వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హిందూ మత రక్షణ కోసం ఆయుధాలు చెపట్టాలి' - హరిద్వార్ ధర్మ సంసద్‌లో ప్రసంగాలపై కలకలం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

హరిద్వార్‌లో డిసెంబర్ 17 నుంచి 19 వరకూ నిర్వహించిన 'ధర్మ సంసద్‌'లో హిందుత్వం గురించి సాధువులు, సన్యాసులు ఇచ్చిన వివాదాస్పద ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోల్లో మతాన్ని కాపాడుకోడానికి ఆయుధాలు చేపట్టాలని, ముస్లిం ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాను పెరగనివ్వకూడదని అంటుండడంతోపాటూ హిందూ మతం రక్షణ పేరుతో సాధువులు వివాదాస్పద ప్రసంగాలు ఇస్తూ కనిపిస్తున్నారు.

వీరిలో ఒక సన్యాసిని కూడా ఆయుధాలు చేపట్టాలని చెప్పడం కనిపిస్తోంది.

Haridwar

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన కొన్ని గంటల తర్వాత కూడా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో జిల్లా యంత్రాంగంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే. డెహ్రాడూన్‌లో గురువారం సీనియర్ పోలీసు అధికారుల సమావేశం జరిగింది. దీనికి హరిద్వార్ ఎస్ఎస్‌పీ డాక్టర్ యోగేంద్ర సింగ్ యాదవ్ కూడా హాజరయ్యారు.

ఈ అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హరిద్వార్ ఎస్ఎస్‌పీని ఆదేశించానని, ఐపీసీ సెక్షన్ 153A కింద కేసు నమోదు చేశామని ఈ సమావేశం తర్వాత రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు.

ఆలస్యంగా కేసు నమోదు చేయడం గురించి మాట్లాడిన ఆయన "మధ్యాహ్నానికి మాకు ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం. ఇలా రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం తప్పు. అందుకే, మేం ఈ వీడియోలను సోషల్ మీడియాలో బ్లాక్ చేయాలని కూడా చెప్పాం" అని డీజీపీ తెలిపారు.

https://twitter.com/uttarakhandcops/status/1474028455960276996

మరోవైపు, "సోషల్ మీడియాలో ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి విద్వేషాలు వ్యాపించేలా చేయడానికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలను పరిగణనలోకి తీసుకుని వసీం రిజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగీ, మిగతా వారిపై ఐపీసీ 153A కింద హరిద్వార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. చట్టపరమైన చర్యలు చేపడతాం" అని ఉత్తరాఖండ్ పోలీసులు ట్విటర్‌లో ఒక ప్రకటన చేశారు.

కాషాయ రాజ్యాంగం

ఈ ధర్మ సంసద్‌లో బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్, జునా అఖాడ మహామండలేశ్వర్, గాజియాబాద్ సాధువు యతి నరసింహానంద్ సరస్వతి, జునా అఖాడా మహామండలేశ్వర్, రైట్ వింగ్ సంస్థ హిందూ రక్షాసేనకు చెందిన స్వామీ ప్రబోధానంద్, నిరంజనీ అఖాడా మహామండలేశ్వర్ మా అన్నపూర్ణ సహా ధర్మ సంసద్ నిర్వాహకులు పండిత్ అధీర్ కౌశిక్, మరో వెయ్యి మందికి పైగా మహామండలేశ్వర్, మహంత్, సాధువులు హాజరయ్యారు. జునా, నిరంజనీ, మహానిర్వాణీ సహా హరిద్వార్‌లోని అన్ని ప్రముఖ అఖాడాలూ ఇందులో పాల్గొన్నాయి.

అఖాడా పరిషత్ అధ్యక్షులు కూడా ధర్మ సంసద్‌ కార్యక్రమానికి హాజరయ్యారు.

ధర్మ సంసద్‌కు హాజరైన బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ కార్యక్రమానికి కాషాయ రాజ్యాంగం తీసుకువచ్చారు.

"భారత్‌లో హిందీ భాషలో, కాషాయం రంగులో మనం రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా ముద్రించుకోవాల్సి వస్తోంది, ఇది సిగ్గు పడాల్సిన విషయం" అన్నారు.

"అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆక్రమించారు. అలాంటి అశాంతి భారత్‌లో కూడా చెలరేగవచ్చు. ప్రపంచంలో అశాంతి తలెత్తకుండా చేయడం హిందువుల బాధ్యత. ఈరోజు హిందువులు తమ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన సమయం వచ్చింది" అని జునా అఖాడా మహామండలేశ్వర్, ప్రబోధానంద గిరి బీబీసీతో అన్నారు.

"హిదువులపై దాడులు పెరుగుతున్నాయి. హరిద్వార్‌లో ముస్లిం జనాభా ఆధిపత్యం పెరుగుతోంది. హిందువులపై ఎవరైనా దాడి చేస్తే, మేం ఆత్మరక్షణ కోసం ఆయుధాలు చేపట్టవచ్చు" అని చెప్పారు.

కానీ ఆయన తన వాదనలకు ఎలాంటి ఆధారాలూ అందించలేకపోయారు. ఈ వాదనలకు విశ్వసనీయత కూడా లేదు.

ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదంతా ఎన్నికల ముందు వ్యూహమే అని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

కానీ, "ఎన్నికలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మేం హిందువుల రక్షణ కోసం ఉద్యమం ప్రారంభించాం. హరిద్వార్‌లోని మహాత్ములందరూ మాకు మద్దతు పలికారు" అని ప్రబోధానంద్ చెప్పారు.

"గత ఏడేళ్ల నుంచి ఇలాంటి ధర్మ సంసద్ నిర్వహిస్తున్నాం. ఇంతకు ముందు దిల్లీ, గాజియాబాద్‌లో కూడా ఇలాంటి ధర్మ సంసద్‌లు నిర్వహించాం. హిందూ దేశం ఏర్పాటు దిశగా సన్నాహాలు చేయడమే దీని లక్ష్యం. దానికోసం ఆయుధాలు చేపట్టాల్సి వచ్చినా, చేపడతాం" అని హరిద్వార్‌లో ధర్మ సంసద్ స్థానిక నిర్వాహకులు, పరశురామ అఖాడే అధ్యక్షులు పండిత్ అధీర్ కౌశిక్ అన్నారు.

"హిందూ యువతను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. వారిని బెయిల్ మీద విడిపించడానికి, వారి కుటుంబాలకు తాము అన్ని రకాల సాయం అందిస్తాం. మనకు మాత్రం ఇద్దరు పిల్లల్నే కనాలని చెబుతారు. వారికి మాత్రం 12-20-40 మంది వరకూ పిల్లలు పుడతారు. జనాభా నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి" అని చెప్పారు.

తర్వాత ధర్మ సంసద్ కోసం సన్నాహాలు

పండిత్ అధీర్ వివరాల ప్రకారం తర్వాత ధర్మ సంసద్‌ను ఏప్రిల్-మేలో మధురలోని బృందావనంలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మహామండలేశ్వర్ యతి నరసింహానంద్ గిరి మహరాజ్ ధర్మ సంసద్ తీర్మానం ప్రకటించారు.

"ఇక సనాతన వైదిక దేశం స్థాపనే ప్రతి హిందువు లక్ష్యం కావాలి. ప్రస్తుతం క్రైస్తవులకు 100కు పైగా దేశాలు ఉన్నాయి. ముస్లింలకు 57 దేశాలున్నాయి. బౌద్ధులకు కూడా 8 దేశాలు ఉన్నాయి. కేవలం 90 లక్షల మంది యూదులకు కూడా తమకంటూ ఇజ్రాయెల్ దేశం ఉంది. నా దేశం అని చెప్పుకోడానికి ఒక అంగుళం చోటు కూడా లేకపోవడం వంద కోట్ల మంది హిందువుల దౌర్భాగ్యం. ఇక హిందువులు తమ దేశం కోసం తమ మొత్తం జీవితాన్ని ఇవ్వాల్సి ఉంటుంది" అన్నారు.

జునా అఖాడాకు చెందిన ప్రబోధానంద్ గిరి చర్చల్లో నిలవడానికి ఇలాంటి ప్రసంగాలు చేస్తుంటారని, కానీ, నరసింహానంద్, అధీర్ కౌశిక్ దీనిని ఒక మిషన్‌లా తీసుకుని చేస్తున్నారని హరిద్వార్ స్థానిక జర్నలిస్ట్ ధర్మేంద్ర చౌధరి చెప్పారు.

"ఇక్కడ ప్రతి ఆరు నెలలకు లేదా 8 నెలలకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రసంగాలు ఇస్తుంటారు. కానీ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన తర్వాత ప్రజల దృష్టి దీనిపై పడింది" అని ధర్మేంద్ర చౌధరి తెలిపారు.

https://twitter.com/drshamamohd/status/1473934900508053507

రెచ్చగొట్టే ప్రకటనలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్

కాంగ్రెస్ ప్రతినిధి షామా మొహమ్మద్ ట్వీట్ ద్వారా ఈ సభపై, అక్కడ ఇచ్చిన ప్రసంగాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

"జోకులు వేయకపోయినా, వేశారని ఆరోపిస్తూ మున్వర్ ఫారూఖీని శిక్షించారు. కానీ ధర్మ సంసద్‌ సభ్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు" అని ఆమె అన్నారు.

ధర్మ సంసద్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి గరిమా మెహ్రా దసౌనీ బీబీసీతో మాట్లాడారు.

"యువతకు ఉద్యోగాలు డిమాండ్ చేయడానికి, ద్రవ్యోల్బణం అంశంపై ధర్మ సంసద్ నిర్వహించడానికి బదులు కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు హిందుస్తాన్, పాకిస్తాన్, ముస్లింలు అనేది వీళ్ల ఎజెండా అవుతుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో గంగలో శవాలు తేలుతున్నప్పుడు, వారిలో హిందూ, ముస్లిం అందరూ ఉన్నారు. ఆ సమయంలో హిందూ మతం పతాకధారులు వారికి అంత్యక్రియలు చేయడానికి ఎందుకు రాలేదు. ఇలాంటి మానసికత ఉన్న వారు దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు" అన్నారు.

ధర్మ సంసద్‌లో చేసిన ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, కోర్టులు, పోలీసులు దీనిని సూమోటోగా తీసుకోవాలని ఆమె కోరారు.

https://twitter.com/pushkardhami/status/1472180823088513033

ఆరోజు హరిద్వార్‌లోనే ఉన్న జేపీ నడ్డా, పుష్కర్ ధామీ

ఈ ధర్మ సంసద్ డిసెంబర్ 17 నుంచి 19 వరకూ జరిగింది. డిసెంబర్ 18న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హరిద్వార్‌లో విజయ సంకల్ప యాత్ర ప్రారంభించడానికి అక్కడే ఉన్నారు.

ఆయనతోపాటూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మదన్ కౌశిక్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కౌశిక్ హరిద్వార్ ఎమ్మెల్యే కూడా. ఆయన ఇదంతా జరిగినది తనకు తెలీదని చెప్పారు.

"నాకు తెలీకుండా అలా ఏం ధర్మ సంసద్ జరిగిందో నేను వివరాలు తెలుసుకుంటాను. నాకు దీనికి సంబంధించి ఉదయమే ఫోన్ వచ్చింది. డిసెంబర్ 18న మేమంతా జేపీ నడ్డా గారి కార్యక్రమంలోనే ఉన్నాం" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
In order to save hinduism, one needs to hold weapons- statement creates panic
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X