వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశారాం బాపు: రేప్ కేసులు, వేల కోట్ల ఆస్తులు, ఖరీదైన లాయర్లు... ఎవరు ఈ వివాదాస్పద బాబా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సంత్ ఆశారాం

ఇప్పటికే ఒక రేప్ కేసులో జీవితకాల కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బాపు, మరొక రేప్ కేసులో దోషిగా తేలారు.

కొన్నేళ్ల కిందట తన ఆశ్రమంలో ఉన్న ఒక యువతిని ఆశారాం బాపు రేప్ చేశారని, గుజరాత్‌లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు తేల్చింది. నేడు కోర్టు ఆయనకు శిక్షను విధించనుంది.

ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆశారాం భార్యతోపాటు మరో ఆరుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376 (సి) (అత్యాచారం), సెక్షన్ 377 (అసహజ లైంగిక నేరం), బాధితురాలిని అక్రమంగా నిర్బంధించినందడం వంటి నేరాల కింద ఆశారామ్‌ను కోర్టు దోషిగా తేల్చింది.

సెషన్ కోర్టు తీర్పును గుజరాత్ హై కోర్టులో సవాలు చేస్తామని ఆశారాం తరపు న్యాయవాది సీబీ గుప్తా అన్నారు.

సంత్ ఆశారాం

ఈ కేసు ఏంటి?

ఆశారాం బాపు తనను రేప్ చేశాడంటూ 2013లో సూరత్‌కు చెందిన ఒక మహిళ కేసు పెట్టారు. తనను అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. ఈ కేసులో మరొక ఏడుగురిని కూడా నిందితులుగా చేర్చారు.

విచారణ సమయంలో వారిలో ఒకరు మరణించారు.

2014 జులైలో పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఎఫ్‌ఐఆర్ ప్రకారం 2001 నుంచి 2006 మధ్య అహ్మదాబాద్ నగర శివార్లలోని తన ఆశ్రమంలో బాధితురాలిపై ఆశారం అనేకసార్లు అత్యాచారం చేశారు.

అప్పటికే ఆయన మరొక రేప్ కేసులో జైలులో ఉన్నారు. ఒక మైనర్ బాలికన్ రేప్ చేశారని తేల్చిన జోధ్‌పూర్ కోర్టు, 2018 ఏప్రిల్ 25న జీవితకాల కారాగారశిక్ష విధించింది.

సంత్ ఆశారాం

ఈ ఆశారాం బాపు ఎవరు?

ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో గల బెరానీ గ్రామంలో 1941లో ఆశారాం బాపు జన్మించారు. ఆశారాం అసలు పేరు అసుమల్ హర్పలానీ.

సింధీ వ్యాపార సముదాయానికి చెందిన ఆశారాం కుటుంబం 1947లో విభజన తర్వాత భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో స్థిరపడింది.

1960లలో ఆధ్యాత్మిక గురువు లీలాషా వద్ద శిష్యునిగా అసుమల్ చేరారు. అసుమల్‌కి ఆశారాం అని లీలా షా పేరు పెట్టారు.

1972లో ఆశారాం అహ్మదాబాద్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముతేరా పట్టణంలో సబర్మతి నది ఒడ్డున తన మొదటి ఆశ్రమాన్ని నిర్మించారు.

ఆ తరువాత క్రమంగా గుజరాత్‌లోని ఇతర నగరాల్లోనూ ఆయన ఆశ్రమాలు వెలిశాయి. ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి.

ప్రవచనాలు, నాటుమందులు, భజనలు-కీర్తనలతో తొలుత గ్రామాల్లోని పేదలు, ఆదివాసీలను ఆశారాం ఆకర్షించారు. ఆ తరువాత గుజరాత్ పట్టణ మధ్యతరగతి వర్గాలకు చేరువ అయ్యారు.

ప్రవచనాలు, భజనల తరువాత ప్రసాదం పేరుతో పెట్టే ఉచిత భోజనం వంటి చర్యలతో ఆశారాం భక్తులు వేగంగా పెరిగారు.

ఒక దశలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ఫాలోవర్లు ఉండేవారని ఆశారాం అధికారిక వెబ్‌సైట్ చెబుతోంది.

ఈ అనుచరుల బలంతో ఆశారాం తన కుమారుడు నారాయణ్ సాయితో కలిసి దేశ విదేశాలలో 400 ఆశ్రమాలు కలిగిన సామ్రాజ్యాన్ని స్థాపించారు.

ఆశారాంకు చాలా ఆశ్రమాలు ఉన్నాయి. అలాగే దాదాపు రూ. 10,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిపై ప్రస్తుతం కేంద్ర, గుజరాత్ రాష్ట్ర పన్నుల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నాయి.

ఈ విచారణలో ఆశ్రమ నిర్మాణానికి అక్రమంగా భూములు లాక్కున్న కేసులను కూడా చేర్చారు.

ఆశారాం భక్తులుగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరు?

ఓ వైపు భక్తులు పెరగడంతో పాటు మరోవైపు రాజకీయ నాయకులు కూడా ఆశారాం ఆశ్రమానికి క్యూ కట్టారు.

ఆయన భక్తుల జాబితాలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు ఎల్‌కె అడ్వాణీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేత ఉమా భారతి, చత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి ప్రముఖ రాజకీయ నేతలు ఉండేవారు.

ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, మోతీలాల్ వోరా కూడా ఉన్నారు.

2000 తొలి నాళల్లో నేడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ కూడా ఆశారాంను దర్శిస్తూ ఉండేవారు.

అయితే 2008లో ముతేరా ఆశ్రమంలో ఇద్దరు చిన్నారుల హత్య వెలుగులోకి రావడంతో దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆశారామ్‌కు దూరంగా జరిగారు.

ముతేరా ఆశ్రమంలో ఏం జరిగింది?

2008 జూలై 5న 10 ఏళ్ల అభిషేక్ వాఘేలా, 11 ఏళ్ల దీపేష్ వాఘేలా సగం కాలిపోయిన మృతదేహాలు ఆశారాం ముతేరా ఆశ్రమం వెలుపల గల సబర్మతీ నది ఒడ్డున కనిపించాయి.

అహ్మదాబాద్‌లో నివసిస్తున్న పిల్లల తల్లిదండ్రులు మరణానికి కొద్ది రోజుల ముందే ఆశారాం 'గురుకుల' పాఠశాలలో వారిని చేర్పించారు.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయడానికి డీకే త్రివేది కమిషన్‌ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ దర్యాప్తు రిపోర్టును ఇప్పటికీ వెల్లడించలేదు.

ముతేరా ఆశ్రమానికి చెందిన ఏడుగురు ఉద్యోగులపై 2012లో గుజరాత్ పోలీసులు పలు నేరారోపణలతో కేసులు నమోదుచేశారు.

ప్రస్తుతం ఈ కేసు విచారణ అహ్మదాబాద్‌లోని సెషన్స్ కోర్టులో కొనసాగుతోంది.

సంత్ ఆశారాం

జోధ్‌పూర్ కేసు ఏమిటి?

ఒక మైనర్ బాలికన్ రేప్ చేశారనే ఆరోపణలతో 2013లో ఆశారాం మీద కేసు నమోదైంది.

షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక కుటుంబం ఆశారామ్‌ను సేవిస్తూ ఉండేది. అక్కడ ఒక ఆశ్రమాన్ని కూడా వారు సొంత ఖర్చుతో నిర్మించారు.

'కల్చర్ ఎడ్యుకేషన్’ తమ ఇద్దరు పిల్లలను చింద్వారాలోని ఆశారాం గురుకులానికి పంపారు.

2013 ఆగస్టు 7న పిల్లల తండ్రికి చింద్వారా గురుకులం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 16 ఏళ్ల కుమార్తె అనారోగ్యంతో ఉందని వారు చెప్పారు.

మరుసటి రోజు బాధితురాలి తల్లిదండ్రులు చింద్వారా గురుకులానికి చేరుకున్నప్పుడు వారి కుమార్తెకు దుష్టశక్తులు ఉన్నాయని ఆశారాం మాత్రమే నయం చేయగలరని వారు నమ్మబలికారు.

ఆగస్టు 14న బాధితురాలి కుటుంబం జోధ్‌పూర్ ఆశ్రమానికి చేరుకుని ఆశారామ్‌ను కలిశారు.

ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం ఆగస్టు 15 సాయంత్రం, 'నయం’ చేస్తానని చెప్పి 16 ఏళ్ల బాలికను తన గుడారానికి పిలిపించారు. అక్కడే ఆ బాలిక మీద అత్యాచారం చేశారు.

ఆశారాంను నమ్మిన బాధిత కుటుంబానికి ఈ ఘటన షాక్‌లో పడేసింది. విచారణ సమయంలో బాధిత కుటుంబం ఇంటి నుంచి బయటికి వెళ్లేవారు కూడా కాదు.

తమకు ఆశ్రమం వాళ్లు డబ్బులు ఆశ చూపారని, వినకపోతే చంపేస్తామని బెదిరించారని కూడా ఆ కుటుంబం ఆరోపించింది. అయితే బాధిత కుటుంబం వారికంటే బలవంతుడైన ఆశారాంపై న్యాయం కోసం పోరాడింది.

చివరకు ఆ కేసులో ఆశారామ్‌కు శిక్ష పడింది.

సంత్ ఆశారాం

సాక్ష్యం చెబితే హత్య లేదంటే మిస్సింగ్ ?

ఆశారాం, ఆయన కుమారుడు నారాయణ్ సాయిపై అత్యాచారం చేశారని ఆరోపించిన ఇద్దరు సూరత్ సిస్టర్స్‌లో ఒకరి భర్తపై 2014 ఫిబ్రవరి 28న ఉదయం దాడి జరిగింది.

అంతేకాదు మరో 15 రోజుల అనంతరం ఆశారాం వీడియోగ్రాఫర్ రాకేష్ పటేల్‌పై దాడి చేశారు.

రెండో దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత సూరత్‌లోని మార్కెట్‌లో దినేష్ భగ్నానీ అనే మూడో సాక్షిపై యాసిడ్‌ దాడికి ప్రయత్నించారు.

ఈ ముగ్గురు సాక్షులూ దాడుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. అయితే 2014 మే 23న ఆశారాం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అమృత్ ప్రజాపతిపై నాలుగోసారి దాడి జరిగింది.

అమృత్‌పై పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపారు. చికిత్స పొందుతూ 17 రోజుల అనంతరం ఆయన మృతిచెందారు.

ఆశారాం కేసుపై 187 కథనాలు రాసిన షాజహాన్‌పూర్‌కు చెందిన జర్నలిస్టు నరేంద్ర యాదవ్‌ను తదుపరి లక్ష్యంగా చేసుకున్నారు.

నరేంద్ర మెడపై గుర్తుతెలియని దుండగులు కొడవలితో రెండుసార్లు నరికారు. అయితే 76 కుట్లు, మూడు ఆపరేషన్ల తర్వాత నరేంద్ర ప్రాణాలతో బయటపడ్డారు.

2015 జనవరిలో ముజఫర్‌నగర్‌లో మరో సాక్షి అఖిల గుప్తాను కాల్చి చంపేశారు.

సరిగ్గా నెల తర్వాత జోధ్‌పూర్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన వెంటనే ఆశారాం కార్యదర్శిగా పనిచేసిన రాహుల్ సచన్‌పై కోర్టు ప్రాంగణంలో దాడి చేశారు.

రాహుల్ ఆ దాడి నుండి బయటపడ్డాడు. కానీ 25 నవంబర్ 2015 నుంచి ఇప్పటి వరకు కనిపించలేదు.

ఈ కేసులో ఎనిమిదో దాడి 13 మే 2015న పానిపట్‌లో సాక్షి మహేంద్ర చావ్లాపై జరిగింది. దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడిన మహేంద్ర ఇప్పటికీ పాక్షిక అంగవైకల్యంతో బాధపడుతున్నారు.

ఈ దాడి జరిగిన మూడు నెలల్లోనే జోధ్‌పూర్ కేసులో సాక్షిగా ఉన్న 35 ఏళ్ల కిర్పాల్ సింగ్‌ను కాల్చి చంపేశారు.

హత్యకు కొన్ని వారాల ముందు ఆయన జోధ్‌పూర్ కోర్టులో బాధితురాలికి మద్దతుగా వాంగ్మూలాన్ని ఇచ్చారు.

జోధ్‌పూర్ కేసులో ఆశారాం దేశంలోని ఖరీదైన న్యాయవాదులను నియమించుకున్నారు. రామ్ జెఠ్మలానీ, రాజు రామచంద్రన్, సుబ్రమణ్యం స్వామి, సిద్ధార్థ్ లూథ్రా, సల్మాన్ ఖుర్షీద్, కేటీఎస్ తులసి, యుయు లలిత్ లు ఆశారాం తరఫున వివిధ కోర్టులలో వాదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Asaram Bapu: Rape cases, assets of thousands of crores, expensive lawyers... who is this controversial baba
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X