినియోగంలో మార్పుకు ఒక ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చింది. క్లీన్ ఎనర్జీ వైపు వెళ్లడం వల్ల కలిగే సామాజిక పరిణామాలను గుర్తించే జాతీయ విధానానికి ఇది ఒక ఉదాహరణ అని కేల్కర్ చెప్పారు. స్పెయిన్ వంటి ఇతర దేశాలు కూడా దీనికి ప్రాధాన్యతనిస్తున్నాయి.

అయితే ఇతర చోట్ల మంచి ఫలితాలను ఇచ్చిన ప్రయోగాలను అనుసరించడానికంటే ముందు భారతదేశం ఇంధన వినియోగంలో మార్పు కోసం దాని ప్రత్యేక అవసరాలను అర్థం చేసుకోవాలి అని నేషనల్ ఫౌండేషన్‌కు చెందిన పరిశోధకురాలు స్వాతి డి సౌజా చెప్పారు.

బొగ్గు నుంచి ఇతర పనుల్లోకి మారే కార్మికులని గుర్తించడం ఒక అత్యవసర సమస్య అని ఆమె పేర్కొన్నారు. "అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారతదేశంలోని బొగ్గు, దాని అనుబంధ రంగాలలో కాంట్రాక్ట్ కార్మికుల వాటా చాలా ఎక్కువ" అని ఆమె చెప్పారు. "ఇది భారత ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనధికారిక మార్కెట్ లెక్కల కారణంగా పాక్షికంగా కనిపిస్తోంది".

భారతదేశం మరింత అభివృద్ధి చెందిన దేశాలలో ఇంధన వనరుల వినియోగంలో మార్పు ప్రణాళికలను అనుసరిస్తే, కాంట్రాక్ట్, అనధికారిక రంగ కార్మికులను పెద్ద సంఖ్యలో వదులుకోవాల్సి వస్తుంది.

బొగ్గు కార్మికులు సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో బహుళ పరిశ్రమలలో కూడా పని చేయవచ్చు. ఇది శ్రామిక శక్తి పూర్తి చిత్రాన్ని మరింత క్లిష్టతరం చేస్తుంది. "బొగ్గు ఆధారిత రంగంలో పని చేసే కార్మికులని నిర్వచించడం వలన అటువంటి కార్మికులు కూడా విధాన నిర్ణయాల పరిధిలోకి వస్తారు. ఎవరూ నిరాధరణకు గురికారు" అని డి సౌజా చెప్పారు.

భారతదేశంలో బొగ్గు రంగ ఉద్యోగాల్లోనూ, ఇంధన వినియోగంలోనూ మార్పులు మహిళలపై చూపే ప్రభావాన్ని రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని డిసౌజా సిఫార్సు చేశారు.

"ఒక దశాబ్దంపైగా కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గుతోంది" అని డిసౌజా చెప్పారు. "పునరుత్పాదక శక్తిని పెంచడం ద్వారా సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఉన్న రంగంలో మహిళలను ఎక్కువగా భాగస్వామ్యం చేయడానికి ఆస్కారం ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి".

ఈ మహిళల సామాజిక, ఆర్థిక స్థితి, ఇతర అవకాశాల కోసం వలస వెళ్లడానికి వారు చూపించే సుముఖతను అర్థం చేసుకోవడం ద్వారా శ్రామికశక్తిలో మహిళల సంఖ్యను పెంచడంలో సహాయపడగలవని డిసౌజా చెప్పారు.

అడవుల్లో నివసించేవారు, స్థానిక సంఘాల ఆందోళనలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులపై యూత్ అడ్వైజరీ గ్రూప్ సభ్యురాలు అర్చన సోరెంగ్ చెప్పారు. ప్రత్యేకించి భూమి, అటవీ ప్రాంతాలపై వారి హక్కులు, ప్రాజెక్ట్‌లపై వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

అయినప్పటికీ, విధాన నిర్ణేతలు అటువంటి నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించే అవకాశం ఇంకా చాలా దూరంలో ఉంది. ప్రపంచ బ్యాంకు నుండి బొగ్గు గనుల మూసివేత కార్యచరణ కోసం నిధులను కోరేందుకు ప్రాథమిక చర్యలు తీసుకున్నప్పటికీ, బొగ్గు నుండి ఇతర వనరులకు మార్పు కోసం భారతదేశం ఇప్పటికీ ఎటువంటి సమగ్ర ప్రణాళికను కలిగి లేదు.

ఇది అభివృద్ధి చెందిన దేశాల నుండి సకాలంలో ఆర్థిక సహాయం అందుకునే ప్రాముఖ్యతను సూచిస్తుంది. "ట్రాన్సిషన్ ఫైనాన్సింగ్ అనేది చాలా పెద్ద విషయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు" అని ఐఫారెస్ట్‌కి చెందిన శ్రేష్ట బెనర్జీ చెప్పారు. "ఇది శిలాజ ఇంధన కార్మికులను మార్చడం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థను పునఃరూపకల్పన చేయడంలాంటిది".

పునరుత్పాదక శక్తిలో ప్రస్తుత పెట్టుబడుల నమూనా దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనదని ఆమె చెప్పారు. "మన వద్ద బొగ్గు ఉన్న ప్రాంతాల్లో, పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరు". కానీ, పశ్చిమ, దక్షిణ భారతదేశంలో పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బొగ్గు తూర్పు, మధ్య భారత దేశంలో లభిస్తుంది. "ఈ అసమానతల వలన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాలు ఈ రంగంలో పెట్టుబడులకు నోచుకోకపోవడం వల్ల అభివృద్ధికి దూరంగా ఉండి పేదరికంలోకి కూరుకుపోయే అవకాశం ఉంది" అని ఆమె వివరించారు. "ఇక్కడే సాంప్రాదాయ ఇంధన వనరుల నుంచి ఇతర ఇంధన వనరులకు మారడం వల్ల ఉత్పన్నం అయ్యే సమస్యలకు పరిష్కారాన్ని అందించాలి".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What happens if India stops using Coal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X