• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధూళిచెట్టు: ఈ కవి దేనికి చెందుతాడు?

By Pratap
|

ముస్లిం తెలుగు కవి వాహెద్ ధూళిచెట్టు పేర ఇటీవల ఓ కవితా సంకలనం వెలువరించాడు. ధూళిచెట్టు కవిత్వం దేనికి చెందుతుంది, కవి ఏం చెప్పదలుచుకున్నాడు అనే ప్రశ్న లేదా సందేహం తప్పకుండా పుడుతుంది. దానికి కారణం - ఆయన ఓ వాదానికి చెందిన కవిగా కనిపించడు.

ఆయన కవిత్వాన్ని వాదాల గుంజకు కట్టేయలేం. అట్లని వాదాల స్పృహ ఆయన కవిత్వంలో లేదా అంటే ఉంది. వాదాలను మించిన విస్తృతి గల కవిగా వాహెద్ ధూళిచెట్టు కవిత్వం కనిపిస్తుంది. ఇటువంటి కవి ఆత్మను పట్టుకోవడం కాస్తా కష్టం. కానీ, మనకు అర్థమైన మేరకు మనకు అర్థమైన రీతిలో కాస్తా చెప్పడానికి ప్రయత్నిస్తే మాత్రం దారులు దొరుకుతాయి.

ధూళిచెట్టు కవిత్వంలో ఓ సున్నితమైన వాక్యసంపద కనిపిస్తుంది. కుసుమపేశలమైన భావపరంపర పరుచుకుంటూ పోయాడు. అయితే, ఆ సున్నితమైన వాక్యాసంపద మధ్య మనకు సమాజంలోని, దేశంలో ప్రస్తుత పరిస్థితులు గుండెను తాకి వణుకు పుట్టిస్తాయి. సమాజంలోని బీభత్సమైన స్థితిని ఆయన తన కవిత్వం నిండా పరిచాడు. కన్నీటి పిట్టలు అనే కవిత చదివితే మనకు ఆ విషయానికి సంబంధించిన సంకేతాలు అందుతాయి.

Review on Waheds Dhooli Chettuu poetry

ఆయన తాటాకు నుంచి కారుతున్న చీకటి బీభత్సమని అంటాడు. అంతటి సుతిమెత్తని పదాలతో బీభత్సాన్ని ఎరుక పరిచే ప్రయత్నం వాహెద్ చేశాడు. ఆ సున్నితమైన పదాలతో, వాక్యాలతో ఆయన ఆగ్రహాన్ని, ధిక్కారాన్ని కూడా సంధించి వదిలాడు.

వాహెద్ చీకటి వెలుగుల మధ్య ప్రయాణం చేస్తూ సమాజం నిండా చీకటి పరుచుకుంటున్న విషయాన్ని మన కళ్లకు చూపించడు, హృదయానుభూతం చేస్తాడు. అందుకే, ఆయన కవిత్వం వణుకు పుట్టిస్తుందని చెప్పడం. చీకటిని చీల్చే ఖడ్గం కూడా కవిత్వమనే స్పృహ వాహెద్‌కు ఉంది. అందుకే కవిత్వాన్ని ధరించిన మనిషి కావాలంటాడు. కవిత్వాన్ని ధరించడమంటే సున్నితమైన హృదయం, మానవ స్పృహ, నలుగురి పట్ల పట్టింపు... మొత్తంగా సమాజం పట్ల సానుకూల మానవీయమైన దృష్టి ఉండడమని అర్థం.

కవి నిస్సహాయుడనే విషయం కూడా వాహెద్ కవిత్వం చదివితే అర్థమవుతుంది. ఆ నిస్సహాయత నుంచి వేదనను, ఆగ్రహాన్ని కవి పరుచుకుంటూ పోతాడు. ఎండలు మండిపోతున్నాయి/ అందుకే నీడను వెంటపెట్టుకుని తిరుగుతున్నాను అంటాడు. మనిషి ఒంటరివాడై పోతున్న వైనాన్ని కూడా వాహెద్ కవిత్వీకరించాడు. మనిషి సామూహికం కావాలనే ఆకాంక్ష ఇందులో ఉంది. కాకి ఆరుపుకు పది కాకులు చేరుతాయి/ భాష బలహీనమైంది - ఒక్కరు రారు కదా అని అంటాడు.

భాష లేని పశుపక్ష్యాదులు ఒంటరి వేదనను ఎదుర్కోవడానికి సామూహికమవుతుంటే, భాష ఉండి కూడా మనిషి సామూహికం కాలేకపోవడాన్ని ఆయన అలా సంకేతించాడు. ధూళిచెట్టు సంకలనంలో ఒక సంభాషణ అత్యంత ప్రత్యేకమైన, విశిష్టమైన కవితగా కనిపిస్తుంది. ఓ అమ్మాయితో చెట్టుతో జరిపే సంభాషణ బీభత్స ప్రధానమైన దృశ్యాన్ని, ప్రవాహాన్ని ప్రేమించి, ముద్దాడి కుప్పకూలిపోయే భయానక స్థితిని దృశ్యీకరిస్తూనే చివరగా బాలికకు ఆశావహమైన సందేశాన్ని అందిస్తుంది. ఆ బాలికకను ఓ ఆత్మబలాన్ని చేకూర్చి పెడుతుంది. ఈ విధమైన ఆత్మబలాన్ని సంతరించి పెట్టే గుణం కూడా వాహెద్ కవిత్వంలో అంతర్గతంగా ఉంది.

వాహెద్‌ సామాజిక కల్లోల్లాన్ని స్వీయ కల్లోలంగా మార్చుకున్నాడు. తిరిగి దాన్ని సామాజిక చేస్తున్నాడు. అంటే వస్తుగతాన్ని ఆత్మగతం చేసుకుని తిరిగి వస్తుగతం చేస్తున్నాడు. దీనివల్ల కవిత్వం కళాత్మకంగా వ్యక్తమవుతుంది. పొల్లు పదాలు, పొల్లు వాక్యాలు ఉండవు. కవిత్వం కవిత్వంగా వెలువడుతుంది.

తెలుగులో ముస్లిం వాదం బలంగా ముందుకు వచ్చింది. అయితే, వాహెద్ దీన్ని ఎలా పలుకుతున్నాడనేది ప్రశ్న. బహుశా, ఇది ఒక్క ముస్లింల సమస్య కూడా కాకపోవచ్చు. యావత్తు దేశానికి చెందిన సమస్య. వాహెద్‌ది ఇస్లాం మతం. అతనికి మతం వ్యక్తిగతమైంది. కానీ ముస్లింగా తన అస్తిత్వానికి వేళ్లు ఈ దేశంలోనే ఉన్నాయని పలుకుతున్నాడు.

రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక విధానానికి, స్వేచ్ఛకు - ఆ స్వేచ్ఛ కూడా ముస్లిం అయినందుకు - భంగం వాటిల్లినప్పుడు వాహెద్ సున్నితంగానే అయినా స్పష్టంగా పలికాడు. తన అస్తిత్వానికి సంబంధించిన వేళ్లు ఈ దేశంలోనే ఉన్నాయని ప్రకటించుకుంటున్నాడు. ముస్లిం కావడం వల్ల వాహెద్ లాంటి కవి కూడా తన ముస్లిం అస్తిత్వాన్ని చాటుకోవాల్సి వచ్చింది.

ముస్లింకు, ఇస్లామ్‌ మతానికి మధ్య తేడా ఉందనే విషయం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇస్లామ్ ముస్లింల మతమే. కానీ, భారత సమాజానికి వచ్చేసరికి అది భిన్నంగా వ్యక్తమవుతుంది. దేశమంతటా ముస్లింలు జీవిస్తున్న పరిస్థితిలో వారిని కూడా మిగతా ప్రజలు అంగీకరించి, తమలో కలుపుకున్నారు. గ్రామాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. దళితులకు శిష్టవర్గాలకు భిన్నమైన దైవాలుంటాయి. అలాగే, ముస్లింలకు అటువంటి ప్రత్యేకమైన ఆరాధనా స్థలం మాత్రమే ఉందనే రీతిలో గ్రామీణ వ్యవస్థ కలిసి మెలిసి జీవిస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు భారతదేశంలో ముస్లిం అనేది ఓ కులమే తప్ప మతం కాదని నిర్వచించవచ్చు. ఆ రకమైన నిర్వచనమే వాహెద్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ కోణం నుంచి వాహెద్ కవిత్వాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అతను తన కవిత్వంలో అంతకు మించిన స్వీయ మతాభివ్యక్తులను తీసుకుని రాలేదు. పావురాళ్లు కవిత చదివితే వాహెద్ ఆక్రోశం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆ ఆక్రోశంలోని సామంజస్యం కూడా మనకు అర్థమవుతుంది.

వాహెద్ ధూళిచెట్టు కవిత్వానికి మరో లక్షణం కూడా ఉంది. దేశంలో రహస్యంగా, కూడబలుక్కున్నట్లు విస్తరిస్తున్న దళిత, మైనారిటీ వ్యతిరేకతను వాహెద్ చాలా నర్మగర్భంగా చెప్పాడు. నిజానికి ఆయన కవిత్వం పలికే ప్రధాన ఆలోచనాధార అదే. దళిత, మైనారిటీల హక్కులకు, స్వేచ్ఛకు భంగం కలిగించే సంఘటనలు జరిగినప్పుడు, ప్రకటనలు వెలువడినప్పుడు కూడా వాహెద్ కవిత్వం రాశాడు.

అయితే, సంఘటనలను, ప్రకటనలను ఆధారం చేసుకుని కవిత్వం రాసే సమయంలో కవి అత్యంత జాగరూకత వహించాల్సి ఉంటుంది. లేదంటే కవిగా అతను విఫలమవుతాడు. అకవిత్వమై తేలిపోతాడు. వాహెద్ చాలా జాగరూకతతో వ్యవహరించాడని ఆయన కవిత్వం చదివితే అర్థమవుతుంది. వాహెద్ సంఘటనలను, ప్రకటనలను నేపథ్యంగా చేసుకుని వాటి వెనక గల తాత్వికతను ఎత్తిచూపాడు.

ప్రగతినిరోధక శక్తులు, ప్రజా వ్యతిరేక శక్తులు... సమాజాన్ని ముక్కలుగా చీల్చే శక్తుల తాత్వికతను ఎత్తి చూపుతూ ఆవి తెచ్చే పెట్టే పరిస్థితులను కవిత్వీకరించాడు. ఆ రకంగా వాహెద్ కవిత్వం సార్వజనీనతను సంతరించుకుంది. రాజకీయం పేరుతో విస్తరిస్తున్న అరాజకీయ పరిస్థితిని వాహెద్ తన కవిత్వంలో పలికాడు. ఆ రకంగా అతను నిజమైన పొలిటికల్ పోయెట్. అదే సమయంలో నిజమైన మార్క్సిస్టు పోయెట్‌గా కనిపిస్తాడు.

వాహెద్ కవిత్వం సున్నితంగా, నర్మగర్భంగానూ ఉండడానికి పారశీక, ఉర్ధూ కవిత్వం సంస్కారమై ఉండవచ్చు. ఆ ప్రభావం వాహెద్‌పై బలంగానే ఉంది. అది రూపంలో కనిపిస్తుంది. అలాగని అతను అనుచరుడు కాడు. తన సొంత గొంతుతో ధూళి చెట్టు కవిత్వం కొమ్మలను విస్తరిస్తూ వెళ్లాడు. వాటిపై పక్షులను కూడా నాటాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Telugu poet Wahed Dhooli Chettu poetry speaks about man and society and wishes good for the human being.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more