వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్‌బాక్సింగ్: ఓ కుటుంబం గాథ

|
Google Oneindia TeluguNews

అదో ఇల్లు. ఆ ఇంట్లో ఇదో గది. గది లోపల గడియ వేసుకున్న గది. గది ఇరుకు గది. ఆ ఇరుకు గదిలో వున్నది ఒకటీ రెండూ మూడూ నలుగురు. ఆ నలుగురిలో ఇద్దరు ఆడ ఇద్దరు మగ. ఇద్దరు ఆడవారిలో ఒకరు తల్లి ఇంకొకరు కూతురు. ఇద్దరు మగవారిలో ఒకరు తండ్రి ఇంకొకరు కొడుకు. అంటే ఆ గదిలో వున్నది ఓ తల్లీ ఓ తండ్రీ వాళ్ల కొడుకూ కూతురు.

నలుగురే వున్న ఆ గదికి ఉన్నది ఒకే ఒక్క కిటికీ. అది కూడా మూసివుంది. గది లోపల సామానంత చిందరవందరగా వుంది. పెచ్చులూడిన గోడల్లోంచి ఇటుక రాళ్లు తొంగి చూస్తున్నవి. గది పైకప్పు మీద నుంచి సాలీళ్లు గోడల మీదకి ఉయ్యాల లూగుతున్నవి. మంచం మీద కూచున్నాడతను. మంచం అంచున కూచున్నది ఆమె. కూతురు వోమూలన రెండు చేతుల మధ్య తలను ఇరికించుకు కూచున్నది. ఎటు చూసున్నదీ తెలీడం లేదు. అమ్మాయి కొంచెం దూరంలో గోడకి జారగిలపడి కూచున్నాడు అబ్బాయి.

సీలింగు నుంచి వేలాడ్తున్న పాత ఫ్యాను రెక్కలకు అంటుకున్న నల్లటి గీతల్ని చూస్తూవున్న అబ్బాయి వున్నట్టుండి లేచి నిలబడ్డాడు.
మంచం మీద వున్న తండ్రి కేసి చూశాడు. మూసివున్న గది తలుపుకేసి చూశాడు.

డాడీ.. నేను స్కూల్‌కి వెళ్లాలి అన్నాడు అనలేదు.. అరిచాడు.

డాడీ మాట్లాళ్లేదు. మమ్మీ ‘ష్.. అరవకు ఇవ్వాళ వొద్దులేరా' అంది.

chintapatla quick boxing on ghosts

అదేంటి మమ్మీ స్కూల్‌కి వెళ్లి వారం అయింది. ఇవేళ వెళ్లకపోతే స్కూల్లోంచి తీసేస్తారు అన్నాడు అబ్బాయి బిగుతు చెడ్డీని కిందకి లాక్కుంటూ.

‘ఎప్పుడో తీసేశారు మనిద్దర్నీ' అని ఇప్పుడన్న అమ్మాయి తలని చేతులు వదిలేసినయి. గుండ్రటి ముఖంలో గుండ్రటి కళ్లు గుండ్రంగా తిరిగినయి.

అవును మమ్మీ ఇద్దర్నీ ఎప్పుడో తీసేశారు స్కూల్ నుంచి అందమ్మాయి నుదుటి మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసేస్తూ అబ్బాయి అక్కవైపు చూశాడు. అమ్మవైపు చూశాడు. మళ్లీ గదిలో నేల మీద దబ్బున కూలబడ్డాడు.

గది బయట చప్పుళ్లు వినపడ్తున్నాయి. ఎవరో ఎవరెవరో ఇల్లంతా తిరిగేస్తున్నారు. పిల్లల తల్లి తండ్రి వైపు చూసింది. నల్లటి వలయాలు చుట్టేసిన కళ్లు వెడల్పు చేసి చూసింది. ‘ఏమండీ ఎలావుండేవారు. ఎలాగయిపోయారు'.. అంది నీళ్లు నిండిన కళ్లతో.

లావుగా వుండే మనిషి సన్నబడటం వల్ల ఒళ్లంతా ఒదులుగా ముడతలు పడ్డ మాంసం సంచీలా వుంది. మొహం చెక్క పేడులావుంది. కళ్లు ఎక్కడున్నయో తెలియనంత లోతుకి వెళ్లిపోయినయి.

‘అంతా ఖర్మ!' అన్నాడతను కుడిచేతి నాలుగువేళ్లతో నుదురు కొట్టుకుంటూ. ‘ఇంత దూరం వస్తుందనుకోలేదు. అంతా అయిపోయింది. పూర్తిగా అప్పుల పాలయిపోయేం. ఇక మనల్ని ఎవరూ ఆదుకోలేరు' అన్నాడు అతను చిరిగిన బనీను రంధ్రంకేసి చూస్తూ.

ఉన్నట్టుండి అబ్బాయి లేచి నిలబడ్డాడు. ‘డాడీ మన ఇంట్లో ఎవరెవరో తిరుగుతున్నారు తలుపుతీద్దాం' అన్నాడు.

‘వొద్దు! వొద్దు!' అన్నాడు తండ్రి అదిరిపడుతూ.

‘అదేంటి డాడీ మన ఇల్లే కదా!' అంది అమ్మాయి కూర్చున్న చోట నుంచి కొంచెం ఇటు జరుగుతూ.

‘కాదమ్మ ఇప్పుడది మనిల్లు కాదు' అన్నాడతను ఎటు చూస్తూ అన్నాడో తెలీదు.

‘ఇల్లు జప్తు చేస్తున్నారా?' అంది ఆమె ఆయన వైపు భయం భయంగా చూస్తూ.

‘జప్తు చేస్తే యేం! చెయ్యకపోతేనేం! ఇప్పుడు ఏదైనా ఒకటే. మనకిక ఇల్లే అవసరం లేదు' అన్నాడతను నుదుటి మీది గీతల్ని సాపుగా వుంచడానికి యత్నిస్తూ.

‘ఎంత సేపు ఈ రూంలోనే కూచోవాలి నేను బయటికి పోవాలి' అన్నాడబ్బాయి మొండిగా. వద్దన్నాడుగా డాడీ అంది అమ్మాయి.

వద్దురా! డాడీకి కోపం వస్తుంది అన్నది అమ్మ. గదిలో కూచుని కూచుని విసుగొచ్చేసిన అబ్బాయి ఎవరి మాటా వినవొద్దనుకున్నాడు.

మూసివున్న తలుపువైపు గెంతాడు. బోల్టు మీద చెయ్యివేశాడు. మంచం మీదనించి కుర్రాడి వైపుకి ఒక్క దూకు దూకాడు తండ్రి.

వొద్దు అని చెప్తుంటే అర్థం కాదూ అంటూ అబ్బాయి వీపు మీద చాచిపెట్టి కొట్టాడు ఎముకలా వేలాడ్తున్న చేత్తో.

గిరిక్కున వెనక్కి తిరిగాడు అబ్బాయి. ఇది వరకు కొట్టేవాడు కాదు గానీ ఈ మధ్య ప్రతి రోజూ కొడ్తూనే వున్నాడు ఏదడిగినా. అందువల్ల దెబ్బలంటే వొణుకూ భయమూ అబ్బాయికి. తన వీపు మీద పడ్డది దెబ్బే అవునా కాదా అర్థం కాలేదు కానీ మళ్లీ తండ్రి చేయెత్తుతుండటం గమనించి వెనక్కి వచ్చాడు.

‘ఇలాగ లాభం లేదు నీతో' అంటూ తండ్రి వాడ్ని అమాంతం పైకెత్తి గదిలో ఓ పక్క వున్న సజ్జా మీదకి విసిరేశాడు. ఓ బట్టల మూటలా వెళ్లి చిల్లరసామాను, రేకు పెట్టెలూ, చెక్క సామానూ వున్న సజ్జా మీదకి వెళ్లి పడ్డాడు అబ్బాయి. ఏమేం గుచ్చుకున్నయో ఎంత రక్తం కారిపోతున్నదో అని తన్ని తను పరీక్షగా చూసుకున్నాడు. ఒంటి మీద చిన్న గీత గూడా పడ్లేదు. అంతా బానే వుంది. హమ్మయ్య అనుకున్నాడు.

‘నేను చెప్పేదాకా అక్కడ్నించి కదలకు' అంటూ మళ్లీ వెళ్లి మంచం మీద తన జాగాలో కూచుని మోకాళ్ల మీద తల పెట్టుకున్నాడు తండ్రి.

కాసేపు నిశ్శబ్దం గదిలో కాలరెత్తుకు తిరిగింది. ఎవరూ ఏమీ మాట్లాళ్లేదు. ఎవరి భంగిమలో వాళ్లు కంటిన్యూ అయ్యారు.

ఎవరో గది ముందుకి వచ్చారు. గది తలుపు తట్టారు. తల్లీ కూతురూ కొడుకూ తండ్రి వైపుకి చూశారు. తండ్రి భయపడుతూ మెడని గుండ్రంగా తిప్పుతూ గదంతా కలయచూశాడు.

అదో ఇల్లు. ఇంటిముందు గుంపులు గుంపులుగా జనం. పోలీసు జీపు వుంది. అంబులెన్స్ వుంది. హడావిడిగా తిరుగుతున్న బూటుకాళ్ల చప్పుడుంది. ఇంటి వైపుకి తోసుకువస్తున్న జనాన్ని వెనక్కి తరుముతున్న లాఠీలున్నాయి. అదో ఇంట్లో హాలుకి ఆనుకునివున్న గదిలో మంచానికి అడ్డంగా ఓ మగ శవం వుంది. మంచం మీదనించి కాళ్లు కిందకి జార్చి ఒక ఆడశవం వుంది. కింద నేలమీద ఒక అమ్మాయీ ఆమె కాళ్ల దగ్గర ఒక అబ్బాయీ శవాలైవున్నారు.

గదిలో బల్ల మీద కాగితాల్లో సగం సగం తినేసిన బిర్యానీ వుంది. ఆపక్కన సగమూ పావూ ఆయిపోయిన కూల్ డ్రింకు బాటిళ్లునయి ఆ పక్కనే పూర్తిగా ఖాళీ అయిన ఒక చిన్న సీసా కూడా వుంది. శవాల నోట్లోంచి బయటకు వచ్చిన నురగ చెంపలకు అంటుకుని వుంది. గది గోడలకు శవాల వాసన అంటుకుని చూసేవాళ్లకు వాంతి వొచ్చేట్టు అతుక్కుని వుంది.

ముక్కులకి కర్చీఫులడ్డం పెట్టుకున్న పోలీసులున్నారు. కెమెరాలు క్లిక్కుమంటున్నవి.

పూర్తిగా దివాలా తీశాడు అన్నారెవరో. పీకల్లోతు అప్పుల్లో వున్నాడు. ఈ మధ్య ఇంట్లోంచి ఎవరూ బయటకే రావడం లేదు. పాపం.. అయ్యో పాపం.. మొత్తం కుటుంబమంతా పాపం.. పాపం.. అంటున్నారెవరెవరెవరో.

ఎవరో గది ముందుకు వచ్చారు. గది తలుపుతట్టారు. తల్లీ కూతురూ కొడుకూ తండ్రి వైపుకి చూశారు. తండ్రి భయపడుతూ మెడని గుండ్రంగా తిప్పుతూ గదంతా కలియజేశాడు. తలుపు మీద దబదబమంటూ బాత్తున్నారు. విరగొట్టండి అన్నారెవరో ఒకరు.

తండ్రి మంచం దిగాడు సజ్జామీది అబ్బాయిని చేతుల్తో పట్టిలాటి భుజమ్మీద వేసుకున్నాడు. తల్లి అమ్మాయి చెయ్యి పట్టుకుని నిలబడింది. ఒకటీ రెండూ మూడు నలుగురూ ఇంటి ముందు వున్న మర్రి చెట్టు కిందకు చేరారు. తండ్రి అబ్బాయిని ఓ కొమ్మ మీదకి చేర్చి కిందకు వచ్చి కూతురునీ ఆ తర్వాత తల్లినీ చెట్టు మీదకి చేర్చాడు.

డాడీ మన ఇంటి ముందు జనం వున్నారు అన్నాడు అబ్బాయి. అంబులెన్స్ కూడా వుంది అంది అమ్మాయి.

మాట్లాడకుండా చూడండి అన్నాడు తండ్రి. ఒకటొకటిగా శవాల్ని బయటకు తెస్తున్నారు. అది డాడీ అన్నాడు అబ్బాయి. అదిగో మమ్మీ అన్నది అమ్మాయి. ఒరేయ్ నువ్వేరా అన్నాడు తండ్రి. అది నువ్వేనమ్మా అన్నది తల్లి.

ఇక మనకు ఆస్తులూ లేవు. అప్పులూ లేవు. ఏ టెన్షన్లూ లేవు అన్నాడు తండ్రి.

ఇక ఇల్లూ లేదు వాకిలీ లేదు. ఈ మర్రిచెట్టే మన ఇల్లు అన్నది తల్లి. స్కూలూ లేదు అన్నడబ్బాయి. ఫీజూ కట్టక్కర్లేదు అంది అమ్మాయి. (31 అక్టోబర్ దెయ్యాల దినం సందర్భంగా దెయ్యాకలు గ్రీటింగ్స్‌తో)

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about ghosts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X