• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఔట్ డేటెడ్: నేనూ, నా ఆల్విన్ వాచీ అబ్షెషన్

By Pratap
|

అల్ప విషయాలు

చిన్నప్పుడు చాలా కలలు ఉండేవి. బడిలో చదువుతున్నప్పుడు మనకు కొంత మంది ఆదర్శంగా కనిపించేవారు. అలా నాకు ఆదర్శంగా కనిపించినవాళ్లలో మా టీచర్ కంచర్ల గోవర్ధన్ రెడ్డి. అందులోనూ అతను చేతికి రిస్ట్ వాచీ పెట్టుకునేవాడు. పాఠం చెబుతున్నప్పుడు అప్పుడప్పుడు దాన్ని తీసి బల్ల మీద పెట్టేవాడు. అలా పెట్టినప్పుడు ఆ వాచీ బెల్ట్ వేసిన ముద్ర మణికట్టు చుట్టూ స్పష్టంగా కనిపించేది.

అది చూసినప్పుడల్లా నాకు కూడా ఓ వాచీ పెట్టుకోవాలని, నా మణికట్టు మీద కూడా అలాంటి మచ్చ ఒకటి ఉండాలని కోరుకునేవాడిని. నేను బడిలో చదువుతున్నప్పుడు మా అన్న బుచ్చిరెడ్డి నాకు వాచీ తెచ్చాడు. కానీ దానికి చైన్ ఉంది. దాన్ని చాలా రోజులే పెట్టుకున్నాను. కానీ, అకస్మాత్తుగా దాన్ని మా బావ లాగేసుకున్నాడు. వాళ్ల అక్క బిడ్డకో ఎవరికో పెళ్లి ఉందని, వారికి పెట్టాలని దాన్ని లాగేసుకుని పోయాడు.

సరే, ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి సారు పెట్టుకున్నటువంటి వాచీ పెట్టుకోవాలని కోరిక అలాగే ఉండిపోయింది. వాచీ పెట్టుకోవాలనే కోరిక కన్నా బెల్టు ముద్ర మణికట్టు చుట్టూ ఏర్పడి అది ప్రత్యేకంగా కనిపించాలనే కోరికనే ఎక్కువగా ఉన్నట్లు నాకు ఇప్పుడనిపిస్తున్నది.

బడిలో ఏర్పడిన కోరిక అలాగే ఉండిపోయింది. హైదరాబాద్ వచ్చేసి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఎ ఎంఫిల్, ఉదయం దినపత్రికలో రిపోర్టర్ ఉద్యోగం ఇలా జీవితం సాగిపోతూ ఉంది. కానీ నా కోరిక మాత్రం అంతరాంతరాల్లో అలాగే ఉండిపోయింది.

Allwyn watch was the dream of every body

నేను ఉదయం దినపత్రికలో పొలిటికల్ రిపోర్టింగ్ చేస్తూ ఉండేవాడిని. అదీ తెలుగుదేశం పార్టీ బీట్. తెలుగు దేశం పార్టీ వ్యవహారాలు చూసి, వార్తలూ వార్తాకథనాలు రాయడం నా బాధ్యత. గజ్జెల మల్లారెడ్డి ఎడిటర్‌గా ఉండేవారు. నా వార్తాకథనాలను ఆయన చాలా ప్రోత్సహించేవారు.

అటువంటి సందర్భంలో నా జర్నలిజం కెరీర్‌లో అత్యంత భయానకమైన, చీకటి రోజులు ప్రారంభమయ్యాయి. ఓ వ్యక్తి తాను ఈవినెంగ్ డైలీ పెడుతున్నానని చెప్పి నన్ను నమ్మించి, ఎక్కువ జీతం ఎర చూపి నన్ను లాక్కున్నాడు. మిత్రులు చెబుతున్నా వినకుండా గజ్జెల మల్లారెడ్డితో అబద్ధం చెప్పి ఆ పత్రికలో చేరిపోయాను. అప్పటి నుంచి నా జీవితంలో ఎన్నడు లేని నరకం అనుభవించాను. జీతం ఉండేది కాదు, పిల్లలకు పాలు కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. అటువంటి నరకాన్ని అనుభవించిన తర్వాత నన్ను తన పత్రికలోకి తీసుకున్న యజమానిని నేను ఉండలేను, తిరిగి నాకు ఉదయంలో ఉద్యోగం కావాలి అని అడిగాను. ఓ రకంగా అతనిపై ఎక్కడ లేని ఒత్తిడి పెట్టాను.

అప్పటికి గజ్జెల మల్లారెడ్డి స్థానంలో కె. రామచంద్ర మూర్తి ఎడిటర్‌గా వచ్చారు. ఉదయం నుంచి నన్ను తీసుకున్న వ్యక్తే బతిమాలాడో బామాలో నాకు తిరిగి ఉదయంలో ఉద్యోగం ఇప్పించాడు. దాంతో నేను అక్కడ జూనియర్ అయిపోయాను. పైగా, పొలిటికల్ బ్యూరో నన్ను కొనసాగించడానికి రామచంద్రమూర్తిగారు అంగీకరించలేదు. బిజినెస్ రిపోర్టింగ్ చేయమన్నారు.

ఉదయంలో అప్పుడు బిజినెస్ స్పెషల్ పేజీ కూడా ఉండేది. ఓ డెస్క్ ఉండేది. అయితే, నాకు బిజినెస్‌లో ఓనమాలు తెలియదు అన్నప్పటికీ రామచంద్రమూర్తిగారు అంగీకరించలేదు. రోజుకు నాలుగైదు బిజినెస్ ప్రెస్ మీట్లు జరుగుతుండేవి ( దేశంలోప్రైవేట్ రంగం విజృంభిస్తున్న దశ అది, ఈ సమయంలో తెలుగు పత్రికారంగంలో బిజినెస్ వార్తలకు, వార్తాకథనాలకు ప్రాధాన్యం పెరిగింది). ఆ ప్రెస్ మీట్లకు వెళ్లి వార్తలు కవర్ చేయడమే నీ బాధ్యత అని రామచంద్రమూర్తి చెప్పారు.

బిజినెస్ రిపోర్టర్‌గా ఎందుకు వేస్తున్నాననే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. బిజినెస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో గిఫ్టులు ఇచ్చేవారు. అది నగదు రూపంలోనో, వస్తు రూపంలోనో ఉండేది. ఎవరు వెళ్లినా వారు గిఫ్టులు తీసుకుంటున్నారు. బిజినెస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో మనం గిఫ్టులు తీసుకోకూడదు. నువ్వు నిజాయితీ గలవాడివి కాబట్టి నీ మీద నమ్మకం వల్లనే అలా వేస్తున్నానని, మిగతావారి మీద నాకు నమ్మకం లేదు అని రామచంద్రమూర్తిగారు చెప్పారు. (అది నిజమో అబద్ధమో తెలియదు. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూడడానికి అంతకు ముందు బిజినెస్ రిపోర్టింగ్‌లో పనిచేసే సబ్ ఎడిటర్‌ను రిపోర్టర్‌గా వేశారు).

బిజినెస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు మామూలుగా యాడ్ కన్సల్టెంట్ ఏజెన్సీలు నిర్వహించేవి. ఆ ఏజెన్సీలు దాదాపుగా పత్రికా రంగంలోని వారందరికీ తెలిసినవే. ముఖ్యంగా బిజినెస్ వార్తాకథనాలు రాసేవారందరికి సుపరిచతం. ఇదంతా 1980 చివరి దశకం మాట.. అదలా పుంచితే నేను రోజుకు మూడు, నాలుగు బిజినెస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు అటెండ్ అవుతూ ఆ వార్తలు రాస్తూ వచ్చేవాడిని.

ఏడాది కాలంలో నేను పూర్తిగానే గిఫ్టులు తీసుకోలేదనే మాట అబద్ధం కానీ నాలుగైదు తీసుకుని ఉంటాను. అప్పుడు నా చేతికి వాచీ ఉండేది కాదు. అటువంటి సందర్భంలోనే నేను ఓ బిజినెస్ ప్రెస్ మీట్‌కు వెళ్లా. ఆల్విన్ వాచీ సంస్థను కొనడానికి ఓ ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ అది. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత గిఫ్టులు ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైంది. ఆ సమయంలో యాడ్ ఏజెన్సీ ప్రతినిధి నన్ను ప్రత్యేకంగా పిలిచి -మీరు గిఫ్టులు తీసుకోవడం లేదు, మీ చేతికి వాచీ కూడా లేదు, ఇది తీసుకోండి అని నాకు ఆల్విన్ వాచీ ఇచ్చాడు. మొహమాటం కొద్దీ తీసుకున్నాను.

ఆల్విన్ కథా కమామీషు

హైదరాబాద్ ప్రభుత్వం 1942లో హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్‌ను స్థాపించింది. అది ఆల్విన్ మెటల్ వర్క్స్ పేర ప్రారభమైంది. నిజాం హైదరాబాద్ ప్రభుత్వం, మెస్రస్ అల్లాద్దీన్ అండ్ అండ్ కంపెనీ జాయింట్ వెంచర్‌గా ప్రారంభమైంది.

హైదరాబాద్ స్టేట్ రైల్వేలకు అది అల్పియోన్ సిx9 బస్సులను తయారు చేసేది. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను కూడా తయారు చేసింది. కంపెనీ సామర్థ్యం దెబ్బ తినడంతో రాష్ట్ర ప్రభుత్వం 1969లో దాన్ని స్వాధీనం చేసుకుంది.

హైదరాబాదులో తొలిసారి 1963లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టారు. ఎపిఎస్ఆర్టీసితో కలిసి హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్ ఆ బస్సుల డిజైన్‌ను రూపొందించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎపిఎస్ఆర్టీసి బస్సుల అతి పెద్ద కోచింగ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్‌గా అది కొనసాగుతూ వచ్చింది. ఇండియన్ ఆర్మీ మీడియం కెపాసిటీ శక్తిమాన్ ట్రక్కు బాడీలను కూడా ఈ సంస్థ నిర్మించింది.

అల్విన్ రెఫ్రిజిరేటర్లు భారత దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్. గోద్రెజ్, కెల్వినేటర్, వోల్టాస్‌లతో అది పోటీ పడుతూ వాటికి సమఉజ్జీగా, కొన్నిసార్లు వాటిని మించి కొనసాగుతూ వచ్చింది. 2005 వరకు ఆల్విన్ రెఫ్రిజిరేటర్లకు ఏ సంస్థ కూడా పోటీ ఇవ్వలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.

ఆల్విన్ క్రమంగా ఆటోమొబైల్స్, ట్రక్స్, స్కూటర్లు, బస్సు కోచింగ్ బిల్డింగ్, రెప్రిజిరేటర్లు, రిస్ట్ వాచీల వంటి ఉత్పత్తి రంగాలకు విస్తరించింది. 1970, 1980 దశకంలో అవి ఇండియాలో లీడింగ్ బ్రాండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాలంలో 1995లో దాన్ని మూసేశారు. ఆర్థిక సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు ఊపందకున్న కాలం అది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం అనేది అందులో ఓ భాగం.

ఆల్విన్ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. అయితే, వాచీ డివిజన్‌కు వద్దాం. హైదరాబాద్ ఆల్విన్ 1981ల వాచీల వ్యాపారంలోకి వచ్చింది. జపాన్‌కు చెందిన సీకో సచహకారంతో మెకానికల్, క్వార్ట్జ్ వాచీలను ఉత్పత్తి చేస్తూ వచ్చింది. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హెచ్ఎంటి వాచీలకు దేశంలో అత్యధిక మార్కెట్ ఉంటూ వచ్చింది. ఆ తర్వాత హెచ్ఎంటి, టైటాన్ హెచ్ఎంటితో పోటీ పడుతూ వచ్చాయి. దేశంలోని పది శాతం మార్కెట్ వాటా దానిదే.

సిక్ కంపెనీగా మారిపోయింది....

హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్ సిక్ కంపెనీగా మారిపోయింది. 1993నాటికి దాన్ని ఆర్థిక నిల్వలన్నీ ఊడ్చుకుని పోయాయి. దాని నష్టాలు ర.180 కోట్లకు పేరుకుపోయాయి. దాంతో 1993 మార్చి 31వ తేదీన పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డు (బిఐఎఫ్ఆర్)కు సిఫార్సు చేశారు. (అత్యంత ప్రతిభావంతంగా మార్కెట్‌లో పోటీ పడుతూ వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా జబ్బు పడి మూతపడే స్థితికి ఎందుకు వచ్చాయో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆర్థిక వేత్తలు, ప్రజాస్వామిక వాదులు దాని గురించి మాట్లాడారు, మాట్లాడుతున్నారు).

ఆ క్రమంలో హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్‌కు చెందిన రెఫ్రిజిరేషన్ అండ్ అప్లయెన్సెస్ డివిజన్‌ను వోల్టాస్ లిమిటెడ్‌లో విలీనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అది క్రమక్రమంగా స్వీడన్‌కు చెందిన ఎలక్ట్రోలక్ష్ చేతిలోకి వెళ్లింది. హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్ సంస్థలో బస్సు బాడీ బిల్డింగ్, వాచీలు, రెఫ్రిజిరేటర్ల విభాగాలు ఉండేవి. కంపెనీలోని విభాగాలను విడగొట్టి ప్రైవేట్‌పరం చేసే క్రమంలో ఆల్విన్ వాచెస్ లిమిటెడ్ ఏర్పడింది. అది కాల క్రమంలో మూతపడింది.

మళ్లీ మొదటికి వస్తే...

మళ్లీ మొదటికి వస్తే, యాడ్ ఏజెన్సీ ఇచ్చిన ఆల్విన్ రిస్ట్ వాచీ నా చేతికి 2009, 2010 దాకా ఉంటూ వచ్చింది. దాదాపు 20, 25 ఏళ్ల పాటు నా చేతిని అది అలంకరించింది. దానికి గోధురంగు బెల్టు ఉండేది. అది పెట్టుకోవడం వల్ల నా మణికట్టు చుట్టూ తెల్లటి చారిక ఏర్పడింది.

మధ్యలో ఆ వాచీకి వెల్డింగ్ కూడా చేయించి, బెల్టు అమరేలా చేశాను. ఓ రోజు కవి అయిల సైదాచారి మా ఇంటికి వచ్చి నన్ను బయటకు తీసుకుని వెళ్లాడు. ఆ సమయంలో నేను చేతికి వాచీ ఎలా పెట్టుకున్నానో తెలియదు. అది టూ వీలర్ మీద వెనక్క కూర్చున్నప్పుడు ఎక్కడో జారిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఎంత దేవులాడిన దొరకలేదు. ఆ తర్వాత నేను చేతికి వాచీ పెట్టుకోలేదు.

ఆల్విన్ వాచీ మీద నాకున్న మమకారాన్ని చూసి నా చిన్న కొడుకు 'డాడీ, అవుట్ డేటెడ్' అనేవాడు. అలా అన్నప్పుడు నాకు ఆల్విన్‌ను అవుట్ డేట్ చేసింది ఎవరు అనే ప్రశ్న ఉదయించింది. నిజానికి, దానంతటదే నష్టాల ఊబిలో కూరుకుపోయిందా, ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వాలు దాన్ని మూత పడే స్థితికి తెచ్చాయా అనేది ఆర్థిక నిపుణులు తేల్చాల్సి ఉంది.

ఇప్పుడు నా చేతికి టైటాన్ రిస్ట్ వాచీ పెట్టుకుంటున్నాను. నా పెద్ద కొడుకు ఐఐటిలో చేరిన సందర్భంలో తీసుకున్నది అది. అది వాడికి అవుట్ డేటెడ్ అయిపోయి నాకు వదిలేసి వెళ్లిపోయాడు. దానికి బెల్టు కాకుండా చైన్ ఉంటుంది. అయినా అది నా మణికట్టు చేతి చుట్టూ తెల్లటి చారికను రూపు దిద్దింది. చైన్ వదులుగా చేసుకుంటే అది ఉండకపోయేది. చైన్ వదులుగా చేసి ముందుకీ వెనక్కీ జారే విధంగా పెట్టుకోవాలని సూచించినా నేను వినలేదు. నాకు ఇష్టం కూడా లేదు.

దీనివల్ల నా మణికట్టుకు ఏర్పడిన గుండ్రటి చారిక నాకు ఆల్విన్ వాచీనే గుర్తు చేస్తుంది. అదీ నాకు ఆల్విన్ వాచీపైనే కాదు, ఆల్విన్ కంపెనీపై ఉన్న అబ్షెషన్. మరో మాట - ఇటీవలి, అంటే మూడు, నాలుగేళ్ల క్రితం దాకా మా ఇంట్లో ఆల్విన్ రెఫ్రిజిరేటర్ ఉండేది. అది పనిచేయలేని స్థితికి చేరుకున్న తర్వాతనే నేను మరో రెఫ్రిజిరేటర్‌ను కొన్నాను. తప్పదు కదా, క్రమంగా ప్రైవేట్ మార్కెట్ రంగంలోకి మనం అడుగు పెట్టాల్సిన వాతావరణం.

ఔట్ డేటెడ్ అంటే కాలం చెల్లిన అని అర్థం. ప్రభుత్వ రంగ సంస్లకు కాలం చెల్లి, ప్రైవేట్ సంస్థలు ఊరేగుతున్న కాలం ఇది. నెహ్రూ కలలకు పాతర వేసిన కాలం కూడా...

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
Kasula Pratap Reddy explained the brand image of Allwyn watches in the market from his personal experience
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X