ప్రాణం తీసిన ఈత సరదా: చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి

Subscribe to Oneindia Telugu

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఈత సరదా ఇద్దరి ప్రాణం తీసింది. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని విశ్వనాథపురంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. విశ్వనాథపురానికి చెందిన రాములమ్మ ఇంట్లో బుధవారం దుర్గమ్మ వేడుకను ఆనందంగా చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని లాలాపేటలో ఉంటున్న రాములమ్మ కుమార్తె స్వరూప, ఆమె భర్త రవి, కుమారుడు శివరాజ్‌(17) ఈ వేడుకలో పాల్గొనేందుకు వచ్చారు. శివరాజ్‌ లాలాపేట్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. లాలాపేట్‌కు చెందిన సునీల్‌ (18) శివరాజ్‌ స్నేహితుడు. సురేష్‌, దీవెన ఇతని తల్లిదండ్రులు. ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. సునీల్‌ శివరాజ్‌ను కలిసేందుకు గురువారం పుష్‌పుల్‌ రైలులో హైదరాబాద్‌ నుంచి విశ్వనాథపురానికి వచ్చాడు.

Two youths drowned in a pond

స్నేహితులిద్దరూ కలుసుకొని సంతోషంగా కబుర్లు చెప్పుకున్నారు. కిరాణం దుకాణానికి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వారిద్దరూ సమీపంలోని గూడెపుకుంటచెరువు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. వారికి ఈత రాకపోయినా లోతు తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో చెరువులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్వరూప, ఆమె అక్క నాగమ్మ, బంధువులు పరుగున చెరువు వద్దకు వెళ్లారు.

గ్రామస్థుల సహకారంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అప్పటి వరకూ ఇంట్లో సంతోషంగా గడిపిన స్నేహితులు శివరాజ్‌, సునీల్‌ మృత్యువాత పడడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది. ఏసీపీ సంజీవరావు, ఎస్సై కరుణాకర్‌, పోలీస్‌ సిబ్బంది సంఘటన స్థలాన్ని సందర్శించారు.
వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్‌ తెలిపారు. సునీల్‌, శివరాజ్‌లు ఎంతో స్నేహంగా ఉండేవారని చెబుతూ శివరాజ్‌ తల్లి స్వరూప విలపించింది.

కలర్‌ కంపెనీపై పోలీసుల దాడులు

వరంగల్‌: హైదరాబాద్‌ మౌలాలీ అడ్రస్‌తో హన్మకొండ కేంద్రంగా అల్ట్రా పెయింట్ తయారు చేస్తున్న కంపెనీని గురువారం హైదరాబాద్‌ పోలీసులు గుర్తించారు. కూక్‌పల్లి ఏసీపీ ఎన్‌. భుజంగరావు తన సిబ్బందితో వరంగల్‌కు చేరుకుని నకిలీ కంపెనీలో తయారు చేస్తున్న రంగులను సీజ్‌ చేశారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం... హన్మకొండ మచిలీబజార్‌కు చెందిన గోరాంల నాగరాజు కొద్ది రోజులుగా అల్ట్రా పెయింట్స్ పేరుతో నగరంలో ముడిసరుకులు దిగుమతి చేసుకుని పెయింట్ తయారుచేసి విక్రయిస్తున్నాడు.

ఈ సంస్థకు సంబంధించిన హక్కులను డి. సైదిరెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితమే రిజిస్టర్‌ కలిగి ఉన్నాడు. కానీ నాగరాజు ఇదే పేరుతో పెయింట్స్ తయారు చేస్తుండడంతో నిజమైన సంస్థకు నష్టం వాటిల్లింది. ఇది గమనించి సైదిరెడ్డి 15 ఫిబ్రవరి 2017న కూక్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గురువారం వరంగల్‌కు చేరుకున్న పోలీసులు నాగరాజు నిర్వహిస్తున్న ఫ్యాక్టరీపై దాడిచేశారు. సుమారు రూ. 20 లక్షల ముడిసరుకును, 3 వేల కలర్‌ డబ్బాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామన్నారు. వీరిని కోర్టుకు పంపిస్తామని ఏసీపీ చెప్పారు. పోలీసులు వస్తున్నట్లు గమనించిన నిర్వాహకులు ఫ్యాక్టరీలో లేకుండా తప్పించుకుని పారిపోయారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two youths drowned in a pond in Janagama district on Thursday.
Please Wait while comments are loading...