• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్ మూడెకరాల భూమికి చిల్లులు: ఎనిమిది ఎకరాలున్న వారికీ భూమి

By Swetha Basvababu
|

హైదరాబాద్/ కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మక పథకం 'మూడెకరాల భూమి' పంపిణీ అమలు విషయమై సర్కార్ ఆత్మరక్షణలో పడిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వాధికారులు నిర్వహించిన సర్వేలోనే 55 వేల పై చిలుకు దళితులు అర్హులని గుర్తిస్తే మూడేళ్ల కాలంలో కేవలం 216 మందికి మాత్రమే భూ పంపిణీ జరిగింది.

అందులోనూ అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఎనిమిది ఎకరాల భూమి గల కుటుంబానికి మూడెకరాల పథకం ఎలా అమలైందన్న అనుమానం సహజసిద్ధంగానే దళితుల్లో వ్యక్తం అవుతున్నది.

మానకొండూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు దళితుల ఆత్మహత్యాయత్నం ప్రభుత్వాన్ని మరింత చిక్కుల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహంకాళి శ్రీనివాస్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నది. గూడెం గ్రామంలో భూమి ఉన్న వారికి భూమి మంజూరు చేశారని ఆరోపణలు వచ్చాయి.

Eight acres land owner qualifying for 'Land for Dalits'

ఎనిమిదెకరాల భూమున్నోళ్లకే 'మూడెకరాలు'

మానకొండూర్‌లో బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసింది. కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు.. శంకరపట్నం మండల కేంద్రంలోనూ దళితులు రాస్తారోకోకు దిగారు. హుజూరాబాద్‌, సైదాపూర్‌లో బీజేపీ, ఎంఆర్‌పీఎస్‌, తీగులగుట్టపల్లిలో కాంగ్రెస్‌, రేకుర్తిలో టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, టీడీపీ, దళిత సంఘాలన్నీ ఏదో ఒకచోట ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం ఇరుకున పడ్డాయి. సంజాయిషీ ఇచ్చుకునే స్థితికి పడిపోవడం అధికార టీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడడంలేదు.

దళితులకు మూడెకరాలు.. అసలైన లబ్దిదారులను పక్కన బెట్టి చేతులు తడిపిన వారికి పెద్దపీట వేశారు. దీన్ని ప్రశ్నించిన దళిత యువకులకు అధికార టీఆర్ఎస్ నేతల బెదిరింపులు, అధికారుల చీదరింపులే ఎదురయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడంతో కలత చెందిన ఇద్దరు దళిత యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. అందరినీ వదిలేసి దీనికి దళిత వీఆర్వోను బలిపశువును చేసి సస్పెండ్‌ చేశారు. ఇది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం వేదికగా అధికార టీఆర్ఎస్ గ్రూపు రాజకీయాల నేపథ్యం. జిల్లాల పునర్విభజనలో కరీంనగర్‌ జిల్లాలోని బెజ్జంకి మండలం గూడెం ఇప్పుడు సిద్దిపేటలో చేరింది. నియోజకవర్గాల్లో మార్పులేకపోవడంతో ఆ గ్రామం మానకొండూరులోనే కొనసాగుతోంది.

34 మంది అర్హులు.. ఎనిమిది మందికి భూ పంపిణీ

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాలతో మూడెకరాల భూపంపిణీలో అవకతవకలు జరిగాయి. గూడెంలో భూపంపిణీకి 34మందిని అర్హులుగా గుర్తించారు. 24 ఎకరాల భూమి కొనుగోలు ప్రతిపాదనల నేపథ్యంలో గ్రామసభ నిర్వహించకుండానే ఎనిమిది మందికి మాత్రమే పట్టాలిచ్చారు. ఇందులో మూడు నుంచి 8ఎకరాలు ఉన్న లబ్దిదారులూ ఉన్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో సెంట్ భూమి లేని దళిత యువకులు యాలాల పరశురాములు, మహంకాళి శ్రీనివాస్‌ ఆవేదనకు గురయ్యారు. జాబితాలో తమ పేర్లు లేవని అధికారులను ప్రశ్నించారు.

స్థానిక సర్పంచ్‌కు మొరపెట్టుకున్నారు. కానీ ప్రత్యర్థి పక్షం వారిని సర్పంచ్‌ మనుషులుగా ఎదురుపక్షం ముద్ర వేసింది. గ్రామసభ లేకుండానే జాబితా ఎలా ప్రకటిస్తారని ప్రజాప్రతినిధులను, అటు అధికారులను ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా జాయింట్‌ కలెక్టర్‌నూ కలిశారు. ఎక్కడికెళ్లినా బెదిరింపులు చీదరింపులే ఎదురయ్యాయి. ఎమ్మెల్మే రసమయికి చెప్పుకుందామని ప్రయత్నిస్తే ఆయన దొరకలేదు. చివరికి ఈ నెల మూడవ తేదీన తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన లేక ఫోన్‌లో సంప్రదించినా సానుకూల స్పందన రాక దళిత యువకులు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. వీరిని స్థానికులు కరీంనగర్‌ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విపక్షాలన్నీ భగ్గుమనడంతో అదే రోజు మంత్రి ఈటల ఆదేశంతో క్షతగాత్రులను హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు.

Eight acres land owner qualifying for 'Land for Dalits'

గూడుపుఠాణి వెనుక నేతలపై చర్యలు శూన్యం

బెజ్జంకి మండలంలో టీఆర్‌ఎస్‌ నేతల గ్రూపు రాజకీయాలకు సామాన్యులు బలవుతున్నారు. స్థానిక జడ్‌పీటీసీ తన్నీరు శరత్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. వీరికి ఎదురుపక్షంగా గూడెం సర్పంచ్‌, పలువురు గ్రామ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఎన్ని గ్రూపు రాజకీయాలు సాగినా, అందులోనూ అధికారపక్షంలో అయినా శరత్‌రావు చెప్పిందే ఇక్కడ వేదంగా సాగుతున్నట్టు తెలిసింది. గూడెం సర్పంచ్‌ మనుషులుగా ముద్ర వేయడంతోనే పరశురాములు, శ్రీనివాస్‌‌కు మూడెకరాల భూమి దక్కలేదని వారి కుటుంబసభ్యులు వాపోయారు. గ్రామస్తులూ ఇదే వాస్తవమన్నారు.

బెజ్జంకి మండలం గూడెం ఘటనలో వీఆర్వోను సస్పెండ్‌ చేసి ప్రభుత్వం బలిపశువును చేసింది. ఆ అధికారి బహిరంగంగా ముడుపులు అడగటంతోనే ఈ చర్యలు తీసుకున్నట్టు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ గూడుపుఠాణి వెనుక ఉన్న అసలు ప్రజా ప్రతినిధులపై ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదు. మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే స్థాయి నేతలు బాధితులను పరామర్శించినా ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్‌పీటీసీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అటువైపు తొంగి చూడక పోవడం గమనార్హం.

ఎంబీఏ చదువుకున్నా రాని కొలువు

రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకును ఎంబీఏ చదివించామని పరశురాములు తల్లిదండ్రులు ఎల్లమ్మ, పోచయ్య తెలిపారు. ఉద్యోగం రాక ఇంటి పట్టునే కూలీ పని చేస్తున్నాడని, మూడెకరాల భూమికి అర్హునిగా ఎంపికైనా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాగలున్నోళ్లకే భూములిస్తున్నారని తెలిసి కలత చెందాడని, ఎవరినడిగినా పైసలిస్తేనే పని జరుగుతదని చెప్పిండ్రని వాపోయారు. సిద్దపేట జాయింట్‌ కలెక్టర్‌ను అడిగితే కోపం చేసిండని, ఇంత తిరిగినా ఏమైందని మార్కెట్‌కమిటీ చైర్మన్‌సాబ్‌ శ్రీనివాస్‌రెడ్డి దెప్పిపొడిసిండని, దీంతో కలతచెందిన తమ కొడుకు పాణం తీసుకోబోయిండు. మాకు దిక్కెవరు? అని వారు ఆవేదనతో చెప్పారు.

Eight acres land owner qualifying for 'Land for Dalits'

భూపంపిణీలో మానకొండూర్‌ ప్రథమం అన్న ఈటల

గ్రూపు తగాదాల వల్లే సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెంకు చెందిన మహంకాళి శ్రీనివాస్‌, పరశురాములు ఆత్మహత్యాయత్నం చేశారని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకం అమలులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మానకొండూర్‌ నియోజకవర్గం ప్రథమంగా నిలిచిందని చెప్పారు. మూడెకరాల భూ పంపిణీ విషయంలో ప్రభుత్వంపై దళితులకు వ్యతిరేకత లేదని తెలిపారు. శ్రీనివాస్‌ భార్య ఆరోపణల మేరకు వీఆర్‌ఓను సస్పెండ్‌ చేశామని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సిద్దిపేట కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందులో టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నా వదిలేది లేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీల ఆరోపణలను ఖండించారు.

పోలీసుల వేధింపులపై రెండు నివేదికల్లో తేడాలు

ఇప్పటికే నేరెళ్లలో లారీల దహనం కేసులో దళితులపై వేధింపుల పర్వంపై తాజాగా హైకోర్టు సందేహాలు చిక్కులు తెచ్చి పెట్టాయి. బాధితులందరికీ ఒకేచోట గాయాలు ఎలా అయ్యాయని హైకోర్టు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. నివేదికల్లో తేడాలను ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు జిల్లాలో రాజకీయ చిచ్చు రగులుతోంది. ఇప్పటికే నేరెళ్ల ఘటన జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. జాతీయ ఎస్సీ కమిషన్‌, మానవ హక్కుల సంఘం, చివరకు రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్లి విపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనకు బాధ్యుడిగా భావించిన ఎస్సైను సస్పెండ్‌చేసి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా పరిస్థితి చేయి దాటుతున్నట్లు కనిపిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Government has self defence in Bejjanki mandal Gudem village. Victims had presently getting treatment in Yashoda Hospital Secunderabad while agitations flare up thtough united Karim Nagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more