వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల నిరంకుశత్వం: భారతదేశంలో దిగజారిపోతున్న ప్రజాస్వామ్యం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మోదీ ప్రబుత్వం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి

ఇండియాలో ప్రజాస్వామ్యం పలచనవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భావించే దేశానికి ఇదేమంత మంచి విషయం కాదు. ఇంతకీ, ఏం జరుగుతోంది?

ఈ నెల ప్రారంభంలో అమెరికాకు చెందిన ఫ్రీడం హౌస్ సంస్థ 'అంతర్జాతీయ రాజకీయ హక్కులు, స్వేచ్ఛ'పై ప్రచురించిన వార్షిక నివేదికలో.. భారతదేశ స్థానాన్ని స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం నుంచి "పాక్షిక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యానికి" తగ్గించింది.

గత వారం, స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన నివేదికలో ఇండియా గురించి మరింత కఠినంగా ప్రస్తావించింది. ఇండియా "ఎన్నికల (ప్రభుత్వ) నిరంకుశత్వ" దేశంగా మారిందని పేర్కొంది.

గత నెల 'ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్’ యూనిట్ ప్రచురించిన 'ప్రజాస్వామ్య సూచీ' (డెమోక్రసీ ఇండెక్స్)లో ఇండియా రెండు అడుగులు కిందకు దిగి 53వ స్థానానికి పడిపోయింది. ఇందులో భారతదేశాన్ని " దోషపూరిత ప్రజాస్వామ్య దేశంగా" అభివర్ణించారు.

దేశంలో ప్రజాస్వామ్యం వెనుకడుగు వేయడానికి కారణం నరేంద్ర మోదీ, ఆయన హిందుత్వ బీజేపీ ప్రభుత్వమేనని ఈ నివేదికలన్నీ ఆరోపించాయి.

మోదీ నేతృత్వంలో మానవ హకుల సంఘాలపై ఒత్తిడి పెరిగిందని, జర్నలిస్టులు, యాక్టివిస్టులను బెదిరించడం, దాడులు.. ముఖ్యంగా ముస్లింలపై దాడులు పెరిగాయని వారంతా అంటున్నారు. ఇవన్నీ కూడా దేశంలో రాజకీయ, పౌర స్వేచ్ఛను దిగజార్చుతున్నాయని ఆ నివేదికలు విమర్శించాయి.

2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పౌర హకులు, స్వేచ్ఛ దిగజారిపోతూనే ఉన్నాయని ఫ్రీడం హౌస్ పేర్కొంది. భారతదేశం ఉన్నత ప్రమాణాల నుంచి కిందకు పడిపోవడం ప్రపంచ ప్రజాస్వామ్య ప్రమాణాలపై చెడు ప్రభావం చూపిస్తుందని తెలిపింది.

2019 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఘన విజయం సాధించింది

"మోదీ పాలనలో భావ ప్రకటన స్వేచ్ఛపై వేటు పడడంతో మీడియా, పౌర సమాజం ప్రజాస్వామ్య విలువలకు మరింత దూరంగా జరిగిపోతోందని" వీ-డెమ్ పేర్కొంది.

పాకిస్తాన్‌లాగ నిరంకుశంగా మారుతోందని, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ కన్నా అధ్వానంగా తయారవుతోందని ఆరోపించింది.

మోదీ పాలసీలు ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని, మత కలహాలను ప్రేరేపిస్తున్నాయని, దేశ రాజకీయ నిర్మాణాన్ని దెబ్బ తీస్తున్నాయని డెమోక్రసీ ఇండెక్స్ పేర్కొంది. ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువల వెనుకబాటుతనం, పౌర హక్కులపై వేటు భారత దేశ స్థానాన్ని దిగజార్చేశాయని తెలిపింది.

భారత్ ప్రభుత్వం ఎలా స్పందించింది?

ఈ నివేదికలు మోదీ ప్రభుత్వాన్ని చికాకు పెట్టాయనడంలో ఆశ్చర్యం లేదు. అంతే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రజాస్వామ్యంపై నీలి నీడలు ఏర్పడడానికి కారణమయ్యాయి.

ఫ్రీడం హౌస్ నివేదికపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. "ఇండియాలో బలమైన సంస్థలు, స్థిరమైన ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాయి. మాకు ఎవరూ ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. ముఖ్యంగా ప్రాథమిక అవగాహన లేని వారి నుంచి మాకు ఎటువటి ఉపన్యాసాలు అక్కర్లేదు" అని తెలిపింది.

ఈ నివేదిక వెలువరించిన రాజకీయ తీర్పులు "వాస్తవ దూరాలు, వక్రీకరణలు" అని పేర్కొంది.

పార్లమెంట్‌లో ఒక ప్రతిపక్ష పార్టీ ఎంపీ వీ-డెమ్ నివేదికకు సంబంధించి ప్రశ్నించేందుకు నిరాకరిస్తూ ఎగువ సభ చైర్మన్ వెంకయ్యనాయుడు .. "భారతదేశంపై వ్యాఖ్యానిస్తున్న దేశాలన్నీ ముందు ఆత్మ పరిశీలన చేసుకుని ఆ తరువాత ఇండియాపై వ్యాఖ్యానించవచ్చు" అన్నారు.

విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ నివేదికలను తీవ్రంగా ఖండించారు.

"మీరు ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం అనే ధ్వైదీభావాన్ని వాడుకుంటున్నారు. మీకు నిజమైన సమాధానం కావాలా.. ఇది వంచన, కపటం (హిపోక్రసీ). ప్రపంచాన్ని సంరక్షించడానికి మీరే స్వయంగా కొందరిని నియమించుకున్నారు. భారతదేశం వారి ఆమోదాన్ని కోరకపోవడం, వాళ్లు ఆడాలనుకున్న ఆట ఆడడానికి సిద్ధంగా లేకపోవడం వారికి జీర్ణం కావట్లేదు. అందుకని వారికి వారే సొంతంగా నియమాలు, ప్రమాణాలు సృష్టిస్తున్నారు. వారి సొంత తీర్పులను ఇచ్చేస్తూ ఇదేదో అంతర్జాతీయ స్థాయి అభ్యాసం అన్నట్లు ప్రలోభపెడుతున్నారు" అని జయశంకర్ ఒక వార్తా పత్రికతో అన్నారు.

ఈ నివేదికలు, ర్యాంకింగులు నమ్మదగినవేనా?

నిజం చెప్పాలంటే ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో చేసే అధ్యయనాలు.

ఫ్రీడం హౌస్ నివేదికలో 195 దేశాలను, 15 భూభాగాలను లెక్కలోకి తీసుకుంటారు.

వీ-డెమ్ సంస్థ 202 దేశాలను పరిగణిస్తూ, 1789 నుంచీ 2020 వరకూ డాటా సేకరించి.. ప్రజాస్వామ్యంపై అతి పెద్ద గ్లోబల్ డాటాసెట్ తయారుచేస్తోందని పేర్కొంది.

ది ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూపొందించిన ప్రజాస్వామ్య సూచీ 165 దేశాలను, రెండు భూభాగాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

వీటన్నిటికీ కూడా "నియమాలు, ప్రమాణాలు" ఉంటాయి.

"సుమారు 30 మిలియన్ల డాటా పాయింట్లతో, 3,500 మంది స్కాలర్లు, వివిధ దేశాల నిపుణుల సహాయంతో ప్రజాస్వామ్యానికి సంబంధించిన వందలకొద్దీ భిన్నమైన లక్షణాలను అంచనా వేస్తారని" వీ-డెమ్ తెలిపింది.

యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అధ్యయనం ప్రకారం.. ఈ ర్యాంకింగులన్నీ సంఖ్యలను, విలువలను కూడా పరిగణనలోనికి తీసుకుని అధ్యయనం చేస్తాయి. ఉదాహరణకు జాతీయ చట్టసభల్లో ఏ పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించారు, అవినీతిన అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలు ఎంత ప్రభావంతమైనవి.. ఇలా ఎన్నో అంశాలను పరిశీలిస్తారు.

నిపుణుల సలహాలతో వీరు సూచీలను, నివేదికలను తయారు చేస్తారు.

ఇటీవల మైనరిటీల పట్ల వివక్ష గురించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి

యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న యొనాటన్ ఎల్ మోర్స్ "ఈ నివేదికల్లో కొంత సబ్జెకివిటీ" ఉంటుందని అంగీకరించారు. మోర్స్, వీ-డెమ్ నిపుణుల బృందంలో సభ్యులుగా ఉన్నారు.

వీ-డెమ్ చాలా విషయాలను పరిశీలించి ప్రతిభావంతంగా నివేదికను తయారుచేస్తుందని మోర్స్ తెలిపారు.

అయితే, ఈ నివేదికలన్నీ ప్రజాస్వామ్యాన్ని ఒకే రకంగా నిర్వచించవు కానీ "ఎన్నికల ప్రజాస్వామ్యం" అనేది ప్రాథమికంగా అందరూ అంగీకరించే అంశమని నిపుణులు అంటున్నారు.

భారతదేశం దిగజారిపోవడం అసాధరణమైన విషయమా?

ఈ ర్యాకింగుల ఆధారంగా చూస్తే ప్రపంచమంతటా ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని తెలుస్తోంది.

ఎన్నికల నిరంకుశత్వం 87 దేశాలలో ఉందని వీ-డెమ్ తెలిపింది. ప్రపంచ జనాభాలో 68 శాతం ఈ దేశాల్లోనే ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉదారవాద ప్రజస్వామ్య విలువలు పతనమైపోతున్నాయని ఈ సంస్థ పేర్కొంది.

20 శాతం కన్నా తక్కువ ప్రపంచ జనాభా స్వేచ్ఛాయుత సమాజంలో జీవిస్తున్నారని ఫ్రీడం హౌస్ తెలిపింది. 1995 నుంచి పోల్చి చూస్తే ఇదే అత్యంత తక్కువ స్థాయి అని పేర్కొంది.

2020 ప్రజాస్వామ్య సూచీ ప్రకారం 167 దేశాల్లో 75 మాత్రమే ప్రజాస్వామ్య విలువలు పాటిస్తున్నాయి.

"అయితే, పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో హక్కులు, స్వేచ్ఛపై వేటు పడడం ఎక్కువమందికి ఆందోళన కలిగిస్తోంది. హంగేరీ, టర్కీ తరువాత ఇప్పుడు ఇండియలో కూడా అదే జరుగుతోంది. ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వంగా వెలుగొందిన భారతదేశ చరిత్ర, జనాభా బట్టీ ఇండియా పరిస్థితి మరింత ప్రత్యేకంగా కనిపిస్తూ కలవరపెడుతోంది" అని ప్రొఫెసర్ మోర్స్ అభిప్రాయపడ్డారు.

ఇండియాలో జర్నలిస్టులపై దాడి పెరుగుతోంది

ఈ విషయంలో ఇండియా కూడా ఇటీవల కాలంలో విఫలమవుతున్న దేశాల ట్రెండ్ ఫాలో అవుతోందని ఆయన అన్నారు.

"ప్రజాదరణ పొందిన నాయకులు ముందుగా దేశంలో ముఖ్యమైన విషయాలను గుప్పిట్లో పెట్టుకుంటారు. ఉదాహరణకు ప్రభుత్వ ఉన్నతోద్యోగుల నియామకాలను రాజకీయం చేస్తారు. న్యాయ వ్యవస్థ నియామకాలను పర్యవేక్షణ నుంచీ తొలగిస్తారు. ఆ తరువాత మీడియాపై అదుపు, విద్యా స్వేచ్ఛను పరిమితం చేయడం లాంటి చర్యలతో భావ ప్రకటన స్వేచ్ఛపై వేటు వేస్తారు. తరువాత సమాజాన్ని విభజిస్తారు. ప్రతిపక్ష పార్టీపై న్యాయసమ్మతి లేకుండా చేస్తారు. వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తారు. తరువాతి ఘట్టం ఎన్నికల సమగ్రతను ఉల్లంఘించడం, పూర్తిగా మోసం చేయడం" అని మోర్స్ అన్నారు.

ఈ నివేదికలు రైట్ వింగ్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పక్షపాతం వహిస్తాయా?

షికాగో యూనివర్సిటికి చెందిన ప్రొఫెసర్ పాల్ స్టానిలాండ్ 1947 నుంచీ ఇండియాపై వీ-డెమ్ తయారుచేసిన సూచీలను పరిశీలించారు.

1970లలో ఎమర్జెన్సీ సమయంలో ఇండియా ర్యాకింగ్ తక్కువగా ఉందని ఆయన గమనించారు.

భారతదేశంలో 1950-60లకన్నా 1990లలో ప్రజాస్వామ్య విలువలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, మళ్లీ 1998-2004 మధ్య బీజీపీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ సూచీలో తరుగుదల కనిపించింది.

"కాబట్టి రైట్ వింగ్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, పక్షపాతం ఉందని అనుకోలేం. 2005 నుంచీ 2013 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కూడా ప్రజాస్వామ్య సూచీలో కొంత తరుగుదల కనిపించింది. అయితే, ఈ నివేదికలతో అంగీకరించాలని ఎవరూ ఎవరినీ బలవంత పెట్టట్లేదు. దేశంలోని పరిస్థితులను కొలిచేందుకు వేరే ముఖ్యమైన ప్రత్యామ్నాయలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి కూడా దేశం మొత్తం చిత్రాన్ని, దేశంలోని పోకడలను చూసేందుకు ఉపయోగపడతాయి" అని స్టానిలాండ్ అన్నారు.

ఈ ర్యాంకింగులు ఎంత ప్రయోజనకరం?

ఈ నివేదికలు పరిశోధనలకు, అధ్యయనాలకు ఉపయోగపడతాని యేల్-ఎన్‌యూఎస్ కాలేజిలో అసిస్టంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోహన్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.

అయితే, ఏది ప్రజాస్వామ్యం, ఎవరు నిర్ణయిస్తారు లాంటి ప్రశ్నలు వస్తాయి.

"ఎవరో కొందరు పరిశోధకులు, నిపుణులు కూర్చుని లెక్కలు కట్టి ఇదే ప్రజాస్వామ్యం, ఇది కాదు అని చెబితే నమ్మశక్యంగా ఉండదని, దేశంలోని మిగతా జనాభా ఈ సుచీలతో అంగీకరించరని విద్యావేత్తలు కానివారు భావించవచ్చు.

ఇవన్నీ కూడా దేశంలో కాకుండా, ఎక్కడో దూరంగా కూర్చుని పరిశోధన ఆధారంగా, డాటా ఆధారంగా తయారుచేసిన నివేదికలు. కాబట్టి వీటిపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇరు వర్గాల వారు చూసే దృక్కోణం వేరుగా ఉంటుంది" అని రోహన్ ముఖర్జీ అంగీకరించారు.

"ప్రజాస్వామ్యనికి వీ-డెమ్ ఇచ్చే నిర్వచనం కచ్చితంగా, బహుముఖంగా ఉంటుంది. అయితే, భారతదేశంలోని ప్రజలు వీటిని చూడకపోవచ్చు. అక్కడ నివసిస్తూ, అక్కడి పరిస్థితులను స్వయంగా చూస్తున్నవారికి భిన్నాభిప్రాయం ఉండవచ్చు. అలాగని, వారి అనుభవాలను తక్కువ చేయలేం. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న దృక్కోణంలో తేడాను అర్థం చేసుకోవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి" అని ఆయన విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Electoral tyranny: Deteriorating democracy in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X