• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళలోని కొందరు నన్‌లు ఒక బిషప్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

By BBC News తెలుగు
|

కేరళలోని ఒక బిషప్ చేసిన మతపరమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కొంతమంది నన్‌లు నిరసనలు చేపట్టడంపై విమర్శల కంటే వారికి మద్దతే ఎక్కువగా లభిస్తోంది.

ఇప్పుడు ఈ నిరసనలు మతపరమైన సేవలు అందించే మహిళలు, మత బోధకుల మధ్య పోరాటానికి చిహ్నంగా మారాయి.

nun

ఆదివారం జరిగే సామూహిక బోధనలను నన్‌లు బహిష్కరించడం ఈ చర్చి చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఒక మతానికి చెందిన వారితో వ్యాపారం చేయవద్దన్న ఒక బిషప్ ప్రకటనకు నిరసనగా వీరంతా ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు.

గత వారం కాథలిక్ క్రైస్తవ సంస్థ సైరో-మలబార్ కాథలిక్ చర్చ్ బిషప్ మార్ జోసెఫ్ కల్లారంగట్ తన మత బోధనల్లో 'లవ్ జిహాద్' లాగే 'నార్కోటిక్స్ జిహాద్' అనే మాటను ఉపయోగించారు. సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్‌లో నన్‌లను ఉద్దేశించి చేసిన బోధనల్లో ఆయన ఇంకాస్త ముందుకెళ్లి వ్యాఖ్యలు చేశారు.

బిషప్ తాజా వ్యాఖ్యలపై సిస్టర్ అనుపమ బీబీసీతో మాట్లాడారు.

"కొంతమంది చేసిన తప్పులకు ముస్లింలందరూ దోషులని చెప్పడం సరికాదని, అలా అనవద్దని మేము ఆయనకు చెప్పాం. అలాంటి వారు ప్రతి మతంలోనూ ఉన్నారని అన్నాం. ఆయన తన బోధనల సమయంలో 'మీరు ముస్లింల హోటళ్లలో బిర్యానీ తినకూడదు, ముస్లింల షాపులకు వెళ్లడం, ముస్లింల ఆటోల్లో ప్రయాణించడం లాంటివి చేయకూడదు అన్నారు" అని అనుపమ చెప్పారు.

"మేం విద్యార్థులం. ముస్లింల ఆటోల్లో వెళ్లడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులూ రాలేదని ఆయనతో అన్నాం. కానీ బిషప్ తన 'నార్కోటిక్స్ జిహాద్', మిగతా వ్యాఖ్యలపై అసలు వెనక్కు తగ్గలేదు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం పోప్ అభిప్రాయానికి కూడా విరుద్ధం" అని సిస్టర్ అనుపమ అన్నారు.

సిస్టర్ అనుపమ, సిస్టర్ ఎఫ్లీ, సిస్టర్ ఎంకిట్టా, సిస్టర్ జోసెఫిన్ వీరంతా 2018 సెప్టెంబర్‌లో చారిత్రక నిరసనలకు నేతృత్వం వహించిన నన్‌లు. నన్ మీద అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక బిషప్ స్థాయి మతపెద్దను తిరిగి చర్చిలో నియమించడాన్ని వీరంతా వ్యతిరేకించారు.

ఈ రెండు నిరసనలూ భిన్నమైనవి. కానీ వీటి ద్వారా చర్చిల్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయనేది అర్థమవుతోంది. మతపరమైన సేవలు అందించే మహిళలు ఫాదర్ల ఆధిపత్యాన్ని చాలా రకాలుగా నిరసిస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులు లేక మోసాలు, నన్‌లను దిగువ స్థాయి వారిగా చూడడం లాంటి వాటిని వ్యతిరేకించడంపై ఈ మహిళలు వెనక్కు తగ్గడం లేదు.

"దాదాపు అన్ని మత సంస్థల్లో కచ్చితంగా పితృస్వామ్యం, అణచివేత ఉంది. అక్కడ మహిళలు వ్యవస్థ చివర్లో ఉంటారు. ఆదేశాల రూపంలో జరుగుతున్న లైంగిక వేధింపులపై వారు ఫిర్యాదు చేశారు. అవి అప్పుడప్పుడు లైంగిక వేధింపులను మించి ఉంటున్నాయి. బిషప్ ములక్కల్ దానికి ఒక ఉదాహరణ" అని సుప్రీంకోర్ట్ సీనియర్ లాయర్ రెబెక్కా మెమన్ జాన్ బీబీసీతో అన్నారు.

"ఫిర్యాదులు చేయడానికి కాన్వెంట్ వారికి అనుమతి ఇవ్వదు. వాళ్లు అలా చేస్తే, వారిని చర్చి నుంచి వెళ్లగొడతారు. ఇలా ప్రతి సంస్థలో ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుందని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ బ్రేక్ పాయింట్‌కు నమూనా మాత్రమే" అని ఒక వకీలుగా, స్త్రీవాదిగా పనిచేస్తున్న రెబెక్కా జాన్ అన్నారు.

ఒక్క కేరళలోనే 45వేల మంది నన్‌లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది నన్‌లు ఎవరినీ వ్యతిరేకించడం లేదు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే చర్చిలో మహిళల సమస్యలు కూడా వినాల్సి ఉంటుంది" అని గతంలో సిస్టర్‌గా ఉన్న కొచురాణి అబ్రహామ్ బీబీసీతో అన్నారు.

చర్చిలో నన్‌ల పట్ల ప్రవర్తన

"చర్చిలో నన్‌లు చెప్పేది వినడం లేదని ఒక అధ్యయనంలో తేలింది. కాన్ఫరెన్స్ ఆఫ్ రిలీజియస్ ఆఫ్ ఇండియా (సీఆర్ఐ)కు చెందిన మహిళా గ్రూప్ ఈ అధ్యయనం చేసింది. చర్చిలో మహిళలను తమ నౌకర్లుగా చూస్తున్నారని 'వాటికన్', 'మాటర్స్ ఇండియా' అనే రెండు ప్రచురణ సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ అధ్యయనం చేశారని కొచురాణి అబ్రహామ్ చెప్పారు.

మిషనరీస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్‌కు సంబంధించిన నోయెలా డిసౌజా ముంబయి నుంచి దీనిపై బీబీసీతో మాట్లాడారు.

"శిక్షణ సంస్థలకు చర్చి నుంచి నిధులు అందుతూ ఉన్నప్పటికీ, అక్కడ పనిచేస్తున్న నన్‌లకు తక్కువ వేతనం ఇస్తున్నారనేది మేం గుర్తించాం. వారు చేస్తున్న పనికి సరైన గౌరవం లభించేది కాదు. వారికి సెమినరీలో ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. ఫాదర్లు ఎప్పుడూ వారికి ఆదేశాలు ఇచ్చేవారు" అని చెప్పారు.

"ఆ అధ్యయనంలో నన్‌లను తిట్టేవారని, వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొనేవారని మాకు తెలిసింది. ఫాదర్లు వారిని ఎప్పుడూ నీచంగా చూసేవాళ్లు. విద్యా రంగం అయినా, గ్రామాభివృద్ధి అంశం అయినా అందరికంటే నన్‌లే ముందుంటారు. కానీ చర్చ్‌ ఉన్నతాధికారులు నన్‌లను ప్రశంసించడం ఫాదర్లకు నచ్చదు" అని డిసౌజా అన్నారు.

అతిపెద్ద సమస్య భూములే

కానీ, ఇప్పుడు నన్‌లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఒకటుంది. విద్య లేదా ఇతర అభివృద్ధి పనుల కోసం నన్‌లకు ఇంతకు ముందు ఇచ్చిన భూమిని మతాధికారులు తిరిగి లాగేసుకుంటున్నారు.

"భూములను ఒక ఒప్పందం రూపంలో ఇస్తారు. కానీ ఇప్పుడు సిస్టర్లు చర్చ్ దయ మీద ఆధారపడి ఉండడాన్ని మనం చూస్తున్నాం" అని నోయెలా డిసౌజా చెప్పారు.

నన్‌లు ఫాదర్ల మధ్య భూముల వివాదానికి సంబంధించిన ఒక కేసు సుప్రీంకోర్టు వరకూ కూడా వెళ్లింది. మరోవైపు ఇలాంటి వివాదాలకు సంబంధించిన కేసుల్లో కేరళ కోర్టుల్లో ఎప్పుడూ విచారణలు జరుగుతుంటాయి.

ఎర్నాకుళంలో న్యారాకాల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ సిస్టర్ ఎనీ జైస్ బీబీసీతో ఇలాంటి వివాదానికి సంబంధించిన విషయం చెప్పారు.

"భూమి అనేది చర్చి బలహీనత. మాకు రెండు స్కూళ్లు ఉన్నాయి. లిటిల్ ఫ్లవర్ స్కూల్(కేరళ బోర్డు), సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్(సీబీఎస్ఈ) రెండూ మూడు ఎకరాల 69 సెంట్ల భూమిలో ఉన్నాయి. దానిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని కేసులు పెట్టిన తర్వాత, ఇప్పుడు మేం మా సీనియర్ అధికారి బిషప్‌కు భూమిలో ఒక భాగం ఇచ్చేయాలని చూస్తున్నాం" అన్నారు.

"నన్ ఆర్క్ డివోసెజ్‌కు భూములు ఇచ్చేస్తే, అది చాలా చెడు ఉదాహరణగా మారుతుంది. అది కచ్చితంగా జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుంది. దేశంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి. బిషప్‌లు ఆ భూములన్నింటి మీదా కన్నేస్తారు. నన్‌లు వారి మాట వినడానికి, వారికి లొంగిపోడానికి సిద్ధంగా ఉండాలి. పితృస్వామ్య చర్చి దానిని సులభంగా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు" అని మాటర్స్ ఇండియా ఎడిటర్ జాన్ కవి చెప్పారు.

భూములకు సంబంధించిన కేసుల్లో కేరళ చర్చిలు, రాజకీయ వర్గాల్లో అవగాహన ఉంది. చర్చికి చెందిన కొంతమంది మత పెద్దలు, బీజేపీతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు.

బిషప్ జోసెఫ్ కల్లారంగట్ 'నార్కోటిక్స్ జిహాద్' గురించి చేసిన వ్యాఖ్యలు కేరళలో ఒక పెద్ద వివాదం సృష్టించాయి. ఎందుకంటే అక్కడ 26 శాతం ముస్లింలు, క్రైస్తవులు 18 శాతం ఉన్నారు. మరోవైపు, బిషప్ వ్యాఖ్యలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఎందుకంటే, అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికి ఇది ప్రారంభంగా చూస్తోంది. మరోవైపు, సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఈ అంశాన్ని కాంగ్రెస్ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నంగా భావిస్తోంది.

చర్చిలో జరిగిన ఇలాంటి ఘటనలను బట్టి అక్కడ ప్రతి నన్, సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్‌లోని సిస్టర్‌లాగే ఆలోచిస్తారని అనుకోవడం పొరపాటే అవుతుంది.

"కానీ, ఇది ఒక ప్రారంభం. మనం ఆమె సాహసాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆమెకు సిస్టర్ లూసీ కలాప్పురా(బిషప్ ములక్కల్‌ను వ్యతిరేకించినందుకు ఈమెను తొలగించారు)తో పోలిస్తే చాలా ధైర్యం ఉంది. అందుకే ఆమె ప్రమాదాలకు ఎదురెళ్లి బిషప్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలని నిర్ణయించారు. ఆమె మాకు, మా విశ్వాసాలకు ప్రతినిధి కారు. కానీ, ఆమె ఏం చేశారో అది చాలా పెద్ద విషయం" అని రెబెక్కా మెమన్ జాన్ అన్నారు.

అయితే, కొట్టాయం నన్‌ల ఈ నిరసనలపై కేరళ కాథలిక్ బిషప్ కౌన్సిల్(కేసీబీసీ) నుంచి వివరణ తెలుసుకోవాలని బీబీసీ ప్రయత్నించింది. కానీ మాకు ఎలాంటి సమాధానం లభించలేదు.

మరోవైపు బిషప్ ప్రకటనలపై ఎలాంటి కేసూ నమోదు కాలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.

రాష్ట్రంలో ముస్లింలు, క్రిస్టియన్ల మధ్య వివాదాలు సృష్టించాలనేది ఆయన ఉద్దేశం కాదని, కొందరు ఉపయోగించే పద్ధతుల నుంచి క్రైస్తవులను హెచ్చరించాలనే ఆయన అలా అన్నారని తెలిపారు.

బిషప్‌ను వెనకేసుకొచ్చిన విజయన్ "నార్కోటిక్స్ జిహాద్" అనే మాటను ఆయన నిజానికి డ్రగ్స్, దానికి సంబంధించిన నేర కార్యకలాపాలను ఉద్దేశించి చెప్పడానికి ఉపయోగించారు. అయితే, డ్రగ్స్ వ్యాపారాన్ని ఒక మతానికి జోడించి చూడడం తప్పు" అన్నారు.

"రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని విభజించాలని ప్రయత్నించేవారు, ఇలాంటి వ్యాఖ్యలను వక్రీకరించి చూపే అవకాశం ఉందనే విషయం మత పెద్దలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది" అని విజయన్ చెప్పారు.

బిషప్‌కు అనుకూలంగా ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాష్ట్ర పోలీసులు ఇప్పుడు బిషప్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోడానికి న్యాయ సలహాలు కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Why do some nuns in Kerala oppose this bishop
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X