కార్యకర్తలను కాపాడుకుంటాం.. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటాం: చంద్రబాబు
కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కార్యకర్తలనే కాదు, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నారాయణ అనే వ్యక్తి తమ పార్టీ కాకపోయినా ఆ కుటుంబానికి అండగా నిలిచామని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడడం మంచిది కాదని సీఎం జగన్‌ను పరోక్షంగా హెచ్చరించారు.
కొందరు పోలీసులు, పోలీసు ఉన్నతాధికారులు వైసీపీ నేతలు చెప్పినట్లు నడుచుకోవడం మానుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్స్ చేసే స్థాయిలో కొందరు పోలీసులు ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. అధికారం ఎప్పుడూ ఒకరికే సొంతం కాదని గుర్తుచేశారు.

ఇటు చంద్రబాబునాయుడిని తెలుగు సినీ నటుడు రాజ్ కుమార్ కలిశారు. మంగళగిరిలో గల పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వీరిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన రాజ్ కుమార్ అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో టీడీపీదే విజయమని రాజ్ కుమార్ తెలిపారు. 1996 నుంచి తాను టీడీపీ కోసం ప్రచారం చేస్తున్నానని వివరించారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ అయ్యానని వివరించారు. టీడీపీ అభిమానిగా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశానని వెల్లడించారు.
ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు లేవు. కానీ టీడీపీ, వైసీపీ మాత్రం ఎన్నికలు జరిగితే ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చిస్తున్నాయి. ఆ రెండు పార్టీల వ్యుహాలు అలానే ఉన్నాయి..