తెలంగాణలో జూనియర్ వీరప్పన్..! 20 ఏళ్లుగా పోలీసులకు సవాల్
హైదరాబాద్ : ఓ సామాన్యుడు అసాధారణంగా ఎదిగాడు. నేర సామ్రాజ్యం విస్తరించుకుని కోట్లకు పడగలెత్తాడు. అధికారులను కనుసన్నల్లో తనవైపు తిప్పుకున్నాడు. ఆడిందే ఆటగా.. ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏళ్లుగా అడవి రాజుగా వెలిగిపోతున్నాడు. తెలంగాణ వీరప్పన్ గా చలామణి అవుతూ అటవీశాఖను శాసిస్తున్నాడు. అడవులను అడ్డంగా నరుకుతూ దర్జాగా తప్పించుకుంటున్నాడంటూ చెట్ల దొంగపై... ఓ దినపత్రిక ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కలప స్మగ్లర్లపై పీడీ యాక్టులు పెడతామన్న సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యం సంతంరించుకుంది.

20 ఇయర్స్ ఛాలెంజ్
తెలంగాణలో అడవులను నరుకుతూ ప్రారంభమైన కలప దొంగ ప్రస్థానం.. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ కు విస్తరించింది. టేకు స్మగ్లింగ్ తో కోట్లు కూడబెడుతూ 3 రాష్ట్రాల్లో హవా నడిపిస్తున్నాడు. 20 ఏళ్ల కిందట అతి సామాన్యుడిగా ఉన్నోడు.. ఇవాళ అసాధారణ స్థాయికి చేరాడు. అడవుల్లో చెట్లను నరుకుతూ కలప స్మగ్లింగ్ చేయడమే వృత్తిగా పెట్టుకుని ప్రత్యేక సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. అనుచరులను భారీగా పెట్టుకుని అడ్డూ అదుపు లేకుండా విజృంభిస్తున్నాడు.

గోదావరి నది తీరాన.. రెచ్చిపోతున్న జూవీ
తెలంగాణ వీరప్పన్ గా చలామణి అవుతూ అటవీశాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నాడు. అసలు పేరుకంటే ఈ కొసరు పేరుతోనే పిలిపించుకోవడం ఇష్టమట.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సదరు చెట్ల దొంగకు మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్ ఉందట. తెలంగాణలో అత్యధిక అటవీ ప్రాంతమున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాను టార్గెట్ చేసుకొని తన కార్యకలాపాలను విస్తరిస్తున్నాడు. గోదావరి నది తీరానికి మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు దగ్గరగా ఉండటంతో ఈ జిల్లాపై దృష్టి సారించాడు. కాటారం, మహదేవ్ పూర్, ఏటూరు నాగారం, తాడ్వాయి తదితర మండలాల్లో వందల సంఖ్యలో అనుచరులు ఉండటం గమనార్హం.

పక్కా స్కెచ్.. నెలకు కోటి లంచం
అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్న ఈ అడవి రాజు.. పోలీసుల, అధికారుల కంటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడట. టీములవారీగా సామ్రాజ్యం నిర్మించుకున్న సదరు కలప స్మగ్లర్.. ఎవరి బాధ్యతలు వాళ్లకు ఫిక్స్ చేశాడు. 20 -30 మంది వరకు సభ్యులుండే మొదటి టీమ్ కు.. అడవుల్లోకి వెళ్లి చెట్లు నరికే బాధ్యత అప్పగించాడు. మరో 10 మంది వీరికి రక్షణగా ఉంటారట. వీరి దగ్గర చెట్లు కోసే యంత్రాలు కాదు.. తేడా వస్తే అడ్డొచ్చినవారిని ఎదుర్కొనేందుకు గొడ్డళ్లు, మారణాయుధాలు కూడా ఉంటాయట.
నరికిన చెట్లను మైదాన ప్రాంతానికి తరలించడం రెండో టీమ్ డ్యూటీ. ఒకేసారి 10 -20 ఎడ్లబండ్లతో వరుస క్రమంలో కలపను దాటిస్తారు. ఒకవేళ మధ్యలో
అటవీశాఖ అధికారులు ఎదురై ప్రశ్నిస్తే.. "తెలంగాణ వీరప్పన్" ఎడ్లబండ్లని చెప్పి తప్పించుకుంటారట. ఇక మూడో టీమ్ కు అసలైన బాధ్యత అప్పగించాడు. మైదాన ప్రాంతం నుంచి బాస్ సూచించిన పట్టణాలకు కలప తరలించడం వీరి బాధ్యత. లారీలు, డీసీఎం వ్యానులు, ట్రాలీ ఆటోలు, టాటా సుమోలు లాంటి వాహనాలు కలప తరలింపులో ఉపయోగిస్తారు. ఈ వాహనాలకు ఎస్కార్టుగా ముందు వరుసలో 3-4 వాహనాలు ఉంటాయి. మార్గమధ్యంలో ఎవరైనా అధికారులు ఆపితే తెలంగాణ వీరప్పన్ పేరు చెబితే ఆ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తారట. అలా ఏ టీముకు ఎంతివ్వలో రేట్ ఫిక్స్ చేసి ఈ దొంగ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నాడు. ఇక అటవీశాఖలో అటెండర్ స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారులకు నెలనెలా కోటి రూపాయల మామూళ్లు ఇస్తున్నాడట. లంచాలే ఆ రేంజ్ లో ఇస్తుంటే ఇతగాడి సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో మరి.

సర్కార్ కొరడా..! దొరికేనా ఈ దొంగ?
అడవుల సంరక్షణపై సీరియస్‌గా దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. తాజాగా ఫారెస్ట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అడవులను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతవరకైనా వెళుతుందని తెలిపారు. అడవుల నుంచి పూచిక పుల్ల బయటకు వెళ్లొద్దని ఆదేశించారు. జంగల్ బచావో, జంగల్ బడావో (అడవులను కాపాడండి, అడవులను పెంచండి) అంటూ పిలుపునిచ్చారు. కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. అంతేకాదు రక్షణ దళాల ఏర్పాటుతో పాటు సర్పంచులకు అడవులను కాపాడే బాధ్యతలు అప్పగించాలనే అంశం పరిశీలిస్తున్నారు. అడవుల సంరక్షణపై ప్రభుత్వం అంతలా సీరియస్ గా ఉన్న ఈ సమయంలో.. ఒకే ఒక్కడిగా రెచ్చిపోతున్న కలప దొంగను పట్టుకుంటే సగం అడవులు సేఫ్ అనే టాక్ వినిపిస్తోంది.