తెలంగాణపై మరో కమిటీ, సీమాంధ్ర నేతలతో ప్రణబ్ భేటీ

తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఈ కమిటీ వేసి సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఇది పార్టీకి చెందిన మూడు ప్రాంతాల నాయకుల మధ్య ఏకాభిప్రాయం సాధన కోసమే పని చేయవచ్చు. పార్టీపరంగా ఏకాభిప్రాయం సాధించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలో సంప్రదింపులు జరుపుతారు. యుపిఎలో కూడా తెలంగాణపై చర్చ జరుగుతుంది. తమకు ఇప్పుడు అత్యంత ప్రధానమైన అంశం తెలంగాణ అని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సలహాదారు అన్నారు. దీన్నిబట్టి తక్షణంగా సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా, సీమాంధ్ర నాయకులు కావూరి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, కెవిపి రామచందర్ రావు, శైలజనానాథ్, జెసి దివాకర్ రెడ్డి తదితరులు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. గులాం నబీ ఆజాద్ తెలంగాణపై సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ సంప్రదింపులు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అవి
కొనసాగుతాయని ప్రణబ్ ముఖర్జీ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ భేటీ ఎప్పుడో జరగాల్సిందని తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాల వల్ల ఆలస్యం జరిగిందని కావూరి సాంబశివ రావు చెప్పారు. తమ ప్రాంత ప్రతినిధులకు ఈ నెల 12, 13వ తేదీల్లో వారి అభిప్రాయాలు వెల్లడించడానికి సమయం ఇవ్వాలని కోరామని, అందుకు ప్రణబ్ ముఖర్జీ అంగీకరించారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల సంభవించే నష్టాలను తాము ప్రణబ్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు.