అమెరికాలో కత్తితో పొడిచి తెలుగు విద్యార్థి దారుణ హత్య, నిందితుడూ మనోడే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అతనిని చంపింది కూడా మరో తెలుగు విద్యార్థి, అందులోను అతని రూమ్‌మేట్ కావడం గమనార్హం. తెలుగు విద్యార్థులైన సంకీర్త్, సాయి సందీప్ ఒకే గదిలో ఉంటున్నారు.

సంకీర్త్‌ను సాయి సందీప్ గదిలోనే కత్తితో పొడిచి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు చంపేశాడనే విషయం పైన ఆరా తీస్తున్నారు.

 Hyderabad Student Killed in US

ఇటీవలే హెచ్1బీ వీసా

రెండేళ్ల క్రితం ఎంఎస్ చేసేందుకు సంకీర్త్ అమెరికా వెళ్లాడు. అతనికి ఇటీవలే డ్రా సిస్టంలో హెచ్1బీ వీసా వచ్చింది. ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. ఈలోపే హత్యకు గురయ్యాడు. నార్త్ ఆస్టిన్‌లో ఉంటూ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంకీర్త్ హత్యతో అతని కుటుంబం ఉండే కాచిగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంకీర్త్ హత్య పైన ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... నిందితుడు సాయి సందీప్ పదిహేను రోజుల క్రితమే సంకీర్త్ ఉంటున్న గదిలోకి వచ్చారని చెప్పారు. అప్పటికే ఆ గదిలో మరో ఇద్దరు ఉన్నారని, సాయి సందీప్ ను ఇటీవలే ఓ కన్సల్టెన్సీ అదే గదికి పంపించిందని చెప్పారు.

 Hyderabad Student Killed in US

ఏదో చిన్న గొడవ జరిగిందని తమకు తెలిసిందని, కానీ కచ్చితంగా ఏం జరిగిందో తెలియదని చెప్పారు. నిందితుడు ఎలాంటి ఉద్యోగం లేకుండా గదిలో ఉంటున్నాడని చెప్పారు. ఈ సంఘటన నిన్న (సోమవారం) అర్ధరాత్రి జరిగిందన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

మృతుడు సంకీర్త్ సోదరుడు మాట్లాడుతూ.. ఇది మా కుటుంబానికి తీరని లోటు అన్నారు. ఏ క్షణికావేశంలో ఇది జరిగిందో తెలియడం లేదన్నారు. తన సోదరుడి మృతదేహాన్ని త్వరగా ఇక్కడకు తీసుకు వచ్చేలా ప్రభుత్వం సహకరించాలని చెప్పారు. సంకీర్త్ సోదరుడు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

నేను బెడ్రూంలో ఉన్నాను, అప్పటి దాకా బాగానే ఉన్నాం: స్నేహితుడు

సంకీర్త్ హత్య పైన అదే రూంలో ఉంటున్న అతని మరో స్నేహితుడు ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగినప్పుడు తాను బెడ్రూంలో ఉన్నానని చెప్పారు. అసలు కచ్చితంగా ఏం జరిగిందో తెలియదన్నారు. ఘటన అనంతరం పోలీసులు అంబులెన్సులో సంకీర్త్‌ను తీసుకు వెళ్లారని చెప్పారు.

తాను అంతకు కొద్దిసేపు ముందే పడుకునేందుకు పడక గదికి వెళ్లానని, కాసేపటికి సాయి సందీప్ చేసింది చూసి షాక్‌కు గురయ్యానని చెప్పారు. సందీప్ ఇటీవలే తమ గదికి వచ్చాడని చెప్పారు. అతని గురించి తమకు పూర్తి వివరాలు తెలియవన్నారు. అంతకుముందు కూడా అతను తమకు తెలియదన్నారు.

 Hyderabad Student Killed in US

పడుకోవడానికి వెళ్లే ముందు తమ మధ్య ప్రాధాన్యం కలిగిన చర్చ ఏం జరగలేదన్నారు. ప్రత్యేకంగా ఇది అని మాట్లాడుకోలేదని, ఎప్పటిలాగే మామూలుగానే మాట్లాడుకున్నామని చెప్పారు. తాను బెడ్రూంలోకి వెళ్లే వరకు అంతా బాగానే ఉందని చెప్పారు.

ఈ సంఘటన అర్ధరాత్రి 2.30 - 3.00 గంటల మధ్య జరిగిందన్నారు. సందీప్ ఉద్యోగం చేసేందుకు వచ్చాడని, అతను ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తున్నట్లు తమకు తెలుసునని, ఎక్కడో కూడా తెలియదన్నారు. ఆస్టన్‌లోనే ఎక్కడో పని చేస్తున్నట్లుగా తెలుసన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Student Killed in America.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి