హైదరాబాద్: అధిష్ఠానంపై, సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీనియర్ కాంగ్రెసు నాయకుడు జి. వెంకటస్వామి (కాకా) వెనక్కి తగ్గారు. 'నేను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు. గాంధీ కుటుంబానికి విశ్వాస పాత్రుడిని' అని తన విధేయత ప్రకటించారు. "మనస్తాపానికి గురై ఉద్రేకంలోనే నేను అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాను. కావాలని కాదు'' అని తెలిపారు. తన తపనంతా తెలంగాణ కోసమేనని, చిరంజీవిని రక్షణ మంత్రి ఆంటోనీ స్వయంగా కలవడంతో ఉద్వేగంతో నియంత్రణ లేకుండా మాట్లాడానని వివరణ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కాకా కుమారులు మాజీ మంత్రి వినోద్, ఎంపీ వివేక్‌లు ఆయనను కలిశారు. దాదాపు రెండు గంటలకు పైగా మంతనాలు జరిపారు. ఆ తర్వాతే కాకా తన 'వివరణ' ప్రకటన పంపారు. "నేను నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. గాంధీ కుటుంబానికి విధేయుడిని. తెలంగాణపై వివరణ ఇచ్చేందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది'' అని తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరి, విద్యార్థులు ఉద్యమిస్తూ, బలిదానాలు చేసుకుంటున్న సమయంలో సమైక్య రాష్ట్రం కోరుకునే చిరంజీవి ఇంటికి రక్షణ శాఖ మంత్రి ఏకే అంటోనీ వెళ్లడంతో దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. ఆంటోనీకి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఈ విషయాలను వివరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి నేను సోనియాగాంధీని కలసి ఈ విషయం చెప్పాలని అనుకున్నానని, కానీ, ఆమె అపాయింట్‌మెంట్ దొరకలేదని, తెలంగాణ సాధించాలన్న లక్ష్యంతో నియంత్రణ తప్పి, ఉద్రేకానికి లోనై ఆవిధంగా మాట్లాడానని, ఇదే విషయాన్ని మంగళవారం సాయంత్రమే ఒక ప్రైవేటు టీవీ చానెల్‌లో చెప్పానని కాకా తన ప్రకటనలో తెలిపారు. అంతకుముందు కాకా తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంగళవారం నాటి 'కాక'ను కొనసాగించారు. సోనియా దిగిపోవాలన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, తెలంగాణ ఇచ్చినట్లయితే తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటానని అంతకు ముందు చెప్పిన విషయం తెలిసిందే.