• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘లోన్ రైట్ ఆఫ్’ అంటే ప్రజల సొమ్మును లూటీ చేయడమేనా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నిర్మలా సీతారామన్

''... వందలు/వేల కోట్ల రూపాయలను రైట్ ఆఫ్ చేశాం’’

ఇలాంటి శీర్షికలతో తరచూ వార్తా పత్రికలు, టీవీలు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలలో వార్తలు కనిపిస్తుంటాయి.

ఇక్కడ ... చుక్కలను చూసి ఏదో రాయడం మరిచిపోయామని అనుకుంటూ ఉండొచ్చు. కానీ, అలా ఏమీ కాదు. ఈ మూడు డాట్‌ల దగ్గర మీరు ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకు పేరును నింపుకోవచ్చు. ఆ పేరుతో గూగుల్‌లో శోధించిన వెంటనే చాలా వార్తలు మీకు కనిపిస్తాయి.

రుణాల మాఫీ అంశం మరోసారి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సమాచార హక్కు దరఖాస్తుకు ప్రత్యుత్తరమిస్తూ గత 11ఏళ్లలో రూ.1.29 లక్షల కోట్లను రైట్ ఆఫ్ చేసినట్లు కెనరా బ్యాంకు వెల్లడించింది.

నిజానికి ఇలా రైట్ ఆఫ్ చేసే రుణాల వివరాలను ప్రతి త్రైమాసికంలోనూ బ్యాంకులు ప్రజలకు వెల్లడిస్తుంటాయి. ముఖ్యంగా స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌లలో నమోదైన బ్యాంకులు ప్రతి త్రైమాసికంలో తమ ఫలితాలను వెల్లడించేటప్పుడు ఈ వివరాలకు కూడా బయటపెడతాయి. ఈ ఫలితాల్లో ఎంత మొత్తం రుణాలను మాఫీ చేశారో తమ షేర్‌హోల్డర్స్‌కు తప్పనిసరిగా బ్యాంకులు వెల్లడించాల్సి ఉంటుంది.

రుణమాఫీ

ప్రభుత్వంపై విమర్శలు

కెనరా బ్యాంకు రుణాల రైట్ ఆఫ్ అంశం వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై చాలా మంది ప్రతిపక్ష నాయకులు విమర్శలు సంధిస్తున్నారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, వామపక్ష నాయకుడు సీతారాం ఏచూరి ఇలా చాలా మంది నాయకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. రుణాల మాఫీ పేరుతో పేద ప్రజల డబ్బులను ప్రభుత్వ బ్యాంకులు లూటీ చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

అయితే, ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న ఈ విమర్శలు నిజమేనా? ఈ వివరాలు బయటకు రాకుండా బ్యాంకులు సాంకేతిక పదజాలాన్ని (టెక్నికల్ టెర్మినాలజీని) ఉపయోగిస్తున్నాయా?

అసలు రైట్ ఆఫ్, రుణాల మాఫీ మధ్య తేడా ఏమిటి? మొదట బ్యాంకింగ్ వ్యవస్థను మనం అర్థం చేసుకుందాం. బ్యాంకులకు రుణాలు ఇవ్వడం ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం.

బ్యాంకుల వ్యాపారం అనేది ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడం కంటే అప్పులు ఇవ్వడం చుట్టూనే ఎక్కువ తిరుగుతుంటుంది. నిజానికి బ్యాంకుల మనుగడకు ఈ రెండూ చాలా కీలకమైనవి.

రుణాలు అనేవి బ్యాంకులకు ఆదాయ మార్గాలు లేదా ఆస్తులు లాంటివి. ఎందుకంటే ఇవి నిత్యం బ్యాంకులకు ఆదాయాన్ని సమకూరుస్తుంటాయి. కస్టమర్లకు ఇచ్చే రుణాలపై బ్యాంకుకు వడ్డీ వస్తుంటుంది.

మరోవైపు బ్యాంకులు తీసుకునే డిపాజిట్లు ఒకరంగా అప్పుగా (లయబిలిటీ) చెప్పుకోవాలి. వీటిపై కస్టమర్లకు బ్యాంకు వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డబ్బులనే రుణాల రూపంలో ఇతర కస్టమర్లకు బ్యాంకులు ఇస్తుంటాయి.

రుణ మాఫీ

రైట్ ఆఫ్ అంటే ఏమిటి?

కట్టగలిగే స్తోమత ఉన్నప్పటికీ డబ్బులు కట్టని రుణ గ్రహీతలను ''విల్‌ఫుల్ డిఫాల్టర్స్’’గా బ్యాంకులు పిలుస్తుంటాయి.

ఇలాంటి విల్‌ఫుల్ డిఫాల్టర్స్ నుంచి డబ్బులు వస్తాయని ఆశ లేదా నమ్మకం పూర్తిగా పోయినప్పుడు బ్యాంకులు ఈ రుణాలు బ్యాడ్ లోన్స్‌గా పేర్కొంటూ రైట్ ఆఫ్ చేస్తాయి.

ఇక్కడ రైట్ ఆఫ్ అంటే రుణాలను రద్దు చేశారని అనుకోకూడదు. తమ బ్యాలెన్స్ షీట్లను క్లీన్ చేయడానికి బ్లాంక్‌లు అలా చేస్తుంటాయి.

రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం, మొదట పారు బాకీలను నిరర్ధక ఆస్తులు (నాన్ పెర్‌ఫార్మింగ్ అసెట్-ఎన్‌పీఏ)గా బ్యాంకులు ప్రకటిస్తాయి. అప్పటికీ ఆ రుణాలు వసూలు కావని నిర్ధారణకు వస్తే వాటిని రైట్ ఆఫ్ చేస్తారు.

ఇలా రుణాలను ఎగవేసే ఆర్థిక నేరస్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇలా రుణాలు ఎగవేసి దేశాన్ని విడిచి పరారవుతున్న వ్యాపారవేత్తలను మళ్లీ దేశానికి తీసుకొచ్చేందుకు దీనిలో నిబంధనలు ఉన్నాయి. దీని ద్వారా వారి స్థిర, చర ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వీలుంది.

రుణమాఫీ

నిరర్ధక ఆస్తులు అంటే ఏమిటి?

నిర్ధరక ఆస్తులు అంటే ఏమిటో తెలుసుకునే ముందు, అసలు బ్యాంకులు ఎలా పనిచేస్తాయో మొదట అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణతో దీన్ని పరిశీలిద్దాం. బ్యాంకులో ఒక రూ.100 డిపాజిట్ వచ్చింది అనుకోండి.. వీటిలో రూ.4.5 క్యాష్ రిజర్వ్ రేషియో-సీఆర్ఆర్ రూపంలో ఆర్బీఐ దగ్గర బ్యాంకులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

మరో 18 రూపాయలను స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో-ఎస్‌ఎల్‌ఆర్ రూపంలో అంటే బ్యాండ్లు లేదా బంగారం రూపంలో బ్యాంకులు విడిగా ఉంచాల్సి ఉంటుంది.

మిగతా 77.5 రూపాయలను రుణాల రూపంలో ఇతరులకు బ్యాంకులు ఇవ్వచ్చు. వీటి నుంచి వచ్చే వడ్డీలో కొంత భాగాన్ని తమ కస్టమర్లకు బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా వడ్డీని ఆదాయంగా తమ దగ్గరే ఉంచుకోవచ్చు.

రిజర్వు బ్యాంకు సమాచారం ప్రకారం.. రుణాల నుంచి వడ్డీ రాకుండా నిలిచిపోయిందంటే దీన్ని ''నిరర్ధక ఆస్తి (ఎన్‌పీఏ)’’గా గుర్తిస్తారు.

వడ్డీ లేదా అసలు 90 రోజులపాటు రాకుండా నిలిచిపోతే ఆ రుణాలను ఎన్‌పీఏ కింద మొదట చూపిస్తారు.

రుణమాఫీ

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఒక రుణం భవిష్యత్‌లో నిరర్ధక ఆస్తిగా మారే అవకాశముందా? అనే విషయాన్ని ముందుగానే అంచానా వేసేందుకు రిజర్వు బ్యాంకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది. దీని కోసం ముందుగానే ఆ ముప్పు ఉండే రుణాలను ''స్పెషల్ మెన్షన్ అకౌంట్ (ఎస్ఎంఏ)’’గా గుర్తిస్తారు.

ఒకసారి రుణాన్ని ఎన్‌పీఏగా గుర్తించిన తర్వాత వీటిని మళ్లీ మూడు వర్గాలు విభజిస్తారు. సబ్ స్టాండార్ట్ అసెస్ట్స్, డౌట్‌ఫుల్ అసెట్స్, లాస్ అసెట్స్‌గా వీటిని వర్గీకరిస్తారు.

ఒక రుణం ఏడాది లేదా అంతకంటే తక్కువ రోజులు ఎన్‌పీఏగా కొనసాగితే దాన్ని సబ్ స్టాండార్డ్ అసెట్‌గా గుర్తిస్తారు. ఒక ఏడాదిపాటు సబ్ స్టాండార్డ్ అసెట్‌గా కొనసాగితే దాన్ని డౌట్‌ఫుల్ అసెట్‌గా పిలుస్తారు. ఇక ఆ రుణం తిరిగి రాబట్టడం అసాధ్యం అని భావించినప్పుడు దాన్ని ''లాస్ అసెట్’’గా చెబుతారు.

''ఎన్‌పీఏ నిబంధనలను మరింత కఠినతరం చేసే కొన్ని నిబంధనలను గత ఫిబ్రవరిలో రిజర్వు బ్యాంకు తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. ఒక రుణం ఎగవేసినట్లు నిర్ధారణకు వచ్చిన 180 రోజుల్లోనే ఈ సమస్యను బ్యాంకులు పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే ఈ రుణం ఆటోమేటిక్‌గా ఇన్‌సాల్వెన్సీ ప్రాసెస్ కిందకు వస్తుంది’’అని బ్యాంకింగ్ నిపుణురాలు కాజల్ జైన్ చెప్పారు.

''కొత్త నిబంధనల ప్రకారం, ఆ ఎగవేసిన రుణం రూ.2000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 180 రోజుల్లోనే బ్యాంకు అధికారులు రిసొల్యూషన్ ప్లాన్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్‌గా ఇన్‌సాల్వెన్సీ కోడ్ కిందకు ఆ రుణం వెళ్లిపోతుంది’’అని ఆమె వివరించారు.

రుణమాఫీ

రుణ మాఫీ అంటే ఏమిటి?

రుణాన్ని తీసుకున్న వ్యక్తి ఆ రుణం కట్టలేనప్పుడు ప్రభుత్వం ఆ రుణాన్ని మాఫీ చేస్తుంటుంది. అయితే, అన్ని రుణాలూ ఈ రుణ మాఫీ కిందకు రావు.

ముఖ్యంగా రైతులకు ఇచ్చే రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంటుంది. ఎన్నికలకు ముందుగా ఇలాంటి హామీలను రాజకీయ పార్టీలు ఇస్తుంటాయి.

పంటలు దెబ్బతినడం, అకాల వర్షాలు, కరవు లాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు రైతులకు పరిహారంగా రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తుంటాయి. అయితే, ఇలాంటి హామీల్లో పెద్దపెద్ద వ్యాపార సంస్థల రుణాలను మాఫీ చేయరు.

రుణాలను రైట్ ఆఫ్ చేయడం కంటే ప్రభుత్వం రుణ మాఫీ చేయడం వైపే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఎక్కువ మొగ్గు చూపుతాయని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు సుదీప్ బందోపాధ్యాయ్ అన్నారు.

''రుణాలను రైటాఫ్ చేయడం కంటే ప్రభుత్వం మాఫీ చేయడమే మేలు. ఎందుకంటే ఈ మొత్తం ప్రభుత్వం నుంచి బ్యాంకులకు అందుతుంది. ఫలితంగా ఆ రుణ భారాన్ని బ్యాంకులు మోయాల్సి ఉండదు’’అని ఆయన చెప్పారు.

''రైతులకు చెందిన రూ.1000 మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తే, ఆ రూ.1000ను బ్యాంకులకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకులే రైట్ ఆఫ్ చేస్తే.. ఆ రుణాల భారాన్ని బ్యాంకులే మోయాల్సి ఉంటుంది. దీని వల్ల వాటి ఆదాయానికి గండి పడుతుంది’’అని సుదీప్ వివరించారు.

అయితే, చాలాసార్లు బ్యాంక్ షీట్లలోని రైట్ ఆఫ్, వైవ్ ఆఫ్ (రుణమాఫీ) గణాంకాలు తికమక పెడుతుంటాయి.

అందుకే ''స్టాటిస్టిక్స్ అబద్ధాలు చెప్పవు. అయితే, పూర్తి నిజం కూడా చెప్పవు’’అని అంటుంటారు.

ఇవి కూడా చదవండి:

సంబంధిత కథనాలు

English summary
Does 'loan write off' mean looting people's money?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X