ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య: పరీక్షలకు అనుమతి ఇవ్వలేదని: హాజరు తక్కువ కారణంతో..!
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోని ఇడుపుల పాయలో ఒక విద్యార్ధి విషాదకర పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాజరు శాతం తక్కువగా ఉందంటూ అధికారులు పరీక్షలకు అనుమతించకపోవటంతో ఆత్యహత్యకు చేసుకున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం తీరు కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బిడ్డను కోల్పోయిన తల్లితండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కడప జిల్లా మైదుకూరు గణపతినగర్‌కు చెందిన రైతు శివలింగారెడ్డి కుమారుడు ఎ.మంజునాథరెడ్డి (19) కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొద్ది నెలలుగా తరగతులకు సక్రమంగా హాజరుకాలేదు. తల్లిదండ్రుల విజ్ఞప్తితో తిరిగి యాజమాన్యం కళాశాలలో కొనసాగించారు.
హాజరు శాతం తక్కువగా ఉందంటూ..
ఇక..పరీక్షలు ఈ నెల 25వ తేదీ ప్రారంభమయ్యాయి. హాజరుశాతం తక్కువ కావడంతో అధికారులు మంజునాథరెడ్డిని పరీక్షలకు అనుమతించక పోవడంతో మనస్తాపానికి గురైనాడు. శనివారం హాస్టల్‌గదిలో ఫ్యానుకు బెడ్‌షీట్‌తో ఉరివేసుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే క్యాంప్‌సలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. తండ్రి శివలింగారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హాజరుశాతం తగ్గితే ప్రస్తుతం పరీక్షలకు అనుమతి ఇవ్వకపోయినా, 15 రోజుల్లో మళ్లీ పరీక్షలకు అనుమతి ఇస్తామని, కానీ ఇంతలోనే విద్యార్థి ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం బాధాకరమని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సుదర్శన్‌రావు.. ఏవో కృష్ణమోహన్ చెబుతున్నారు.

తాను పరీక్షలు రాకలేకపోయాననే..
అందరితో కలివిడిగా ఉండే మంజునాథ్ సహచర స్నేహితులకు రెండు రోజుల క్రితం విందు ఇచ్చాడని తెలిసింది. ట్రిపుల్ ఐటీలో ఇక చదవలేనని, బయటకు వెళ్లి డిగ్రీలో చేరతానని, అందుకే పార్టీ ఇస్తున్నానని విద్యార్థులకు చెప్పినట్లు సమాచారం. అయితే, తాను ఉండే గదిలోని సహచర మిత్రులు పరీక్షలకు వెళ్లటం..తాను వెళ్లలేకపోవటంతో అవమానంగా భావించినట్లుగా తెలుస్తోంది. దీనిని తట్టుకోలేకనే మంజునాధ రెడ్డి ఆత్యహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడి యాజమన్యం తీరు కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో.. క్యాంపస్ లో విషాదఛాయలు నెలకొని ఉన్నాయి.