బాబు వైఖరితో కిరణ్ ధీమా

ఎవరైనా అవిశ్వాసం పెట్టినా సమస్యలేదన్నట్లుగా ఉంది. అవిశ్వాసం పెడితేనే మరింత మంచిదన్నట్లుగా ప్రభుత్వం యోచిస్తుంది. అవిశ్వాసం పెట్టడం ద్వారా విప్‌లు జారీ చేసి నెగ్గవచ్చు. అయితే ప్రభుత్వం ఎలాగు గట్టెక్కుతుంది, కానీ ఇక తమ వారెవరూ, బయటివారెవరు అనే అంశం తేలిపోతుందని, అప్పుడు వారిపై వేటు వేయడానికి కూడా ఉపయోగపడుతుందని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.
టిడిపి, టీఆర్ఎస్ అవిశ్వాస, సవాళ్లు, ప్రతిసవాళ్లను అధికార పార్టీ గమనిస్తోంది. అవిశ్వాస పరీక్షకు దిగితే ఇప్పటిదాకా తమ ప్రభుత్వంపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఉన్న అనుమానాలన్నీ నివృత్తి అవుతాయని కూడా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస పరీక్ష పెట్టనున్నట్లు టిఆర్ఎస్ ప్రకటిస్తే, భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు పలికింది.
అయితే జగన్ వర్గం ఎవరో చెబితే తామే అవిశ్వాసం పెడతామని, టిఆర్ఎస్ మద్దతు ఇస్తే చాలని తెలంగాణ టిడిపి అంటోంది. తెరాసకు 11 మంది, భాజపాకు ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. అసలు అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ స్వీకరించాలంటే కనీసం 30 మంది శాసనసభ్యుల సంతకాలు అవసరం కావటంతో టిఆర్ఎస్ ఇదే అవకాశంగా తెలంగాణ టిడిపి నేతలు మద్దతు ఇవ్వాలని సవాల్ చేస్తుంది. మద్దతు ఇవ్వకుంటే కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్లేనని చెబుతోంది.
అయితే మాజీ పార్లెమెంటు సభ్యుడు వైఎస్ జగన్ వర్గం అవిశ్వానికి సుముఖంగా ఉంటే టిఆర్ఎస్, బిజెపి కాకుండా మరో 17 మంది సంతకాలు చేసి గవర్నర్‌కు ఇస్తేనే గవర్నర్ ఆమోదం పొందుతుంది, లేదంటే తిరస్కరణకు గురవుతుంది. ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు దిగాలని జగన్ వర్గం ఎమ్మెల్యేలు కొందరు గతంలో సవాల్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ శిబిరం ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
ఎందుకంటే సొంత పార్టీకి చెందిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటీసు ఇవ్వడం పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలోని స్వచ్ఛదంగా పదవిని వదులుకోవడమనే క్లాజు పరిధిలోకొస్తుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే గత ఏడాది కర్ణాటకలో భాజపా అసమ్మతి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటింగుకు రాకముందే అనర్హత వేటు పడింది. ఇక్కడా అదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఒకవేళ స్పీకర్ ఈ కారణంతో అనర్హులుగా ప్రకటించకున్నా అవిశ్వాసతీర్మానంపై కాంగ్రెస్ విప్ జారీ చేస్తుంది.
దానికి కట్టుబడి జగన్ వర్గం సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కచ్చితంగా ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయాల్సిందే. కాదంటే విప్ ఉల్లంఘన కింద అనర్హతకు గురవుతారు. ఇప్పటికే ఒక్కొక్కొరుగా ఎమ్మెల్యేలు జారుకుంటున్న పరిస్థితుల్లో జగన్ శిబిరం అవిశ్వాస పరీక్ష విషయంలో ఏమాత్రం రిస్కు తీసుకునేందుకు సిద్ధంగా లేదని సమాచారం. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా శాసనసభ్వత్వాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఒకవేళ అవిశ్వాస పరీక్ష అంటూ జరిగితే కాంగ్రెస్‌కు చెందిన 155 మంది ఎమ్మెల్యేలతోపాటు ఆపార్టీ అనుబంధ సభ్యులుగా ఉన్న మరో ముగ్గురు స్వతంత్రసభ్యులు కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు.
ప్రరాపాకు 18, మజ్లిస్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్‌కే. ఈ రకంగా ప్రభుత్వానికి 183 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని ప్రభుత్వం భావిస్తుంది. పీఆర్పీ, కాంగ్రెస్ నుండి కొందరు వెళ్లినా వారిపై వేటు ద్వారా ప్రభుత్వాన్ని గట్టెక్కించవచ్చునని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.