చిల్లిగవ్వ లేదు : ఖజానా ఖాళీ : బిల్లుల చెల్లింపు నిలిపివేత : హామీల అమలు ఎలా..!
ఏపి ఖజానా ఖాళీ అయింది. చిల్లి గవ్వ లేదు. ఎన్నికల వేళ హామీలు..చెల్లింపులు వేల కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల జీతా లు చెల్లించిన తరువాత ఏమైనా మిగిలితేనే చెల్లింపులు చేయాలని ఆదేశం. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పధకాలతో మార్చి నెలాఖరు వరకు ఎలా నెట్టుకు రావాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఖజనా పై మోయలేని భారం..
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏపి ప్రభుత్వం అనేక వరాలను ప్రకటిస్తోంది. లెక్కకు మించిన హామీలిస్తోంది. ఇవన్నీ అమలు చేయటం ఎలాగో తెలియక ఆర్దిక శాఖ అధికారులు దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికే ఓడిలో ఉన్న ఏపి ప్రభు త్వం రోజు వారి ఖర్చుల కోసం నిధుల అన్వేషణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువనేస్తం..ఆదరణ లాంటి పెద్ద సంక్షేమ పధకాలను డిసెంబర్ నుండి అమలు చేస్తుండటంతో ఖర్చు భారంగా మారింది. గత బడ్జెట్‌లో అంచనా వేసి న విధంగా కేంద్ర నిధులు రాకపోవటం తో ఇతర మార్గాల పై ఏపి ఆర్దిక శాఖ దృష్టి పెట్టింది. ప్రస్తుత ఆర్దిక సంవత్స రం ముగియాలంటే మరో రెండు నెలలు గడవాలి. దీనికి తోడు ఎన్నికల సమయం కావటంతో మార్చి నెలాఖరు వరకు వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్దం కాని పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెల్లింపులు నిలిపివేయాలని ఏపి ఆర్దిక శాఖ అదేశించింది. మరో రెండు రోజుల్లో జీతాలు చెల్లించాల్సి ఉండటంతో వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజా గా నిర్ణయించిన ఉద్యోగుల డిఏ బకాయిలు సైతం ఏప్రిల్ తరువాత చెల్లించేలా ఉత్తర్వులు ఇచ్చారు.

ఎన్నికల వరాల అమలు ఎలా..
ఏపి అర్దిక పరిస్థితి దిగజారుతోంది. మార్చి నెలాఖరు వరకు అందుబాటులో ఉన్న నిధులతో నడిపిస్తామని అధికారులు చెబుతున్నా..వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఒకటో తేదీన ప్రభుత్వోద్యోగులకు వేతనాలు చెల్లించిన తర్వా త డబ్బులు మిగిలితే కొన్ని బిల్లులు చెల్లించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 4, 5 విడతల రైతు రుణమాఫీ కోసం రూ. 8,000 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.2,000 కోట్లు, పెండింగ్ బిల్లులకు రూ.2,500 కోట్లు, ఈ 2 నెలలపాటు పెరిగిన పిం ఛన్ల కోసం రూ.1800 కోట్లు, డ్వాక్రా మహిళలకు రూ.9,500 కోట్లు అవసరంకాగా.. వీటిని మూడు వాయిదాల్లో చెల్లించాలని భావిస్తున్నారు. సబ్సిడీల రూపంలో రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక, వీటితో పాటుగా రాష్ట్రంలో నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లులు కోట్లాది రూపాయలు నిలిచిపోయాయి. దీంతో..కేంద్రం నుండి పెండింగ్ లో ఉన్న నిధుల విడుదల కోసం ఒత్తిడి పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడున్న పరిస్థితలను అధిగమించేందుకు అర్దిక శాఖ అధికారులు ప్రతీ రోజు ముఖ్యమంత్రితో సమావేశం అవుతున్నారు. దీంతో..ఇప్పుడు ఎన్నికల హమీలను ఎలా అమలు చేస్తారనే చర్చ మొదలైంది.