పీకల్లోతు కష్టాల్లో దినకరన్: ఎక్కే మెట్టు, దిగే మెట్టు..

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: చిన్నమ్మ శశికళ ఆశీస్సులతో అన్నాడియంకె ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన టిటీవీ దినకరన్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితిలో ఆయన పడ్డారు. తమిళనాట అధికారం తనదేనంటూ దూకుడు ప్రదర్శించిన ఆయనకు ఇప్పుడు ప్రతి చోటా ఎదురు గాలి వీస్తోంది.

అన్నాడియంకె ఉప ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టినప్పటి నుంచి ఆయనను కష్టాలు వెంటాడుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయనను ప్రశంసలతో ముంచెత్తినవాళ్లు ఇప్పుడు ఆయనపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. పార్టీ నుంచి ఆయనను తప్పించేందుకు కూడా వెనకాడ లేదు.

ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కూడా ఆయన ఆశపడ్డారు. కానీ ఆ ఎన్నిక వాయిదా పడడంతో పాటు రెండాకుల గుర్తు కోసం చేసిన వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంది.

జయలలిత అతన్ని నెట్టేశారు...

జయలలిత అతన్ని నెట్టేశారు...

దినకరన్ శశికళ సోదరి వనితామణని కుమారుడు. జయలలిత జీవించి ఉన్నప్పుడు అతన్ని బయటకు నెట్టేశారు. అప్పట్లో ఆయనపై విదేశీ మారక ద్రవ్యం కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, విచారణలు వాయిదాల ద్వారా సాగుతూ వచ్చాయి. అమ్మ జయలలిత ఉన్నంత వరకు ఆయ పోయెస్ గార్డెన్ వైపు గానీ, పార్టీ కార్యాలయం వైపు గానీ చూడలేని పరిస్థితిలో పడ్డారు. అయితే, జయలలిత మరణంతో ఆయన పోయెస్ గార్డెన్‌లో తిష్ట వేయడమే కాకుండా ఏకంగా శశికళ జైలు పాలు కావడంతో పార్టీనే ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో తన చేతుల్లోకి తీసుకున్నారు.

శశికళ ప్లాన్ బెడిసి కొట్టింది....

శశికళ ప్లాన్ బెడిసి కొట్టింది....

చిన్నమ్మ శశికళ జైలుకు వెళ్తూ పార్టీ పగ్గాలను దినకరన్‌కు అప్పగించారు. దాంతో ఆయన పార్టీని మొత్తం తన గుప్పిట్లోకి పెట్టుకోవడానికి ప్రయత్నించారు. పార్టీ పదవి దక్కిన వారం రోజుల తర్వాత ఫిబ్రవరి 23వ తేదీన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో టీటీవీ జై.. అంటూ ప్రశంసలు మిన్నంటాయి. కాళ్ల మీద పడి ఆశీస్సులు తీసుకున్నవారు కూడా న్నారు. అమ్మ తరహాలో కార్యాలయం మీది నుంచి విక్టరీ సింబల్ చూపించారు. తానే పార్టీ అన్నట్లుగా వ్యవహరించారు.

జయ మేనల్లుడు దీపక్ వ్యతిరేకించినా...

జయ మేనల్లుడు దీపక్ వ్యతిరేకించినా...

జయలలిత మేనల్లుడు దీపక్ దినకరన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినా పట్టించుకోలేదు. పన్నీరు సెల్వం నుంచి చిక్కులు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. పార్టీపై పట్టు బిగించేందుకు నాయకులతో చర్చలు జరుపుతూ, అసంతృప్తులను బుజ్జగిస్తూ వచ్చారు. అర్కె నగర్‌లో విజయం సాధించి అందలం ఎక్కాలని కూడా అనుకున్నారు. కానీ పరిస్థితి ఎదురు తిరిగింది.

కోర్టు చుట్టూ ప్రదక్షిణనలేనా....

కోర్టు చుట్టూ ప్రదక్షిణనలేనా....

ఇక దినకరన్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలో పడ్డారు. విదేశీ మారకద్రవ్యం కేసు విచారణ వేగవంతమైంది. దీంతో ఆయన కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో రెండాకుల గుర్తు కోసం నడిపిన వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంది. దీంతో ఆయనను ఇంతకు ముందు పొగడినవారే తిట్టడం ప్రారంభించారు. పార్టీ పదవి నుంచి తప్పించడమే కాదు, పార్టీ నుంచే గెంటేశారు.

ఇప్పటికే దినకరన్ పాస్‌పోర్టు సీజ్...

ఇప్పటికే దినకరన్ పాస్‌పోర్టు సీజ్...

ఇప్పటికే దినకరన్ పాస్‌పోర్టును సీజ్ చేశారు. విదేశాలకు పారిపోకుండా ఆయనపై లుకవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అదే సమయంలో ఆయన ఎగ్మూర్ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. నేతలూ కార్యకర్తల మధ్య దర్జా ఒలకబోస్తూ వచ్చిన దినకరన్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగ్మూరు కోర్టులో ఆయన బుధవారం న్యాయవాదులతో అడుగు పెట్టారు.

ఆ భేటీకి చుక్కెదురు...

ఆ భేటీకి చుక్కెదురు...

ముఖ్యమంత్రి పళని స్వామిపై నిప్పులు చెరుగుతూ ప్రభుత్వాన్ని కూలదోస్తానని హెచ్చరికలు చేసిన దినకరన్‌కు పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించలేదు. అందుకు పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ కార్యాలయంలో అడుగు పెట్టవద్దంటూ హెచ్చరికలను అందుకున్నారు. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. గౌరవంగా తప్పుకుంటున్నానంటూ ప్రకటించారు. ఏమైనా, దినకరన్ పరిస్థితి బోనులో చిక్కుకున్న ఎలుకలా తయారైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sasikala's nephew TTV Dinakaran is facing lot problems with court cases and lost his image.
Please Wait while comments are loading...