డిజిటల్ లావాదేవీలే ఏలిన వారి ఎత్తు.. ఏటీఎంలో లభించని క్యాష్

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలోని ఖైరతాబాద్‌ కూడలిలో ఏడు బ్యాంకు శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖ ఆవరణలో సొంత ఏటీఎం ఉంది. ప్రతిచోటా నగదు లేదన్న బోర్డులే. నాంపల్లి కోర్టు ఆవరణకు ఆనుకుని ఐదు ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో అప్పుడప్పుడు ఒకదాంట్లో మాత్రమే నగదు నింపుతున్నారు. పెట్టిన నగదు గంటలోనే ఖాళీ అవుతోంది. మిగతా ఏటీఎంల్లో నగదు నింపి నెల రోజులవుతోంది. హైదరాబాద్‌ నగర పరిధిలో ఓ ప్రభుత్వ రంగ బ్యాంకుకు పరిమిత సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ ఏజెన్సీతో ఉన్న ఒప్పందం నవీకరించకపోవడంతో దాదాపు 40 శాతం ఏటీఎంలు మూతపడ్డాయి.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలోనే ఏటీఎంల్లో నగదు కొరత సమస్య ఉంటే రాష్ట్రంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల పరిస్థితేమిటని ఆర్థిక నిపుణులు సందేహిస్తున్నారు. ఆయా ఏటీఎం ఏజెన్సీలు సంబంధిత ఏటీఎంలలో నగదు నింపడం మానేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) బలవంతంగా ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నాయి. రద్దయిన నోట్ల స్థానే కొత్తనోట్లు పూర్తిగా చలామణీలోకి రాకపోవడం కూడా నగదు కొరతకు కారణమన్న అభిప్రాయం కూడా ఉన్నది.

చెక్కుల లావాదేవీల వల్లే తగ్గుతున్న నగదు నిల్వలు

చెక్కుల లావాదేవీల వల్లే తగ్గుతున్న నగదు నిల్వలు

ఏటీఎంలు వచ్చాక బ్యాంకు ఖాతాదారులు నగదు తీసుకోవడానికి బ్యాంకులకెళ్లడం మానేశారు. గత నవంబర్‌లో చలామణీలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేయడంతో ఏటీఎంలు మూతపడడం ప్రారంభమైంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం దాదాపు సద్దుమణిగినా ఏటీఎంలు పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. తెలంగాణవ్యాప్తంగా దాదాపు 9వేల ఏటీఎంలు ఉండగా వాటిలో 70 శాతం ఇప్పటికీ పనిచేయడం లేదు. కొన్నింటిని నిరంతరం మూసివేసి పెట్టగా, మరికొన్ని ఏటీఎంల్లో పెట్టిన నగదు గంటలోనే ఖాళీ అవుతోంది. ఆర్బీఐ నుంచి పూర్తిస్థాయిలో నగదు లభ్యత లేకపోవడం, రద్దయిన నోట్ల విలువకు సమానమైన నగదు మార్కెట్‌లోకి రాకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. చేతిలో ఉన్న నగదు బ్యాంకులో వేస్తే తిరిగి సమయానికి చేతికందుతుందా? అని ఖాతాదారులు సందేహిస్తున్నారు. రూ.2 లక్షలకు మించి నగదు జమ చేస్తున్నవారి వివరాలను బ్యాంకు అధికారులు ఆదాయం పన్ను శాఖకు అందిస్తున్నారు. దీంతో ప్రజలు బ్యాంకుల్లో నగదు జమచేయడం కన్నా ఇంట్లోనే పెట్టుకోవడం మేలని భావిస్తున్నారు. ‘గతంలో మా బ్యాంకులో వ్యాపారులు రోజూ రూ.20 లక్షల వరకు జమ చేసేవారు. కానీ ప్రస్తుతం చెక్కుల రూపంలో లావాదేవీలు జరగడంతో నగదు నిల్వలు తగ్గిపోతున్నాయి' అని హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు మేనేజర్‌ తెలిపారు.

ఏటీఎంల స్థానే సీడీఎంలు

ఏటీఎంల స్థానే సీడీఎంలు

రాష్ట్రవ్యాప్తంగా ఏ ఏటీఎం చూసినా నోక్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బ్యాంకుకు వెళితే నగదు నిల్వల లభ్యత మేరకు చెల్లింపులు చేస్తున్నారు. పట్టణాల్లో రద్దీ ఎక్కువగా ఉండే శాఖల్లో రోజుకు రూ.30 వేలకు మించి ఇవ్వడం లేదు. వేతనాలు ఇచ్చే రోజుల్లో (ప్రతి నెలా 28 నుంచి మరుసటి నెల 10వ తేదీ వరకు) రూ.10 వేలతో సర్దుతున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని బ్యాంకుల్లో పెద్దమొత్తంలో నగదు ఇస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల్లో నగదు లేక, ఏటీఎంలు తెరవక పరిస్థితి దారుణంగా ఉంటున్నది. ఏటీఎంల నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు బ్యాంకులు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాయి. ఏటీఎంల సంఖ్యను చాలావరకు తగ్గించి, ఉన్నవాటి వద్ద సీడీఎం (నగదు జమ యంత్రాలు) పెట్టాలని యోచిస్తున్నాయి. సీడీఎంలో ఖాతాదారు నగదు వేస్తే అతని ఖాతాలో నగదు జమవుతుంది. కొంత రుసుము కూడా బ్యాంకులు వసూలు చేస్తాయి. ఎవరైనా నగదు తీసుకోవాలంటే ఆ యంత్రాన్నే ఏటీఎంలా వినియోగించి తీసుకోవాలి. సీడీఎంలో ఎవరూ నగదు జమ చేయకుంటే, నగదు తీసుకోవడానికి అవకాశం ఉండదు. భద్రతాసిబ్బందిని నియమించడానికి బదులుగా మైక్రో కెమెరాలు ఏర్పాటు చేస్తారు.

ఏటీఎంల మూసివేతతో నిర్వహణ చార్జీల పెంపు

ఏటీఎంల మూసివేతతో నిర్వహణ చార్జీల పెంపు

ప్రజలను బలవంతంగా డిజిటల్‌ లావాదేవీల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అఖిల భారత ఆంధ్రాబ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ తెలిపారు.. నిర్వహణ భారం పేరిట దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్యను 2.3 లక్షల నుంచి లక్షకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇలాగైతే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నగదు కష్టాలు రెట్టింపవుతాయని రవీంద్రనాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఏటీఎంలను మూసివేస్తే బ్యాంకు నిర్వహణ ఛార్జీలు మరింత పెరుగుతాయని, లావాదేవీలకు ప్రతిసారీ బ్యాంకులకు వస్తే ప్రజలకు విలువైన సమయం వృథా అవుతుందని రవీంద్రనాథ్ తెలిపారు.

ఏటీఎంల మూసివేతకే ప్రభుత్వ నిర్ణయం

ఏటీఎంల మూసివేతకే ప్రభుత్వ నిర్ణయం

పెద్ద నోట్ల రద్దు తర్వాత సరిపడా నగదు లేకపోవడం, ప్రజల్ని డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లించేందుకు ఏటీఎంలను మూసివేయడానికి బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే నిర్వహణ ఛార్జీలు తగ్గించుకోవాలని, నష్టాలు వచ్చే ప్రభుత్వరంగ బ్యాంకు శాఖలను మూసివేయాలని ఆర్థికశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు శాఖల ఆవరణల్లోని ఏటీఎం భద్రతా సిబ్బందిని తొలగించాలని ఆయా బ్యాంకు మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏజెన్సీలు ఏటీఎంల భద్రతా సిబ్బందిని తొలగించడం మొదలు పెట్టాయి. ఈ చర్యలన్నీ ఏటీఎంల మూసివేతలో భాగమేనని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana State suffers with cash crunch because till today ATM's running dry while union government has expected to forcebly apply digital transactions.
Please Wait while comments are loading...