హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై పరోక్షంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో నేతలంతా దొరలు అయితే కార్యకర్తలు మాత్రం బలహీన వర్గాల వారు ఉన్నారని అన్నారు. దళితుల బాధ పట్టని దొరలు తెలంగాణ వచ్చాక దళితులకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తామని చెబితే నమ్మె పరిస్థితి లేదన్నారు. దళితుడు అయిన దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి అయితే దొరలు ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. అగ్రవర్ణ కులస్తుడికి ఎజి పదవి వస్తే న్యాయం అవుతుంది. దళితుడికి డిప్యూటీ వస్తే అన్యాయమవుతుందా అని ప్రశ్నించారు. కేంద్రం ఎస్సీ వర్గీకరణ పక్కన పెట్టి తెలంగాణ ప్రకటించవద్దన్నారు. ఎమ్మార్పీఎస్ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదన్నారు.
అయితే తెలంగాణ ప్రకటించి తమ జీవితాలను దొరల చేతిలో బలి పెట్టవద్దని అన్నారు. వర్గీకరణ అంశం తేలాక తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం అన్ని పార్టీలు ఢిల్లీ వెళ్లాలన్నారు. తెలంగాణ వచ్చాక దొరల దగ్గర జీతానికి పని చేసేందుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. మా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రకటించాలన్నారు. అంబేడ్కర్ దారిలో నడుస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ దళితులు దొరల చేతిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రిజర్వేషన్లలో బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల వాటా తేలాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా దాడులు అన్ని దళితులపైనే జరిగాయన్నారు. అగ్రవర్ణాలపైన దాడులు ఎక్కడా జరగలేదన్నారు.
MRPS president Manda Krsiha fired at TRS president K Chandrasekhar Rao today. He demanded central goverment that divide andhra pradesh after sc reservations.
Story first published: Wednesday, July 6, 2011, 17:32 [IST]