
రాజగోపాల్ రెడ్డి డ్రామాలను జనం నమ్మరు: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మునుగోడు బై పోల్ క్యాంపెయిన్ హీటెక్కిస్తోంది. నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ విమర్శలకు దిగుతుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తోంది.
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జ్వరం కారణంగా ప్రచారం రద్దు చేసుకున్నారు. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలను నమ్మొద్దని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీ నేతలు కావాలనే దాడి చేయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు మునుగోడులో అలా జరిగే అవకాశాలు ఉన్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ను తిడుతున్నారని.. మునుగోడుకు బీజేపీ ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పడం లేదని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కోటి రూపాయలైనా తీసుకువచ్చారా? అని నిలదీశారు. మిషన్ భగీరథతో కేసీఆర్ మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేశారని వెల్లడించారు.
తమ ప్రభుత్వం చేసిన, చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అని తెలిపారు. ఏం చేశామో జనాలకు తెలుసు అని తలసాని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కూడా సరిగా ఇవ్వలేదని చెప్పారు. అన్నింటిలో తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయమే జరిగిందని వివరించారు. పైగా అదీ చేశాం.. ఇదీ చేశాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రం చేస్తున్నారని మండిపడ్డారు. ఏం జరిగింది.. జరుగుతుందో జనాలకు తెలుసు అని చెప్పారు.