వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తామర పురుగు: ఏపీ, తెలంగాణల్లో మిర్చి పంటకు పట్టిన ఈ తెగులు దేశంలోని అనేక పంటలను నాశనం చేయబోతోందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మిర్చిపంటలో తీవ్రంగా నష్టపోయానంటున్న కౌలు రైతు గుగులోత్ మల్లీశ్వరి

ఈ ఏడాది మీరు ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం చాలా కష్టం కాబోతోంది. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి మీకు పచ్చడికి కావల్సిన నాణ్యమైన మిరపకాయలు దొరక్కపోవడం. ఒకవేళ దొరికినా ధరలు ఆకాశానికి ఎగబాకడం.

అయితే, ఇప్పుడు మనం మాట్లాడేది కేవలం మామిడికాయ తొక్కు గురించి కాదు. దాని వెనుక అంతకు మించి లోతైన, తీవ్రమైన సమస్య దాగి ఉంది. తెలుగు రాష్ట్రాల మిర్చి రైతుల ఘోష, మొత్తం భారతదేశ వ్యవసాయ రంగ సంక్షోభానికి ఒక ప్రారంభ సూచన కావచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది మిర్చి పంట తీవ్రంగా దెబ్బతింది. దాదాపు 60 శాతం పంట దెబ్బతిన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఎంతో ఆశతో భూమి కౌలుకు తీసుకుని, అప్పు చేసి మిర్చి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఈ వైపరీత్యానికి కారణం, రైతులు ఎప్పుడూ తమ జీవితంలో చూడని ఒక కొత్త పురుగు. శాస్త్రవేత్తలు కూడా స్పష్టంగా నివారణ చెప్పలేని ఆ విదేశీ చీడ పురుగు ఇప్పుడు రైతులను పీడిస్తోంది.

''మా ఆయన చనిపోయారు. బతకడం కోసం కౌలు సాగు మొదలుపెట్టాను. దాంతోనే ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేసినా. రెండు ఎకరాలలో మిరప పంట వేశా. ఎకరా రూ.30 వేలు కౌలు. పురుగు పట్టింది. ఏదో మాములు పురుగు అనుకొని అప్పు తెచ్చి పురుగు మందు వేశాను. అయినా ఏం లాభం లేదు. రెండు ఎకరాల్లో 4 క్వింటాల పంట కూడా చేతికి రాలేదు. దాదాపు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను ఇప్పుడు ఆ అప్పు ఎలా తీర్చాలో అర్ధం కావటం లేదు. ఇంత నష్టం చేసిన తామర పురుగును నా జీవితంలో చూడలేదు'' అని సూర్యాపేట జిల్లాకు చెందిన గుగులోతు బద్లీ బాయి బీబీసీతో చెప్పారు .

ఈ సీజన్ లో మిర్చి పంట సాగు చేసే ప్రాంతాల్లో కూలీలు చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు. సాధారణంగా మిరప పంట చేతికొచ్చే సమయంలో పల్లెల్లో కోలాహలం కనిపిస్తుంటుంది. పక్క ఊళ్ల నుంచి కూడా కూలీలను ట్రాక్టర్లు, ఆటోల్లో తీసుకొస్తుంటారు.

కూలీల రాకతో పల్లెల్లో హడావుడి వాతావరణం ఉండేది. కానీ ఈసారి పంట లేకపోవడంతో కూలీల ఉపాధి కూడా బాగా దెబ్బతింది.

''ప్రతి సంవత్సరం కూలీ వాళ్లతో మా పొలాలు, ఊరు జాతరలా ఉండేది. ఇప్పుడు మాకే పనులు లేక ఖాళీగా ఉన్నం. అసలు మా పరిస్థితి ఏంటో మాకే అర్ధం కావటం లేదు.'' అని మల్లీశ్వరి అనే కౌలు రైతు బీబీసీతో చెప్పారు. ఆమె వ్యవసాయ కూలీ నుంచి కౌలు రైతుగా మారారు.

పచ్చిమిర్చి

ఇక్కడ కౌలు రైతులది మరింత తీవ్రమైన సమస్య. మిరప పంట మీద అధిక ఆదాయం వస్తుందన్న ఆశతో పేద, దిగువ మధ్యతరగతి వర్గాల వారు, భూమిలేని వారు, కూలి పనులు చేసుకునే వారు కూడా కౌలుకు తీసుకుని, ఎరువులు, పురుగు మందులు అప్పు తెచ్చి సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు.

''నేను మొదట్లో కూలీ చేసుకునేదాన్ని. గత మూడు సంవత్సరాలుగా కౌలుకు పొలాలు చేసుకుంటున్నాను. పంటను కాపాడుకోవాడినికి పురుగు మందులు అమ్మే సేటును ఎంతో బ్రతిమిలాడి మందులు, ఎరువులు తెచ్చి మిర్చి పంటను పసి బిడ్డలా చూసుకుంటా వ్యవసాయం చేశాను కానీ ఫలితం లేదు.'' అంటూ కన్నీటి పర్యంతం అయింది మల్లీశ్వరి.

''నేను 5 ఎకరాల్లో మిర్చి పంట వేశాను, అందులో 3 ఎకరాల్లో ఈ కొత్త రకం తామర వైరస్ విపరీతంగా వ్యాపించింది. హైదరాబాద్ నుండి పురుగు మందులు తెచ్చి కొడితే పోతుందంటే అలా కూడా చేశాను. అప్పటికీ వాటి తీవ్రత తగ్గక పోవటంతో ఏం చెయ్యలేని పరిస్థితిలో పంట అసలు చేతికి రాకముందే పీకేశాను. ఎన్నో మందులు కొట్టి ఎంతో కష్టపడితే రెండు ఎకరాల్లో కేవలం 20 క్వింటాల మిర్చి పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు పంట దిగుబడి వచ్చేది. ఇది నా ఒక్కరి సమస్యే కాదు. మా ఊరిలో 80% రైతుల మిరప పంట ఈ కొత్త రకం తామర వలన నాశనం అయ్యింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కూడా మాకు కొత్త రకం తామర పురుగు గురించి అవగాహన కల్పించడానికి రాలేదు'' అని లక్ష్మణ రెడ్డి అనే రైతు బీబీసీతో చెప్పారు .

ఎక్కడి నుంచి వచ్చిందీ పురుగు?

త్రిప్స్ పార్విస్పినస్ అనే కీటకం థాయిలాండ్ నుంచి ఆస్ట్రేలియా, ఐరోపా వరకు వ్యాపించింది. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ఈ పురుగు బాగా విస్తరించింది. ఇప్పుడు కేవలం భారతదేశమే కాకుండా ఫ్రాన్స్, గ్రీస్, హవాయి, మారిషస్, రీయూనియన్, స్పెయిన్, టాంజానియా, నెదర్లాండ్స్‌లో కూడా గుర్తించినట్లు తెలిసింది.

ఇది పాలీఫాగస్ కీటక జాతి. బీన్స్, వంకాయ, బొప్పాయి, మిరపకాయ, మిరియాలు, బంగాళాదుంప, షాలోట్, స్ట్రాబెర్రీలకు సోకుతోంది. అలంకారం కోసం పెంచే కొన్ని రకాల మొక్కలకు కూడా సోకుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

''భారతదేశంలో, ఈ పురుగు మొట్టమొదట 2015లో బెంగుళూరులో బొప్పాయి పై కనిపించింది. అప్పటి నుంచీ ఈ పురుగు గమనాన్ని శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు'' అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ లో నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెట్ పెస్ట్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన శాస్త్రవేత్త కె.వి. రాఘవేంద్ర తెలిపారు.

2021-22 రబీలో ఈ పురుగు తీవ్ర నష్టం చేకూర్చింది. ఇప్పటికే వివిధ వ్యవసాయ సంస్థలు దీనిపై విస్తృత పరిశోధన చేశాయి. పిల్ల, తల్లి పురుగులో పువ్వు, ఆకుల కింది భాగంలో రసం పీలుస్తాయి. దీంతో అవి వడలిపోయి రాలిపోతాయి. దానివల్ల దిగుబడి బాగా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

''ప్రతి సంవత్సరం రైతులు మిర్చి బస్తాలను ట్రాక్టర్లలో, లారీలలో లోడ్లు లోడ్లు తెచ్చే వారు కానీ ఈ సంవత్సరం ఎడ్ల బండ్ల పైన, సైకిలపైన ఒక్కటి రెండు మిర్చి బస్తాలు తెస్తున్నారు. ఏటా మా కోల్డ్ స్టోరెజ్ నిండి పోయేది. అలాంటిది ఈ సంవత్సరం మొత్తం ఖాళీగా ఉంది. వేరే వేరే రాష్ట్రాల నుండి మిర్చి కోసం ఆర్డర్లు వస్తున్నాయి కానీ ఏం లాభం? మిర్చి దిగుబడి లేదు. అసలు మిర్చి అమ్మే రైతులే లేరు. గత 10 ఏళ్లుగా కోల్డ్ స్టోరెజ్ నడుపుతున్నాం కానీ ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు’’ అని షేక్ సత్తార్ అనే కోల్డ్ స్టోరేజ్ యజమాని వెల్లడించారు. ఆయన కోల్డ్ స్టోరేజీ నిర్వహించడంతోపాటు మిర్చి ట్రేడింగ్ కూడా చేస్తారు.

మిరప పూలను పీల్చేస్తున్న తామర పురుగు

''కనీసం మాకు కోల్డ్ స్టోరెజ్ నిర్వహణ ఖర్చులకు కూడా డబ్బులు రావటం లేదు'' అన్నారు సత్తార్.

ఈ తెగులు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దాదాపు ఐదారు లక్షల ఎకరాలలో తీరని పంట నష్టం జరిగిందని అంచనా. ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి 20-25 క్వింటాల్ మిర్చి పండిచే రైతు ఈసారి 5 క్వింటాళ్ల మిర్చి కూడా పండించలేకపోయారు.

పైగా 2021లో అధిక వర్షపాతం, వాతావరణ మార్పుల వల్ల దీని తీవ్రత పెరిగింది. పైగా తీవ్రంగా పెరిగిన చోట మిగిలిన పురుగులను డామినేట్ చేస్తుంది.

పంట నష్టం తీవ్రతపై ఇటీవల ఏపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిచ్చారు. ఏపీ, తెలంగాణల్లో ఈ వైరస్ కారణంగా మిర్చిపంట 40 నుంచి 80 శాతం దెబ్బతిన్నదని మంత్రి పేర్కొన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది.

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

ఇది కేవలం మిర్చి పంట సమస్యో.. లేదా కొందరు ఆంధ్ర, తెలంగాణ రైతుల సమస్యో అనుకుంటే పొరబాటేనని నిపుణులు అంటున్నారు. ఇది అనేక రకాల పంటలకు, అనేక ప్రాంతాలకు చాలా వేగంగా విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక రకంగా ఇది భారతీయ వ్యవసాయ రంగానికి రాబోతోన్న పెద్ద సవాల్ గా వారు విశ్లేషిస్తున్నారు.

''ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వ్యాపించింది. పత్తి, వంకాయ, మునగ, బొప్పాయి, మామిడి.. వీటితో పాటూ ఇతర కలుపు మొక్కలకు వ్యాపిస్తోంది. ఈ 'ట్రిప్స్‌ పార్విస్పైనస్' ఒక మిరప పంటపై మాత్రమే కాకుండా ఆహారేతర పంటలపై కూడా వస్తున్నట్టు మా సర్వేలో గుర్తించాము. ప్రత్తి పంటపైనా దీని ప్రభావం ఉంది. మిరప పై ఎక్కువగా ఉంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలో మామిడి పూతపై కూడా గుర్తించాము. ఎక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుందో అక్కడ తీవ్రత అధికంగా ఉంటుంది. వచ్చే సంవత్సరం పంటలపై కూడా ఇది తీవ్ర నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు.'' అన్నారు రాఘవేంద్ర.

అయితే, ఇతర పంటలపై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయంలో వ్యవసాయ రంగ నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

''ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉన్న మాట వాస్తవం. పురుగు మందుల సాగు పెరగడం వల్ల ప్రకృతిలో సహజంగా ఉండాల్సిన ఎన్నో మంచి చేసే పురుగులు అంతరిస్తున్నాయి. దానివల్ల బయటి నుంచి వచ్చే పురుగులను ఇక్కడ పొలాల్లో అడ్డుకునే జీవులు లేకుండా పోతున్నాయి. మొక్కలకు సహజ ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే పర్యావరణ పరంగా ఒక జీవిని అడ్డుకునే శత్రు జీవీ ఉంటుంది. ఆ శత్రు జీవులను చంపుకున్నాం. దానివల్ల తీవ్రత ఎక్కువగా ఉంటోంది'' అని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ జీవీ రామాంజనేయులు బీబీసీతో అన్నారు .

వైరస్ కారణంగా పంటను మధ్యలోనే పీకేయాల్సి వచ్చిందన్న రైతు లక్ష్మారెడ్డి

''ఈ పురుగు నేరుగా ప్రమాదం కాదు. ఇది ఒకరకమైన వైరస్ ను వ్యాపింపజేస్తోంది. ఇది చాలా ప్రమాకరమైంది. అయితే మిర్చితో పాటూ ఇతర పంటలకు వ్యాపించినా, మిర్చిలో ఉన్నంత తీవ్రంగానే ఉంటుందని ఇప్పుడే చెప్పలేం'' అన్నారు రామాంజనేయులు.

ఈ తెగులు వచ్చిన మొదట్లో అది ఏంటో కూడా స్థానిక రైతులకు, వ్యవసాయ అధికారులకు అర్థం కాలేదు. దీని తీవ్రతను ముందుగా గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ పరిశోధనా సంస్థలకు లేఖలు రాసింది.

దీంతో కేంద్ర ప్రభుత్వం ఐసీఏఆర్ అనుబంధంగా పని చేస్తున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ క్వారంటైన్‌ అండ్‌ స్టోరేజ్‌ (డీపీపీక్యూఎస్‌), నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ ( ఎన్‌బిఎఔఐఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మనేజ్‌ మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ రీసెర్చ్‌ (ఐఐహచ్‌ఆర్‌), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌సీఐపీఎం), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెస్ట్‌ కంట్రోల్‌ (సీఐపీసీ)లతో పాటు ఎన్‌బీ ఏఐఆర్‌లకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్తల బృందాన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపింది.

ఈ శాస్ర్తవేత్తల బృందం జనవరి 3, 4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, 5, 6 తేదీల్లో ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, వరంగల్ జిల్లాలో పర్యటించింది. అప్పుడే వారు ఈ త్రిప్స్ అనే కీటకాన్ని గుర్తించారు. ఈ ర‌కం పురుగు ఆగ్నేయాసియా ట్రిప్స్‌లో ఒకటైన 'ట్రిప్స్‌ పార్విస్పైనస్' పురుగు అని నిర్ధారించారు.

దాంతో పాటు రూట్ రాట్ వ్యాధి (తడి నేలలో పెరిగే చెట్ల మూలాలపై దాడి చేసే వ్యాధి), వైరస్ సంక్రమణ కూడా ఉందని గుర్తించారు. మొత్తంగా త్రిప్స్ తో మొదలై ఒకేసారి మూడు నాలుగు రకాల వ్యాధుల వలన మిరప పంట చాలా తీవ్రంగా దెబ్బతిందని నిర్ధారించింది ఆ శాస్త్రవేత్తలు బృందం.

మిర్చి పంట

విదేశాల నుంచి వ్యాధులు ఎలా వస్తాయి?

''కరోనా వైరస్ వచ్చాక మనందరికీ క్వారంటైన్ అనే పద్ధతి బాగా తెలిసింది. కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొక్కలు, జీవులు, జంతువులు, ఆహార ఉత్పత్తులకు కూడా ఇలాంటి క్వారంటైన్ విధానం ఉంది. విదేశాల నుంచి ఏదైనా జీవ సంబంధింతమైనవి దిగుమతి చేసుకునేప్పుడు ఓడరేవులు, విమానాశ్రయాల్లో వాటిని పక్కనబెట్టి సమస్యేమీ లేదని నిర్ధారించుకున్న తరువాతే దేశంలోకి అనుమతించాలి. అమెరికా వంటి దేశాల్లో ఈ వ్యవస్థ చాలా కఠినంగా పనిచేస్తుంది. దురదృష్టవశాత్తూ భారత దేశంలో ఆ పరిస్థితి లేదు. దీంతో ఆగ్నేయాసియా నుంచి దిగుమతుల ద్వారా ఆ పురుగు, వైరస్ రెండూ భారతదేశంలో ప్రవేశించి ఇప్పుడు మన రైతుల పాలిట శాపంగా మారాయి’’ అని రామాంజనేయులు అన్నారు.

మన దేశంలో ఎవరు కావాలనుకుంటే వారు, నిబంధనలూ పాటించకుండా, మొక్కలు, విత్తనాలు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉందని, ఆఖరికి కొరియర్ లో కూడా విదేశీ విత్తనాలు తెప్పించేస్తున్నారని రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. తెగుళ్లు రావడానికి ఇది కూడా ఒక కారణమని ఆయన అన్నారు.

పాడైపోయిన మిరపతోట

నివారణ ఎలా?

ఈ పురుగు అనేక రకాల కలుపు మొక్కలకు వ్యాపించే అవకాశం ఉన్నందున దాన్ని తప్పించుకోవడం అంత తేలిక కాదు. కానీ శుభ్రమైన సాగు కాస్త ఉపయోగపడొచ్చని ఐసీఏఆర్ కు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ కె.వి. రాఘవేంద్ర, డాక్టర్ ఆర్ ఆర్ రచన బీబీసీతో చెప్పారు.

ప్రస్తుతానికి ఏదైనా మందు ఈ పురుగుపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అనడానికి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రకరకాల పురుగు మందులు వాడి చూసి రైతులు అప్పుల పాలయ్యారు.

''పంట దెబ్బతింటోంది తెలిసినప్పటి నుంచి విపరీతంగా పురుగు మందులు వాడడం మొదలైంది. దీంతో షాపులో వాటి బాకీ వేలల్లో పెరిగింది. కానీ ఏ ఫలితమూ లేదు. నానాటికీ పంట దిగజారడమే కానీ బాగు పడింది లేదు. పంట పోయింది. బాకీ కూడా పెరిగింది'' అని రఘునాథపాలెం కు చెందిన రైతు లక్ష్మారెడ్డి అన్నారు.

ఈ పురుగు సహజంగా లక్షల సంఖ్యలో పెరుగుతాయి. ఈ పురుగును ఆకర్షించే పసుపు, నీలం రంగు స్టిక్కర్లు పొలాల్లో పెడుతుంటే లక్షల్లో చిన్న చిన్న పురుగులు వాటిని అంటుకుంటున్నాయి. అయినా పొలంలో పంట బాగు పడడం లేదు. ఎందుకంటే అదే స్థాయిలో కొత్త పురుగులు పుట్టుకొస్తున్నాయి.

ఈ వైరస్ నివారణకు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు

  • సాధారణంగా అన్ని పురుగులకు నాశనం చేసే విరోధి పురుగులు ఉంటాయి. అయితే, మిరప పంటకు అధికంగా మందు కొట్టడం వల్ల అవి చనిపోతున్నాయి. ఈ ట్రిప్స్‌ పార్విస్పైనస్ కు సహజంగా నివారించ గలిగేవి తగ్గిపోతున్నాయి.
  • మిర్చి రైతులు అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ అలవాటు చేసుకోవాలి.
  • పసుపు ఆకుపచ్చ రంగులో ఉండే స్టికీ ట్రాప్ అట్టలను పొలంలో ఏర్పాటు చెయ్యాలి.
  • పంట మార్పిడి చేయాలి. దాని వలన ట్రిప్స్ పార్వినస్‌కు సహజ శత్రువులైన క్రిమికీటకాలు మళ్లీ వస్తాయి.
  • వేసవిలో లోతుగా దున్నడం వల్ల ఈ పురుగు ప్యూపా దెబ్బతింటుంది.
  • గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి.
  • విత్తన శుద్ధి చేయాలి.
  • శిలీంద్రాలు, బాగా కుళ్లిన కంపోస్ట్ ఎరువులను వాడాలి
  • విత్తనానికి ముందు వేప పిండి, వర్మీ కంపోస్ట్ మట్టిలో వేయడం మంచిది.
  • నైట్రోజన్, ఫాస్పరస్ తో పాటు పొటాష్ ఎరువుల వల్ల ఫలితం ఉండొచ్చు.
  • మట్టిలో ప్యూపేషన్ తగ్గించడం కోసం వెండి రంగు పాలిథీన్ షీట్లతో మట్టిని కప్పాలి.
  • జొన్న, మొక్కజొన్న, సజ్జలను 2-3 వరసలో సరిహద్దు పంటలుగా పెంచాలి.
  • మిరపలో మొక్కజొన్న, జొన్న, అలసంద అంతరపంటగా వేయడం ఉపయోగకరంగా ఉంటుంది.
  • తరచూ అంతర సాగు. అంటే ఎర్తింగ్అప్ లేదా రూట్ జోన్ సమీపంలో ర్యాకింగ్ చేస్తే మంచిది.
  • పురుగు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మొక్కలను వేరుచేసి పాతిపెట్టడం లేదా కాల్చివేయడం చేయాలి.
  • సామూహికంగా ట్రాప్ చేయడం కోసం పొలాల్లో నీలిరంగు స్టిక్కీ ట్రాప్‌లను ఏర్పాటు చేయాలి
  • వరద నీటి పారుదలకి బదులుగా స్ప్రింక్లర్ ఇరిగేషన్ విధానం మంచిది.
పురుగును ఆకర్షించే స్టిక్కర్లు

వీటితో పాటు....

  • బొటానికల్ ఆధారిత పురుగు మందులను అంటే వేప గింజల సారం (ఎన్ఎస్‌కేఈ ) 5% లేదా వేప నూనె 3% లేదా కానుగ నూనె లేదా వావిలి ఆకు సారం నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆముదం నూనెలు పంటలకు కొట్టాలి.
  • సూక్ష్మజీవుల ఆధారిత పురుగు మందులు అంటే బ్యూవేరియా బస్సియానా లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ లేదా బాసిల్లస్ ఆల్బస్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి
  • చివరి ప్రయత్నంగా మిర్చి పంట పై లేబుల్ క్లెయిమ్ పురుగుమందులతో పురుగు ఉధృతినిబట్టి పిచికారీ చేయడం
  • ట్రిమిరియా మైక్రోబలీ పురుగుమందులు కొట్టాలి.

(సాధారణంగా పంట పరిస్థితిని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన పరిష్కారాలు ఇవి. రైతులు తమ పొలానికి ఉన్న ప్రత్యేక పరిస్థితిని బట్టి స్థానిక వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు మందులు ఉపయోగించాలి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Eczema: Is this pest of chilli crop in AP and Telangana going to destroy many crops in the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X