ఖమ్మం: చర్చలకు ప్రభుత్వ దూతగా నియమించిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితో తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావు చర్చలు జరపబోరని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కె.టి. రామారావు స్పష్టం చేశారు. ఇది కెసిఆర్ ఆరోగ్య సమస్య కాదని, తెలంగాణ సమస్య అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్రమే జోక్యం చేసుకుని చర్చలకు ఆహ్వానించాలని ఆయన డిమాండ్ చేశారు.
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కోసం రాజీనామాకు సిద్ధపడిన మంత్రులు తెలంగాణపై మాట్లాడకపోవడం ఏమిటని ఆయన అడిగారు. ఖమ్మంలో కెసిఆర్ కు రక్షణ లేదని ఆయన అన్నారు. కలెక్టర్ తో సహా అధికారులంతా ఆంధ్రావారే ఉన్నారని, అందువల్ల కెసిఆర్ కు భద్రత తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. కెసిఆర్ తో దీక్ష విరమింపజేయడానికి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిని ప్రభుత్వం దూతగా నియమించిన విషయం తెలిసిందే. తాము ఇచ్చే హామీ ఏదీ ఉండదని మంత్రి ఇప్పటికే చెప్పారు.