వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బేజారవుతున్న గులాబీయులు: కక్కలేక మింగలేక కారు కే'డర్‌'

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆడబడుచులకు 'బతుకమ్మ' పండుగ సందర్భంగా పంపిణీ చేసిన 'చీర'లు సర్కార్ వారికి అనుకున్నంత పేరు దక్కలేదు. పథకం అమలులో తేడాతో ఎక్కడో తేడా జరుగుతున్నదన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కలుగుతోంది. రూ.224లతో చీర పంపిణీ చేస్తే.. దాని ధర కేవలం రూ.50 లోపేనని మహిళలు చెప్తున్నారు. మధ్య దళారులు మధ్యలోనే స్వాహా చేశారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చివరకు గులాబీ శ్రేణుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సాక్షాత్ సీఎం - టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిమాన సీనియర్ నాయకుడు కూడా ఆందోళన చెందుతున్నారు. పార్టీ, ప్రభుత్వ పనితీరులో ఎక్కడో తేడా జరుగుతున్నదని సందేహిస్తున్నారు. 'దీన్ని మా పెద్దలు ఎందుకు గ్రహించడంలేదో సమజైతలేదు. జనంలో పరిస్థితి ఎట్ల ఉన్నదో చెబ్దామని ఆరాటపడుతున్నం. కానీ, ఆ సౌలత్‌ మాకు యాడున్నది? పార్టీలో అసలా వాతావరణమే లేదు. జై అంటే జై అనుడే తప్ప.. మేం చేయగలిగేది ఏమీ లేదు' అని పార్టీ నేత బాధపడ్డారు.

''మా ఊర్లె 80 గొర్లు సచ్చినై. ఇంక పోతనే ఉన్నై. ఎంత తండ్లాడినా పట్టించుకునెటోళ్లే లేరు. లబ్ధిదారులు నారాజైతున్నరు. నేను జెప్పినట్టు కాకుండా, మీ అంతల మీరే రాయుండ్రి. గొర్రెల పెంపకందారులు నష్టపోవద్దన్నదే నా ఉద్దేశం..'' అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక గ్రామ ప్రజాప్రతినిధి 'నవతెలంగాణ' ప్రత్యేక ప్రతినిధితో జరిపిన ఫోన్‌ సంభాషణలో భాగమిది. ఇసొంటి ఉదాహ రణలు తెలంగాణ రాష్ట్రంలో ఏమూలన విన్నా చూసినా బొచ్చెడున్నై. అధికార పార్టీలో భావ ప్రకటన భయం గుప్పిట విలవిల్లాడుతున్నది. పలుచోట్ల కక్కలేక.. మింగలేక..సొంత పార్టీ కే'డర్‌'మంటున్నది. లోటుపాట్లపై చెబితే కంటు అవుతామన్న ఆంక్షల ముండ్లు గులాబీయుల గుండెల్ని డామినేట్‌ చేస్తున్నాయి.

 Fear in TRS leader

సదరు ఊరిలో గొర్రెల పథకంలో విషాదం గూడు కట్టుకొన్నది. దానిపై కేస్‌ స్టడీకి బాధితులు ధైర్యంగా ముం దుకు రానంతటి ప్రచ్ఛన్న ఆంక్షల వలయం సృష్టిం పబడింది. ఆ పల్లెకు 2 నెలల కిందట 1,500లకు పైగా జీవాలు వచ్చాయి. 6 శాతం ఇప్పటికే జీవం విడిచాయి. వాటి బీమా సంగతి ఎటూ తేలడంలేదు. కడమ వాటిని కాపాడుకునేందుకు పోషకులు నానా తంటాలు పడాల్సి వస్తున్నది. వెటర్నరీ మందుల దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. 'మా అసొంటోళ్లం ఏమో కానీ, ఇతరులైతే బాగానే లాభపడుతున్నారు..' అని ఈ పథకాన్ని దగ్గరగా గమనించిన ఆ మండలంలోని ఒక లబ్ధిదారుడు తెలిపారు.

సంపద సముపార్జన సాధ్యమేనా..!

ఏదో ఒక చోట అట్లాంటి సమస్యలు సహజమని, దాన్నిబట్టి పథకం మొత్తానికి ఆపాదించడం కరెక్టు కాదని వాదించే వారున్నారు. కానీ, ఫీల్డులో చూడబోతే ఎవరు సంతోషంగా ఉన్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సర్కారుకు ప్రతిష్టాత్మకమైన గొర్రెల స్కీం ఆలనా పాలనా 'అంగట్లో అవ్వా అంటే..ఎవరి బిడ్డవు నీవు..' అన్న సామెతలా మారుతోంది. ఇక అక్రమాల సంగతి సరేసరి! తాజాగా పాత నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం, మోతె మండలాల నుంచి 50 గొర్రెల యూనిట్లను తిరిగి ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు తరలిస్తున్నట్టు సాక్షాత్తూ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఉప్పందింది. ఆయన ఆదేశాలతో ఆ ప్రయత్నానికి అధికారులు కళ్లెం వేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. రాష్ట్రంలో ఈ స్కీంతో ఏకంగా రూ. 25 వేల కోట్ల సంపద సాధిస్తామని సీఎం చంద్రశేఖరరావు స్వయంగా చెప్పారు. ఆయన నిర్దేశించిన కార్యాచరణ, అంచనాల ప్రకారం..పథకానికి రూ.5 వేల కోట్లు రెండేండ్లలో వెచ్చించాలి. కోటిన్నర జీవాలు కొనాలి. వాటిల్లో ఒక్కో యూనిట్‌కు గొర్రెపోతు (పొట్టేలు) ఉండాలి. ప్రస్తుతం ఒక కోటి గొర్రెలు తెలంగాణలో ఉన్నాయి. రాయితీపై సర్కారు ఇప్పించేవి కలుపుకొంటే..అవి 2.50 కోట్లు అవుతాయి. రెండు సంవత్సరాల్లో మూడు ఈతలు ఈనుతాయి. (ఒక్కో గొర్రెకు మూడు కాన్పులు-మూడు పిల్లలు) ఈ లెక్కన జీవాల సంఖ్య 7.50 కోట్లకు పెరుగుతుంది. వీటిల్లో రెండు కోట్ల జీవాలు ఉంచుకొని, కడమ 5 కోట్ల గొర్రెలను అమ్ముకున్నా..ఒక్కోదానికి కమ్‌సేకమ్‌ రూ.5 వేలు వస్తే..ఆ సొమ్ము పాతిక వేల కోట్లు! ఇగ..ఎంత ధనమో చూడండి అంటూ ఊరించే లెక్కల్ని సిద్దిపేట జిల్లా కొండపాకలో లాభితులకు గొర్రెల్ని అందజేసిన సందర్భంలో కండ్లకు కట్టారు సీఎం కేసీఆర్‌. ఇదంతా నెరవేరి తీరాలంటే..లబ్దిదారుల స్థాయిలో సునిశిత పరిశీలన, లోతైన సమీక్ష అవసరం.

 Fear in TRS leader

కంట్లె పెట్టుకుంటరు..కంటైతమని ఊకున్నా..
'మా దగ్గరి చుట్టాల ఇంట్ల పెండ్లి జరిగింది. కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు జేశ్నం. నడిమిట్ల ఉన్నోళ్లు పైన ఖర్చులకని మూడు వేలు అడిగిండ్రు. అప్పుడే అనిపించింది అసొంటోళ్లను పట్టీయాలని. కానీ, తర్వాత కంట్లె పెట్టుకుంటరనీ, లీడర్లతోని కంటైతమని గమ్మున ఊకున్న. బ్యారమాడి రెండు వేలు ఇచ్చినంకనే పథకం చెక్కును ఇప్పించిండ్రు..' అంటూ పాలమూరు ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్‌ అభిమాని ఒకరు లంచగొండ్ల ఆధిపత్యాన్ని తెలియజేశారు. ''సీఎం కేసీఆర్‌ మంచి స్కీంలనే తెచ్చిండ్రు. ఇంక తాపకోటి తెస్తనే ఉన్నరు. కనీ, లోటుపాట్లు, లోపాల గురించి మాత్రం శ్రద్ధ చూపుతలేనట్టుంది. ఆధారాలతోసహా చూపించి చర్చిద్దామని ఉంది. స్థానికంగా మా పార్టీలోనే రాజకీయంగా పడ'నోళ్లు' అడ్డుపుల్లలేశి, పెద్దోళ్లను మాకు దూరం జేస్తరు.

అట్ల ఆగమవుడు ఎందుకని ప్రేక్షకపాత్ర పోషిస్తున్నా..' అని పూర్వ కరీంనగర్‌ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ లీడర్‌ విచారపడ్డారు. ఏ పథకమైనా సమర్థవంతంగా అమలు చేయాలి. వాటి ఫలాలను లక్షిత ప్రజలకు చేర్చి..ఆ మీదట లాభసాటి చేసినప్పుడే సార్థకత ఉంటుందన్నారు. కనీసం పార్టీలో అంతర్గతంగానైనా పరిస్థితి ఇదీ..అని వివరించే వెసులుబాటు లేకపోవడమైతే మరీ విషాదకరమని ఫికరయ్యారు. మరిక..పాలక ప్రభువులు వాస్తవాలను గ్రహించేదెప్పుడో!

English summary
Fear in Karimnagar TRS leader
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X