కొలమానాలెక్కడివి?

Posted By:
Subscribe to Oneindia Telugu

ముస్లిం తెలుగు సాహిత్యం ఇవాళ్ల తీవ్రమైన దాడిని ఎదుర్కుంటోంది. స్కైబాబ రాసిన 'సుల్తానా' అనే కథ మూలంగా దాడి ప్రారంభమైంది. 'సుల్తానా' కథలో ఒక ముస్లిం అమ్మాయి హిందువును ప్రేమిస్తే ఏ రకంగా మోసపోతుందో చెప్పే కథ. ఈ కథ ఒక తెలుగు వార పత్రిక సాహిత్య ప్రత్యేక సంచికలో అచ్చయింది. ఈ సంచిక వెలువడిన చాలా రోజులకు ఆ కథ మీద దాడి ప్రారంభమైంది. కథ మీదనే కాకుండా 'జల్‌జలా' అనే తెలుగు ముస్లిం కవితా సంకలనంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ కవితా సంకలనం వెలువడి కొన్నేళ్లవుతోంది. చాలా కాలం 'జల్‌జలా' సంకలనంలోని కవితలపై తెలుగు సాహిత్యం రంగం మౌనమే పాటించింది. ఈ మౌనం వెనక గల కారణలేమిటనేది ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే కొత్తగా వచ్చిన, వస్తున్న ఆలోచనల పట్ల, విమర్శలపైన తెలుగు సాహిత్యం ఎప్పుడూ మౌనమే పాటించింది; పాటిస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, స్కైబాబ కథ మీద, జల్‌జలా కవిత్వం మీద దాడి ప్రారంభం కావడానికి నేపథ్యం వుంది. ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్‌సి) నల్లగొండ జిల్లా నాయకుడు ఆజం అలీ నల్లగొండలో పట్టపగలు దారుణంగా హత్యకు గురయ్యాడు. అదీ, అంతకు ముందు హైదరాబాద్‌లో హత్యకు గురైన ఎపిసిఎల్‌సి రాష్ట్ర నాయకుడు పురుషోత్తం సంస్మరణ సభ నిర్వహించే ఏర్పాట్లలో ఉండగా ఆజం అలీ హత్య జరిగింది. ఆజం అలీ కేవలం పౌర హక్కుల నేత మాత్రమే కాకుండా కవి కూడా. ఆయన కవితలు 'జల్‌జలా' కవితా సంకలనంలో వున్నాయి. ఆజం అలీ సంస్మారణార్థం ఆయన కవిత్వాన్ని పరామర్శించే ఉద్దేశంతో ఒక తెలుగు మాస పత్రిక సంపాదకుడు 'జల్‌జలా' కవితా సంకలనం సంపాదించాడు. ఇందులో కవితలు చదివిన తర్వాత, దాని సంపాదకుడు స్కైబాబ నేపథ్యం తెలుసుకున్న తర్వాత ఆయన కలాన్ని మరో వైపు తిప్పాడు. అంతే, అగ్గి రాజుకుంది. (ఆజం అలీ కవిత్వం గురించి రాస్తే ఎదురయ్యే ప్రమాదం గ్రహింపునకు రావడం కూడా అతడు కలాన్ని స్కైబాబ మీదికి మళ్లించడానికి కారణం కావచ్చు) 'జల్‌జలా' కవితా సంకలనం వెలువడినప్పటి నుంచీ ముస్లిం తెలుగు సాహిత్యం విస్తృతికి స్కైబాబ కాలికి బలపం కట్టుకుని తిరగడమే కాకుండా కవిత్వమే కాకుండా కథలు రాయడం కూడా ప్రారంభించాడు. 'సుల్తానా' కథకు ముందు ఆయన కొన్ని కథలు రాశాడు. ఈ కథలన్నీ ముస్లింల జీవితాలకు అద్దం పట్టేవే. 'సుల్తానా' కథ గానీ, 'జల్‌జలా' సంకలనంలోని కొన్ని కవితలు గానీ హిందువులకు రుచించకపోవడం ఆసాధారణమేమీ కాదు. పైగా, ఉదార సెక్యులరిస్టులకు అవి మింగుడు పడడం మరీ కష్టం. అయితే, చిక్కల్లా కొందరు తెలుగు ముస్లిం సాహిత్యకారులు కూడా స్కైబాబకు వ్యతిరేకంగా మాట్లాడడంతో వచ్చి పడింది. 'జల్‌జలా' కవులు ఇస్లాం మతంలోని, సమాజంలోని అణచివేత ధోరణులను, పేదరికాన్ని, వివక్షను ప్రశ్నిస్తూ కూడా బలమైన కవితలు రాశారు. ఈ రకంగా చూస్తే వీరు మొదట తమ మతపెద్దల ఆగ్రహానికి ఈ కవులు గురి కావాల్సి వుంటుంది. (నల్లగొండలో జరిగిన ఓ కవి సమ్మేళనంలో ఓ కవి తన కవిత చదువుతుండగా రాళ్లు విసిరి దాడి చేశారు కూడా) ఈ దృష్టి కోణం నుంచి ముస్లిం తెలుగు సాహిత్యకారులు స్కైబాబను వ్యతిరేకించడం లేదు. స్కైబాబ ధోరణి వల్ల చాలా మందిని దూరం చేసుకునే పరిస్థితి వస్తుందనేది వారి వాదన. ఇందులో నిజం లేకపోలేదు. అయితే, ఎవరినీ నొప్పించకుండా ఐడెంటిటీ ఉద్యమాలు నడిపించడం గానీ, అందుకు సంబంధించిన సాహిత్య సృజన చేయడం గానీ సాధ్యం కాదు. దళితులు అగ్రకులాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. స్త్రీలు పురుషులపై విరుచుకపడ్డారు. ఈ విమర్శలు హద్దులు దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే, 'జల్‌జలా' కవులు కూడా హద్దులు దాటారు. ఈ హద్దులు దాటడం అవసరమా, కాదా అనే దగ్గరే పేచీ వస్తుంది. హద్దులు దాటకుండా సున్నితంగా, సుతిమెత్తంగా మాట్లాడాలనేది కొందరి వాదన. కవిత్వం ఎవరినీ నొప్పించకూడదనేది వారి వాదనలోని ఆంతర్యం. ఇది చెప్పడానికి, వినడానికి కూడా బాగానే వుంటుంది. సుతిమెత్తగా మాట్లాడడమంటే 'హేతువుబద్దంగా' వాదించి ఎదుటివారిని ఒప్పించాలనడమే అవుతుంది. ఆధిపత్యాన్ని అనుభవిస్తున్న ఎవరూ కూడా సుతిమెత్తని హేతువును అంగీకరించి తన దారిని మార్చుకోరనే విషయాన్ని కాస్తా ఇంగితం ఉన్న వారెవరైనా చెప్పేయగలరు. కానీ, స్థిరీకృత విలువలను దెబ్బ కొట్టి కొత్త విలువలను ప్రతిపాదించే సందర్భంలో 'అతి' కవిత్వంలో అవసరమే అవుతుంది. స్త్రీ,దళిత వాదులే కాదు, దిగంబర కవులు కూడా అదే విధంగా వ్యవహరించారు. వారిని కొంత మేరకు వ్యతిరేకించిన సాహితీ పెద్దలు కొందరు ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అయితే, ముస్లిం తెలుగు కవుల విషయంలో ఆ రాజీకి ఎందుకు వెనకాడుతున్నారు? దళిత, స్త్రీవాదుల ఐడెంటిటీ వేరు, ముస్లింల ఐడెంటిటీ వేరు కావడమే అందుకు కారణం. మైనారిటీ బ్రాహ్మణవాదం మెజారిటీ ప్రజల్లోని రక్తంలో మెజారిటీ మతంగా జీర్ణమైపోయాక ఇతర మతస్థులను తమతో సమానంగా చూడడం అనేది వట్టి మాటే అవుతుంది. దేశ దరిద్రానికంతటికీ దేశంలోని ముస్లింలే కారణమనే వాదన నుంచి ముస్లింలు తమ మతంలోని ఛాందసవాదం గురించి మాత్రమే మాట్లాడాలనే కమ్యూనిస్టు మేధావుల వాదన వరకు చెప్తున్న మాట ఒక్కటే. ముస్లింలకు ప్రత్యేకమైన ఐడెంటిటీ లేదనేది వారి మాటలు, చేతలు అర్థం చేయిస్తూనే వున్నాయి. ఈ స్థితిలో ముస్లింలు తాము ఈ దేశవాసులమేనని, మిగతా ప్రజలకు ఉన్న హక్కులు, అధికారాలు, స్వేచ్ఛ తమకూ ఉన్నాయని ప్రకటించుకోవడానికి, తమను ఈ దేశస్థులుగా గుర్తించకపోవడంలోని మత కారణాలను ప్రశ్నించడానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా ఎంచుకున్నారు. ఇదే నయా బ్రాహ్మణ వాదులకు, నిరింద్రియ మేధావులకు రుచించడం లేదు. యాభై, అరవై ఏళ్ల క్రితం లేదంటే అంతకు ముందు సెక్యులర్‌ పదానికి, హిందూ ముస్లిం ఐక్యతకు ఇచ్చిన నిర్వచనాలను, విశ్లేషణలనూ ఉటంకిస్తూ కొత్త ఆలోచనలకు పాతర వేయాలని చూస్తున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన మార్పులను, ప్రజల అభిప్రాయాల్లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవడానికి వారు ఇష్టపడడం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ను తాము సమర్థించడం లేదని ఒక మొండివాదనను ముందుకు తెస్తున్నారు.

ఈ విషయం ఇలా వుంటే, తెలంగాణా పల్లెల్లో హిందువులు, ముస్లింలు ఎవరి మతాచారాలను వారు పాటిస్తూనే సహజీవనం చేసే పరిస్థితి వుండేది/ఉంది. అంటే, ఇక్కడ ముస్లింలు తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోలేదు. ఇదే సమయంలో ముస్లింలు, కింది కులాలవాళ్లు కలిసి చేసుకునే పీర్ల పండగల వంటి కొత్త సంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. దర్గాలు, పీర్ల పండుగ వంటివి ఈ సహజీవనాన్ని మరింత పెంచాయి. కోస్తాంధ్రలో ముస్లింలు తమ ఐడెంటిటీని కోల్పోయారు. ఒక మేరకు కోస్తాంధ్రను అనుకుని వున్న తెలంగాణా జిల్లాల్లోని ముస్లింలు కూడా ఈ ఐడెంటిటీని కోల్పోయారు. ఒక రకంగా, వారు తమ గుర్తింపు లేకుండా హిందూ మెజారిటీ మతానికి తలొగ్గారు. తెలంగాణా పల్లెల్లో ఎవరి ఆచారాలకు (మూఢాచారాలయినా సరే) కట్టుబడి వుంటూ కూడా పరస్పర విద్వేషాలు ఎప్పుడూ లేవు. (తెలంగాణా సాయుధ పోరాట చరిత్రను అధ్యయనం చేస్తే కూడా ఈ విషయం తెలుస్తుంది) నగరాల్లో, పట్టణాల్లో ఈ విద్వేషాలు చాలా కాలం తర్వాత చోటు చేసుకోవడం ప్రారంభించాయి. స్థానిక ముస్లింలకు, హిందువులకు ఎప్పుడూ వైరం లేదు. బయట నుంచి వచ్చిన ముస్లింల కారణంగా ఈ విద్వేషాలు మొదలయ్యాయి. వీటి వెనక రాజకీయోద్దేశాలున్నాయి. అప్పటి పరిస్థితి అదయితే, దేశంలో బిజెపి ప్రాబల్యం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రాబల్యం పెరుగుతుండడం వల్ల హిందూ ముస్లింల మధ్య కృత్రిమ వైరాన్ని మరింత పెంచి పోషించే శక్తులు పెరిగాయి. చదువుకున్న మధ్య తరగతి పట్టణవాసుల మనోభావాలను ప్రభావితం చేసే ఈ శక్తులు ముస్లింలను మరింతగా దూరం చేసే పనులే చేస్తూ వస్తోంది. కోస్తాంధ్ర ముస్లింల మాదిరిగా హిందువులతో బేషరతుగా మమేకమై వుంటే తెలంగాణా ముస్లింల నుంచి శక్తివంతమైన కవితలు గానీ, కథలు గానీ వచ్చి వుండేవి కావు. పాత్రలకు ముస్లిం పేర్లు తగిలించి కోస్తాంధ్ర రచయితల మాదిరిగా 'విశ్వజనీన సత్యాన్ని', 'దీర్ఘకాలిక రాజకీయ లక్ష్య సాధన అవసరాన్ని' బోధించి వుండేవారు. దీని వల్ల బ్రాహ్మణవాదులకు, నయా బ్రాహ్మణవాదులకు, నిరింద్రియ మేధావులకు అభ్యంతరం వుండేది కాదు. తెలంగాణాను తమ అంతర్గత వలసగా మార్చుకునే వారి బోధనలు ఎప్పటి లాగనే చెలమణి అయి వుండేవి. మొత్తంగా తెలంగాణా ఐడెంటిటీతో ఈ ప్రాంతంలోని ముస్లింల ఐడెంటిటీ ఆధారపడి వుంది. నిన్నమొన్నటి వరకు వామపక్షాల, విప్లవ భావజాలాలను మనఃస్ఫూర్తిగా అంగీకరించిన తెలంగాణా మేధావులు, సాహిత్యకారులు చాలా మంది ఈ రోజు వాటిలోని డొల్లతనాన్ని బయట పెట్టే పనికి పూనుకున్నారు. శాశ్వత సత్యం వుంటుందనే తప్పుడు ప్రచారాన్ని వారు తిప్పికొడుతున్నారు. ఈ కోవలోకే తెలంగాణ ముస్లిం కవులు, రచయితలు వస్తారు. మాట్లాడేది సూటిగా మాట్లాడడమే వీరికి వంటి బట్టింది. ఈ అవసరం కూడా ఇక్కడి వారికే ఎందుకు వచ్చిందంటే, తెలంగాణాను నానా సిద్ధాంతాలకు ప్రయోగశాలగా మార్చినందుకు. ఈ స్థితిలో కోస్తాంధ్ర మేధావుల, విమర్శకుల, సాహిత్య కారుల కొలబద్దలు తెలంగాణా సాహిత్యాన్ని బేరీజు వేయడానికి సరిపోవు. తెలంగాణాలోని ఏ సాహిత్య ప్రక్రియపైనా, ఆ మాటకొస్తే ఏ రచయితపైనా తీర్పు చెప్పడానికి ఆ కొలమానాలు పనికిరావు. చెప్పాలంటే, వర్తమాన సాహిత్యాన్ని అంచనా వేయడానికి కొత్త ప్రమాణాలు, కొలబద్దలు అవసరం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి