మోడీ ప్లాన్: కెసిఆర్‌పై ఒత్తిడి, బాబూ జగన్ ఒకే ఒరలో, పవన్ సైతం..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: దేశ రాజకీయాలను పూర్తిగా బిజెపి గుప్పిట్లోకి తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ పక్కా ప్రణాళిక రచించినట్లు అమలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఆలోచన మోడీది కాగా, దాన్ని అమలు చేసేది బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా.

బిజెపిలో మోడీ, షా జోడీకి తిరుగులేనట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు పార్టీని నామమాత్రం చేసి, బిజెపి రాజకీయాలను దేశవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా ఆ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. బలం ఉన్నచోటు పాగా వేయడం, లేనిచోట్ల ప్రాంతీయ పార్టీలను తమ గూటిలోకి తెచ్చుకోవడం అనే ప్రణాళికను అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్, కేరళ, ఇతర కొన్ని చిన్న రాష్ట్రాల్లో తప్ప బిజెపి అంతటా పాగా వేసినట్లే కనిపిస్తోంది. బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను తమ భాగస్వామిగా చేర్చుకోవడం బిజెపి సాధించిన పెద్ద విజయాల్లో ఒక్కటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో బిజెపి చేస్తున్న రాజకీయాలు గమ్మత్తు ఉన్నాయి.

ఇటు చంద్రబాబుతోనూ అటు జగన్‌తోనూ..

ఇటు చంద్రబాబుతోనూ అటు జగన్‌తోనూ..

తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఒకే ఒరలో ఇమిడిపోయే పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇరువురు రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికీ జాతీయ స్థాయిలో వారిద్దరు కూడా బిజెపి చెప్పుచేతుల్లోనే ఉండే పరిస్థితి వచ్చేసింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగిస్తూనే జగన్‌ను దగ్గరగా ఉంచుకునే ఎత్తుగడను బిజెపి జాతీయ నాయకత్వం అనుసరిస్తున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇరువురు కూడా దాదాపుగా రాష్ట్రంలో సమవుజ్జీలు కావడం అందుకు కారణం కావచ్చు.

పవన్ కల్యాణ్ సైతం...

పవన్ కల్యాణ్ సైతం...

కేంద్రంపై పోరాటం చేస్తానని చెబుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎంత కాలం ఇలా కొనసాగుతారనేది ప్రశ్నార్థకమే. ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తానని ఆయన చెబుతున్నారు. నిజానికి, బిజెపితో స్నేహం కుదిరిన తర్వాత ఆ అంశాన్ని జగన్ వదిలేశారు. జగన్ వదిలేసిన తర్వాత కూడా అది చర్చనీయాంశంగానే ఉంది. దాంతో పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉండవచ్చు. క్రమంగా ప్రత్యేక హోదా ఊసు కూడా లేకుండా పోవచ్చు. చివరకు పవన్ కల్యాణ్ బిజెపి మిత్రుడిగా మారనూ వచ్చు. అందుకు తగిన వ్యూహాన్ని బిజెపి రూపొందించవచ్చు.

కెసిఆర్‌పై బిజెపి ఒత్తిడి...

కెసిఆర్‌పై బిజెపి ఒత్తిడి...

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె. చంద్రశేఖర రావును కూడా తమ కూటమిలో చేర్చుకోవడానికి బిజెపి అగ్ర నాయకత్వం ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ఇప్పటికప్పుడైతే తెరెా తర్వాత కాంగ్రెసు పార్టీయే బలమైన పార్టీగా కనిపిస్తోంది. ఈ స్థితిలో కాంగ్రెసు పార్టీని పూర్తిగా దెబ్బ తీయడానికి కెసిఆర్‌తో స్నేహం అవసరమని మోడీ, అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం. మజ్లీస్‌తో దోస్తీ చేస్తున్న కెసిఆర్ బిజెపికి చేరువ కావడానికి వెనకాడుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ముస్లీంలు తమకు దూరమవుతారనే సందేహం కూడా కెసిఆర్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంశాలవారీ మద్దతు పేరుతో కేంద్రానికి అనుకూలంగానే ఉన్నారు. కానీ, అది సరిపోదనే ఆలోచనలో బిజెపి అగ్రనాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు.

తమిళనాడులో...

తమిళనాడులో...

జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పడంలో బిజెపి జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తమకు వ్యతిరేకంగా ఉన్న శశికళ వర్గాన్ని దెబ్బ తీయడానికి ఇంకా ప్రయత్నాలు ప్రారంభిస్తూనే ఉంది. తమకు అనుకూలంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామిని కలపడంలో బిజెపిదే పాత్ర. వారికి వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్న దినకరన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించని పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో ఉంది. అంతా గవర్నర్ చేతిలో ఉండడంతో దినకరన్ చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు.

కర్ణాటకపై గురి...

కర్ణాటకపై గురి...

ప్రస్తుతం కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో ఉంది. వివిధ కారణాలతో తమకు దూరమైన యడ్యూరప్ప వంటివారిని తిరిగి బిజెపి తీసుకుంది. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేసే ఆలోచన కూడా సాగుతన్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా, గౌరీ లంకేష్ హత్యను వాడుకునే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు అర్తమవుతోంది. గౌరీ లంకేష్ హత్యకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు.

ప్రాంతీయ పార్టీలున్నా....

ప్రాంతీయ పార్టీలున్నా....

ప్రాంతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉండి, అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి వాటిని సహిస్తూ వాటిని తమ కూటమిలోకి తెచ్చుకునే ఎత్తుగడను మాత్రమే బిజెపి నాయకత్వం అనుసరిస్తోంది. కొన్ని రాష్ట్రాలు తమ ఏలుబడిలో లేకపోయినప్పటికీ తమ చెప్పుచేతల్లో ప్రాంతీయ పార్టీలు ఉండే విధంగా చూసుకోవడం వ్యూహంలోని భాగం. తద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెసును నామరూపాలు లేకుండా చేయడం, దేశవ్యాప్తంగా తాము అనుకున్న విధానాలను నిరాటంకంగా అమలు చేయడం మోడీ ప్రభుత్వం యోచనగా తెలుస్తోంది. దానివల్ల దేశ రాజకీయాలు పూర్తిగా బిజెపి గుప్పిట్లోకి వస్తాయని భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to political analysts - PM Narendra Modi and BJP national president Ait shah planning take indian politics into their fold. As part of it BJP will continue friendship with Chandrababu Naidu and YS Jagan in Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X