Subhash Chandrabose:నేతాజీ మృతి మిస్టరీపై రష్యా కొత్త వాదన..నెహ్రూ పాత్ర: చివరి రోజుల్లో అక్కడ..!
నేతాజీ సుభాష్ చంద్రబోస్... 1897 జనవరి 23వ తేదీన కటక్‌లో జన్మించాడు. 18 ఆగష్టు 1945న మృతి చెందారు. అయితే ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ ఎలా మృతి చెందాడు అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుండగా... అసలు బోస్ మరణించలేదనే వాదన కూడా ఉంది. సుభాష్ చంద్రబోస్ తైపేలో విమానం కూలడంతో మృతి చెందాడని ప్రపంచానికి తెలుసు. అయితే అది నిజం కాదని చాలామంది వాదిస్తున్నారు. అయితే అసలు మిస్టరీ ఏంటి..?

నేతాజీ మృతి పై కొనసాగుతోన్న మిస్టరీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. 75 ఏళ్లు గడిచినప్పటికీ నేతాజీ మృతి మాత్రం ఇంకా వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. నేతాజీ మృతిపై జస్టిస్ ముఖర్జీతో వేసిన ఏకసభ్య విచారణ కమిటీ కూడా 2005లో ఓ నివేదిక సమర్పించింది. అందులో కూడా సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని పేర్కొంది. అయితే తాజాగా నేతాజీ మనవళ్లు మనవరాండ్రు మాత్రం తమ తాతయ్య విమాన ప్రమాదంలోనే మృతి చెందారంటూ చెప్పుకొచ్చారు. అయితే నేతాజీ మాత్రం ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో గుమ్నామీ బాబాగా బతికే ఉన్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై బెంగాల్‌లో సినిమా కూడా వచ్చింది. 1960వ దశకం నుంచి 1987వ దశకం వరకు సుభాష్ చంద్రబోస్ గుమ్నామీ బాబా అవతారంలో జీవించి ఉండేవాడని అతని కింద పలువురు శిషువులు కూడా ఉండేవారిని వార్తలు వచ్చాయి.

గుమ్నామీ బాబా ఎవరు..?
మూడేళ్ల కిందట యూపీ ప్రభుత్వం గుమ్నామీ బాబా ఎవరు అని తెలుసుకోవాలని భావించి ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ఈ కమిషన్ ఓ రిపోర్టును తయారు చేసింది. అయితే ఆ నివేదిక మాత్రం బయట పెట్టలేదు. గుమ్నామీ బాబా అనే వ్యక్తిని ఇంటెలిజెన్స్ వర్గాలు నియమించాయని, ప్రజలను గందరగోళంలో నెట్టివేసి సుభాష్ చంద్రబోసే గుమ్నామీ బాబా అవతారం ఎత్తాడని నమ్మించే ప్రయత్నం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేసిన బీఎన్ మాలిక్ అప్పటి ప్రధాని నెహ్రూకు చాలా సన్నిహితుడని నివేదిక పేర్కొంది. నెహ్రూకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు సుభాష్ చంద్రబోస్ పోలికలతో ఉన్న చాలామంది సాధువులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు బీఎన్ మాలిక్ ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది.

నాడు విమానంలో ప్రయాణించలేదా..?
ఇక ఆ సమయంలో నేతాజీ యూఎస్ఎస్‌ఆర్‌లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు తను భారత్‌లో తిరిగి అడుగుపెడితే రాజకీయ అస్థిరత ఏర్పడే అవకాశాలున్నాయని చాలా మంది భావించారు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే గుమ్నామీ బాబాతో పాటు ఇతర బాబాలు కూడా తెరపైకి వచ్చి తానే సుభాష్ చంద్రబోస్ అని చెప్పి గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ఏర్పాటు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే ఢిల్లీకి చెందిన ఇక్బాల్ చంద్ర మల్హోత్రా అనే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో సుభాష్ చంద్రబోస్ తప్పించుకున్నాడని చెప్పారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా విమానంలో ఆయన వెళ్లలేదని... జర్మనీకి చెందిన సబ్‌మెరైన్‌లో సింగపూర్ నుంచి వ్లాడివాస్తోక్‌కు వెళ్లారని చెప్పారు.ఇక్కడి నుంచే యూఎస్ఎస్‌ఆర్‌కు చేరుకున్నట్లు చెప్పారు మల్హోత్ర.

జోసెఫ్ స్టాలిన్ బోస్‌ను దాచాలని భావించారా..?
ఈ సబ్‌మెరైన్‌లో బంగారం,విలువైన రత్నాలు వజ్రాలు ఉన్నాయని చెప్పారు. నేతాజీ వ్లాడివాస్తోక్‌లో దిగిపోగానే ఈ సబ్‌మెరైన్ టోక్యోకు బయలుదేరిందని చెప్పారు మల్హోత్రా. ఇక వ్లాడివాస్తోక్‌లో దిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమైపోయారన్న విషయం పూర్తిగా ఎవరికీ తెలియదని మల్హోత్రా చెప్పారు. కానీ రష్యాలో కొన్నేళ్ల పాటు పరిశోధనలు చేసిన పరిశోధకులు పురబీ రాయ్ మాత్రం మరో వాదన తెరపైకి తెచ్చారు. మాస్కో ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం జోసెఫ్ స్టాలిన్ 1946లో తన ముగ్గురు సన్నిహితులతో సమావేశమై సుభాష్ చంద్రబోస్‌ను ఎక్కడ ఉంచాలని చర్చ జరిపారట. అయితే ఈ విషయాలన్నీ డాక్యుమెంట్ రూపంలో పొందుపర్చారు. ఈ డాక్యుమెంట్లను అప్పటి మేజర్ జనరల్ అలెగ్జాండర్ కోల్స్‌నికోవ్ చూశారట. అది కేవలం రష్యా పౌరులకు మాత్రమే అందుబాటులో ఉండటంతో పురబీ రాయ్ దీనిపై ముందుకెళ్లలేక పోయింది.

1945-46 మధ్య నేతాజీ ప్రసంగం
1998లో ఎంకే ముఖర్జీ విచారణ కమిషన్ అలెగ్జాండర్ కోల్స్‌నికోవ్‌ను కలిసి సాక్షాలు రుజువులు సేకరించేందుకు ఇస్తాంబుల్‌కు వెళ్లింది. అయితే కోల్స్‌నికోవ్ మాత్రం హాజరు కాలేదు. దీంతో సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారన్న పురబీ రాయ్ వాదనను ఈ కమిషన్ కొట్టిపారేయలేకపోయింది.ఇక రెండు దశబ్దాల తర్వాత అంటే 2016లో మల్హోత్రా డాక్యుమెంట్‌లో ప్రత్యక్షమైన కోల్స్‌నికోవ్ నాటి విషయాలను బయటపెట్టారు. జోసఫ్ స్టాలిన్ సుభాష్ చంద్రబోస్‌ను ఎక్కడ తరలించాలో మాట్లాడుకున్నారనే విషయాన్ని చెప్పారు. అయితే ఈ విషయాన్ని అప్పటి భారత ప్రభుత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. అయితే నేతాజీకి సంబంధించిన డాక్యుమెంట్లను 2016లో పరిశీలిస్తున్న సమయంలో ఓ ఫైల్ బయటపడింది. అందులో 1945 డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 1946 మధ్య విదేశాల నుంచి సుభాష్ చంద్రబోస్ మాట్లాడినట్లు ఉంది. ఇది రేడియో ద్వారా ప్రసారం కాగా.. వీటిని అప్పటి కలకత్తా గవర్నర్ హౌజ్‌లోని ఐబీ స్టేషన్ పసిగట్టింది. ఇక సుభాష్ చంద్రబోస్ భారత్‌లో తిరిగి అడుగుపెడతారని ఇక స్వాతంత్ర్యం తథ్యమనే వార్తలు కూడా వచ్చాయి.

నేతాజీ పై బ్రిటీష్ ప్రధాని కీలక ప్రకటన
కానీ సుభాష్ చంద్రబోస్ ఎప్పటికీ తిరిగి రాలేదు.అతని గురించి వివరాలు బయటకు రాలేదు. ఇక చేసేదేమీ లేక అప్పటి వైశ్రాయ్ బోస్ గురించి ఏం చేద్దామని ఒక విధానంతో బయటకు రావాలని నాటి బ్రిటీష్ ప్రధానికి సూచించారు. దీంతో సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడో అక్కడే ఉండనివ్వండంటూ అప్పటి ప్రధాని 1945 అక్టోబర్ 25న ఓ సమావేశం నిర్వహించి ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే నేతాజీని స్టాలినే దాచి ఉంటాడనే వార్తలు పుట్టుకొచ్చాయి. బ్రిటీషర్లకు మద్దతుగా ఉన్న నెహ్రూకు వ్యతిరేకంగా నేతాజీని అస్త్రంగా వినియోగించాలని స్టాలిన్ భావించారనే వాదన ఉంది. అయితే 1953లో స్టాలిన్ మృతి చెందడంతో సోవియట్ యూనియన్ కొత్త నాయకులు నెహ్రూతో చేతులు కలిపి నేతాజీని సైబేరియాలో వదిలేశారని రూమర్స్ వచ్చాయి.
మొత్తానికి ఎన్నో డాక్యుమెంట్లు ఎన్నో ప్రభుత్వ విచారణ కమిషన్లు మరెన్నో ప్రైవేట్ వ్యక్తుల పరిశోధనలు జరిగినప్పటికీ... నేతాజా మరణంపై మిస్టరీ మాత్రం అలానే మిగిలిపోయింది.