దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కి తప్పిన ప్రమాదం... ఘన్‌పూర్ వద్ద బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్...
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద దానాపూర్ ఎక్స్‌పెస్‌కు పెద్ద ప్రమాదమే తప్పింది. మంగళవారం(మార్చి 2) ఉదయం రైలు సికింద్రాబాద్ నుంచి దానాపూర్ బయలుదేరింది. ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ వద్దకు చేరుకున్న సమయంలో రైలు ఇంజిన్ బోగీల నుంచి విడిపోయింది. లూప్ లైన్ నుంచి మెయిన్ ట్రాక్‌కు మారుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలు ఇంజిన్ స్టేషన్ ఘన్‌పూర్ గేటు దాటి కొద్ది దూరం ముందుకు వెళ్లగా... దాని భోగీలు మాత్రం అక్కడే ఆగిపోయాయి. ఇంజిన్ విడిపోయిన విషయం తెలిసి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇంజిన్‌ను తిరిగి వెనక్కి రప్పించి బోగీలకు తగిలించారు. అనంతరం రైలు కాజీపేట మీదుగా దానాపూర్ బయలుదేరి వెళ్లింది. సుమారు అరగంట సమయం పాటు రైలు స్టేషన్ ఘన్‌పూర్ వద్దే నిలిచిపోయింది. ఇంజిన్ బోగీల నుంచి విడిపోయిన సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెప్తున్నారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండేళ్ల క్రితం సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ కూడా ఇలాగే బోగీల నుంచి విడిపోయింది.
ఆ విషయాన్ని గమనించని ట్రైన్ పైలట్ అలాగే 2కి.మీ దూరం వెళ్లిపోయాడు. నర్సీపట్నం-తుని మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత రైలు ఇంజిన్‌ను మళ్లీ వెనక్కి తీసుకొచ్చి లింక్ చేయడంతో రైలు భువనేశ్వర్ బయలుదేరింది.