వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ పబ్‌జీ గేమ్‌ను ఎందుకు నిషేధించింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పబ్‌జీ గేమ్

పాకిస్తాన్‌లో పబ్‌జీ గేమ్‌ను నిషేధించారు. ఆ దేశ టెలి కమ్యునికేషన్ అథారిటీ (పీటీఏ) ఈ నిషేధాన్ని విధించింది. ఈ నిర్ణయంపై పబ్‌జీ ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీలు చేసింది. త్వరలోనే కోర్టు ఈ విషయంలో నిర్ణయం వెల్లడించనుంది.

ఈ అప్పీలుపై విచారణ జరుపుతున్న జడ్జి జస్టిస్ ఫారూఖీ... పబ్‌జీపై 'ఏ చట్ట ప్రకారం నిషేధం విధించార’ని పీటీఏను ప్రశ్నించారు. దీనికి పీటీఏ న్యాయవాది ఇచ్చిన సమాధానం ఇప్పుడు పాకిస్తాన్‌లో కొత్త చర్చకు దారితీసింది.

''పబ్‌‌జీ గేమ్ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉంది. చిన్నారులకు, యువతకు మానసికంగా నష్టం చేస్తోంది’’ అని ఆ న్యాయవాది కోర్టుకు చెప్పారు.

ఇదివరకు టిక్‌టాక్ కూడా పాకిస్తాన్‌లో ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంది. దాన్ని నిషేధించాలన్న డిమాండ్ ఆ దేశంలో పెరుగుతోంది.

ఇటు పబ్‌జీని ఇష్టపడేవారు ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తుతున్నారు. పబ్‌జీ గేమర్స్, ఆ గేమ్‌ను సమర్థించేవాళ్లు పంజాబ్-సింధ్ ప్రాంతంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఇమ్రాన్ ఖాన్

పబ్‌జీ గేమ్ కారణంగా కొందరు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఇటీవల పాకిస్తాన్‌లో వార్తలు వచ్చాయి. టీవీ ఛానెళ్లలో ఈ విషయంపై చాలా రోజులపాటు చర్చలు జరుగుతూ వచ్చాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

''రెండు వారాల క్రితం లాహోర్‌లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు పబ్‌జీ ఆడనివ్వకపోవడంతోనే వాళ్లు ఆ పని చేసినట్లు ఆ తర్వాత పోలీసులు వెల్లడించారు. పబ్‌జీపై నిషేధం విధించాలంటూ పీటీఏను అభ్యర్థించారు. పబ్‌జీ కారణంగా చిన్నారులు చెడిపోతున్నారని, వాళ్ల సమయం వృథా అవుతోందని పీటీఏ ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపింది’’ అని పాకిస్తాన్‌లోని బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ వివరించారు.

పబ్‌జీ నిషేధంపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. నిషేధం తొలగించాలంటూ చాలా మంది పోస్టులు పెట్టారు.

#UnBanPUBGPakistan, #PUBGKaJawabDou హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.

వీడియో గేమ్‌లపై పాకిస్తాన్ నిషేధం విధించడం ఇదేమీ తొలిసారి కాదని అసోసియేట్ రిపోర్ట్స్ అబ్రాడ్ దక్షిణాసియా ప్రతినిధి నాయ్లా ఇనాయత్ 'ద ప్రింట్’ వెబ్‌సైట్‌లో రాశారు.

''2013లో కాల్ ఆఫ్ డ్యూటీ, మెడల్ ఆఫ్ హానర్ లాంటి గేమ్‌లను ప్రభుత్వం నిషేధించింది. పాకిస్తాన్‌ను 'తీవ్రవాదులు తలదాచుకునే ప్రాంతం’గా వాటిలో చూపించడమే అందుకు కారణం. 2017లో స్వలింగ సంపర్కానికి సంబంధించిన అంశాలున్నాయంటూ వాల్కిరీ డ్రైవ్ అనే గేమ్‌ను కూడా పాకిస్తాన్ నిషేధించింది’’ అని తెలిపారు.

‘ప్రపంచంలోనే అత్యంత ఆదరణ, ఆదాయం ఉన్న గేమ్‌ల్లో పబ్‌జీ కూడా ఒకటి’

అసలు ఈ నిషేధం వల్ల ఎంత ప్రభావం ఉంటుంది? దీని వెనుక వేరే కారణాలు ఉన్నాయా?

'ఒక ప్రత్యేక వర్గాన్ని సంతృప్తిపరిచేందుకే పాకిస్తాన్ ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటోంది’ అని పాకిస్తాన్ యువతలో చాలా మంది నుంచి వాదన వినిపిస్తోంది.

''కొన్ని నెలలుగా లాక్‌డౌన్ పరిస్థితులు ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పిల్లలు, పెద్దలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం పబ్‌జీని నిషేధించింది. కొంత మంది దీన్ని దుర్వినియోగం చేశారే అనుకోండి. కానీ, మిగతా 99 శాతం మంది అలా చేయడం లేదుగా’’ అని కరాచీకి చెందిన రేహాన్ అబ్బాస్ అనే విద్యార్థి వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ, ఆదాయం ఉన్న గేమ్‌ల్లో పబ్‌జీ ఒకటన్న విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా విస్మరించిందో అర్థం కావడం లేదని ఇంకొందరు విద్యార్థులు అన్నారు.

పబ్‌జీ‌పై పాకిస్తాన్ తీసుకున్నటువంటి చర్యలు గేమ్‌లు ఆడేవారిపైనే కాదు, వాటిని తయారుచేసే డెవెలపర్లపైనా ప్రభావం చూపిస్తాయన్నది ఇంకొందరి అభిప్రాయం.

కొన్నేళ్ల క్రితం పాకిస్తాన్ యూట్యూబ్‌పైనా నిషేధం విధించిందని ప్రముఖ టీవీ హోస్ట్ వకార్ జకా గుర్తు చేశారు.

''ఆ నిషేధం తొలగించి ఉండొచ్చు. కానీ, డిజిటల్ రంగానికి ఇలాంటి నిర్ణయాలు చాలా నష్టం చేస్తాయి’’ అని అన్నారు.

పాకిస్తాన్‌లో పబ్‌జీ నిషేధంపై సాగుతున్న వివాదం రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనుక 'యువత మద్దతు’ పాత్ర చాలా ఉందని విశ్లేషకులు చెబుతుంటారు.

అయితే, ఇమ్రాన్ ఖాన్ పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలూ యువత అభిమతానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి.

ఇప్పుడు పబ్‌జీ నిషేధం ఇమ్రాన్ ఖాన్ యువ అభిమాన గణంపై ప్రభావం చూపుతుందా?

''పాకిస్తాన్‌లో పబ్‌జీకి ఎంత ఆదరణ ఉందన్న గణాంకాలు ఎవరి దగ్గరా లేవు. ఇమ్రాన్‌ఖాన్ మతం పేరు చెప్పుకుంటూ, రైట్ వింగ్ సంప్రదాయవాద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు’’ అని 'ఇండిపెండెంట్ ఉర్దూ’ పత్రిక ఎడిటర్ హారూన్ రషీద్ వ్యాఖ్యానించారు.

ఈ నిషేధం వల్ల ఇమ్రాన్ ఖాన్‌కు యువ అభిమాన గణం సన్నగిల్లుతుందని తాను భావించట్లేదని బీబీసీ ఉర్దూ సీనియర్ పాత్రికేయుడు ఆరిఫ్ శమీమ్ అన్నారు.

''యువ అభిమానులు గుడ్డిగా తనను అనుసరించేంతగా ఇమ్రాన్ ఖాన్ ఆకట్టుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ సమర్థకుడైన ఓ గాయకుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన బిలావల్ భుట్టో గురించి ఈ మధ్య అసభ్య వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా జనం ఆ గాయకుడిని సమర్థిస్తూ మాట్లాడారు. ఇమ్రాన్‌కున్న మద్దతే అందుకు కారణం. ఆర్థిక ఇబ్బందులు, కరోనావైరస్ సంక్షోభం విషయంలో విధానపరమైన లోపాలు... ఇలా అంశాలు ఎన్ని ఉన్నా ఇమ్రాన్ అభిమానులు ప్రశ్నించరు. ఇదే పాకిస్తాన్‌కున్న అతిపెద్ద సమస్య’’ అని అన్నారు.

పబ్‌జీ గేమ్

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ చర్యలపై 'సైన్యం ప్రభావం’ ఉంటోందన్న ఆరోపణలు కూడా గత ఆరు నెలల్లో ఎక్కువయ్యాయి.

పాకిస్తాన్ సైన్యం మాత్రం వీటిని కొట్టిపారేస్తోంది. అయితే, ఆ దేశ రాజకీయ చరిత్ర తెలిసినవారికి, ఈ ఆరోపణలు ఆశ్చర్యం కలిగించే విషయమైతే కాదు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో పబ్‌జీ గేమ్ భవిష్యతు ఏమిటనేది ఇస్లామామాద్ హైకోర్టు చేతుల్లో ఉంది.

ఒకవేళ ఈ కోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే, పబ్‌జీ అక్కడి సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించవచ్చు.

''పబ్‌జీ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని, అసభ్యంగా ఉందని పీటీఏ కోర్టుకు చెప్పింది. కానీ, ప్రభుత్వంలో ఏ విభాగం ఈ అభిప్రాయం వ్యక్తం చేసిందనేది పీటీఏ స్ఫష్టం చేయలేదు. దేశంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే కొన్ని శక్తిమంతమైన సంస్థలు ఉన్నాయి. పీటీఏ వీటి ప్రభావంలోనే ఉంది. పాకిస్తాన్‌కు, ఇస్లాంకు వ్యతిరేకమైనవి ఏంటన్నది ఈ సంస్థలు నిర్ణయిస్తాయి. వాటిని తొలగిస్తాయి. ఇమ్రాన్ 'మార్పు’ తెస్తానన్న నినాదంతో అధికారంలోకి వచ్చారు. కానీ, దేశంలో ఏమీ మారలేదు’’ అని హారూన్ రషీద్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pakistan bans PUBG as it alleges that it is against islam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X