మాల్ ప్రాక్టీస్ అక్కడే మొదలైంది, కక్షసాధింపు లేదు: సజ్జల, పెద్దిరెడ్డి
టెన్త్ పేపర్ లీక్ ఘటనపై మాజీ మంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పందించారు. నారాయణ విద్యా సంస్థల పర్యవేక్షణలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని సజ్జల అన్నారు. మాల్ ప్రాక్టీస్ కల్చర్ మొదలైందే నారాయణ విద్యా సంస్థల నుంచి అని విరుచుకుపడ్డారు. అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే నారాయణ పోలీసులకు దొరికారని తెలిపారు.

ఆధారాలతోనే అరెస్ట్
ఎలాంటి కక్ష సాధింపు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వాస్తవాలతో పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. విచారణలో అంతా తేలిందని స్పష్టం చేశారు. నారాయణ సంస్థల్లో ఈ ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ జరిగిందని వివరించారు. పూర్తి విచారణ జరిగిన తర్వాతే నారాయణను అరెస్ట్ చేశారని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కావాలనే చేశారని అంటున్నారని దుయ్యబట్టారు.

ధృవీకరణ
టెన్త్ ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టీస్ కేసులో నారాయణను అరెస్టు చేశామని చిత్తూరు ఎస్పీ కార్యాలయం తెలిపింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ లో నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో ఇప్పటికే 60 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ కేసుతోపాటు, అమరావతి రాజధాని భూముల కేసులో కూడా నారాయణ పై ఆరోపణలు వచ్చాయి. నారాయణతోపాటు ఆయన సతీమణికి కూడా అతని విద్యాసంస్థల్లో కీలక పాత్ర ఉంది. మాల్ ప్రాక్టీస్ నిరోదక చట్టం 408 ఐపిసి కింద కేసులు నమోదు చేశారు.

కక్షతోనే..
నారాయణ అరెస్ట్ వ్యవహారం ఇవాళ కాక రేపింది. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని వారు అంటున్నారు. వరసగా ఒక్కో నేతను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసే పనులను జనం చూస్తున్నారని పేర్కొన్నారు. తగిన సమయంలో బుద్దిచెబుతారని కామెంట్ చేశారు.