పొలం కోసం కిరాతకం: తమ్ముడి తలను తెగనరికిన సోదరులు

Subscribe to Oneindia Telugu

గుంటూరు: జిల్లాలోని కారంపూడి మండలంలోని పేటసన్నెగండ్ల శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొలం కోసం జరిగిన గొడవ కారణంగా ఓ యువకుడిని అతని దాయాదులు తల నరికి కిరాతకంగా హత్య చేశారు. నిందితుల బారినుంచి మృతుడి తండ్రి, చెల్లెలు తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పేటసన్నెగండ్ల గ్రామానికి చెందిన చప్పిడి చిన్న వెంకటేశ్వర్లు, అతడి అన్న పెద్ద వెంకటేశ్వర్లు కుటుంబాల మధ్య పొలం వివాదం నడుస్తోంది. దీనికి సంబంధించి కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని మంగళవారం ఉదయం చిన్న వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు వెంకటనర్సయ్య(25), కుమార్తె ఆదిలక్ష్మి సదరు వివాదాస్పద భూమికి వెళ్లి కందులు విత్తేందుకు ప్రయత్నించారు.

ఈ విషయం తెలిసి పెద్ద వెంకటేశ్వర్లు కుమారులు అంజి, శంకర్‌, నరసింహారావు, అయ్యప్పస్వామిలు ట్రాక్టరుపై అక్కడికి వచ్చి వారితో ఘర్షణకు దిగారు. దీంతో చిన్న వెంకటేశ్వర్లు తన ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటి ముఖం పట్టబోతుండగా వేట కొడవళ్లతో గాయపర్చారు.

A youth allegedly killed for field

ఈ హఠాత్పరిణామం నుంచి వెంటనే తేరుకున్న ఆయన అక్కడి నుంచి పారిపోగా కుమారుడు, కుమార్తె ద్విచక్ర వాహనంపై పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితులు తమతో తెచ్చుకున్న కారాన్ని కళ్లల్లో కొట్టడంతో కిందపడిపోయారు. వెంటనే వారు వెంకటనర్సయ్య చేతులు, శరీర భాగాలపై వేటకొడవళ్లతో నరికారు.

ఆదిలక్ష్మి ప్రతిఘటించబోగా దాడి చేయడంతో పరుగుపెట్టింది. అనంతరం సదరు దాయాదులు బంధుత్వాన్ని కూడా మరచి అతి కిరాతకంగా వెంకటనర్సయ్య తలను మొండెం నుంచి వేరు చేశారు. ఆపై తాము వచ్చిన ట్రాక్టరులోనే వెళ్లిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్న వెంకటేశ్వర్లు కారంపూడి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఏఎస్సై ఫైంబర్‌ ఆయనను గురజాల ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై నారాయణస్వామి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేయడంతో గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ సుబ్బారావు, దాచేపల్లి ఎస్సై ఆనంద్‌ కూడా తరలివచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వెంకటనర్సయ్యను హత్య చేసిన నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. వారిని పట్టుకుని కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.
పొలం కోసం ఘర్షణ: పగే ప్రాణం తీసింది

తల్లి నుంచి సంక్రమించిన పొలాన్ని తానే సాగు చేసుకోవాలని చిన్న వెంకటేశ్వర్లు తన కుమారుడి సహకారంతో కోర్టును ఆశ్రయించాడు. పొలం తమకే చెందుతుందంటూ ఆయన అన్న కుమారులూ కోర్టుకెక్కారు. ఇలా రెండు కుటుంబాల మధ్య వివాదం నలుగుతూనే ఉంది. అయితే నిందితుల అన్న లింగయ్య రెండేళ్ల క్రితం హత్యకు గురైన ఘటనలో వెంకటనర్సయ్య హస్తం ఉందని అతడిపై పగ పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వెంకటనర్సయ్య హత్యతో మిన్నంటిన రోదనలు

పొలంలో విత్తనాలు ఎదపెట్టేందుకు వెళ్లొస్తామని చెప్పిన వెంకటనర్సయ్య అదే పొలంలో దారుణహత్యకు గురికావడంతో అతడి తల్లి సైదమ్మ కన్నీరుమున్నీరుగా విలపిపించింది. ఒక్కగానొక్క కుమారుడ్ని అల్లారుముద్దుగా పెంచుకున్నామని రోదించింది. వెంకటనర్సయ్య ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు విలపిస్తున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది.

కాగా, హతుడు వెంకటనర్సయ్యకు మూడేళ్ల క్రితమే గ్రామానికి చెందిన సౌజన్యతో వివాహం కాగా, 15 నెలల కుమారుడు ఉన్నాడు. తన భర్త హత్య విషయం తెలుసుకున్న సౌజన్యను ఓదార్చటం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో వారి కుటుంబంతోపాటు గ్రామంలోనూ విషాదఛాయలు నెలకొన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A youth allegedly killed for field in Guntur district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి