టీపిసీసీలో పదవుల పందేరం!జంబో కార్యవర్గంలో లోపాలు!ఉదయ్ పూర్ డిక్లరేషన్ వరంగా మారిందా?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు ముప్పేట దాడి చేయడమే కాకుండా అంతర్గత కలహాలతో కకావికలం అవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జంబో కార్యక్రవర్గం శరాఘాతంగా మారింది. అంతే కాకుండా పాత కొత్త కలయికతో జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలన్న అదిష్టానం ఆదేశాలను అమలు చేయకుండా కొంత మంది నేతలు పదవుల పందేరాలకు శ్రీకారం చుట్టారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

పీసిసిలో పదవుల పంచాయితీ..
ఒక అడుగు ముందుకు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కు పడుతున్న చందంగా తయారయ్యింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని బలోపేతం చేసి క్యాడలో భరోసా నింపాల్సిన తరుణంలో అదే క్యాడర్ చేజారిపోయే విధంగా కొంత మంది పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఏళ్ల తరబడి పార్టీ జెండాను బుజం మీద మోసిన నిఖార్సయిన కార్యకర్తలు వాపోతున్నారు. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం పార్టీలో భర్తీ చేయాల్సిన పదవులను భర్తీ చేయడంలో నాయకులు వివక్ష చూపిస్తున్నారని సాదారణ కార్యకర్తలు భగ్గుమంటున్నారు.

పదవులను అమ్ముకోవడం ఏంటి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాఖార్సయిన కార్యకర్తలు
అంతే కాకుండా ఏఐసీసీ పంపించిన దూతతో పీసిసిలో ఉన్న ఓ వర్కింగ్ ప్రసిడెంట్ కుమ్ముక్కై తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టడమే కాకుండా, పదవికి ఇంత ఖర్చవుతుందని బేరసారాలకు దిగుతున్నట్టు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఏఐసీసీ పంపిన దూతపై అదిష్టానానికి పూర్తి విశ్వాసం ఉండడంతో, ఆయన పంపిన తుది జాబితానే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి పదవులకోసం ఎదురుచూస్తున్న నిజమైన కార్యకర్తలు ఉత్కంఠకు గురవుతున్నారు. పదవుల భర్తీ బాద్యతలను బుజాన వేసుకున్న కార్యనిర్వాహక అద్యక్షుడు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలనే డిమాండ్ గాంధీ భవన్ లో మారుమోగిపోతుంది.

జంబో కార్యవర్గంలో చోటు కల్పించాలి.. జెండాను మోసిన శ్రేణుల డిమాండ్..
ఇదిలా ఉండగా సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్న తరుణంలో పార్టీ నష్ట నివారణ చర్యలకు పాల్పడడం లేదని కార్యక్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పీసీసీ ఆఫీస్ బేరర్స్, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు మరియు ఇతర కమిటీలు సభ్యులను నియమించే క్రమంలో కసరత్తులు చేస్తున్న అధ్యక్షుడికి ఇతర నేతలనుండి రికమండేషన్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జంబో కార్యవర్గాన్ని రూపొందించే క్రమంలో పిసిసి అధ్యక్షుడికి అనేక ఒత్తిళ్లు వస్తున్నట్టు చర్చ జరుగుతోంది. సీనియర్లకు పిసిసి అధ్యక్షునికి సమన్వయం లోపించిన సమయంలో ఈ కార్యవర్గ కూర్పు ఎవరికి న్యాయం చేస్తుందో, మరెవరికి అన్యాయం చేస్తుందోననే ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది.

ఉదయ్ పూర్ డిక్లరేషన్ తో న్యాయం జరుగుతుందా... కార్యకర్తల్లో నెలకొన్న ఉత్కంఠ..
రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసే ఈ కూర్పు సీనియర్లను ఒప్పిస్తుందా.? ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం సీనియర్లకు జంబో కూర్పులో స్థానం దక్కుతుందా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఏఐసీసీ దూతతో పాటు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి సిఫారసు చేస్తున్న తుది జాబితా పార్టీకి పనిచేసిన వాళ్లను కాకుండా ఆర్థికంగా బలంగా ఉన్న వారికే చోటు కల్పిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పదవులను డబ్బుతో కొనలేని నాయకులు కష్టపడి పనిచేసినా పదవులు దక్కవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. పార్టీ చేరకున్నా, పార్టీ సభ్యత్వం తీసుకోకున్నా ఆర్ధిక స్థోమత ఉన్న ఇతర పార్టీ వారికి పదవులను రిజర్వ్ చేసి పెడుతున్నారని, ఇది ఎంతవరకూ సమంజసమని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పీసిసి అద్యక్షుడు క్షేత్ర స్దాయిలో అంశాలను పరిశీలించి నిజమైన కార్యకర్తలను గుర్తించి పదవులను కట్టబెట్టాలనే డిమాండ్ గాంధీ భవన్ లో వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications