ప్రపంచానికే ఆయనో స్ఫూర్తి పాఠం: 'ఆనంద్' మాష్టారు భారత ఆణిముత్యం..

Subscribe to Oneindia Telugu

చదువొక్కటే మనిషిని వెలిగిస్తుంది. నేపథ్యం చదువుకు గుదిబండలా మారినప్పుడు.. సంకల్పం మాత్రమే చీకట్లను బద్దలుకొడుతుంది. చేజారిన కలను తిరిగి స్వప్నించడానికి.. ఆనందకుమార్ అనే మాస్టారు అదే సంకల్పంతో బయలుదేరాడు.

ప్రతిభ, పేదరికం సమాంతరంగా సహవాసం చేయడం ఎంత కష్టసాధ్యమో అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. ఆ పాఠం అతని గమ్యాన్నే మార్చేసింది. ఒక్కడి 'కల'లో ఏముంది?.. అలాంటి వందల కలల్ని వెలిగిస్తే కదా! అసలైన ఆనందం అన్న ఆలోచనకు వచ్చాడు.

ఆ ఆలోచనే ఓ లెక్కల మాస్టారును ఈరోజు ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకెళ్లింది. పేదరికం తన కెరీర్ లెక్క తప్పేలా చేసినా.. ప్రతిభతో ప్రపంచమే తనవైపు చూసేలా చేసుకున్న మేధ ఆయన సొంతం. ఆయన సృష్టించిన 'సూపర్-30' ప్రపంచం మొత్తానికి ఇప్పుడో ఆదర్శం.

ఎవరీ ఆనందకుమార్?:

ఎవరీ ఆనందకుమార్?:

1973, జనవరి 1న పాట్నాలోని ఓ పేద కుటుంబంలో ఆనందకుమార్ జన్మించారు. ఆయన తండ్రి పోస్టాఫీసులో ఒక సాదాసీదా క్లర్క్‌. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో హిందీ మీడియంలోనే ఆనందకుమార్ చదువు కొనసాగింది. చిన్నప్పటి నుంచి ఆయనకు గణితం అంటే ఎనలేని ఆసక్తి.

ఎంత చిక్కుతో కూడిన లెక్కనైనా.. దాన్ని సాధించేవరకు వెనక్కి తగ్గేవాడు కాదు. అలా లెక్కల్లో అందరి చేత జీనియస్ అనిపించుకున్నారు. డిగ్రీకి వచ్చేనాటికి 'నంబర్ థియరీ' మీద ఇంగ్లాండులోని కొన్ని విద్యాసంస్థలకు జర్నల్స్ కూడా రాశారు. అలా ఆరోజుల్లోనే ఆయన ప్రతిభ ప్రపంచానికి పరిచయమైంది.

ఆనందకుమార్ గురువులంతా ఆయన ప్రతిభను చూసి అభినందించకుండా ఉండకపోయేవారు. ఎప్పటికైనా మ్యాథమాటిక్స్ లో ఆయన్ను ప్రపంచం గుర్తిస్తుందని వారు బలంగా నమ్మారు.

1994లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ పిలుపు:

1994లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ పిలుపు:

ఆనందకుమార్ ప్రతిభకు 1994లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లభించింది. కానీ అప్పటికే తండ్రి మరణించడం.. కుటుంబం తీవ్ర దుర్భిక్షంలో ఉండటం ఆయన్ను అటు వైపు వెళ్లకుండా అడ్డుకున్నాయి.

దానికి తోడు ఆయన చదువు కోసం సహాయం చేయడానికి ఏ ఒక్క దాత ముందుకు రాలేదు. ఆఖరికి ఆంగ్ల దినపత్రిక హిందూలో ఆయన గురించి అచ్చయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ సమయంలో ఆనందకుమార్ తీవ్రంగా కలత చెందినప్పటికీ.. తనకంటూ మరో గమ్యాన్ని ఏర్పరుచుకోవడంలో ఆయన సఫలమయ్యారు.

సూపర్ 30 సృష్టికర్త:

సూపర్ 30 సృష్టికర్త:

ఉన్నత చదువులకు బ్రేక్ పడ్డాక.. ఆనందకుమార్ ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు. అలా చేసి ఉంటే.. ఏ ప్రభుత్వ కార్యాలయంలోను.. లేక మరో సంస్థలోను గుమాస్తాగా మిగిలిపోయేవారేమో. కానీ ఆయన ఆలోచన వేరు. తనలాగా పేదరికంలో మగ్గిపోతూ ఉన్నత చదువులు చదవాలనుకునేవారికి అండగా నిలవాలనుకున్నాడు.

ఈ ఆలోచన నుంచే 'సూపర్ 30'(రామనుజం స్కూల్ ఆఫ్ మ్యాథమేటిక్స్) పుట్టుకొచ్చింది. అత్యంత పేదరికంలో మగ్గిపోతున్న 30మంది యువతీ యువకులను ఎంపిక చేసి వారికి ఐఐటీ-జేఈఈ కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వారందిరిని పాట్నాకు తీసుకుని వచ్చి.. ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించి మరీ వారికి చదువు చెప్పాడు.

అలా ఆయన స్థాపించిన సంస్థ నేటికి అత్యంత విజయవంతంగా ముందుకెళ్తోంది. వందకు వంద శాతం ఫలితాలు సాధించడమంటే ఏంటో ఎవరైనా సరే ఆయన్ను చూసి నేర్చుకోవాల్సిందే.

450మందిలో 396మంది ఐఐటీకి:

450మందిలో 396మంది ఐఐటీకి:

సూపర్-30 స్థాపించిన 15ఏళ్లలో సుమారు 450మంది పేద విద్యార్థులను ఆనందకుమార్ ట్రైన్ చేశారు. ఇందులో 396మంది ఐఐటీల్లో చదివేందుకు అర్హత సాధించారు. ఆయన బ్యాచ్ లలో వందకు వంద శాతం ఫలితాలు సాధించినవి కూడా ఉన్నాయి.

వరుసగా 15ఏళ్ల నుంచి ఐఐటీ జేఈఈ కోచింగ్ లో ఆయన సృష్టిస్తున్న ప్రభంజనం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేసింది. లక్షలు పోసి మరీ ఐఐటీ కోచింగ్ లు తీసుకుంటున్న విద్యార్థులు.. ఆనందకుమార్ ను, ఆయన విద్యార్థుల ప్రతిభను చూసి ఇప్పటికీ విస్మయం చెందుతూనే ఉన్నారు.

కుయుక్తులు:

కుయుక్తులు:

ఆనందకుమార్ ప్రభంజనం మొదలవగానే పాట్నాలోని చాలా కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లు.. ఎలాగైనా ఆయన్ను అడ్డుకోవాలని ప్రయత్నించాయి. సూపర్-30 కాన్సెప్టును కాపీ కొట్టే ప్రయత్నం చేశాయి.

అలా 'రాజా సూపర్ 30', 'గయా సూపర్ 30', 'ఒరిజినల్ సూపర్ 30' వంటి కాపీ క్యాట్ కోచింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. అంతేనా! ఆనందకుమార్ ఇనిస్టిట్యూట్ నుంచి ర్యాంకులు సాధించనవాళ్లను సైతం తమ విద్యార్థులుగా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాయి. ఆయనతో కలిసి పనిచేసిన అధ్యాపకులను తమ సంస్థల్లోకి లాగే ప్రయత్నం చేశాయి.

అలా ఏకంగా ఓ అధ్యాపకుడిని హతమార్చడం అప్పట్లో పెనుసంచలనానికి దారి తీసింది. అప్పటి నుంచి బీహార్ సర్కార్ ఆనందకుమార్‌కు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. సీఎం నితీష్ కుమార్ ఆనందకుమార్‌కు ఇద్దరు బాడీగార్డులను నియమించారు.

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు:

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు:

ఆనందకుమార్ స్థాపించిన సూపర్-30కేవలం బీహార్ కే పరిమితం కాలేదు. ఒడిశా వంటి రాష్ట్రాల్లోను మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తోంది. చదువుకోవడం గగనం అనుకునే విద్యార్థులను ఏకంగా భారత అత్యున్నత విద్యా నిలయాలైన ఐఐటీల్లోకి సాగనంపుతోంది.

ఆనందకుమార్ ప్రతిభ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు. డిస్కవరీ వంటి చానెల్స్ ఆయనపై డాక్యుమెంటరీలు కూడా ప్రసారం చేశాయి. ప్రఖ్యాత 'టైమ్ మేగజైన్' ఆనంద్ ఇనిస్టిట్యూట్ ను ఆసియాలోనే బెస్ట్ స్కూల్ గా గుర్తించింది. న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు ఆయన ప్రతిభను, సేవలను కొనియాడుతూ కథనాలు వెలువరించాయి. బిబిసి సైతం ఆయనపై ఓ టీవి కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

బాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ హీరోగా ఆనందకుమార్ జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు కూడా అప్పట్లో జరిగాయి. ఇందుకోసం ఆనందకుమార్ వద్ద అమితాబ్ సూచనలు కూడా తీసుకున్నారు. ప్రకాష్ ఝా దర్శకత్వంలో 'అరక్షణ్' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

మొత్తం మీద మిణుకు మిణుకుమనే జీవితం నుంచి.. నిత్యం ప్రకాశించే సూర్యుడిలా ఆనందకుమార్ ఇప్పుడు వెలిగిపోతున్నారు. ఆయన ప్రతిభ, ఆయన కన్న కలలు ఎంతోమంది మట్టిబిడ్డలను అత్యున్నత స్థాయి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. సంకల్పం ఉంటే జీవితం ఎప్పటికీ లెక్క తప్పదని నిరూపించిన ఈ లెక్కల మాష్టారుకు ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bollywood superstar Amitabh Bachchan wanted to learn teaching skills of mathamatics for his flick "Aarakshan''. So, director Praksh Jha had no other name in his mind other than a legend in the field of mathamatics- the super 30 fame, Anand Kumar.
Please Wait while comments are loading...