ఇదీ డ్రాగన్ వ్యూహం: మార్కెట్‌పై ఆధిపత్యానికే సిల్క్ రోడ్డు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

బీజింగ్/ న్యూఢిల్లీ: అంతర్గత పారిశ్రామిక, ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడటంతోపాటు అంతర్జాతీయ వాణిజ్యంలో తనదైన ముద్ర కోసం చైనా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నది. అందులో భాగంగా వివిధ దేశాలను కలుపుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మీదుగా చైనా - పాక్ ఎకనమిక్ కారిడార్ పేరిట వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీవోఆర్) ప్రాజెక్టును చేపట్టింది.

ట్రిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై జరుగుతున్న సదస్సుకు భారత్, జపాన్ దూరంగా ఉన్నాయి. అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్న భారత్.. అంతర్జాతీయ సమాజాన్ని అనుసంధానించే ప్రాజెక్టుపై నిర్వహించిన సదస్సుకు గైర్హాజరు కావడంతో ఏకాకిగా మారిందని అంతర్జాతీయ విమర్శకులు భావిస్తున్నారు.

పీవోకే మీదుగా చైనా చేపట్టిన ఈ ప్రాజెక్టు తమ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగకరమని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. తొలుత ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన అమెరికా పూర్తిగా యూ - టర్న్ తీసుకుని సదస్సులో పాల్గొనడం కొసమెరుపు.

ఇదీ భారత్, జపాన్ ప్రత్యామ్నాయాలు

ఓబీఓఆర్ ప్రాజెక్టులో భాగస్వామిగా మారేందుకు తిరస్కరించిన భారత్.. పార్టనర్‌షిప్ ఫర్ క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరిట సొంతంగా బెల్ట్ అండ్ రోడ్డు నిర్మాణం ప్రారంభించింది. పాకిస్థాన్ మినహా నేపాల్ బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక మధ్య సాగే ఈ ప్రాజెక్టులో దక్షిణాసియా దేశాలతో అనుసంధానం కావడం భారత్‌కు తేలికవుతుంది. ఇక 150 మిలియన్ డాలర్ల వ్యయంతో హిందూ, పసిఫిక్, యూరప్ ప్రాంతాలను కలుపుతూ జపాన్ చేపట్టిన ప్రాజెక్టులోనూ చురుకైన పాత్ర పోషిస్తున్న భారత్‌కు పలు ప్రయోజనాలు ఉన్నాయి.

ఓబీవోఆర్ అంటే ఏమిటి?

చైనాలోని ఈశాన్య ప్రాంతంలోని జియాన్ నుంచి ఉరుమి మీదుగా కజకిస్థాన్ లోని అల్మాటీ.. ఉజ్బెకిస్థాన్, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను తాకుతూ టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ను ముద్దాడుతూ రష్యా రాజధాని మాస్కో మీదుగా పోలండ్ నుంచి నెదర్లాండ్స్ లోని రొట్టర్ డామ్‌కు చేరుకుంటుందీ భూమార్గం ఓబీవోఆర్. భూభాగంపై అత్యంత పొడవైందీ ఈ మార్గం.

మరో సిల్క్ రోడ్డు సముద్ర జలాల మీదుగా సాగుతుంది. రొట్టర్ డామ్ నుంచి ఇటలీలోని వెనిసె మీదుగా గ్రీస్‌లోని ఏథేన్స్ గుండా కెన్యా రాజధాని నైరోబికి చేరుకుంటుంది. నైరోబి నుంచి నేరుగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నుంచి శ్రీలంక రాజధాని కొలంబో ద్వారా మలేషియా రాజధాని కౌలాలంపూర్ మీదుగా ఇండోనేషియా రాజధాని జకార్తాను తాకుతూ దక్షిణ చైనా సముద్రం మీదుగా థాయిలాండ్ లోని లావోస్‌ను ఆనుకుని తిరిగి చైనాలోని జాన్ జియాంగ్‌, ఫుజౌహోతో ముగుస్తుంది.

Why One Belt One Road is China's compulsion, how India can meet the challenge

పాత సిల్క్ రోడ్డు ప్లస్ చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్.. బీజింగ్ నుంచి జియాన్ మీదుగా మంగోలియా, కజకిస్థాన్, పాకిస్థాన్, కోల్ కతా, ఇరాన్, టర్కీ, గ్రీక్ దేశాల మీదుగా ఇటలీ వరకు వెళుతుంది. ఏథేన్స్ నుంచి నైరోబీ ద్వారా హిందూ మహా సముద్రం నుంచి కొలంబో తర్వాత కోల్‌కతా, మయన్మార్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాల మీదుగా చైనాలోని జాన్ జియాంగ్‌తో ముగుస్తుంది. 68 దేశాల భాగస్వామ్యంతో సాగే ఈ ప్రాజెక్టు జయప్రదమైతే ప్రపంచ మార్కెట్‌కు చైనా పరిశ్రమలు సన్నిహితం కావడానికి వీలు కలుగుతుంది. ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు సాగితే అమెరికా సూపర్ పవర్ స్థానాన్ని కొట్టేసినా ఆశ్చర్యం లేదు.

ప్రధాన సవాళ్లు ఇవి

ఓబీవోఆర్ ప్రాజెక్టుతో పలుదేశాలకు పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నది. హింస, ఉగ్రవాదం సహా రాజకీయ అస్థిరత వంటి సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. చైనా మిత్రపక్షం పాకిస్థాన్ పరిధిలోని సీపీఈసీ నిర్మాణంపై 13 వేల మందికి పైగా చైనా సైనికుల పర్యవేక్షణ సాగుతున్నది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాక్‌లోని గిరిజన ప్రాంతాలన్నీ ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్నాయి. పలు మధ్యాసియా, ఆఫిక్రా దేశాల్లో భారీస్థాయిలో అవినీతి, ఆర్థిక సుస్థిరత వంటి సవాళ్లు దీనికి ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి.

చైనా అంతర్గత సమస్యలివి

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులను పరిగణనలోకి తీసుకున్నందునే చైనా ఈ ఓబీఓఆర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఉత్పాదక రంగంలో అవసరాన్ని మించి పెట్టుబడులు పెట్టడానికి తోడు చైనాలో ఉక్కు, అల్యూమినియం, సిమెంట్ పరిశ్రమలు మిగులు ఉత్పత్తితో బాధపడుతున్నాయి.

ఇటీవల అంతర్జాతీయంగా చైనా ఉత్పత్తులకు ఆదరణ తగ్గింది. చైనా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా తిరోగమనంలో పయనిస్తున్నది. దేశీయంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 2016లో 12 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా, భవిష్యత్‌లో భారీగా ఉద్యోగాల్లో కోత విధించే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఓబీవోఆర్ పూర్తయితే చైనా కార్మికులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. భారత్ సహా ఇతర దేశాలన్నీ స్థానిక ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారత ప్రధాని మోదీ 2014 'మేకిన్ ఇండియా' నినాదమిస్తే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'ఫస్ట్ అమెరికన్' పాలసీని ముందుకు తెచ్చారు. ఫ్రాన్స్, బ్రెజిల్ దేశాలు కూడా దేశీయ పరిశ్రమల బలోపేతంపై ద్రుష్టి సారించాయి. ఇక ఈయూ నుంచి బ్రిటన్ 'బ్రెగ్జిట్' చైనాను మరిన్ని సమస్యల్లోకి నెట్టివేస్తున్నది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
International observers may interpret India's decision to stay away from One Belt One Road summit as a step towards isolating itself from a global connectivity project.
Please Wait while comments are loading...