రాష్ట్ర రాజకీయ నాయకులు దద్దమ్మలు: జెపి

ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోందని, ఈ పరిస్థితికి శాంతియుత పరిష్కారం కనుగొనలేకపోతే నిజమైన ప్రజాస్వామ్యానికి మనం అర్హులం కాదని స్పష్టం చేశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ తదితరులను కలుసుకున్న జేపీ... హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత శనివారం విలేఖరులతో మాట్లాడారు.
"వెనకబడిన దేశాలైన రువాండా, భివాండీల్లో తెగలు, జాతుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా 8 లక్షలమంది చనిపోయారు. రాష్ట్రాన్ని కూడా అటువంటి దారుణమైన పరిస్థితుల్లోకి దిగజార్చాలన్న దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెకిలి రాజకీయాలు చేసే మూర్ఖులు, ఉన్మాదులు ఇందుకు ప్రయత్నిస్తున్నారు. మన బతుకులను పణంగా పెట్టిన రాజకీయ పార్టీలు ఈ చర్యలకు పాల్పడుతున్నాయి. గత పదేళ్లకన్నా ఎక్కువగా ఇప్పుడు హింస జరుగుతోంది. రాష్ట్రాన్ని విభజించడం, సమైక్యంగా ఉంచడం అనే రెండు ప్రక్రియలూ ఒకేసారి జరగవు. ఇందుకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అదే శాంతియుత పరిష్కారం. ఈ సంక్షోభాన్ని నివారించే దిశగా కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే ఓ ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నాను. పెద్దలతో మాట్లాడిన తర్వాతే ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నా" అని జెపి అన్నారు.