ప్రగతి నివేదన సభ: ఔటర్ రింగ్ రోడ్డుపై 100 కి.మీ. మేర ట్రాఫిక్

హైదరాబాద్: ప్రగతి నివేదన సభకు వెళ్లే ముందు, వెళ్లి వచ్చే సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెళ్లేటప్పుడు వాహనాలు వేర్వేరు సమయాల్లో వెళ్లాయి. కానీ వచ్చే సమయంలో అన్నీ ఒకేసారి రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు పదులు, వంద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు 158 కిలోమమీటర్లు ఉండగా.. 100 కిలోమీటర్ల మేర జామ్ అయంది. ఇతర సర్వీసు, జాతీయ రహదార్లలోను పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి.

సభ ముగిసిన తర్వాత ఒకేసారి ఔటర్ పైకి వాహనాలు
నగరంలోకి వేలాది వాహనాలు వచ్చాయి. సభ ముగిసిన తర్వాత అన్ని వాహనాలు ఒకేసారి వెలుపలకు వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు పైకి వచ్చాయి. సర్వీసు రోడ్లు, ఇతర రోడ్లపై నుంచి కూడా ఒక్కసారిగా వాహనాలు రాడవంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. సభ నుంచి వెళ్తున్న వాహనాలతో రాజధానికి నలువైపులా ఉన్న జాతీయ రహదారులు నిండిపోయాయి.

పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలు
సాయంత్రం ఏడున్నర, ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు కొంగర కలాన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు రెండు వైపులా కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు రద్దీ దృష్ట్యా పలుచోట్ల డ్రైవర్లు బస్సులను ఔటర్ రింగ్ రోడ్డు కిందికి దింపేశారు. ట్రాక్టర్లపై సభకు వచ్చిన వేలాది వాహనాలు రోడ్ల పైనే రాత్రికి సేదతీరి, ఉదయం బయలుదేరాయి.

సభకు వేలాది ట్రాక్టర్లు
కాగా, బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, కార్లు, డీసీఎంలు, తుఫాన్లు.. ఇలా పలు వాహనాల్లో జనాలను తరలించారు. జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, బొమ్మలతో ఉన్న వాహనాలు రహదారులను గులాబీమయం చేశాయి. కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భారీగా వాహనాలు రావడంతో పలుచోట్ల వాహనాల రద్దీ నెలకొంది. సభకు 12వేల ట్రాక్టర్లు వచ్చాయి. వాటిలో బాగా అలంకరించిన వాటిని సభ ముందు ప్రదర్శనకు పెట్టారు. మరో విషయం ఏమంటే వాహనాలు చాలా వరకు సభకు వెళ్లకుండానే మధ్య నుంచే వెను దిరిగాయి.

ఎన్నో ఏర్పాట్లు
బహిరంగ సభ ప్రాంతంలో అలంకరణ ఆకట్టుకుంది. సంక్షేమ పథకాలతో ఏర్పాటు చేసిన కేసీఆర్ కటౌట్లు, తోరణాలు ఉంచారు. గులాబీ రంగుతో అలంకరించిన వేదిక ఆకర్షణగా నిలిచింది. ప్రగతి నివేదన సభ విద్యుత్తు వెలుగుల్లో మెరిసిపోయింది. సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ, మెర్క్యురీ విద్యుత్తు దీపాలను అమర్చారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రగతి నివేదన సభకు హాజరైన కార్యకర్తల్లో చాలామంది 12 గంటలపాటు సభా ప్రాంగణంలోనే ఉన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!