జూ. ఎన్టీఆర్ ప్రభావం చాలా: బాలయ్య
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపిందని ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారనే విమర్శలను ఆయన ఖండించారు. సినీహీరో బాలకృష్ణ ఆదివారంనాడు కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. కడప, చిత్తూరు జిల్లాల పర్యటనకు వెళుతున్న ఆయన వెళ్లేముందు ఆసుపత్రికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఎన్టీఆర్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. తాతగారి ఆశీస్సులు, అభిమానుల ఆదరణే ఆయనను కాపాడిందన్నారు.
ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఈరోజు పలువురు ప్రముఖులు పరామర్శించారు. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, ఈటీవీ ఎండీ సుమన్, నిర్మాత అశ్వినీదత్, నటుడు కైకాల సత్యనారాయణ, దర్శకరత్న దాసరి నారాయణరావు తదితరులు పరామర్శించారు. ఆయన తల్లికి ధైర్యం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.