ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కన్నెర్ర: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమన్లు: విచారణకు హాజరు
అమరావతి: ఏపీ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి కన్నెర్ర చేసింది. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడం పట్ల వివరణ కోరింది. విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు సమన్లను జారీ చేసింది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన వర్చువల్ విధానంలో సుప్రీంకోర్టు విచారణకు హాజరు కానున్నారు. బిహార్ ప్రభుత్వంపైనా సుప్రీంకోర్టు ఇదే తరహా ఆగ్రహావేశాలను వ్యక్త పరిచింది.

పరిహారం చెల్లించాలంటూ ఆదేశించినా..
ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా సమన్లు ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లింపుల్లో ఏపీ, బిహార్ ప్రభుత్వాలు జాప్యం చేయడం- సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణమైంది. కోవిడ్ వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ ఇదివరకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు సూచించింది.

2 గంటలకు వర్చువల్ విచారణ..
ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని మంజూరు చేయడంలో జాప్యం చేశాయంటూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. అత్యున్నత న్యాయస్థానం వాటిని విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది. సమన్లను జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ విధానంలో విచారణకు హాజరు కావాలంటూ ఏపీ, బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. వారు చట్టానికి అతీతులేమీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తప్పనిసరిగా ఆర్థిక సాయం..
కోవిడ్ వల్ల, ఆ తరువాత తలెత్తిన అనారోగ్య సమస్యల వల్ల మరణించిన వారి కుటుంబీకులకు నాలుగు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ సుప్రీంకోర్టు గత ఏడాది జూన్ 30వ తేదీన జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ అథారిటీని ఆదేశించింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలనీ సూచించింది. ఎక్స్‌గ్రేషియా మొత్తం ఎంత ఉండాలనే విషయాన్ని నిర్ధారించుకునే స్వేచ్ఛను సుప్రీంకోర్టు ఎన్డీఎంఏ నిర్ణయానికే వదిలి వేసింది.

50 వేల ఎక్స్‌గ్రేషియో..
అదే సమయంలో- కరోనా మృతుల కుటుంబాలకు 50,000 రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియోను చెల్లించడానికి సిఫారసు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. కోవిడ్ వల్ల మరణించిన కుటుంబాల వారికి 50,000 రూపాయలను చెల్లించడానికి అంగీకరించింది. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్‌లో ఈ అఫిడవిట్‌ను ఆమోదించింది.
Recommended Video

జాప్యానికి గల కారణాలపై..
ఈ మొత్తాన్ని మృతుల కుటుంబీకులకు అందజేయడంలో ఏపీ, బిహార్ ప్రభుత్వాలు జాప్యం చేశాయంటూ పిటీషన్లు దాఖలయ్యాయి. దీన్ని విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం.. ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సమన్లు ఇచ్చింది. జాప్యం చేయడానికి గల కారణాలను వివరించాలని ఆదేశించింది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ విధానంలో విచారణకు హాజరు కావాలని సూచించింది.












Click it and Unblock the Notifications