వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద వాయిస్ ఆఫ్ కలర్స్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

సత్య శ్రీనివాస్ కవి, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్. అంతకన్నా ఎక్కువగా ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతినీ పిల్లలనూ ఒక రకంగా చూసే సత్య శ్రీనివాస్ తల్లులను కూడా అంతే ప్రేమతో అక్కున చేర్చుకుంటారు. ఒక ఎన్విర్న్మెంటలిస్ట్ గా దేశ దేశాల సంస్థలతో సంబంధాలు నెరపుతూ, ప్రకృతిలోని సహజ వనరుల సంరక్షణ కోసం గ్రామాల్లోని ప్రజలతో మమేకమవుతూ అయన తనను తాను సిటీలో నివసించే ఒక సహజమైన వ్యక్తిగా మలచుకున్నారు.

ఆయన ప్రకృతి ఆరాధన ఎంతటిదో ఆయన కవితలనే చదవనవసరం లేదు, ఆయన ఇంటిని చూసినా చాలు. తన కలలంటే ఎంతటి ఇష్టమో, గ్రామీణ జీవితమన్నా, స్వచ్ఛమైన ఆ మట్టి మనుషులన్నా ఆయనకు అంతే ఇష్టం. "20 మెమోయిర్స్" పేరిట హైదరాబాదులోని గోథే సెంటర్ లో మొదటి సారి తను గీసిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు 'శ్రీ సత్య శ్రీనివాస్' గారు. తను జీవితంలో చూసిన ఎందరో గ్రామీణ అమ్మలను బొమ్మలుగా గీసి ప్రదర్శించారు.

అమ్మలనే ఎందుకు గీశాడో తెలుసుకుందామని అనిపించింది. ఒక సాయంత్రం పూట, ప్రశాంతమైన వాతావరణంలో తన చిత్రాలను ప్రదర్శనను ఉంచిన గోథే సెంటర్ లోనే, ఆ అమ్మల చిత్రాల మధ్యనే ఈ మా సంభాషణ సాగింది. కళలకు సంబంధించిన ఎన్నో విషయాల మీద స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ, ఒక కళాకారుడిగా తన అంతరంగాన్ని కూడా ప్రదర్శనకు నిలిపినట్టుగా అనిపించింది ఆయనతో మాట్లాడుతుంటే. సత్య శ్రీనివాస్ గారికీ నాకూ మధ్య సాగిన ఆ సంభాషణలే "The Voice of Colours".

అటువంటి సత్య శ్రీనివాస్‌తో కవిత్వ ప్రేమికుడు, కవి, గుండె లోతులు తెలిసిన వైద్యుడు సంభాషణ కొనసాగిస్తే ఎలా ఉంటుంది. డాక్టర్ విరించి సత్యశ్రీనివాస్ మాట మాట కలిపి సుదీర్ఘ సంభాషణ కొనసాగించారు. వారి ఏకాంత సంభాషణను ఒన్ ఇండియా పాఠకుల కోసం అందిస్తున్నాం.

Virinchi: ఏ కళలో అయినా రాణించాలి అంటే, గురువు ఉండాలి అంటారు. చిత్రకళ (art of painting) లో మీకు గురువు ఎవరైనా ఉన్నారా?. వారి గురించి చెబుతారా?.

Satya Srinivas: ఈ కళ ను టెక్నికల్ గా నేర్చుకున్నది మాత్రం 'నరేంద్ర రాయ్' అనే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ దగ్గరే. 1982 కాలంలో కేశవ మెమోరియల్ లో వారి దగ్గర నేర్చుకున్నాను. కానీ తరువాత నాకు చిత్రాలు వేయాలి అనే ప్రేరణ కల్పించింది మాత్రం ఇదిగో కనిపిస్తున్నారు గా ఈ అమ్మలే. ఒక రకంగా చెప్పాలి అంటే మనలో అంతర్గత ప్రేరణ కలగటానికి గురువులెందుకు?. గురువులు మనకు ఒక దారిని చూపిస్తారు...కానీ, నడవాల్సిందీ ఆ ప్రేరణ పొందాల్సిందీ మాత్రం మనమే. మన అంతర్గత ప్రేరణకు గురువులు నేర్పిన విద్య ఒక టెక్నిక్ ని అందించేదిగా, ఒక సహాయకారిగా ఉంటుంది. అసలు ప్రేరణే లేనపుడు, కేవలం టెక్నిక్ మాత్రమే ఏమి చేయగలదు. ఇంకో విధంగా చెప్పాలంటే మన ప్రేరణే మనకు అసలైన గురువు. ఆ రకంగా చూసుకుంటే, నరేంద్ర రాయ్ తో పాటు ఈ అమ్మలందరూ నాకు గురువులే.

V: ఈ అమ్మలు మీలో అంతగా ప్రేరణ కలిగించటానికి కారణం ఏంటి?. మిమ్మల్ని కదిలించేంతగా వారిలో మీరేం చూసారు!?

S: వారి జీవన విధానమే గురూ! ఎన్విరోన్మెంటలిస్టు(environmentalist) గా నేను గ్రామాల్లో, ట్రైబల్ ఏరియాల్లో, అడవుల్లో సంచరిస్తున్నప్పుడు ఈ అమ్మలను దెగ్గరినుండి గమనించే అవకాశం కలిగింది. ఆ అమ్మల జీవితాలు, జీవన విధానాలే కాకుండా వారి ఉద్వేగాలు (emotions) నన్ను ఆలోచింపజేసాయి. అంతర్గత ప్రేరణ అక్కడ అలా మొదలయ్యి౦ది. ఆ తరువాత ఆ ప్రేరణే, నా చుట్టూ ఉన్న అమ్మలని కూడా అర్థం చేసుకోవటానికి ఉపయోగ పడింది. ఇపుడు నేను పోట్రెయిట్ గీసిన ఈ అమ్మల్లో చాలా మందితో నాకు అనుబంధం ఉంది. వారి జీవితం, వారి మానసిక ఉద్వేగాలు నాకు చాలా దగ్గరగా తెలుసు. వారి ఉద్వేగాలను నేను అనుభవించాను. అందుకే వారి ఉద్వేగాలకు ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను. బొమ్మలు వేయటం, అందులోనూ పోట్రెయిట్స్ వేయటం నాకు చాలా ఇష్టం. కాబట్టి నాకు ఇష్టమైన కళ లో నాకు ఇష్టమైన వ్యక్తుల పోట్రెయిట్స్ గీయాలని అనిపించి బొమ్మలు వేయటం మొదలుపెట్టాను.

V: ఈ అమ్మలందరూ మీకు వ్యక్తిగతంగా తెలిసినవారే అన్నమాట.

S: అందరూ తెలిసిన వారు కాదు. ఈ అమ్మల్లో కొంత మంది నాకు వ్యక్తిగతంగా తెలియక పోవచ్చు. కానీ మానసికంగా ఐతే మాత్రం నాకు తెలిసిన వారే!. ఎందుకంటే కొంత మంది మిత్రులు వారి తల్లుల ఫోటోలు నాకు పంపి బొమ్మలు గీయించుకున్నారు. అటువంటి అమ్మలు నాకు వ్యక్తిగతంగా తెలియక పోవచ్చు. కానీ మానసికంగా నాకు తెలియకుండా ఎలా ఉంటారు? వారిని తెలుసుకున్నప్పుడే నేను బొమ్మ గీయగలను. ఉదాహరణకు మీరు మీ అమ్మ ఫోటో ఇచ్చారనుకోండి. నేను వెంటనే ఆమె బొమ్మను వేయలేను. ఆమెను అర్థం చేసుకోవటానికి నాకు ఆరునెలలు కూడా పట్టొచ్చు. ఆమె ఫీచర్స్ ఏంటీ?..ఆమె జీవితమేంటి అనేది నేను ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. బొమ్మ వేయటానికి మూడు గంటలు లేదా మూడు రోజులు పట్టొచ్చు..కానీ ఒక అమ్మను నేను అర్థం చేసుకోవటానికి చాలా కాలం పట్టొచ్చు.

అర్థం చేసుకోనిది, ఎలా వేయగలను?. "అర్థం చేసుకోవాలంటే ఆమె జీవితం గురించి క్షుణ్ణంగా తెలియాలా..?" అని మీరు అడగొచ్చు. కానీ ఒక కళాకారుడిగా నేను ఏ అమ్మనైనా అర్థం చేసుకోగలను. ఆమె జీవితమంతా తెలియాల్సిన అవసరం ఉండక పోవచ్చు. ఇన్ట్యూషన్(intution) నన్ను ప్రేరేపింపవచ్చు. వీళ్ళంతా అమ్మలు కదా..వాళ్ల మనసుల్లోంచి వినిపించే 'లల్లబీ' ని నేను వింటాను. వారి ఫోటోలను చూస్తున్నప్పుడు వారి జోలపాటలే నాకు వినిపిస్తాయి. అమ్మ ఎవరికైనా అమ్మే కదా..! కొడుకుగా మారటం మనం నేర్చుకున్నపుడే వారి జోలపాటల్ని మనం వినగలం. At the end of the day, it is not just a painting for me. కేవలం పెయింటింగ్ మాత్రమే అయ్యేట్టయితే ఇంత ఆలోచించవలసిన అవసరం లేదు. నాకు ఒక కథ కావాలి.

ఆ అమ్మకు నాకూ మధ్య ఒక కథ ఉండాలి. అలా ఉన్నప్పుడే మా ఇద్దరి మధ్య ఉండే అనుబంధానికి ఈ పెయింటింగ్ అనేది ఒక నిదర్శనంలా మిగులుతుంది. అపుడు నేను గీసిన పెయింటింగ్, నేను అమ్మతనాన్ని అర్థం చేసుకోగలిగటం వల్ల నాలోంచి బయటకు వచ్చే ఒక ఉద్వేగం వంటిది. It is not a painting for me. Its my emotion. My art is an expression of emotional outburst from me.

V: అయితే కళాకారుడికి తను సృష్టించిన కళారూపం అందరూ భావిస్తున్నట్టు ఒక నిర్జీవ వస్తువు ఎంత మాత్రం కాదన్నమాట. ఎవరికి ఎలాగా ఉన్నా, ఎలా అనిపించినా, అతడికి మాత్రం అది సజీవమైన అంశమే అంటారు..

S: అంతే కదా గురూ..! అది సజీవం కాలేనపుడు ఇక కళకు అర్థమే లేదంటాను. అది ఏ కళేగానీ..! చిత్రకళలోని విశేషమేమంటే ఒక సజీవమైన అంశాన్ని నిర్జీవమైనటువంటి పనిముట్ల సహాయంతో సృష్టి చేయాలి. పేపరూ, రంగులూ నిర్జీవమైనవే కదా!...కళాకారుడు ఆ నిర్జీవ పనిముట్లకు ముందు ప్రాణం పోసి, తన సజీవ వస్తువును సృష్టించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎటువంటి సజీవ సృష్టి చేయడానికి ఎటువంటి పేపరు ఉపయోగించాలి?..ఏ రంగు ఉపయోగించాలి? అనేది ఆర్టిస్ట్ కి తెలిసి ఉండాలి. ఉదాహరణకు ఈ బొమ్మ చూడ౦డి... ఈమె యాకూబ్ గారి తల్లి. ఈమె పోట్రెయిట్ కి 'గ్రామ దేవత' అని పేరు పెట్టాను. ఈమెను పట్టుకోవడానికి గరుకు టెక్ట్చర్ ఉండే ఇండియన్ పేపర్ ను వాడాను. అదే ఈ బొమ్మ చూడ౦డి ఈమె కవి సిద్ధార్థ గారి తల్లి. ఈమెను ఆక్వారెల్లీ పేపర్ మీద పట్టుకున్నాను.

V: ఓహ్...! పేపర్ టెక్చర్ ను కూడా వేయబోయే బొమ్మకు అనుగుణంగా ఎంపిక చేసుకుంటారా!?. Interesting. మీరు యాకూబ్ గారి మదర్ కోసం ఈ రఫ్ టెక్చర్ ఉన్న ఇండియన్ పేపర్ని ఎంచుకున్నాను అన్నారు. ఆమె కోసం ఆ పేపర్నే ఎ౦పిక ఎందుకు చేసుకున్నారో వివరిస్తారా..?

S: నేను యాకూబ్ తల్లిని చూశాను. నిజంగానే ఆమె గ్రామ దేవత. ఎపుడూ రొట్టమాకురేవు ఊర్లోనే ఉంటుంది. సిటీకి రమ్మన్నా రాదామె. ఒక వేళ హైదరాబాదులోని యాకూబ్ ఇంటికి వచ్చినా, బయటనే సోఫాలోనో, మంచం మీదో కూర్చుంటుంది, అక్కడే పడుకుంటుంది. ఇంట్లో పడుకోమన్నా పడుకోదు. ఎందుకంటే..ఆమెకు స్పేస్ కావాలి. మనకులాగా గదులు ముఖ్యం కాదామెకు. బయట కూర్చుంటే నలుగురు మనుషులూ తిరుగుతూ కనిపించాలామెకు. ఊర్లో అలాగే ఉంటుంది మనుషుల జీవితం. వారికి నలుగురూ కలిసే ఉండాలి. సిటీలో ఒక గదిలో కూర్చోపెట్టి ఒక టీవీని వాళ్ల ముందు పెట్టేస్తే..వాళ్లస్సలు ఉండలేరు. టీవీ ముందే జీవితమంతా గడిచిపోతే ఒక మనిషికీ ఇంకో మనిషికీ మధ్య సంబంధం ఏముంటుంది?. అందుకే ఆమె సిటీలో ఉన్నా పల్లెలో ఉండే స్వచ్ఛమైన జీవితాన్నే కోరుకుంటుంది. విశాలమైన స్పేస్ నే కోరుకుంటుంది. ఇటువంటి అమ్మను పట్టుకోవాలంటే ఈ టెక్చర్ ఉన్న పేపర్ ని ఉపయోగిస్తే బాగుంటుంది అనిపించింది నాకు.

గ్రామ దేవతకు మనం రోజూ పూజలు చేయం. బోనాలు ప్రతి రోజూ ఎత్త౦. ప్రతీ శనివారం వేంకటేశ్వర స్వామిని పూజించినట్టు పూజించం. ఒక సందర్భంలోనే ఆ దేవతలను పూజిస్తాం. ఈ దేవతల ఉనికి అంతర్లీనమైనది. ఉదాహరణకు చెఱువు కట్ట మీది మైసమ్మ... కట్ట మీద ఆమె కొలువై ఉన్నందుకే ఆ కట్ట ఉంటుంది. మైసమ్మను అక్కడనుండి తొలగించి చూడండి, ఇంక చెరువూ ఉండదూ, కట్టా ఉండదు. అన్నింటినీ తవ్వేస్తారు. మైసమ్మ ఒక దేవత అనే భయం ఉండటం వల్ల, ఆ కట్ట అలాగే ఉంటుంది. ఆమె కనిపించకుండా ఆ చెఱువును కాపాడతూ ౦టుంది. అంటే ఊరిని కాపాడుతున్నట్టే కదా. ఆమె అక్కడి నుండి జరగదు. ప్రజలు కూడా ఆమెను అక్కడినుండి జరపరు. అట్లాగే యాకూబ్ మదర్ కూడా కనిపించకుండా ఆ వూరిని కాపాడుతూ ఉంటుంది. ఆమె అక్కడి నుండి జరగదు. ఆమె అక్కడ ఉండటం వల్లే యాకూబ్ రొట్టమాకు రేవుతో అనుబంధాన్ని కొనసాగిస్తూ..ఆ ఊరికి పదే పదే వెళ్తూంటాడు. రొట్టెమాకురేవు అనే ఊరు, యాకూబ్ కి తల్లి ఐతే..యాకూబ్ తల్లి ఆ ఊరికి దేవత. ఊరికి చదువుకున్న పిల్లలు పదే పదే ఒస్తేనే కదా ఊరు కాపాడబడుతుంది. ఈమె కూడా కనబడకుండానే రొట్టమాకురేవును కాపాడుతూ ఉంది. అందుకే ఆమెను 'గ్రామ దేవత' అంటున్నాను. చూడటానికి రఫ్ గా కనిపించినా ఈ పేపర్ మీద కలర్ అంత త్వరగా ఆరిపోదు. యాకూబ్ మదర్ ని పట్టుకోవడానికి ఇదే పేపర్ సరయినదని నాకనిపించింది. Its my intution.

V: ఇపుడు మీరు పేపరును సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని విషయాల్ని పరిగణలోనికి తీసుకుని మీ ఇన్ట్యూషన్ తో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే, కలర్ విషయంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా...?

S: అవును. ఉదాహరణకు ఇదే యాకూబ్ మదర్ బొమ్మ చూడండి. ఈ బొమ్మలో కేవలం బ్రౌన్ కలర్ మాత్రమే ఉంటుంది. బ్రౌన్ అనేది మట్టి కలర్. జీవితాన్ని పట్టుకోగలిగిన కలర్. చక్కదనాన్నీ, వెచ్చదనాన్నీ (warmth) ప్రతిబింబిస్తుందీ కలర్. ఈ బొమ్మలో పై నుండి కింది దాకా బ్రౌన్ కలర్ లోని వేరియస్ షేడ్స్ నీ, టోన్స్ నీ చూపించాను. తన ఊరినీ, మట్టినీ ప్రేమించే యాకూబ్ మదర్ ని పట్టుకోవడానికి ఈ కలర్ అయితేనే బాగుంటుందని..ఈ కలర్ ని తీసుకున్నాను.

V: నిర్జీవ వస్తువులైన పేపర్ కలర్ వంటి వాటికి ప్రాణం పోయడం అంటే ఇదేననుకుంటాను. చిత్రకారుడికి తన వస్తువే కాకుండా పేపర్, కలర్ వంటి వాటి మీద కూడా పూర్తి అవగాహన ఉండాలనిపిస్తుంది మీ మాటలు వింటుంటే..!

S: అంతే కదా గురూ...! ఏ కళాకారుడికయినా ముఖ్యంగా వాని ఇన్స్ట్రూమెంట్(Instrument) ఏంటో వానికి క్షుణ్ణంగా తెలియాలి. వీణ వాయించే వాడికి ఏ తీగను మీటితే ఏ వైబ్రేషన్ వస్తుందో తెలియకపోతే వాడి మ్యూజిక్ అపశృతిలోనే ఉండిపోతుంది. ఇన్స్ట్రూమెంట్ ని అవగాహన చేసుకోలేక పొతే ఆ కళ కూడా నిర్జీవంగానే ఉండిపోతుంది. Knowing the instrument itself is an art.

V: ఓకే. ఉదాహరణకు మీరు ఇపుడు ఒక కాన్సెప్ట్ అనుకున్నారనుకుందాం. ఒక అమ్మను గీయాలి అనుకున్నారు. మీ ఊహల్లో ఆమెను 'ఇలా గీయాలి' అని ఒక ఊహా చిత్రాన్ని ఏర్పరచుకున్నారు. ఇపుడు బొమ్మ గీయటానికి ముందు, మిమ్మల్ని మీరు ఎలా సిద్ధపరుచుకుంటారు?

S: ఊహల్లో ఒక రూపాన్ని గీసుకోవడం అంత సులువుగా జరుగదు గురూ..! ఒక్కోసారి ఆరు నెలలకు పైగా కూడా పట్టొచ్చు. ఈ ఫోటో చూడ౦డి, కవి సిద్ధార్థ మదర్ ఈమె. ఈమె ఎపుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. మా అమ్మతో అప్పట్లో పురాణ కాలక్షేపం వంటివి చేసేది. మా ఇంటికి చాలా సార్లు వచ్చేది. ఎపుడూ చూసినా నవ్వుతున్నట్టే కనిపించేది. ఫోటోలో కూడా నవ్వుతూ కనిపిస్తుంది. ఆ నవ్వును నా బొమ్మలోకి నేను ఎలా పట్టుకోవాలి అనేది విషయం. ఆమెలోకి నేను వెళ్లాలి. లేదా ఆమెనన్ను ఆవహించాలి. ఆ మాతృత్వపు పరిమళాన్నీ, ప్రేమనూ నేను ఆస్వాదించాలి. అపుడే ఆమె నవ్వును నేను పట్టుకోగలుగుతాను. ఆ నవ్వును ఆమె కళ్ల లో చూపించాలి. మనిషి తన మనసుతో నవ్వేటపుడు కళ్లు చెమక్కుమని మెరుస్తుంటాయి.

చిన్న పిల్లగాడి నవ్వులా స్వచ్ఛంగా ఉంటుంది. పైపై నవ్వు తెలిసిపోతుంటుంది. ఆమె నవ్వు అలా స్వచ్చంగా ఉంటుంది. ఈ బొమ్మలో ఆమె నవ్వును పట్టుకున్నాననిపించింది, అందుకే ఈ బొమ్మకు 'soulful smile' అని పేరు పెట్టాను. ఆమె నవ్వులోని ఆ స్వచ్ఛతను నా కలర్ షేడ్స్ లోకి తీసుకురాగలగటమే ఆ బొమ్మ వేస్తున్నపుడు నేను పట్టుకోవలసినది కాబట్టి నా prior preperation అంతా ఒక కొడుకుని కావటమే! నాకు బొమ్మ గీయటం ఒక ఉద్వేగ భరిత స్థితి తప్ప ఇంకేమీ కాదు. ఆ ఉద్వేగ స్థితిలోకి పోవటానికే నాకు సమయం పడుతుంది. ఒకసారి ఆ స్థితికి చేరుకున్నాక బొమ్మ గీయటానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. కోపం అనే ఒక ఎమోషన్ రోజుల తరబడి ఉండదు కదా! కొన్ని సెకన్లు ఉండొచ్చు. కొన్ని నిముషాలు ఉండొచ్చు. ఆ సమయంలోనే కొట్టడమో తిట్టడమో చేస్తాం కదా! ఇదీ ఆంతే.

V: అమ్మలనే చిత్రించాలని మీరు ఎపుడనుకున్నారు?. ఈ నిర్ణయం ఎపుడు తీసుకున్నారు?. ఎందుకు తీసుకున్నారు?. నా ప్రశ్నలో నాన్నలు ఎందుకు కాదు అనేది కూడా అంతర్గతంగా ఉందనుకుంటాను.

S: (నవ్వులు) ఎపుడు నిర్ణయం తీసుకున్నాను అంటే ఇదమిత్తంగా చెప్పలేను..అంతర్లీనంగా నాకటువంటి భావన కలిగించింది మాత్రం గ్రామాల్లో నేను చేసిన పర్యటనలే అనుకుంటాను . మా నాన్న జర్నలిస్ట్ గా ఉన్నపుడు, చాలీ చాలని జీతాలు ఉండేవి. పెద్ద ఫ్యామిలీ మాది. అందుకే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఆయనకు ఉండేవి. సంపాదనలో పడి మమ్మల్ని చూసుకోవటానికి సమయం కూడా ఉండేది కాదాయనకు. అప్పట్లో మేము హైదరాబాదుకు కొత్త. ఇక్కడ మాకంతా భయంగా ఉండేది. ఉర్దూలోనే మాట్లాడాలనే నిబంధనుండేది. ఈ రోజు సత్య శ్రీనివాస్ ఒక కవిగా ఒక పెయింటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అనుకుందాం. అంతేగాక, సత్య శ్రీనివాస్ అన్నలూ, చెల్లెళ్ళూ అందరూ వారి వారి రంగాల్లో సెటిలయ్యారు. ఒక్క సత్య శ్రీనివాస్ ఇంటి పరిస్థితియే కాదిది. దాదాపు అందరి ఇంటి పరిస్థితీ ఇదే. ఈ పిల్లలు గానీ, నాన్నలు గానీ ఇలా గొప్ప గొప్ప వాళ్లుగా తయారు కావటానికి కారణం ఎవరు?. ఇంటిలో ఉండే అమ్మలే కదా..? కనిపించకుండానే వాళ్లు ఇంత మందిని గొప్పవాళ్ళుగా తయారు చేశారు.

అందుకోసమని తమ జీవితాల్ని ఎంతగానో త్యాగం చేశారు. పైగా ఈ అమ్మలు మననుండి గానీ, జీవితం నుండిగానీ ఏమీ ఆశించలేదు. అనామకంగానే ఉండిపోయారు. సంతోషాల్ని మాత్రమే పంచిపోయ్యారు. వీళ్ల స్టోరీస్ కూడా ఎక్కడా ఉండవు. గొప్ప వాళ్ల గురించే చర్చించుకుంటాం. ఫలానా వాడు గొప్ప కవి అంటాం. వాడు అలా తయారవటానికి కారణం ఎవరు?. మా అమ్మనే తీసుకోండి..కుటుంబాన్నంతా ఆమే నడిపింది. ఆమె మాత్రం ప్రపంచానికి తెలియకుండానే ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయింది. ఆమెను నేనెందుకు ఈ ప్రపంచానికి పరిచయం చేయకూడదు?. ఒక మొక్క నాటుతాం. పంట వస్తుంది. అది అలా ఎదిగి రావటానికి మొక్క గొప్పతనం అనుకుంటాం, లేదా విత్తనం గొప్పదనం అనుకుంటా౦. నేల లేకపోతే..నేలలో సారం లేకపోతే మొక్క ఎలా బతుకుతుంది?. ఎలా ఎదుగుతుంది? ఈ అమ్మలంతా నేల సారం వంటి వారు. నాన్నల గురించి పిల్లల గురించి వారి గొప్పతనం గురించి లోకం లో ఎన్నో కథలున్నాయి. ఈ అమ్మల కథలు ఎవరు గుర్తించాలి? ప్రపంచానికి ఎవరు అందించాలి?. (పది సెకన్ల గంభీర మౌనం)

మీ ప్రశ్న కు సమాధానం దొరికిందనుకుంటాను. (నవ్వులు)

V: మీరు అమ్మల్లో గత తరం అమ్మల్నే తీసుకున్నట్టు ఉన్నారు. ఈ జెనెరేషన్ అమ్మలను బొమ్మలుగా వేయలేదని అనిపించింది. ఈ ఎగ్జిబిషన్ లో ఈ తరం అమ్మలైతే నాకెవరూ కనిపించలేదు. ఇలా ఆ తరం అమ్మలనే ఎంచుకోవటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?.

S: ఈ జెనెరేషన్ అమ్మలందరూ అమ్మలు కాదు గురూ..! కానీ ఆ జెనెరేషన్ అమ్మలను వెతుక్కుని, వారిని ఎక్ప్లోర్ చేసుకుంటూ పోతే..వాళ్లు వందల వేల యేండ్ల వృక్షాల్లాంటి వారని తెలుస్తుంది. నీడనిచ్చారే తప్ప, ఏమీ ఆశించలేదు వాళ్ళంతా. కుటుంబం నుంచిగానీ, సమాజం నుంచి గానీ ఏమీ ఆశించకుండానే వారు ఒక తరాన్ని ముందుకు నడిపించినవారు. ఇంకోటి వీళ్లకు పెట్టే గుణముంది. మీ అమ్మమ్మనే ఒకసారి గుర్తు తెచ్చుకోండి...ఆమె ఇంట్లో నలుగురు ఉన్నా పది మందికి సరిపడా వండేస్తుంది. ఎపుడెవరు ఇంటికొచ్చి తింటారేమో అనే ఆలోచన ఆ కాలం వారికుండేది. ఆ ఇల్లులు కూడా పదిమంది వచ్చీ పోయే ఇల్లుల్లా ఉండేవి. ఇపుడెవరన్నా ఇంటికి వస్తున్నారంటే..ఫోన్ చేసి రావాలి అనుకుంటున్నాం. ఫోన్ చేసి రాకు౦టే విసుక్కుంటున్నాం. వాడికెంత వండాలి..? ఎంత తింటాడో అని ఆలోచించే కాలంలో ఉన్నాం.

V: అప్పటి అమ్మలందరినీ మీ చిత్రాల ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారనుకోవచ్చా...?

S: అంతే కాదు గురూ...ఆ తరం అమ్మలు అంతరించి పోతున్నారంటే, ఆ సమాజమే అంతరించి పోతున్నట్టు. ఆ పెట్టే గుణమే అంతరించి పోతున్నపుడు, ఒక అందమైన సమాజాన్ని నేను ఊహించలేను I cannot expect a beautiful society. When Im living in an inorganic society, how can I aspire for an organic relations between human beings? ఈ అమ్మలను చిత్రించటం ద్వారా వారి ఆర్గానిక్ కల్చర్ ను నేను చిత్రించదలిచాను. ఈ రోజుల్లో 'ఆర్గానిక్' అనే పదం ఒక జోక్ గా మారింది. ఆర్గానిక్ అంటే సహజమైన పద్దతుల్లో పంటలు పండించటం మాత్రమే కాదు. అదొక గుణం. ఆర్గానిక్ కూరగాయలు తిని, నేను ఆరోగ్యంగా ఉన్నాననుకోవటం మూర్ఖత్వం. ఆర్గానిక్ సైకాలజీ లేనపుడు, సైకలాజికల్లీ నేను ఆర్గానిక్ గా ఆలోచించలేనపుడు, ఉత్త ఆర్గానిక్ కూరగాయలు తిని సహజంగా, ప్రకృతికి దగ్గరగా జీవించేస్తున్నామనుకోవటం ఒక బిగ్ జోక్. మనుషుల మధ్య ఆ సహజమైన ఆర్గానిక్ రిలేషన్స్ లేకుండా, ఆ గుణ సంపద లేకుండా, పై పై చర్యలతో సహజత్వాన్ని ఎలా తీసుకు రాగలం. అప్పటి స్మాల్ విలేజ్ సొసైటీల్లో వారి జీవితాల్లో సహజత్వం ఉండేది. జీవ౦ ఉండేది.

మనమిపుడున్న సమాజం, ఈ జీవితం పూర్తిగా ఇనార్గానిక్. మన ఆలోచనలు కూడా ఇనార్గానిక్. ఈ భావన నన్ను ప్రేరేపించింది. నేను కేవలం ఆ అమ్మలను మాత్రమే చిత్రించటం లేదు. వారి గుణాల్ని, ఆ సమాజపు సహజత్వాన్ని, వారి జీవితాల్లోని స్వచ్ఛమైన జీవ కళ నూ చిత్రిస్తున్నాను. యాకూబ్ అమ్మలాగా నలుగురితో మాట్లాడుతూ ఆరు బయట కూర్చోవటంలో ఉండే జీవకళ, క్లోజ్డ్ రూమ్స్ లో టీవీల ముందు కూర్చోవటంలో వస్తుందా?.

V: మీరన్నట్టు, ఈ తరాల అంతరాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కానీ కాలానుగుణమైన ఈ మార్పు తప్పదేమో కదా..ఈ తప్పని పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలంటారు?.

S: అవును గురూ..! ఇది తప్పని సరి జరుగుతూ న్న మార్పు. కానీ నేను ఇంకో రకంగా దీనిని చూడదలిచాను. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఈ అమ్మలంతా ఆ కుటుంబాలనీ, అంత మందినీ నడిపినవారు. నడిపించిన వారు. ఆ సంబంధ బాంధవ్యాల్ని అర్థం చేసుకుని బతుకుని సంతోషంగా గడిపిన వారు. ఇపుడు కుటుంబం మాట వదిలేస్తే..పెళ్ళి అనేది కూడా లేదు. 'లివింగ్ టుగెదర్' అని వచ్చేసింది. నాకు నీవు ఫలానా ఇన్ని రోజుల్లో అర్థం కాకపోతే, నేను నిన్ను వొదిలేసేయవచ్చు అనే పరిస్థితిలోకి వచ్చేశాం. ఈ ట్రాన్సిషన్ జరిగింది. స్వార్థం తప్ప ఇంకొకటి కనిపించని ఇటువంటి సమాజ౦లో why dont we document the people who have nurtured an organic thought in us. ఈ రోజు మనలో కొద్దో గొప్పో ఒకడికి అన్నం పెట్టే గుణమో సహాయం చేసే గుణమో ఉందీ అంటే అది ఆ తరంద్వారా సహజంగా మనలోకి ఇంబైబ్ అయిన గుణం. అది ఒక తండ్రి ద్వారానో..ఒక తల్లి ద్వారానో వచ్ఛిన గుణం కాదు. తల్లి దండ్రుల ద్వారా మనం వారి జీన్స్ ని పొందుతాం. కానీ ఆ గుణాల్ని కాదు. Gene itself is a subject. అది ఒక పదార్థం. దానికి ఎటువంటి ఎమోషనూ లేదు. అది కేవలం ఒక పదార్థం మాత్రమే. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కావాలసిన రకంగా మనం ఒక బేబీని సృష్టించవచ్చు.

కానీ ఆ బేబీ గుణగణాల్ని ప్రవర్తనా రీతుల్నీ సృష్టించలేం. ఆ గుణాల్ని సమాజమే అందించాలి. గుండెనో కిడ్నీనో ట్రాన్స్ప్లాంట్ చేసినపుడు, ఆ అవయవం మాత్రమే మారింది, కానీ గుణాలు మారవు. అవయవ దానం చేసిన వ్యక్తి గుణాలు అవయవం స్వీకరించిన వ్యక్తి లోకి వచ్చేయవు. ఇపుడు ఒక సమాజంలోని గుణాల్ని ఇంకా సమాజానికి అందించాలంటే...ఆ సమాజాన్నే ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఒక నేచురల్ ఆర్గానిక్ సొసైటీ లోని గుణాలను, ఒక అన్నేచురల్ ఇనార్గానిక్ సొసైటీకి బదలాయించాలి. నేను అడవుల్లో పని చేశాను. అక్కడి ట్రైబల్ అమ్మలతో మనుషులతో కలిసి పని చేశాను. వారి దగ్గర ఈ సహజత్వాన్నీ జీవ కళనూ చూశాను. అలాగే ఆ తరం అమ్మల్లో కూడా ఈ సహజత్వాన్నీ, జీవ కళనూ చూశాను. ఆ గుణాల్ని ఈ తరంలోకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనుకుంటాను. అందుకే ఒక కళా కారుడిలా నా బొమ్మల ద్వారా ఆ తరాన్ని, ఆ గుణాల్ని ఈ తరానికి అందించే ప్రయత్నం చేస్తున్నా.

V: మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ ఈ జనరేషన్ అమ్మలందరూ అమ్మలు కాదు అన్నారు. ఈ విషయాన్ని ఇంకాస్త వివరంగా చెబుతారా?.

S: అంతే కదా గురూ..! మాతృత్వం పొందిన వారంతా అమ్మలైపోరు కదా...! అమ్మతనమంటే పెట్టే గుణం. అది లేనపుడు తల్లి అయినంత మాత్రాన అమ్మలెలా అవుతారు. ఇక్కడ నేను బొమ్మలు వేసిన వారంతా అమ్మలే. వీరందరిలో పెట్టే గుణం ఉంది. మా అమ్మ మాత్రమే కాదు. వీరందరూ అమ్మల్లాగే కనిపిస్తారు నాకు. అమ్మ ఎవరికైనా అమ్మలాగే కనిపిస్తుంది. అది అమ్మగుణం. అదే అమ్మతనం. ఆ అమ్మతనానికి లింగ బేధాలు కూడా లేవు. పురుషుడైనా అమ్మతనాన్ని కలిగి ఉంటే..అమ్మే అవుతాడు. ఆ తనం ఉండాలి. ఆ తనాన్ని సమాజంలో పెంపొందించాలి. అది లేనపుడు ఆ అమ్మలు, ఆ మనుషులూ అమ్మలెలా అవుతారు?.

V: మీరు ఇపుడు ఎగ్జిబిషన్ లో ఉంచిన బొమ్మలన్నీ ఎప్పటి నుండి వేస్తున్నారు?.

S: ఇవన్నీ 2002 నుండి 2016 వరకు వేసిన చిత్రాలు. 2002 లో మా అమ్మ బొమ్మను గీసాను. అప్పటి నుండి మొదలయ్యింది. ఇప్పటిదాకా నలభై ఆరు బొమ్మలు వేసాను. ఇక్కడ ఇరవై ఆరు బొమ్మల్ని డిసప్లే చేస్తున్నాను.

V: 2002 నుండి ఇప్పటి దాకా వేస్తూ వస్తున్నపుడు, మీ చిత్రాల్లో మీరు గమనిస్తున్న మార్పు ఏమిటి?.

S: ఏ కళాకారుడైనా రెండు విషయాలు నేర్చుకోవాలి. ఒకటి స్కిల్(skill), రెండు క్రాఫ్ట్మన్ షిప్(craftsmanship). స్కిల్ ఇన్హెరెంట్ గా రావచ్చు. కానీ క్రాఫ్ట్ మన్ షిప్ ని కళాకారుడే అభివృద్ధి చేసుకోవాలి. ఒక కుమ్మరి, కుండలు చేస్తున్నపుడు ఎటువంటి క్రాఫ్ట్మన్ షిప్ ను ప్రదర్శిస్తాడో..అటువంటి పర్ఫెక్షన్ ని నేర్చుకోవాలి. క్రాఫ్ట్మన్ షిప్ అభివృద్ధి చేసుకోవాలంటే..మనకున్న ఇన్స్ట్రూమెంట్స్ పై అవగాహన పెంచుకోవాలి. నా విషయం వరకూ వస్తే, ఇప్పటిదాకా నేను నా మిత్రులు ఇస్తూ వస్తూన్న ఆర్ట్ మెటీరియల్ ని అవగాహన చేసుకుంటూ నా చిత్రకళను కొనసాగిస్తున్నాను. కానీ ఈ రోజు టెక్నాలజీ పెరిగాక, ఈ ఆర్ట్ మెటీరియల్ కి సంబంధించిన సమాచారం విస్తృతంగా దొరుకుతోంది. మెటీరియల్ కూడా చాలా సులువుగా దొరుకుతోంది. దాన్నంతా నేను ఎక్ప్లోర్ చేయాలి. ఇందాకా మిత్రుడు ఏలే లక్ష్మణ్ వచ్చారు. మెటీరియల్ ని ఉపయోగించే విషయంలో కొన్ని సూచనలు చేశారు. మార్కెట్ కి వెళ్ళి ఈ మెటిరియల్ వెదుక్కోవాలి అనుకుంటున్నాను. అది నా క్రాఫ్ట్ మన్ షిప్ ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.

V: ఇదే ప్రశ్నను ఇంకో రకంగా అడుగుతున్నాను. నుండి ఇప్పటి దాకా మీరు బొమ్మలు గీస్తున్నారు. ఈ 14 సంవత్సరాల కాల వ్యవధి మీలో,మీ అంతరంగంలో. మీకు మీరు గమనించిన మార్పు ఏంటి?.

S: ఇంటర్నల్ గా నాకు ఖచ్ఛితంగా తెలిసిన విషయం ఏమంటే., my paintings are not marketable commodities.

ఈ అమ్మల్నీ అమ్మమ్మల్నీ నేను ఎలా అమ్ముకోగలను?. నాకు అమ్మలు కదా వీళ్ల౦తా...వారినెందుకు అమ్ముకోవాలి?. వారి బొమ్మలతో నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడినప్పుడు, అమ్ముకోవటమనే విషయం చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకు. అంతే కాదు, 'మా అమ్మ బొమ్మను అమ్ముకు౦టావా?' అని రేప్పొద్దున ఇంకెవరైనా అడగొచ్చు. ఇపుడిటువంటి చోట్ల ఎక్కడైనా ఎగ్జిబిషన్ పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న అంశం కదా..! నా సొంత ఖర్చులతో నేను ఎంతకని ఈ ప్రదర్శనలను కొనసాగించగలను?. చిత్రాల ద్వారా ఈ అమ్మతనాన్ని ఇలా ఎంతకాలం సొంత ఖర్చులతో ఈ తరానికి అందించగలను అని ఆలోచిస్తుంటాను. నాకున్న సంపాదన రీత్యా నాకు ఈ పని తలకు మించిన భారం కాకూడదు అనుకుంటాను. లాభాలు రానవసరం లేదు నాకు ...ఎందుకంటే నేను అమ్మలను అమ్మతనాన్ని అమ్ముకోలేనని చెప్పాను కదా..కానీ నేను దివాలా తీయకుంటే చాలనుకుంటాను. దీనికో పరిష్కారం ఆలోచించినపుడు, ఇక పై అమ్మల బొమ్మలను వేయడానికి టోకెన్ లాగా కొంత డబ్బు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇది ఈ మధ్య వచ్చిన ఆలోచనే. ఆ డబ్బు ఇలా ప్రదర్శనలు చేయటానికి కొంత ఊరటనిస్తే చాలు. లేదా ఇంకెవరైనా స్పాన్సర్ షిప్ చేస్తామని ముందుకు రావచ్చేమో తెలియదు. చూడాలి..,నేను ఈ ఆలోచనను ఎంత వరకు ముందుకు తీసుకెళ్లగలనో. ఎందుకంటే ....

V: ఇపుడు ఈ గోథే సెంటర్ లో ప్రదర్శన ఏర్పాటు చేయటానికి ఎవరైనా స్పాన్సర్స్ దొరికారా సర్..?

S: స్పాన్సర్లు ఎవరూ లేరు కానీ, ఈ విషయంలో ఈ రోజు నేను మార్కెట్ ను జయించానేమో అన్నంత ఆనందం ఉంది. ఇక్కడ ఏర్పాటు చేయగలగటం నేను ఊహించనిది. సహకరించిన యాకూబ్ కీ, గోథే సెంటర్ నిర్వాహకులకు, బొమ్మలను అమర్చిన మిత్రుడు బంగారు బ్రహ్మం కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇది నేను ఊహించనిది అని ఎందుకు అంటున్నాను అంటే..ఈ గోథే సెంటర్ ఒకప్పుడు మేము నివసించిన ఇల్లు. సరిగ్గా ఇక్కడే మా ఇల్లు ఉండేది. తరువాత దానిని కూల్చి ఈ గోథే సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నిర్వాహకులను అడిగినపుడు వారు ఈ స్థలం ఒకప్పుడు మేము నివసించిన ఇల్లే అని తెలుసుకుని చాలా సంతోషించారు. ఎగ్జిబిషన్ పెట్టుకోవటానికి పూర్తి సహకారం అందించారు. మా అమ్మ బొమ్మను నేను మొదట ఈ ఇంటిలోనే వేశాను, ఇపుడు అదే చోట , దాదాపు పధ్నాలుగు సంవత్సరాల తరువాత ప్రదర్శన పెట్టుకోవడానికి అవకాశం రావటం అనేది యాదృచ్ఛికం అనుకోవడం కన్నా అంతకుమించిని ఏదో అనుబంధం అనుకుంటాను. అతి తక్కువ ఖర్చుతో ఇలా పది మందితో నా అనుభవాల్ని పంచుకోవటం నేను మరచిపోలేని విషయం.

V: -(నేను చిత్రాల్ని పరిశీలిస్తూ...)చిత్ర కళలో ఎన్నో ఇజాలు వచ్చాయి కదా..! సర్రియలిజం, క్యూబిజం, ఎక్సప్రెషనిజం వంటివి..వీటిలో కొన్ని హృదయ జనితమైనవనీ, కొన్ని మేథో జనితమైనవనీ అంటూంటారు..అలాగే వీక్షకుడి విషయానికి వస్తే హృదయ రంజకమూ, మేథో రంజకమూ అని కూడా ఉంటుంటాయి. ఇపుడు మీ చిత్రాలు పాఠకుల హృదయాన్ని తాకాలి అనుకుంటారా లేక మేథస్సును తాకాలి అనుకుంటారా..?

S: బేసికల్ గా నేను ఈ ఇజంలనీ నమ్మను గురూ..!

ఈ కళ ఈ ఇజంలో ఉంది, ఆ బొమ్మ ఆ ఇజంలో ఉంది అనేది నేను నమ్మను. నమ్మను అంటే...ఒక కళాకారుడిగా నేను నమ్మను. అ౦టే ఆ ఇజాలు లేవని కాదు. కానీ ఒక చిత్రం ఏ ఇజంలోకి వస్తుంది అని తెలుసుకోవలసిన పని, ఆ విధంగా వివరించవలసిన పని నాది కాదు. అది విమర్శకుల పని. వీక్షకుల పని. ఒక కళాకారుడిగా నాలోపల ఉన్న కళను బయటకు తీయటమే నా పని. One who is a failure artist he turns to be a critic అంటాడు ఆస్కార్ వైల్డ్. నేను ఈ ఇజాల గురించి కొంతే తెలుసుకున్నాను, ఎంత అవసరమో అంతే తెలుసుకున్నాను. ఈ ఇజం ల గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ పోతే నేను విమర్శకుడినౌతానేగానీ..కళాకారుడిని కాలేను. ఇపుడు నా చిత్రాలు హృదయాన్ని తాకుతాయా..? మెదడును తాకుతాయా అంటే నేను చెప్పలేను. అది చూసేవాడి చూపుని బట్టి ఉంటుంది. అన్ని కళలూ హృదయాన్నీ తాకుతాయి, మెదడునూ తాకుతాయి...అలా తాకే ప్రయత్నం కళాకారుడు చేయగలగాలి. అంతవరకే అతడి పని అనుకుంటాను. ఒకసారి ఒక చిత్రాన్ని వేసిన తరువాత, ఇపుడా చిత్రం కళాకారుడిది కాదు, ప్రపంచానిది. ప్రపంచం ఎలా తీసుకుంటుందో ప్రపంచానికే తెలియాలి.

V: మనం ఈ విషయంలో ఇంకాస్త చర్చించాలి అనుకుంటాను. ఉదాహరణకు ఒక అబ్సాట్రాక్ట్ పెయింటింగ్ ని ఒక ఆర్టిస్ట్ వేశాడనుకుందాం. అతడు ఏమి చెప్పదలుచుకున్నాడో వీక్షకుడికి అర్థం కాదు. ఆ పెయింటింగ్ ని చూడగానే, అది వీక్షకుడి హృదయాన్ని తాకే అవకాశం ఉండదు. అపుడు అతడు తన మేథను ఉపయోగించాలి. కొంతసేపు ఆలోచించాలి, పలు రకాలుగా ఊహిస్తూ పోవాలి. అపుడుగానీ ఆ ఆర్టిస్టు ఏమి చెప్పదలచుకున్నాడో ఇద మిత్తంగా అర్థం కాదు. అటువంటి సందర్భంలో వీక్షకుడికి అదే విధంగా ఆర్టిస్టుకీ మధ్య బంధం తెగిపోయే అవకాశం, భావ ప్రసరణ సవ్యం గా జరిగే సంభావ్యత తగ్గి పోతుంటాయి కదా..?

S: సమాజం అనేది ఒక స్టాటిక్ థింగ్ అనుకోను గురూ...! అది డైనమిక్ గా కదులుతూ ఉంటుంది. సమాజంలో ఆధునిక టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త కొత్త ఇజాలు కూడా కళారంగం లో పుట్టుకు వస్తాయి. సొసైటీ పరిణామం చెందే కొద్దీ కళ, అలాగే క్రాఫ్ట్స్‌మన్ షిప్(craftmanship) పరిణామం చెందుతుంటాయి. ఇపుడు ఒక వీక్షకుడు వందేండ్ల కిందటి మనసుతో వచ్చి, ఇప్పటి బొమ్మను చూస్తే వాడికేమర్థమవుతుంది. వాడి ఎమోషన్ వంద ఏండ్ల కిందటిది, ఇప్పటి ఎమోషన్ నీ ఇప్పటి పరిణామాన్ని అతడెలా అందుకోగలడు?. వీక్షకుడైనా , పాఠకుడైనా ఆ కళ గురించిన ప్రాథమిక అవగాహన లేనపుడు అతడు కళాకారుడితో కలిసి నడవలేడు. అవగాహనకు కళాకారుడు సృష్టించిన కళ అడ్డంకి కాదు... వీక్షకుడు వెనుకబాటు తనమే అడ్డంకి. పోయెట్రీ విషయమైనా అంతే. పాఠకుడు ఎంతోకొంత హోం వర్క్ చేయగలిగినపుడే కవిత్వాన్ని అందుకోగలుగుతాడు. మన తెలుగులో పాఠకులు ఇంకా శ్రీశ్రీ దగ్గరే ఆగిపోయి ఉన్నారు. ఒక కవితను చూసి ఇది శ్రీశ్రీ కవితలా లేదు కాబట్టి, ఇది కవిత్వమే కాదనో, అర్థమే కావటం లేదనో అంటూంటారు. వారంతా అక్కడే ఆగిపోయి వున్నారు. శ్రీశ్రీ ఆధునికతకు, పరిణామానికి పెద్ద పీట వేశాడు.ఆయనే ఈ ఆధునికతకు ప్రతినిధి, కానీ అటువంటి శ్రీశ్రీ దగ్గరే పాఠకుడు ఆగిపోయాడు, అక్కడినుండి ఎదగటం లేదు. శ్రీశ్రీ తరువాత ఎన్నెన్ని కవిత్వోద్యమాలు వచ్చాయి..వాటిపై అవగాహనే లేనపుడు, పాఠకుడికి ఆ కవిత్వమెలా అర్థమవుతుంది?.

V: ఐతే కళను అర్థం చేసుకోవాలంటే పాఠకుడు కూడా ఆ కళ పట్ల అవగాహన ఉండాలంటారు. ఈ మధ్య 'సామాన్య మానవుడు' లేదా 'సామాన్య పాఠకుడి'కి అర్థం కావటమే లేదు అని అనడం వింటూ ఉంటాం...

S: నేను సెల్ ఫోన్ మాత్రమే వాడతాను. మా అబ్బాయి స్మార్ట్ ఫోన్ వాడతాడు. ఇపుడు నా చేతికి ఆ స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఉపయోగించమంటే నేను ఫోన్ కూడా చేయలేను. నేను స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలనే విషయం మీద ఇంకా అబ్డేట్ కాలేదు. నేను ఇంకా పురాతన సెల్ ఫోన్ యుగంలోనే ఉండిపోయానంటే..ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పటికీ అర్థం కాదు. ఇఫుడు తప్పు అబ్డేట్ కాలేని నాదే అవుతుందిగానీ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీది కాదు. ఒకఫోన్ విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే..ఒక కళకు ఇంకెంత ఉండాలి?.కళ విస్తృతమైనది కదా.. యూనివర్సల్ కదా..దాని పరిధి చాలా పెద్దది. దాన్ని అర్థం చేసుకునే రీతిలో పాఠకుడు ఉన్నపుడే అది అతడికి అర్థమవుతుంది. ఇక సామాన్య పాఠకుడు అంటే ఎవరు? కవిత్వం చదివేవాడు సామాన్యుడు ఎలా ఔతాడు?. ఈ అర్థంలేని వాదాలు పాఠకుడిని అజ్ఞానంలోనే ఉంచేస్తాయి తప్ప..వాడి అవగాహనా పరిధిని పెంచేవి కావు. గొప్ప పాఠకుల మధ్యనే గొప్ప కవులూ పుడతారు.

V: అయితే కళాకారుడికి 'ఇజాలతో పెద్దగా పనిలేదంటారు..

S: అవును. కొంత బేసిక్ స్టడీ ఉపయోగపడొచ్చు. అలాగే ఆర్ట్ హిస్టరీ కూడా కొంత అవగాహన చేసుకోవాల్సి ఉంటుందనుకుంటాను. ఆర్టిస్ట్ కి అన్నిటికంటే ముఖ్యం ఆర్ట్ వేయటమే. ఆర్ట్ వేస్తేనే అతడు నేర్చుకుంటాడు తప్ప వేరే ఏమి చదివినా, ఆలోచించినా అతడు నేర్చుకోలేడు. కవి కవిత్వం రాస్తూ రాస్తూనే కవిత్వం రాయటాన్ని నేర్చుకుంటాడు. ముందే కవిత్వానికి సంబంధించిన ఆ ఇజంల మీద ధ్యాస వుంటే కవిత్వం రాసేదేముంటుందిక?.ఆకలేస్తే అన్నం తినాలి. ఆలోచిస్తే ఆకలి తీరదు..ఆకలి ఎలా తీరుతుందో తెలుసుకోవటం వల్ల ఆకలి తీరదు. మీ వైద్య పరిభాషలో చెప్పాలంటే..గుండె పనితీరును గురించి తెలుసుకోవాలంటే గుండె పని చేస్తున్నపుడే నేర్చుకోవాలి. గుండెను బయటకు తీసి గుండె పనితీరుని నేర్చుకోలేవు, కేవలం అనాటమీనే నేర్చుకోగలవు.

V: మీరు ఒక పెయింటర్, అలాగే ఒక పోయెట్..ఈ రెండు కళల్లో దేనితో మీరు ఎక్కువగా ఐడెంటిఫై అవుతారు?.

S: నాకు ఈ రెండూ ఇష్టమే గురూ.. ఇవే కాదు, ఫోటోగ్రఫీ అన్నా ఇష్టమే, ఇంటిని అందంగా సర్దుకోవటమన్నా ఇష్టమే. ఇవన్నీ నా ఎక్స్ప్రెషన్స్. నన్ను నేను వీటి ద్వారా తెలియబరుస్తున్నాను, ఆవిష్కరించుకుంటున్నాను, అలాగే వీటిద్వారా నన్ను నేను తెలుసుకుంటున్నాను. వీటిలో ఒకటి ఎక్కువ ఇష్టం, ఒకటి తక్కువ ఇష్టం అనేదేమీ లేదు. ఆయా సమయాల్లో.. స్పాంటేనియస్ గా నన్ను ఏది ప్రేరేపిస్తుందో ఆ ఎక్స్ప్రెషన్లోకి నేను ఒదిగిపోవటానికి ప్రయత్నిస్తాను. ఈ ఆర్ట్ ఫామ్స్ లో ఇది మోస్ట్ ప్రిఫర్డ్(most preferred) ఇది లెస్ ప్రిఫర్డ్(less preferred) అనేదేమీ లేదు. The purpose of my art forms is to express myself.

V: మిమ్మల్ని మీరు ఇలా ఎక్స్ప్రెస్ చేసుకున్నపుడు, పాఠకుడు లేదా వీక్షకుడు మిమ్మల్ని రీచ్ అవగలుగుతున్నాడా..? లేదా మీరు మీ పాఠకుడి దగ్గరికి రీచ్ అవగలుగుతున్నారా?

S: దానిని నేను చెప్పలేను. కొందరు మార్కెట్ ద్వారా విస్తరించి రీచ్ అవుతారు. కొందరు మౌత్ టు మౌత్ అవుతారు. నేను ఆలోచించేది first of all let me express myself. రీచ్ అయ్యేది రీచ్ అవుతుంది. క్రికెట్ లో, సినిమాల్లో వొచ్చేసినంత తొందరగా డబ్బూ పేరూ ఈ పోయెట్రీలో, వ్యాసాల్లో, చిత్రాల్లో రావు. ఇది చాలా మెల్లిగా ముందుకు కదిలే విషయం. గంటసేపు జరిగే పుస్తకావిష్కరణ సభ గానీ, వారం రోజులు జరిగే art exhibition కానీ పాఠకుని దెగ్గరికి కళాకారుణ్ణి ఎంత వరకు తీసుకెళ్తాయి అంటే చెప్పడం కష్టమే. నా పోయెట్రీ ద్వారా, చిత్రాల ద్వారా ఇప్పటికిప్పుడే ప్రపంచానికి నేను తెలిసిపోవాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా నేను ఆలోచించేది సమాజం లో ఆర్ట్ మీద ఉండే శ్రద్ధ ఎంతుందని?

మన కళల మీద కావలసినంత అవగాహనని ప్రభుత్వాలు కల్పించ గలుగుతున్నాయా?. అవార్డులు రివార్డులు వంటి క౦టి తుడుపు చర్యలకే మనం అలవాటు పడిపోయి ఉన్నాం. ఇపుడు మనం రోడ్డు మీదకు పోయామంటే ఎన్నో గోడలు తెల్లగా నిర్వికారంగా కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద అందమైన చిత్రాల్ని ఎందుకు గీయకూడదు?. ఎందుకు ఖాళీగా ఒదిలేయాలి?. ఆ ఖాళీ స్పేస్ ని ఒక కళాకారుడు తనను తాను ఎక్స్ప్రెస్ చేయటానికి ఎందుకు కేటాయించకూడదు?. ఇటువంటివి ఎన్నో జరిగాలి. ప్రజల్లో కళ పట్ల చైతన్యం కలిగినప్పుడే కళ ప్రజల్ని చేరాల్సినంత చేరుతుంది.

నన్ను నేను వ్యక్తీకరించుకుంటున్నా...

నన్ను నేను వ్యక్తీకరించుకుంటున్నా...

V: ఇపుడు మీరు ఇక్కడ చిత్ర ప్రదర్శన చేశారు. మీరు స్వయంగా వీక్షకులకు మీ చిత్రాలను చూపించారు. వారి కళ్లలో మీరు మీ వీక్షకులను రీచ్ అయినట్టు మీకు అనిపించిందా.? మీ perspective ని తెలుసుకోదలిచి ఈ ప్రశ్న అడుగుతున్నాను.

S: నేను ఇక్కడ కేవలం నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను. వారి ఎమోషన్ ను నేను ఖచ్ఛితంగా కొలవలేను. ఒక ఎమోషన్ ని అందరూ ఒకే తీవ్రతతో ఎక్స్ప్రెస్ (express) చేస్తారనుకోను. కొందరు మనసులో ఉంచుకుని బయటకు గంభీరంగా ఉండిపోవచ్చు. కొందరు వెంటనే బయటకు ఎక్స్ప్రెస్ చేయవచ్చు. కొందరు ఏమీ అర్థం కాకున్నా, పొగడాలి కాబట్టి 'వావ్' అని పెద్దగా అరవొచ్చు. కాబట్టి ఆ ఎమోషన్ లోని ఎక్స్ప్రెస్సివ్ తీవ్రత( intensity of expression) ఆధారంగా నేను రీచ్ అయ్యానా లేదా అనేది అంచనా వేయలేను. ఇంకోటేమంటే ఈ ఆర్ట్ ద్వారా నేనేమీ సందేశాలివ్వదలచుకోలేదు. నా సందేశాలేమీ లేవు. కాబట్టి సినిమా చూసి సందేశం తీసుకుపోయినట్టుగా నా దగ్గరేమీ లేదు. కానీ ఈ ప్లాట్ ఫారం ద్వారా నేను నా ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ని ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ (emotional performance) గా మలచదలిచాను. ఇఫుడు మీరు ఇక్కడికొచ్చారు.

ఈ బొమ్మల్ని చూశారు. చూసినపుడు, మీకు మీ అమ్మో, అమ్మమ్మో, నాయనమ్మో గుర్తుకు వచ్చి ఉంటుంది. బయటికెళ్ళాక కూడా మీరు మరచిపొయిన మీ అమ్మమ్మ, నాయనమ్మ మీకు గుర్తుకు రావాలి. వాళ్ళు మళ్లీ మీ జీవితాల్లోకి రావాలి. వాళ్లు బొమ్మలుగా, గోడ మీది ఫోటోలుగా మిగిలిపోకూడదు. లైఫ్ లోకి రావాలి. ఒక పోయెంను చదివి పాఠకుడు ఎలా మరల మరల మననం చేసుకుంటాడో..నా బొమ్మలు చూసిన వీక్షకుడు వాళ్ల అమ్మల్నీ, అమ్మమ్మల్ని, నాయనమ్మల్నీ గుర్తుకు చేసుకోవాలి. ఈ బొమ్మలు కొంతకాలం వాళ్లని హాంట్ చేయాలి. వెంటాడాలి. రేపు పొద్దున వాళ్ల అమ్మల్నీ అమ్మమ్మల్నీ చూసే దృష్టిలో కొంత మార్పు వచ్చినా చాలు. ఈ ఎగ్జిబిషన్ విజయం పొందినట్లే. ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇక్కడినుంచి మొదలవ్వాలి. అది మొదలవుతే, నేను వీక్షకుడికి రీచ్ అయినట్టే.

సునిశితత్వం చనిపోతోంది...

సునిశితత్వం చనిపోతోంది...

V: -ఈ ఆధునిక కాలంలో..బిజీ సిటీ లైఫ్ లల్లో మనుషులు ఎమోషనల్ గా ఉండటమే నేరమనుకుంటున్న తరుణంలో ..'ఎమోషనల్ పెర్ఫార్మన్స్' (emotional performance) ని మీరిక్కడనుండి మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా?.

S: నిజమే గురూ..! నిజానికి మనకు అన్నీ తెలుసు గురూ..! మనలో సునిశితత్వం చచ్చిపోతోంది. మనం ఎమోషన్ ని రేషనలైజ్ చేసేస్తున్నాం, లాజికల్ గా ఆలోచించటం మొదలు పెట్టాం. ఏదన్నా చేయాలంటే..ఒక సహాయం చేయాలంటే..నాకేంటి ఇందులో లాభం అనే స్వార్థ పూరిత ఆలోచనని కొనసాగిస్తున్నాం. ఎవరైనా ఎమోషనల్ గా పని చేసినా, ఏదో లాభం లేనిది ఎందుకు చేస్తారు అనుకుంటుంటాం. ఎమోషన్ ని కూడా మార్కెటబుల్ అవునా కాదా అని చూస్తున్నాం. ఎవడికైనా వ్యవస్థ మీద కోపమొచ్చేసి విప్లవ కవిత్వం రాసేస్తే..అది పొలిటికల్ గా, మార్కెట్ పరంగా ఎంతవరకు పనికొస్తుంది? అని ఆలోచిస్తున్నాం. పొలిటికల్ గానో..మార్కెట్ పరంగానో మంచి గిరాకీ లేదా మంచి పేరు వస్తుంది అనుకున్నపుడు, ఇంక విప్లవ కవిత్వమే రాయటం మొదలు పెట్టాం.

నీ కెట్లా కావాలి కవిత్వం..? విప్లవంగా కావాలా..? ఇదిగో రాసేశా..!! లేదా రొమాంటిక్ గా కావాలా? ఇదిగో రాసేశా..!! నీ మార్కెట్ కు అనుగుణంగా నేను కవిత్వం రాసినట్టయితే..ఇంక నేను నా కవిత్వం రాసిందెపుడు?. ఇటువంటి కవుల్నీ కళాకారుల్నీ నేను నమ్మను అని చెప్పడానికి నాకెటువంటి కాంట్రాడిక్షన్స్ లేవు గురూ! కవులే ఇలా ఉన్నపుడు పాఠకుడు, వీక్షకుడు అంతకు మించి ఉంటాడనుకోలేను కదా!. కానీ ఈ ప్లాట్ ఫాం ద్వారా నేను ఎమోషన్ ను రేషనలైజ్ చేయదలచుకోలేదు. నా సెన్సిబిలిటీస్ ని ఎలా ఉండనిస్తానో అలానే వీక్షకుడికి అదించాలనుకుంటాను. నేను కొత్త కళ్లద్దాలను వీక్షకుడికి ఇచ్చాను. వాళ్లు వాటిని ఉపయోగించుకు౦టారో తీసి పక్కన పెట్టేస్తారో నేను చెప్పలేను.

పోయెట్రీకి నిన్ను మించిన ఏమోషన్...

పోయెట్రీకి నిన్ను మించిన ఏమోషన్...

V: ఈ రోజుల్లో పోయెట్రీని ఒక కారణం కోసం, ఒక సందేశం ఇవ్వడం కోసం, లేదా ఒక గుర్తింపుకోసం రాయటం మనం చూస్తుంటాం...

S: పోయెట్రీకి నిన్ను మించిన, నీ ఎమోషన్ ని మించిన కారణం ఏముంటుంది గురూ..! నీ ఎమోషనే నీ పర్పస్. వేరే పర్పస్ ఏమీ లేదు. ఇదేమన్నా సినిమానా, ఒక ఫార్ములా సినిమా సక్సెస్ అయిందని అందరూ అవే కథల్ని అవే సన్నివేశాల్ని మార్చి మార్చి తీయటానికి. ఒకరు ఒక పర్పస్ తో రాసి పేరు తెచ్చుకుంటే ఇంక అందరూ అదే పర్పస్ కోసం రాసేయటం. అంతే కాకుండా ప్రతీ కవీ శ్రీశ్రీ లాగా అయిపోవాలనుకోవటం. అందరూ శ్రీశ్రీలే అయిపోతే..ఇంక కాళోజీ ఎందుకు? దాశరథి ఎందుకు? నెరుడా ఎందుకు? గోథే ఎందుకు?. ఎందుకంటే మనం ట్యూన్ చేయబడ్డాం. సినిమా ఫార్ములా లాగా కవిత్వ ఫార్ములా. ఆ ఫార్ములా కవికి, పాఠకుడికీ ఒకే రకమైన కళ్లద్దాల్ని ఇస్తుంది. ఇద్దరూ అవే కళ్లద్దాల్ని పెట్టుకుని మాట్లాడుకుంటూ కూర్చుంటారు. పోయెట్రీలో కానీ, పెయింటింగ్ లో కానీ ఖచ్ఛితంగా నా ఐడెంటిటీ నాకు ఉండాలి. ఇంకొకరి ఐడెంటిటీ నాకెందుకు?. అసలే..ఈ రోజున్న కాంపిటీటివ్ ప్రపంచంలో, ఫాస్ట్ ప్రపంచంలో నీ ఐడెంటిటీ మహా అయితే పది రోజులకన్నా ఎక్కువ ఉండదు. కళాకారులు నా ఈ ట్రెండ్ కు అలవాటయి పోయారు. ఇప్పటి సినిమా గాయకులనే తీసుకోండి. రెండు మూడు సినిమాల్లో పాడాక, టీవీల్లో రియాలిటీ షో లకు వచ్చేస్తారు. లేదా దుబాయ్ లో పాటలు పాడి డబ్బులు సంపాదించుకుంటారు. ఆ గాయకుల పేర్లు కూడా మనకు గుర్తుండని పరిస్థితి వుంది. డబ్బు సంపాదించటమే ఐడెంటిటీ అనుకున్నపుడు, ఆర్ట్ ఉండేదెక్కడ?. అందుకే తన సొంత పనిని వదిలేసి,వేరే మార్గాల ద్వారా గుర్తింపు పొందాలనే తాపత్రయం. నేను నమ్మేదేంటంటే..నా పనికంటే నాకు వేరే గుర్తింపేది?

సినిమాల్లో రియాలిటీ ఎక్కడిది....

సినిమాల్లో రియాలిటీ ఎక్కడిది....

V: సినిమాల విషయంలో కళ కంటే కూడా మార్కెట్ ముఖ్యమవుతుందనుకుంటాను. అందుకే సినిమాల్లో కళనూ క్రియేటివిటీనీ ప్రశ్నించేలా ట్రెండ్ అనేది ఆధిపత్యం వహిస్తుంటూంది. ట్రెండ్ ని ఫాలో అవుతూ , మార్కెట్ ని పట్టుకుంటూ, సందేశాలు ఇచ్చే చిత్రాలు వస్తున్నాయిగా....

S: అందులో కూడా రియాలిటీ ఎక్కడుంది గురూ..! రియాలిటీకి దూరంగా ఉంటూ నేను సినిమాల ద్వారా సందేశాలిచ్చేస్తాను అనుకోవటం ఎంత పిచ్చితనం కదా..! సందేశమే ఇవ్వదలచుకుంటే..సినిమా ఆపేసి ఒక ప్రసంగం ఇవ్వొచ్చుకదా..! ఈ పైపై నటనలెందుకు?. సినిమా అనేది ఒక చీకట్లో గుద్దులాట లాంటిది గురూ..!! సినిమా ద్వారా నేను ఒక కనిపించని వ్యక్తి తోటి మాట్లాడుతున్నాను. సినిమా చూసే వాడెవడో నాకు తెలియనపుడు, వాడి ఎమోషన్స్ ఏమిటో నాకు తెలియనపుడు నేను ఏదైనా చూపించేస్తాను. 'శ్రీమంతుడు' సినిమానే తీసుకోండి. గ్రామాల్ని దత్తత తీసుకోవటమనే సందేశం ఉందంటాడు. అసలు ఈ రోజు గ్రామాలు గ్రామాల్లాగా లేనపుడు నీవు ఏం దత్తత తీసుకుంటున్నావు?. గ్రామ జీవితం గ్రామం లాగా లేదు. ఒకపుడు ఎనిమిది గంటలకల్లా నిద్రపోయే గ్రామం ఈ రోజు రాత్రి ఒంటిగంట వరకూ టీవీల ముందు సినిమాలూ సీరియళ్ళూ చూస్తుంది. అందరింటికీ ఇంటర్నెట్ ఉంది. అందరి చేతుల్లో సెల్ ఫోన్లూ, స్మార్ట్ ఫోన్లూ, ఫేస్ బుక్ లూ, చాటింగ్ లూ వచ్చేసాయి. పేరుకే గ్రామంలాగా ఉంది, గ్రామం ఎపుడో నగరీకరణ జరిగిపోయింది. ఇపుడు గ్రామాన్ని దత్తత తీసుకుని నీవేం చేస్తావు. గ్రామాన్ని పోషించిన తరమే లేదిపుడు. నగరీకరణ చెందిన గ్రామాన్నీ, నగరీకరణ చెందిన మనుషులనూ దత్తత తీసుకుని నీవే౦ సందేశం ఇస్తావు?

జీవాలున్న గ్రామాలు లేవు..

జీవాలున్న గ్రామాలు లేవు..

V: నిజమే సర్..నిజానికిప్పుడు గ్రామాలు అనేవే లేవేమో ప్రపంచమనే కుగ్రామం తప్ప...

S: గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఉండాల్సిన జీవకళ గల గ్రామాలు లేవంటాను. బాగా డబ్బున్న వాళ్లు ఉండే గ్రామాల్లో ఆ జీవం లేదు. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో, ట్రైబల్ విలేజ్ లల్లో ఆ జీవం ఉంది. గ్రామాన్ని గ్రామంగా నిలపలేక, దానిని నగరీకరణ చేయటం కోసం దత్తత తీసుకోవడం చాలా పిచ్చి ఆలోచన కదా. జీవకళ ఉన్నటువంటి ఒక ఆర్గానిక్ సొసైటీ గ్రామాల్లో లోపించినపుడు, నగరమనే ఒక ఇనార్గానిక్ సొసైటీని గ్రామాల్లోకి తీసుకురావడానికి దత్తత తీసుకోవటం ఏమిటి?, దానికి సందేశమిచ్చేశామనీ, సమాజాన్ని మార్చేద్దామనీ డప్పు కొట్టడమేమిటి?

వందకు పైగా అమ్మలను గీయాలి..

వందకు పైగా అమ్మలను గీయాలి..

V: మనం మాటలలో చాలా దూరమే ప్రయాణించామనుకుంటాను, ఇక కొన్ని ప్రశ్నలు... మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి?.

S: రాబోయే మూడు నాలుగేండ్లలో వందకు పైగా అమ్మలను గీయాలనుకుంటున్నాను. ఈ ఎగ్జిబిషన్ కి వచ్చిన వారే అడుగుతున్నారు, మా అమ్మ బొమ్మ గీయండి అని. ఇంతకు ముందు చెప్పినట్టు 'టోకెన్' గా కొంత మనీ తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. అంతే కాక ఇపుడు కొంతమంది వచ్చి మా విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టండి, కాకినాడలో పెట్టండి, వరంగల్ లో పెట్టండి అని అడుగుతున్నారు. నిజానికి ఈ ఖర్చులను భరించగలిగే స్తోమత నాకైతే లేదు, అందుకు ఎలా ఈ సమస్యను అధిగమించాలా అనే ఆలోచనలో ఉన్నాను. ఇక రెండో ప్రాజెక్టు, ఒక గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామంలోని ముసలి అమ్మల్నీ, అమ్మమ్మల్నీ చిత్రాలుగా గీయాలని ఉంది. ఎందుకంటే నగరీకరణ ఊరిని కబ్జా చేసేస్తోంది. కావాలని మనమే కబ్జా చేసేస్తున్నాం. ఊరిలో ఈ ముసలీ తల్లీతండ్రుల తరం అంతరించి పోతే ఊరే అంతరించి పోతుంది. కాబట్టి ఊరిని మనం మాన్యుమెంట్ లా భద్ర పరచుకోవాలంటే, ఊరి జీవకళ ను పట్టుకోవాలంటే, ఆ జీవ కళకు ప్రతినిధులైన ఈ ముసలి వారిని డాక్యుమెంట్ చేయాలి. రొట్టెమాకురేవు ని ఆ విధంగా తీసుకోవాలి అనే ఆలోచన ఉంది.

ఈ రెండు ప్రాజెక్ట్ లూ ఇంకా ఆలోచనల దశలోనే ఉన్నాయి. కార్యాచరణ ఎలా ఉండబోతుందో చూడాలి.

నాకంటే గొప్పదవ్వాలి...

నాకంటే గొప్పదవ్వాలి...

V: ఔత్సాహిక కళాకారులకు కవులకు మీరు ఏదైనా సూచనలాంటిది ఇస్తారనుకుంటాను..

S: నేను సందేశాలిచ్చేదేమీ లేదు గురూ! You only deserve what you can make yourself worthy of. నాకంటే నా కవిత్వం గొప్పదవ్వాలి. నాకంటే నా పెయింటింగ్ గొప్పదవ్వాలి అనే ఆలోచన పెంపొందించుకోవాలి. ఒక పోయం రాస్తే అది ప్రపంచానికి నచ్చేయాలి అనుకోకూడదు. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. పొగడొచ్చు, తిట్టొచ్చు. కానీ నా పోయెట్రీతో అందర్నీ satisfy చేసెయ్యాలి అనుకోవటం మూర్ఖత్వం. Craftsmanship ని పెంపొందించుకోవాలి. నిరంతర విస్తృత అధ్యయనం కొనసాగుతునే ఉండాలి. క్రిటిసిజం లోకి ఎక్కువగా పోకుండా..కళ మీద ధ్యాస పెట్టాలి.

చాలా నేర్చుకోవాలి గురూ...

చాలా నేర్చుకోవాలి గురూ...

V: చివరిగా..ఒక ప్రశ్న. ఈ ఎక్జిబిషన్ ముగిసేసరికి మీ మీద మీకొచ్చిన అవగాహన ఏమిటి?.

S: ఇంకా చాలా నేర్చుకోవాలి గురూ...! కొత్త కొత్త టెక్నిక్లను పట్టాలి. నేను బ్లాక్ పెన్సిల్ నీ, బ్లాక్ కలర్ నీ ఎక్కువగా ఉపయోగించలేదు. వీటిని ఎలా నా పెయింటింగ్స్లోకి తీసుకురావాలా అనేది అధ్యయనం చేయాలి. లైట్, కాంతిని రిఫ్లెక్ట్ చేస్తే.. బ్లాక్, కాంతిని పూర్తిగా గ్రహించేస్తుంది. అంటే అది ఒక శూన్యాన్ని పుట్టిస్తుంది. ఆ శూన్యాన్ని నా బొమ్మల్లో పట్టాలి. ఆ ఫైనర్ ఆస్పెక్ట్స్ లోని మెచ్యూరిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాను.

సాయంత్రం వేళ .....

సాయంత్రం వేళ .....

V: థ్యాంక్యూ సర్...మీ సమయానికి ధన్యవాదాలు. ఎన్నో విషయాల్ని ఈ సాయంత్రం నాతో చర్చించారు.

మీకు ఈ ఇంటర్వ్యూ బోర్ కలిగించలేదనుకుంటాను.

S: లేదు లేదు. ఇట్స్ ఎ సడన్ సరప్రైస్ ఫర్ మీ. కానీ మంచి ఆయుధాలతోనే నా మీదకు దుమికావు గురూ..! (నవ్వులు)

నిజానికి ఏకాంతంలో నా ఆత్మ తో నేను సంభాషించుకున్నట్టుగా అనిపించింది. నీ ప్రశ్నలు, అపర్ణ సైలెంట్ అబ్సర్వేషన్ నన్ను నాతో గడిపేలా చేసింది. కృతజ్ఞతలు. సరే లేటవుతుంది. బయలు దేరుదాం.

English summary
satya Srinivas is a poet and painter and the lover the nature. He exhibited paintings drawn mothers recently. Dr Virinti Virinchi spoke with Satya Srinivas in detail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X