‘ప్రజా రాజధాని అమరావతి’ వర్సెస్ ‘రాజధాని నిజస్వరూపం’ ఏపీలో పోటాపోటీ సదస్సులు
నవ్యాంధ్రలో రాజధాని పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. రాజధాని ముఖచిత్రంపై గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని టీడీపీ తెలిపింది. ఆ వెంటనే రాజధాని ప్రాంత రైతులు 'రాజధాని నిజస్వరూపం'పేరుతో సదస్సు నిర్వహిస్తున్నారు. దీంతో అమరావతిలో రాజధాని రాజకీయాలు చలిలో కూడా వేడి పుట్టిస్తున్నాయి.

రౌండ్ టేబుల్ సమావేశం
‘ప్రజా రాజధాని అమరావతి' పేరుతో తెలుగుదేశం పార్టీ గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. వైసీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలకు ఆహ్వానం కూడా పంపించింది. నిపుణులు, మేధావులు, వివిధ సంఘాలను కూడా ఇన్వైట్ చేశారు. రాజధానిపై సీఎం జగన్ మాట్లాడటం లేదని విమర్శించే అవకాశం ఉంది. అమరావతిలో భూసేకరణకు సమయం పట్టిందని టీడీపీ నేతలు గుర్తుచేసే ఛాన్స్ ఉంది. 29 గ్రామల భూములు తీసుకొని, నిధులు వెచ్చించి పనుల నిర్మాణంపై వివరిస్తారు.

నిర్మాణాలు పూర్తి..
ఏడాదిలోనే నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కానీ రాజధాని మార్పుపై పూటకో మాట మాట్లాడి ప్రజల్లో అభద్రతాభావం కలిగిస్తున్నారని చెబుతారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధానిలో టీడీపీ పర్యటన చేపట్టడం ఇది మూడోసారి. తొలుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పర్యటించిన సంగతి తెలిసిందే. ఇటీవల చంద్రబాబు నాయుడు బస్సులో పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే.

పోటీగా సదస్సు
టీడీపీ రౌండ్ టేబుల్ సదస్సు ధీటుగా రాజధాని ప్రాంత రైతులు సదస్సు నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు తుళ్లూరులో ‘రాజధాని నిజస్వరూపం'పేరుతో సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. సదస్సుకు రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తాము పడ్డ ఇబ్బందులను వారు ప్రజల దృష్టికి తీసుకొస్తారు.

అప్పులకుప్ప..
మరోవైపు సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇసుకను కృత్రిమ కొరత సృష్టించారని ఫైరయ్యారు. ఏడు నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. రంగులు వేయడానికి మాత్రం వైసీపీ రూ.1400 కోట్లు ఖర్చు చేస్తుంది కానీ.. సంక్షేమ కార్యక్రమాలపై చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. అమరావతి రాజధానిలో రూ.2 లక్షల కోట్ల సందప సృష్టించే వీలుందని గుర్తుచేశారు. ఉన్న విషయం చెబితే బూతులు తిడుతున్నారని చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!