వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మ్యాజిక్ ఏమిటి: రాహుల్ గాంధీ మైనస్ ఏమిటి?

దేశంలో కాంగ్రెసు పరిస్థితి రోజు రోజుకూ దిగదుడుపుగా మారిపోతోంది. ఆ మేరకు బిజెపి తన రెక్కలను విస్తరిస్తోంది. కాంగ్రెసు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెసు పార్టీ క్రమక్రమంగా కుంచిచుకుపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిజెపి క్రమక్రమంగా విస్తరిస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉండడమే దీనికి ప్రధానమైన సూచిక. కాంగ్రెసు కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవి కూడా చిన్న రాష్ట్రాలు కావడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ప్రభంజనం వీచింది. దీన్ని బట్టి వచ్చే కాలంలో ఆ పార్టీకి ఎదురు లేదని అనిపిస్తోంది. 2019లో జరిగే లోకసభ సాధారణ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడానికి అవకాశాలున్నట్లు కూడా ప్రస్తుత ఫలితాలు తెలియజేస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు బిజెపి ఆధిపత్యంలో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో బిజెపి అధికారాన్ని పంచుకుంటోంది. కాంగ్రెసు అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం కర్ణాటక మాత్రమే. అది కూడా జారిపోయే ప్రమాదం లేకపోలేదు.

Modi vs Rahul gandhi: BJP in ruling majority states

దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బిజెపి ఇప్పటి వరకు పాగా వేయలేకపోయింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. కాంగ్రెసు కర్ణాటకను మినిహాయిస్తే మణిపూర్, అస్సాం, మిజోరం వంటి చిన్న రాష్ట్రాల్లో మాత్రమే ఆధిపత్యం వహిస్తోంది.

నాయకత్వం నరేంద్ర మోడీ చేతుల్లోకి వచ్చిన తర్వాత బిజెపి వ్యవహార శైలి మారిపోయింది. దూకుడుగా ముందుకు వెళ్తోంది. నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండడం ఓ ప్లస్ పాయింట్ అయితే, తన చరిష్మా ఏ మాత్రం తగ్గకుండా ముందుకు సాగడం మరో కారణం. ఆయనకు అమిత్ షా వంటి మేనేజిరియల్ కెపాసిటీ ఉన్న నాయకుడు తోడు కావడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. బిజెపి అధ్యక్షుడిగా అమిత్ షాను నిలబెట్టడంలో మోడీదే ప్రధాన పాత్ర.

అదే సమయంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దాన్ని యువత ముందుకు తీసుకుని వెళ్లడంలో మోడీ విజయం సాధించారనే చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం ఆయనది అందె వేసిన చేయిగా చెప్పవచ్చు. ఆ క్రమంలోనే కొత్త సంప్రదాయాలను, సాఫ్ట్‌వేర్ వంటి కొత్త వృత్తులను ఆశ్రయించిన యువతకు ఆయన మార్గదర్శకుడిగా కనిపిస్తున్నారు.

దేశంలో ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపి, ముస్లిం ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో మోడీ సమర్థంగా పనిచేస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి, కొత్తగా సవాల్ విసురుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదానికి మోడీ మాత్రమే ధీటుగా సమాధానం చెప్పగలరనే అభిప్రాయం కూడా యువతలో బలంగా ఉంది.

నరేంద్ర మోడీ మాటల మాయాజాలం కూడా ప్రజలను ఆకట్టుకుంటోంది. రాహుల్ గాంధీ విమర్శలకు ధీటైన జవాబు ఇవ్వగల నేర్పు ఆయనను మంచి వక్తగా నిలబెడుతోంది. పైగా, సైద్ధాంతిక బలంతో నిబద్ధతతో పనిచేసే నాయకులు, కార్యకర్తలు బిజెపికి ఉండడం కూడా కలిసి వస్తోంది.

మరోవైపు, రాహుల్ గాంధీ వయస్సులో చిన్నవాడే అయినా యువతను ఆకట్టుకోవడంలో విఫలమైనట్లు కనిపిస్తున్నారు. గాంధీ వారసత్వం పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. గాంధీ కుటుంబం అంటే గతంలో ఉండే ఆరాధనా భావానికి కాలం చెల్లినట్లే భావించాలి. దాంతో ఆ మ్యాజిక్ రాహుల్ గాంధీ విషయంలో పనిచేయడం లేదు.

వక్తగా కూడా రాహుల్ గాంధీ అంత సమర్థత ఉన్న నాయకుడిగా కనిపించడం లేదు. పైగా, కాంగ్రెసులో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కుమ్ములాటలు ఉండడం, ప్రజాదరణ ఉన్న నాయకులను వదులుకోవడ కూడా రాహుల్ గాంధీకి కలిసి రావడం లేదు. స్థానిక నాయకత్వాలు ఇప్పటికీ రాహుల్ గాంధీ లేదా గాంధీ వారసత్వం అనే కార్డును వాడుకుని ముందుకు సాగాలని మాత్రమే ప్రయత్నిస్తున్నారు. పైగా, ఏ రాష్ట్రానికి తగినట్లు ఆ రాష్ట్రానికి వ్యూహాలు ఖరారు చేసి అమలు చేయడంలో విఫలమవుతున్నారు. పార్టీకి సైద్ధాంతిక నిబద్ధత కొరవడడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది.

రాహుల్ గాంధీకి స్థానిక నాయకత్వాల నుంచి సరైన సమాచారం కూడా అందడం లేదనేది అర్థమవుతోంది. పైగా, స్థానిక నాయకత్వాలు బలంగా ఉంటే సహించకపోవడం కాంగ్రెసు పార్టీలో మరో లోపం. వ్యవస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం ఆ పార్టీకి లేదు.

English summary
While Congress is losing base in majority states of India under the leadership of Rahul Gandhi, BJP is gaining under the leadership of Narendra Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X