• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్నయ్యలా కాకూడదంటే...: పవన్ కల్యాణ్ ఏం చేయాలి?

By Pratap
|

విజయవాడ: ఇటీవలి తిరుపతి సభతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావడం ఖాయమై పోయినట్లుగానే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన నెంబర్ వన్ కావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సి ఉంటుంది.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడడాన్నే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు తన వ్యూహంగా ఎంచుకున్నట్లు కనిపిస్తున్నారు. కానీ, పార్టీని ముందుకు నడిపించడానికి అదొక్కటే సరిపోదు. ఆయనను అభిమానులు మాత్రమే కాకుండా తటస్థులు కూడా ఇష్టపడడానికి కారణం ఆయన మాట్లాడే తీరు. లోపల ఏమీ లేకుండా మాట్లాడుతారనేది ఆయనకున్న పేరు.

పవన్ హిందీ పాఠాలు నేర్పుతారా...

మెగా హీరోలకు అభిమానుల సంఖ్య దండిగానే ఉంది. ఆ విషయం ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉన్నది. అయితే, ఎన్టీ రామారావు తర్వాత అంత మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా అధికారాన్ని ఎందుకు అందుకోలేకపోయారనే విషయంపై పెద్దగా విశ్లేషణ జరిగినట్లు లేదు.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానమైన, కీలకమైన అంశాలపై చిరంజీవి నిర్దిష్టమైన, కచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై గానీ, తెలంగాణ అంశంపై ఆయన కచ్చితంగా మాట్లాడలేదు. చిరంజీవి ఇమేజ్ మాత్రమే ప్రజారాజ్యం పార్టీని అధికారంలోకి తెస్తుందని ఆయన సలహాదారులు కూడా భావించినట్లున్నారు.

What Pawan Kayan has to do in politics?

అందుకే, ప్రజారాజ్యం పార్టీని ఓ రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా ఓ భారీ సినిమా విడుదల మాదిరిగా చేశారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపనకు ముందు జరిగిన వ్యవహారాలు, తిరుపతిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనపై చేసిన ప్రకటన అన్నీ ఓ భారీ సినిమా విడుదల మాదిరిగానే కనిపించింది.

ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితి వేరు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ మాత్రమే ఉంది. వామపక్షాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కాంగ్రెసు పార్టీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మరో ప్రత్యామ్నాయం లేదు. కానీ చిరంజీవి వచ్చేనాటికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు రెండు కూడా బలంగానే ఉన్నాయి. తెలంగాణ అంశం రగలుతోంది.

తెలంగాణలో పవన్ కల్యాణ్ సభలకు పెద్ద యెత్తున ప్రజలు వచ్చినప్పటికీ అంతగా ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు పడలేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి పెద్ద యెత్తున క్యాడర్ ఉన్నా ఆ పార్టీకి కూడా చుక్కెదురైంది. ఇందుకు ప్రధాన కారణం - పవన్ కల్యాణ్ అభిమానాన్ని, తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధతను తెలంగాణ అంశం పక్కకు నెట్టేసింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కూడా అదే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగానే ఉంది. కాంగ్రెసు పార్టీ, బిజెపిలు కూడా ఉన్నాయి. కాంగ్రెసు, బిజెపిలు తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బిజెపిలో ఇప్పటికే రాష్ట్రానికి చెందిన పలువురు బలమైన నాయకులున్నారు.

ప్రస్తుతం కాపు రిజర్వేషన్ల కల్పన, ప్రత్యేక హోదా అంశాలు రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వాటికి నిర్దిష్టమైన పరిష్కారాలు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఈ రెండు అంశాలపై పవన్ కల్యాన్ కచ్చితమైన నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. కాపు సామాజిక వర్గం ముద్ర పడకూడదనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటే ఫలితం మరో రకంగా ఉండవచ్చు.

కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం, దాసరి నారాయణ రావు వంటి నాయకులు ఏ మేరకు పవన్ కల్యాణ్‌కు సహకరిస్తారనేది చూడాల్సే ఉంది. ప్రత్యేక హోదాపై కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద సమరం సాగించాల్సిందే. ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు సెంటిమెంటుగా మారింది. అదే సమయంలో అమరావతి భూముల విషయంపై కూడా, అంటే అమరావతికి భూముల సేకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై కచ్చితమైన నిర్ణయం ప్రకటించడం అవసరం.

కేవలం ఆదర్శాలతో రాజకీయాల్లో రాణించలేమని, స్థానిక సమస్యలకు నిర్దిష్టమైన పరిష్కారాలను సూచించకుండా ముందుకు సాగలేమని జయప్రకాష్ నారాయణ లోకసత్తా పార్టీ ద్వారా రుజువైంది. స్థానిక, ప్రాంతీయ సమస్యలకు పరిష్కారాన్ని కచ్చితంగా చూపించాల్సిందే. వాటిపై కచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిందే.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల సమీకరణాలు బలంగా పనిచేస్తాయని, అవి ప్రాంతాలను బట్టి కూడా పనిచేస్తాయని, వాటి మధ్య సమన్వయం కుదర్చడం ఎలాగనే విషయంపై కూడా దృష్టి పెట్టాలి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య ఎటువంటి సమన్వయాన్ని పవన్ కల్యాణ్ తన విధానాల ద్వారా సాధిస్తారనేది అతి ముఖ్యమైన విషయంగా ఉంటుంది.

కేవలం ఇమేజ్, తన నిజాయితీ మాత్రమే రాజకీయాల్లో తనకు తిరుగులేని స్థానాన్ని సాధించిపెడుతుందని పవన్ కల్యాణ్ నమ్మితే ఇబ్బందులు ఎదురు కావచ్చు.

- కె నిశాంత్

English summary
Jana Sena chief power star Pawan Kalyan has to act stratigically in Andhra Pradesh politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X