హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ బలం

By కె.నిశాంత్
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
వాలితో యుద్ధానికి దిగడం ఆషామాషీ వ్యవహారం కాదట. శత్రువు ఆయనకు ఎదురుగా నిలబడి యుద్ధం చేయడానికి పూనుకుంటే అతని సగం బలం వాలికి వచ్చేదట. అందుకే శ్రీరాముడంతటి వాడు కూడా చెట్టు చాటు నుంచి వాలిని మట్టుబెట్టాల్సి వచ్చిందని అంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కథ కూడా అలాగే ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసింది మొదలు బయటి, లోపలి శత్రువులు ఆయనపై దాడికి పూనుకుంటూనే ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు చేతులెత్తేసినట్లే కనిపిస్తూ మళ్లీ పుంజుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల రీత్యా తెరాస బలం ఉడిగినట్లు కనిపిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకత్వం మాత్రం కెసిఆర్ చేతుల నుంచి జారిపోయే అవకాశం కనిపించడం లేదు. ప్రత్యర్థుల బలహీనతలే ఆయన బలంగా మారుతున్నాయి.

ఎ.నరేంద్ర, టి.దేవేందర్ గౌడ్, విజయశాంతి ప్రజాకర్షణ ఉన్న నాయకులు కూడా కెసిఆర్ ను ఏమీ చేయలేకపోతున్నారు. ఇందుకు కారణమేమిటనే ప్రశ్న ఉదయించడం సహజమే. కెసిఆర్ చిత్తశుద్ధి మాటను పక్కన పెడితే వారికి తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల చిత్తశుద్ధి లేదనే విషయం బయటపడిపోతూనే ఉంది. ఇటువంటి నాయకులు తాత్కాలికంగా కెసిఆర్ ను ఇబ్బంది పెట్టగలుగుతున్నారు. కెసిఆర్ ను బలహీన పరచడానికి, తెరాసను చీల్చడానికి మాత్రమే వారు ముందుకు వచ్చారనే అభిప్రాయం బలపడుతూ ఉండడం కెసిఆర్ బలానికి ఊతం ఇస్తున్నాయి.కెసిఆర్ వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్ర సొంతంగా తెరాస (ఎన్)ను పెట్టి దాన్ని ఎంతో కాలం కొనసాగించలేకపోయారు. కాంగ్రెసుకు బహిరంగంగా అనుకూలంగా మారిపోయారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో పార్లమెంటులో అనుకూలంగా ఓటేసి తన నిజాయితీని తెలంగాణ పట్ల కాకుంగా సొంత ప్రయోజనాల పట్ల చూపుకున్నారు.

ఇక దేవేందర్ గౌడ్ విషయానికి వస్తే, కెసిఆర్ కు పోటీగా ఆయన నవ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ సాధన కోసం తన శక్తియుక్తులను ధారపోస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెసుపై విమర్శల వర్షం కురిపించారు. కెసిఆర్ పై విమర్శానాస్త్రాలు సంధించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లలేకపోయారు. పార్టీని బేషరతుగా చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు.అటు లోకసభకు, ఇటు శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దేవేందర్ రాజకీయ జీవిత స్థాయికి ఇది పెద్ద ఆటంకంగా మారింది. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలోనూ ఇమడలేకపోతున్నారు.

విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సాధన గురించి మాట్లాడని మాట లేదు. ఈ రాములమ్మ తెలంగాణ రాష్ట్ర సాధనే తన ప్రాణమన్నట్లుగా ప్రగల్భాలు పలికారు. కెసిఆర్ ఉద్యమాన్ని సరైన రీతిలో నడిపించలేకపోతున్నారని విమర్శించారు. ఈమె తొలుత బిజెపిలో ఉండి ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నడిపారు. ఆమె ఉద్యమం అడుగు ముందుకు కూడా పడలేదు. కానీ తెలంగాణ సాధన గురించి మాత్రం మాటలు కోటలు దాటాయి. చివరకి తన పార్టీని తెరాసలో విలీనం చేశారు. అత్యంత సురక్షితమైన మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టారు. అంతకు బిజెపి వల్ల సాధ్యం కానిదాన్ని తెరాస ద్వారా సాధించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు తెరాసకు ఎగనామం పెట్టి కాంగ్రెసు వైపు చూస్తున్నారు.

ఈ రకంగా కెసిఆర్ ను వ్యతిరేకించే నాయకులు కాంగ్రెసు వైపో, మరో వైపో చూస్తుండడం వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాలను బయట పెడుతున్నాయి. ఈ స్థితిలో గుడ్డి కన్నా మెల్ల నయం అనే పరిస్థితిలో కెసిఆర్ ను తెలంగాణ ప్రజలు ఆదరించక తప్పడం లేదు. ఇన్ని ఆటంకాల మధ్య కెసిఆర్ కాబట్టే ఆ మాత్రం నిలబడుగలుగుతున్నారని, మరో నాయకుడైతే ఎప్పుడో తోక ముడిచి ఉండేవాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ అభిప్రాయంలో నిజం లేకపోలేదు. ఇదే కెసిఆర్ బలం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X