వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్వంటీ 20: ధోనీ సత్తా?

By Staff
|
Google Oneindia TeluguNews

Mahendra Singh Dhoni
ఇంగ్లాండులో జరుగుతున్న ట్వంటీ 20 ప్రపంచ కప్ ను భారత్ తిరిగి నిలబెట్టుకుంటుందా అనేదే సర్వత్రా ఆసక్తి రేపుతున్న విషయం. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు 2007లో తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్ గెలుచుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఈ కప్ ను గెలుచుకోవడానికి ముందు భారత జట్టు ట్వంటీ 20 క్రికెట్ లో అసాధారణమైన ప్రతిభను చూపిన సంఘటన ఒకటి కూడా లేదు. పైగా, అప్పటికి భారత్ ఒక ట్వంటీ 20 మ్యాచ్ మాత్రమే ఆడింది. ఆ ప్రపంచ కప్ నాటికి భారత జట్టుపై మన దేశ క్రీడాభిమానులకు కూడా నమ్మకం లేదు. అయితే ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ ను ఫైనల్లో ఓడించి ధోనీ సేన జోహెన్స్ బర్గ్ లో ప్రపంచ కప్ ను అందుకుంది.

ఆ విజయంతో భారత క్రికెట్ ముఖ చిత్రమే మారిపోయింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి స్టార్స్ పై ఆధారపడడమే సంప్రదాయంగా పెట్టుకున్న భారత్ దాని నుంచి బయటపడింది. మేటి క్రీడాకారులు ఆడకపోతే ఏమీ చేయలేమనే మానసిక స్థితి నుంచి భారత జట్టు బయట పడింది. సంక్షోభ సమయంలోనూ ప్రశాంతంగా ఆడే కెప్టెన్ ధోనీ, గౌతం గంభీర్ లాంటి క్రీడాకారులు పురుడు పోసుకున్నారు. గంభీర్ నిలకడగా, వేగంగా పరుగులు తీసే ఓపెనరుగా ముందుకు వస్తే, వివాదరహితమైన కెప్టెన్ గా ధోనీ ముందుకు వచ్చాడు.

రెండేళ్ల తర్వాత ఇప్పుడడు డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్ గా భారత జట్టు ట్వంటీ 20 ప్రపంచ కప్ ఆడడానికి సిద్ధమైంది. ప్రపంచ జట్లలో భారత్ మేటి జట్టుగా ముందుకు వచ్చిందనేది నిస్సందేహం. అయితే ప్రపంచ కప్ ను నిలబెట్టుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. భారత ఓపెనింగ్ జోడీ వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ ప్రత్యర్థి జట్టు బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇది భారత్ కు బాగా కలిసి వస్తున్న అంశం. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. సమయానుకూలంగా ఆడే సురేష్ రైనా, రోహిత్ శర్మ వంటి బ్యాట్స్ మెన్ లభించడం అదృష్టమే. ధోనీ తక్కువేమీ కాదు. యువరాజ్ సింగ్ బ్యాట్ తో దడదడలాడిస్తాడు. అయితే యువరాజ్ సింగ్ పై పూర్తి నమ్మకాన్ని ఉంచలేం. ఇటీవలి కాలంలో బౌలింగ్ లోనూ రైనా, రోహిత్ శర్మ రాణిస్తుండడం భారత్ కు మరింత కలిసి వచ్చే అంశంగా మారింది. యూసుఫ్ పఠాన్ భారత జట్టుకు ఐపియల్ అందించిన వరం.

బ్యాటింగ్ లైనప్ లో ఏడో స్థానంలో దిగే ఆటగాళ్లు కూడా ఇర్ఫాన్ పఠాన్, రవీంద్ర జడేజా వంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. అవసరమైతే హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లు కూడా పరుగుల వరద పారించగలరు. బౌలింగ్ లోనూ భారత్ ఎంతో పటిష్టంగా ఉంది. పేస్, స్పిన్ కలగలిసి పటిష్టమైన బౌలింగ్ టీం ఉంది. జహీర్ ఖాన్ కు ఇషాంత్ శర్మ వంటి వారు మంచి మద్దతిస్తున్నారు. ఇంగ్లాండు మైదానాలు భారత బౌలర్లకు అనుకూలిస్తాయి కూడా. స్వింగ్ తో భారత బౌలర్లు తమ ప్రతిభను చాటడానికి ఇంగ్లాండు వాతావరణం అనుకూలంగా ఉంది. స్పిన్ బౌలింగ్ లో హర్భజన్ సింగ్ కు ప్రజ్ఞాన్ ఓజా తోడు కావడం వల్ల బలంగా తయారైంది.

యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ ఐపియల్ లో హ్యాట్రిక్ సాధించి బౌలింగ్ లో తమ సత్తా చాటుకున్నారు. అవసరమైతే బౌలింగులో వీరు ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మెన్ నడ్డివిరచగలరనేది రుజువైంది. యూసుఫ్ పఠాన్, సెహ్వాగ్ కూడా బౌలింగ్ లో తమ ప్రతిభను చాటుకోగలరు. వికెట్ కీపర్ గా, కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ తన ఆలోచనలకు పదును పెట్టగలడు. ఈ స్థితిలో భారత్ ప్రపంచ కప్ ను నిలబెట్టుకోలేక పోతే అది భారత్ చేసే పొరపాట్ల వల్లనే అయి ఉంటుంది తప్ప ప్రత్యర్థుల బలం వల్ల కాదనేది నమ్మకంగా చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X