ఏపీ, తెలంగాణ మధ్య 'పాల' పోరు: 'విజయ' బ్రాండ్‌పై భిన్న ప్రకటనలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య ఏదో ఒక అంశంపై వివాదం తలెత్తున్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంపై పెను వివాదమే నడుస్తోంది. మరోవైపు ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ అడ్వకేట్లు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ప్రైవేట్ డెయిరీలకు ఎదురొడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రభుత్వ పాల ఉత్పత్తుల సంస్థ 'ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీ డెయిరీ)' ఉత్పత్తి చేస్తున్న 'విజయ' బ్రాండ్ పాలపై ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం చోటుచేసుకుంది.

రాష్ట్ర విభజనలో భాగంగా కొన్ని సంస్ధలు తొమ్మిది, పదో షెడ్యూల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. విభజన చట్ట ప్రకారం ఏపీ డెయిరీ తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్నప్పటకీ ఇప్పటికీ ఉమ్మడిగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ కేంద్రంగా పాల వ్యాపారం చేస్తున్న ఏపీ డెయిరీ... 'విజయ' బ్రాండ్ పాలను తెలంగాణలో కూడా విక్రయిస్తోంది.

 Vijaya milk

ఈ విషయాన్ని మొన్నటివరకూ అంతగా పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే 'తెలంగాణ పాడి సమాఖ్య' పేరిట ప్రత్యేక సంస్థను నెలకొల్పుకుని 'విజయా' బ్రాండ్ పేరిటే పాలను విక్రయిస్తోంది. ఈ బ్రాండ్‌కు 'తెలంగాణ' అనే ట్యాగ్ లైన్ తగిలించింది.

మరోవైపు ఏపీ డెయిరీ తెలంగాణలో విక్రయిస్తోన్న 'విజయ' బ్రాండ్ పాలను పాలమూరు జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాంబశివ డెయిరీ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు తన పాలను పంపించి అక్కడ ప్రాసెస్ చేయిస్తోంది.

ఈ క్రమంలో సాంబశివ డెయిరీ నుంచి విజయ బ్రాండ్ పేరుతో కొందరు ప్రజలకు నకిలీ పాలు సరఫరా చేస్తున్నారని విజయ డెయిరీ ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీసాంబశివ డెయిరీ ప్రోడక్ట్స్ సంస్థ సేకరించిన పాలను అచ్చం విజయ బ్రాండ్ డిజైన్‌లో ముద్రించి ఉన్న నకిలీప్యాకెట్లలో నింపి మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్నారనీ, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

ప్యాకెట్లను సరిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయ డెయిరీ ఐదు దశాబ్దాలుగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అన్ని నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ఆరోగ్యకరమైన పాలను విక్రయిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ ప్రకటనకు కౌంటర్‌గా ఆదివారం ఏపీ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ జి.మురళి మరో ప్రకటన విడుదల చేశారు. సాంబశివ డెయిరీ నుంచి విడుదలవుతున్న 'విజయ' బ్రాండ్ పాలు నకిలీవి కావని, వాటిలో ఎలాంటి కల్తీ లేదని ఆయన పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Telangana State Dairy Development Co-operative Federation Ltd has advised customers of its ‘Vijaya’ brand milk to verify the authenticity of the sachet while purchasing. Vijaya milk is processed at its Milk Products Factory in Lalapet. This is mentioned on the packs/sachets supplied in the city.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X